ఆర్తి ప్రబంధం – 13

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<<ఆర్తి ప్రబంధం – 12

Azhwars

ప్రస్తావన

ఇంతవరకు మణవాళమామునులు అభ్యర్ధించిన పలువిషయములను శ్రీ రామానుజులు ప్రసాదించిరి. శ్రీరామానుజుల సౌలభ్యముచే మామునుల కోరికలన్నీ నెరవేరెను. అట్టి వారి సౌలభ్యమునకు వశులైన మామునులు, ఈ పాశురమున రామానుజుల సౌందర్యమునకు ముగ్ధులై వారికి మంగళాశాసనము చేసిరి. వారు శ్రీ రామానుజులకు మాత్రమే మంగళాశాసనము చేయక, వారితొ సంబంధము ఉన్న అందరికీ మంగళాశాసనము చేసిరి.

పాశురం 13

ఎతిరాశన్ వాళి ఎతిరాశన్ వాళి
ఎతిరాశన్ వాళి ఎన్ఱేన్ఱేతిచ్ చదిరాగ
వాళ్వార్గళ్ తాళిణైక్కీళ్ వాళ్వార్గళ్ పెఱ్ఱిడువర్
ఆళ్వార్గళ్ తన్గళ్ అరుళ్

ప్రతి పద్ధార్ధం

వాళ్వార్గళ్ – ఎవరైతే జీవించెదరో
తాళిణైక్కీళ్ – వారి పాదపద్మములందే
వాళ్వార్గళ్ – ఎవరైతే జీవించెదరో
చదిరాగ – తెలివిగా
ఏతిచ్ – ఇలా మంగళము పాడి
ఎతిరాసన్ వాళి – “మంగళం ఎతిరాశునకు”
ఎతిరాసన్ వాళి – “మంగళం ఎతిరాశునకు”
ఎతిరాసన్ వాళి – “మంగళం ఎతిరాశునకు”
ఎన్ఱేన్ఱు – చాలా కాలముగా
పెఱ్ఱిడువర్ – పొందెదరు
అరుళ్ – అనుగ్రహము
ఆళ్వార్గళ్ తన్గళ్ – అందరు ఆళ్వార్లుల

సామాన్య అర్ధం

ఈ పాశురమున మణవాళ మామునులు కొందరు భాగవతులు ఆళ్వార్ల కృపాకటాక్షములను పొందెదరని వర్ణించిరి. వారందరూ శ్రీ రామానుజుల కీర్తిని ఎల్లప్పుడు ప్రశంసించి, “యతిరాజులు చిరకాలము వర్ధిల్లాలి” అని మంగళము పాడు గొప్ప భాగవతులను ఆశ్రయించిన వారగుదురు.

వివరణ

పెరియాళ్వార్ పలుపర్యాయములు శ్రీమన్నారాయణునికి తిరుపల్లాణ్డులో మంగళాశాసనము చేసెను. పెరియాళ్వార్ భగవంతునికి మంగళాశాసనము చేయగా, మణవాళమామునులు భాగవతులకు మంగళాశాసనము చేసెను.మణవాళమామునులు కొందరు భాగవతులు ” అడియేన్ సదిర్తేన్ ఇన్ఱే (కణ్ణినున్ చిఱుత్తామ్బు 5)” అను ప్రబంధమున చెప్పినట్లు ” చరమపర్వనిష్ఠ” యందు నిలబడెదరని గుర్తించెను. ” చరమపర్వనిష్ఠ” అనగా తమ ఆచార్యులే తమకన్నియూ అని తలచి ఉండుట. శ్రీ రామానుజుల శిష్యులు ఎల్లప్పుడు ” యతిరాజులు చిరకాలము వర్ధిల్లవలెను, యతిరాజుల కీర్తి వర్ధిల్లవలెను, యతిరాజులు చిరకాలము వర్ధిల్లవలెను” అని పాడుతూ ఉండిరి. వీరిని మొదటి వర్గం వారని తలచెదము. ఇంకొదరు ” యతిరాజులు చిరకాలము వర్ధిల్లవలెను, యతిరాజుల కీర్తి వర్ధిల్లవలెను, యతిరాజులు చిరకాలము వర్ధిల్లవలెను” అని పాడుచూ మొదట వారి చరణ కమలములనే ఆశ్రయించి ఎట్లు ఒక శిశువు తన తల్లి యొక్క నీడలోనే ఎప్పుడు సురక్షితముగా ఉండునో అట్లు ఉండిరి. ఈ రెండవ వర్గం వారు “నిన్ తాళిణైక్ కీళ్ వాళ్చ్చి (తిరువాయ్ మొళి 3.2.4)” అను వాక్యము గుర్తించి మొదటి వర్గంవారి చరణకమలముల నీడలో జీవింతురు. ఈ రెండవ వర్గం వారి యెడల చూపు కృపను గూర్చి ఈ పాశురము యొక్క రెండవ భాగమున వర్ణించియున్నారు. అళ్వార్లు పదిమంది అను లెక్క ఉన్నది. మధురకవులు మరియు ఆండాళ్ అమ్మవార్లను, నమ్మళ్వార్ల మరియు పెరియాళ్వార్ల తోనే చేర్చెదరు. ఈ ఆళ్వార్లు “మయఱ్వఱ మదినలమ్ అరుళప్పెఱ్ఱవర్గళ్ (తిరువాయ్ మొళి 1.1.1) అని కొనియాడబడువారు. అనగా వారందరు శ్రీమన్నారాయణుని నిష్కారణమైన కృపకు పాత్రులైన వారు. ఆ కృపచే వారిలో ఉన్న అఙ్ఞానము తొలగి పూర్తి ఙ్ఞానము మరియు శ్రీమన్నారాయణుని యెడల భక్తి అత్యంతముగా పెరిగెను. ఈ ఆళ్వార్లు వారి భక్తిని శ్రీమన్నారాయణునియందు మాత్రమే కాక వారి భక్తుల యందునూ “ఎల్లైయిల్ అడిమైత్ తిఱత్తినిల్ ఎన్ఱుమేవుమనత్తనరై” (పెరుమాళ్ తిరుమొళి 2.10) అను ప్రబంధమున చెప్పిన యట్లు చూపెను. పై చెప్పబడిన రెండవవర్గం వారికి పదిమంది ఆళ్వార్ల అనుగ్రహం పూర్తిగా ఉండును. ఈ అనుగ్రహం చేతనే వారు చరమపర్వనిష్ఠను దృఢముగా నమ్మియున్నారు, ఇంకను ఉండెదరు. ఇది మొదటి పాశురమున మణవాళమామునులు వీరు నిత్యసూరులచే (అయఱ్వరుమ్ అమరర్గళ్ (తిరువాయ్ మొళి 1.1.1)) గౌరవింపబడువారని వర్ణించి యుండుటను మనం ఉచితమని తలచెదము. ఈ పాశురమున మణవాళ మామునులు ఈ రెండవవర్గం వారు “మయఱ్వర మదినలమ్ అరుళ పెఱ్ఱవర్గళ్ (తిరువాయ్ మొళి 1.1.1) అని ప్రశంసింపబడు ఆళ్వార్లచే కొనియాడబడెదరని చెప్పుచున్నారు.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/07/arththi-prabandham-13/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment