కణ్ణినుణ్ శిరుతాంబు -10 – పయన్ అన్ఱాగిలుం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 9

Nammalwar-emperumanarనమ్మాళ్వార్లఎమ్పెరుమానార్

పాశుర అవతారిక:

  నంజీయర్

భగవంతుడే తన భక్తులకు ఆచార్యులను ఇస్తాడు. శిష్యుడికి ఆయన మరొక భగవంతుడితో సమానము. అందుకే శిష్యుడు ఆచార్యులకు ఎన్ని సేవలు చేసినా తృప్తి చెందడు, అలా   నమ్మాళ్వార్ల పట్ల మధురకవులు తన కృతఙ్ఞతను చూపుతున్నారని నంజీయర్ అంటున్నారు.

 నంపిళ్ళై   

“విష్ణు ధర్మమం 70.78 “…కృత్స్నాం వా పృథివీం ధధ్యాన్న తత్తుల్యం కథంచన:”(ఉపాయ ఙ్ఞానము, పురుషార్థ  ఙ్ఞానము ఎవరికి వుంటయో వారు పరమాత్మ శ్రీ పాదలను చేరుకుంటారు.)  అన్నట్లు  మధురకవులునమ్మాళ్వార్ల పట్ల అపారమైన ప్రీతితో వారినే నిరంతరము కీర్తిస్తున్నారు” అని నంపిళ్ళై అంటున్నారు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై

పెరియవాచ్చాన్ పిళ్ళై కూడా  నంపిళ్ళై చెప్పిన విషయాన్నే చెపుతున్నారు.  ఆచార్యులు శిష్యుడికి  శ్రీమహాలక్ష్మి, శ్రీమన్నారాయణులనే దివ్య సంపదను ఇస్తారన్నారు. దీనికి సమానమైనదేది  ఇవ్వలేని శిష్యుడు “అయ్యో ఆచార్యుల ఋణము ఏమిచ్చి తీర్చుకోగలనని బాధ పడతాడ”ని అంటున్నారు.

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్

నమ్మాళ్వార్ల కీర్తిని, మధురకవులకు వారు చేసిన ఉపకారమును ఇప్పటి దాకా చెపుతూ వచ్చారు.  నమ్మాళ్వార్లు తన పట్ల చూపిన నిర్హేతుక కృప, తనకు వారి ఋణము తీర్చుకోవటములో ఉన్న పరిమితులను  మధురకవులు ఈ పాశురములో చెప్పుతున్నారు .

 తైత్తరీయ భృగువల్లి 10.6 లో, “యో మా ధధాతి స ఏ దేవమావా:” (ఎవరైతే ఉన్నతమైన పరమాత్మను చూపారో వారే కదా రక్షకులు). అన్నట్లు నాకు నమ్మాళ్వర్లే  కదా రక్షకులు. వారికి నేను చేయగల ప్రత్యుపకార మేమున్నది అని ఈ పాశురములో వాపోతున్నారు. ఈ భావము  ముముక్షుదశలోను ముక్తదశలోను కూడ శిష్యులకు వుంటుంది.  శిష్యుడు ఎప్పటికీ ఆ ఋణము తీర్చుకోలేడు.

ఆచార్యులు శిష్యుల నుండి ఏదీ ఎదురు చూడడు.  కాని ఏదో ఒకటి ఇచ్చుకోవడం శిష్య ధర్మం.  ఆచార్యులు ఆత్మను శుధ్ధి చేస్తారు. ఆత్మ పరమాత్మకు సమర్పించాలి. అలా చేసినప్పటికి ఆచార్యుల  ఋణము తీరదు.  అలా కూడా చేయకపోతే  ఆచార్యులు  ఆత్మను శుధ్ధి చేసిన ఫలితము ఉండదు.

 పాశురము

పయన్ అన్ఱాగిలుం పాంగల్లర్ ఆగిలుం

శెయల్ నన్ఱాగ త్తిరుత్తి ప్పణి కొళ్వాన్

కుయిల్ నిన్ఱార్ పొళిల్సూళ్ కురుకూర్ నంబి

ముయల్గిన్ఱేన్ ఉన్ తన్ మొయ్కళఱ్కు అన్బైయే

ప్రతి పదార్థము:

 పయన్ అన్ఱాగిలుం = స్వార్థము లేకుండా(ఇతరులను ఉజ్జీవింప చేయటము)

పాంగల్లర్ ఆగిలుం = అర్హులు కానప్పటికీ

శెయల్ = కృత్యములుచే

నన్ఱాగ త్తిరుత్తి = బాగా సరిదిద్ది

ప్పణి కొళ్వాన్ = కైంకర్యము చేయిస్తాడు

కుయిల్ నిన్ఱార్ పొళిల్సూళ్ కురుకూర్ = దట్టమైన చెట్ల మీద కోయిలలు కూస్తూ వుండే ఆళ్వార్ తిరునగరి

నంబి = పరిపూర్ణులు , నమ్మళ్వార్లు

ఉన్ తన్ = తమరి

మొయ్కళఱ్కు = శ్రీ పాదముల మీద

అన్బైయే = అభిమానము పెంచుకోవటానికి

ముయల్గిన్ఱేన్ =  ప్రయత్నిస్తున్నాను

భావము:

  అర్హులు కానప్పటికీ తమ కృత్యములుచే బాగా సరిదిద్ది కైంకర్యము చేయిస్తారు.   స్వార్థము లేకుండా ఇతరులను ఉజ్జీవింప చేయటము తమ లక్ష్యముగా, జీవించేవారు నమాళ్వార్లు. వారు నివసించే ప్రాంతము ఆళ్వార్తిరునగరి. అక్కడ  దట్టమైన చెట్ల మీద కోయిలలు కూస్తూ వుంటాయి. గుణ  పరిపూర్ణులైన నమ్మాళ్వార్ల  శ్రీ పాదముల మీద అభిమానము పెంచుకోవటానికి దాసుడు ప్రయత్నిస్తున్నాడు. అని ఈ పాశురములో మధురకవులు అంటున్నారు.

* నంజీయర్ల వ్యాఖ్యానము లోని ముఖ్యాంశములు:

శెయల్ నణ్ఱాగ –  నమాళ్వార్లు సులభులు.  వారి  దగ్గరికి ఎవరైనా వచ్చి చేరవచ్చు.  వారి కృపను పొందవచ్చు. కాని భగవంతుడీని పొందడానికి తగిన  అధికారము ఉండాలి.

* కుయిల్ నిన్ఱార్ పొళిల్సూళ్ కురుకూర్ నంబి  – : ఆళ్వార్  తిరునగరిలో చెట్ల మీద కోయిలలు కూడా నమ్మాళ్వార్ల పేరును కూస్తూ వుంటాయి. అది ఆయన సౌలభ్యము. పరమపదము చేరిన ముక్తాత్మలు సామగానం చేస్తూ వుంటారు.  తైత్తరీయ భృగువల్లి 10.6 “ఏతత్ సామ గాయన్ ఆస్తే” ( ముక్తాత్మలు సామగానము చేస్తున్నాయి.) ముక్తపురుషులకు లక్ష్యము  పరమపదము కాని ముముక్షువులకు లక్ష్యము  ఆళ్వార్ తిరునగరి. నమ్మాళ్వార్లు అత్యంత ప్రీతితో పెరుమాళ్ళను,  నిత్యసూరులను, ముక్తాత్మలను అనుభవించారు.

నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

* పయనన్ఱాగిలుం – ఎవరైనా తమకుపకరించిన వారికి ఉపకరిస్తారు. కాని నమ్మాళ్వార్లు దాసుడికి ఏదీ ఎదురు చూడకుండా కృప చేసారు.

* పాంగల్లరాగిలుం – అర్హతలేమీ లేని నన్ను.

* పయనన్ఱాగిలుం పాంగల్లరాగిలుం – సీతమ్మవారు రావణుడు తనకపకారము చేయ తలపెట్టినా అతనికి ఉపదేశించినట్లుగా,   ప్రత్యుపకారము చేయలేని వారైనా, అనర్హులైనా వారు ఈ లోకములో ఈతి భాధలు పడటము నమ్మాళ్వార్లు  సహించలేరు.  ఒకరు తమ ఇంటికి తాళం పెట్టి ఎవరినీ లోపలికి అనుమతించకున్నా, ఆ ఇల్లు తగలబడుతుంటే దారిన పోయేవారు ఆ మంటలను ఆర్పడానికి ఎలా ప్రయత్నం  చేస్తారో అలాగే నమ్మాళ్వార్లు అనర్హులకు కూడా ఉపదేశము చేసి వారిని ఉజ్జీవింప చేస్తారు.

* తిరుత్తిప్పణికొళ్వాన్ –   తిరువాయిమొళి  3.5.11 లో “తీర్ త్త అడియవర్ తమ్మై తిరుత్తిప్ పణి కొళ్ళ వల్ల”                         (  ప్రాప్యము , ప్రాపకముగా భావించిన వారిని సరిదిద్ది కైంకర్యము చేయించుకుంటాడు.)అని కీర్తించబడ్డాడు. కాని నమ్మాళ్వార్లుh తనను అర్థము చేసుకోని వారిని కూడా  సరిదిద్ది కైంకర్యము  చేయించుతారు.

* కుయిల్ నిన్ఱార్… – నమ్మాళ్వార్లు  తిరువాయిమొళి 8.5.2  “కాణవారాయ్” ( దయచేసి నన్ను చూడ రావా)లో పరమాత్మను వీడి వుండటము వీరికి చాల కష్టమైన విషయము అని చెప్పి,  తిరువాయిమొళి 4.5.8 లో “యావర్ నిగర్ అగల్ వానత్తే” (నాకు సమమైన వారింకెవరూ లేరు. )  అని ,నమ్మాళ్వార్లు  భగవంతుడితో తన సంభంధాన్ని తలచి చాలా ఆనందించారు. ఎల్లప్పుడు కోయిలలు వీరితోనే ఉండేవి.  అవి వీరు పాడిన పాశురాలను నేర్చుకొని పాడూతూ వుండేవి.

* కురుకూర్ నంబి –   నమ్మాళ్వార్లు,   ఆళ్వార్ తిరునగరిలో అవతరించిన పరిపూర్ణ పురుషుడు.. చిత్, అచిత్తులను కూడా నమ్మాళ్వార్లు మార్చేసారని పరాంకుశనాయకి (నమ్మాళ్వార్లు తనను తల్లి భావనలో పరాంకుశనాయకిగా చెప్పుకున్నారు.) తిరువాయిమొళి 6.7.2 “ఊరుం నాడుం ఉలగముం తన్నైప్పోల్ … పితఱ్ఱ”  (ఆమె అన్నింటిని తన లాగ నిరంతరము భగవన్నామ సంకీర్తనము చేసేలా  మార్చేసింది.) అని  చెప్పింది.

* ముయల్గిన్ఱేన్ ఉన్ తన్ మొయ్ కళఱ్కు అన్బైయే –   తిరువాయిమొళి   2.7.8 లో   “ఎన్నైత్ తీమనం కెడుత్తాయ్ ఉనక్కెన్ సెయ్గేన్”  ( నాలోని చెడును పోగొట్టావు. నీకు నేను చేయగల ప్రత్యుపకారమేమున్నది. ) అని నమ్మాళ్వార్లు భగవంతుడి విషయములో అన్నట్లు,  దాసుడు తమ శ్రీ పాదములను శరణు వేడుతున్నాడని మధురకవి ఆళ్వార్లు,  నమ్మాళ్వార్ల పట్ల తన అసమాన నిష్టను ప్రకటిస్తున్నారు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానాము: వీరు నంపిళ్ళైగారి అభిప్రాయముతో ఏకీభవించి ఇంకొక్క మాట చేర్చారు.

* ముయల్గిన్ఱేన్ ఉన్ తన్ మొయ్ కళఱ్కు అన్బైయే –మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల పట్ల తను   చేస్తున్న  కైంకర్యమునకు తానే తృప్తి పడక, వారి శ్రీ పాదముల మీద అపారమన ప్రేమను పెంచుకున్నారని అన్నారు.

 అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానము:

 పయనన్ఱాగిలుం పాంగల్లరాగిలుం –  “ఆర్తో ధర్మత: శుశృషురధ్యాభ్య:” సాధారణముగా  ఆచార్యులకు, శిష్యుడు తన ధనము,  ఉదారత్వము ఇచ్చి కైంకర్యము చేసి నప్పుడే  తృప్తి పడతారు..   నిరవధిక వాత్సల్యము గల  భగవంతుడు కూడా అర్జునుడు శరణాగతి చేసిన తరవాతే కరుణించాడని, గీత 2.7 “శిష్యస్థేహం సాధి  మాం త్వాం ప్రపన్నం” (నేను నీ శిష్యుడను. నిన్ను శరణాగతి చేసాను) చూస్తే తెలుస్తుంది. కాని నమ్మళ్వార్ల నిర్హేతుకమైన కృపతో ఏవీ చూడ కుండా దాసుడిని సరిదిద్దాడు అని మధుర కవులు అంటున్నారు.

*శెయల్ నన్ఱాగ త్తిరుత్తి –    శ్రీ వైష్ణవులచే సంస్కరింపబడిన   క్షత్రబంధు కూడా అంతిమ కాలములోనే ముక్తిని పొందాడు. కాని దాసుడికి మాత్రము  నమ్మళ్వార్ల చూపులు తగలగానే ఙ్ఞానము అనుష్టానము రెండూ అబ్బినాయి. ఙ్ఞానము అంటే ముందుగా సదాచార్య సూక్తుల శ్రవణము, ఆ విన్న సూక్తులను  మననము చేయటము, పరమాత్మ యందు మహావిశ్వాసము కలిగి వుండటము.  అనుష్టానమనగా పూర్వాచార్యులు చేయని అసదనుష్టానము చేయకుండుట,  పూర్వాచార్యులు చేసిన సదనుష్టానమును ఆచరించుట వలన పరిపూర్ణముగా సంస్కరింప బడ్డాడని  మధుర కవులు  అంటున్నారు.

పణి కొళ్వాన్ –  భగవత్, భాగవత కైంకర్యములో నిమగ్నమై వుండాలి. భగవత్ కించిత్కారము,  ఆచార్య కించిత్కారము,  వైష్ణవ కించిత్కారము తప్పక చేయాలి. భగవత్ కించిత్కారము నిరుపాధికము అంటే స్వభావ సిద్దము.ఆచార్య కించిత్కారము  సోపాధికము అంటే అలవర్చుకున్నది. భాగవత కైంకర్యము  అంతిమ లక్ష్యమును చేరటము కొరకునేర్చుకున్నది. భగవతుడిని, భాగవతులను చూపుతారు కావున  ఆచార్య కైంకర్యము అలవరుకున్నది.

 * నిజమైన ఆచార్యులు శిష్యులకు సరి అయిన మార్గమును నిర్దేశించాలి. తరువాత తాము అనుష్టించి చూపాలి. అప్పుడే ఆ శిష్యుడు భగవత్, భాగవత కించిత్కారములో నిమగ్నమవుతాడు.

* కుయిల్ నిన్ఱార్… –  నమ్మాళ్వార్లు  ఆళ్వార్ తిరునగరిలోని కోయిలలను కూడా సంస్కరించారు. ఇక నా మాట చెప్పేదేముంది?  ఆయన మధుర వాక్కులు అందరినీ సంస్కరింప గలవు.

*  కురుకూర్ నంబి – భగవతుడి కృపకు ప్రత్యుపకారము చెయ్యవచ్చేమో కాని ఆచార్య కృపకు ప్రత్యుపకారము చెయలేము.  ఎటువంటి ప్రత్యుపకారము కోరని వాడు నమ్మాళ్వార్లు.

* మొయికళల్ –   పెరియ తిరువంతాది 87 లో “మొయ్కళలే ఏత్త ముయల్” అని నమ్మాళ్వార్లే  ( భగవంతుడి  శ్రీ పాదముల ఔన్నత్యమును తెలియ జేయుట) అన్నట్లుగా   మధురకవులు కూడా అన్నారు. ఇంతకు ముందు  2వ పాశురములో “పొన్నడి” అనంన్నారు. ఈ పాశురములో తీయని, మధురమైన శ్రీ పాదాలు అంటున్నారు.

* మొయికళఱ్కు అన్బైయే – నమ్మాళ్వార్ల శ్రీ పాదములు నన్ను సమ్మొహితుడిని చేశాయి. అందువలన వారికి నేను కృతఙ్ఞతలు చెప్పుకోవాలి.  కాని నేను ప్రత్యుపకారము చేయలేనని భయపడుతున్నాను.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiruth-thambu-10-payan-anragilum/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

0 thoughts on “కణ్ణినుణ్ శిరుతాంబు -10 – పయన్ అన్ఱాగిలుం”

Leave a Comment