ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామములు – ముదలాళ్వార్లు – సరళ వ్యాఖ్యానం 

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః 

పూర్తి వ్యాసమాలిక

పొయిగై ఆళ్వార్ వైభవం:

పొయిగై ఆళ్వార్లు కాంచీపురానికి దగ్గరలో ఉన్న తిరువెఃక్కా దివ్యదేశంలో అవతరించారు. వీరు తల్లి గర్భం నుండి జన్మించకుండా (అయోనిజులు), ఒక సరస్సులో (పోయిగై) పుష్పం నుండి ఆవిర్భవించారు.  ముదలాళ్వార్లు ముగ్గురూ కూడా అయోనిజులుగా పుష్పం నుండి ఆవిర్భవించారు. పొయిగై ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రం ఆశ్వీయుజ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం నాడు.వీరు ముదల్ తిరువందాది అనే ప్రబంధం రచించారు.ఈ గ్రంథంలో 100 పాశురాలు ఉంటాయి.వీటిని అంతాది (ఒక పాశురంలోని చివరి పదం తరువాతి  పాశురానికి మొదటి పదం అవుతుంది) పాశురాలు అని అంటారు.ఆయన ఎమ్పెరుమాన్ యొక్క సర్వోన్నత స్థానంలో  మరియు గొప్పతనంలో లీనమై ఉన్నారు. వారి వాళి తిరునామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

శెయ్యతులావోణత్తిఱ్ జగత్తుదిత్తాన్ వాళియే 

తిరుక్కచ్చి మానగరం సెళిక్క వందోన్ వాళియే

వైయంతగళి నూరుమ్ వగుత్తురైత్తాన్ వాళియే 

వనశమలర్ క్కరువదనిల్ వన్దమైందాన్ వాళియే 

వెయ్య కదిరోన్ తన్నై విళక్కిట్టాన్ వాళియే 

వేంగడవర్ తిరుమలైయై విరుమ్బవన్ వాళియే 

పొయిగైముని వడివళగుమ్ పొఱ్పదముమ్ వాళియే 

పొన్ముడియుమ్ తిరుముగముమ్ భూతలత్తిల్ వాళియే 

పొయిగై ఆళ్వార్ వాళి తిరునామములు — సరళ వ్యాఖ్యానం

శెయ్యతులావోణత్తిఱ్ జగత్తుదిత్తాన్ వాళియే 

పొయిగై ఆళ్వార్లు ఆశ్వీయుజ మాసంలో వచ్చే, శ్రవణా నక్షత్రం నాడు అవతరించారు. ఆయన చిరకాలం వర్ధిల్లు గాక (పల్లాండు)! ఆయనకు మంగళాశాసనం! ‘వాళియే’ అనే పదం మంగళాశాసనం చేయడాన్ని సూచిస్తుంది.

తిరుక్కచ్చి మానగరం సెళిక్క వందోన్ వాళియే

వీరి అవతార స్థలం తిరువెఃక్కా. ఈ క్షేత్రం కాంచీపుర దివ్యదేశం యొక్క పరిసరాల ప్రాంతంలో ఉంటుంది.కాంచీపురం ఒక పెద్ద పట్టణం.  తిరువెఃక్కా అనేది ఆ నగరంలో ఒక చిన్న భాగం.వీరు అవతరించడం వల్లే కంచి పట్టణానికి ఎంతో కీర్తి/వైభవం లభించాయి! భగవద్విషయం (శ్రీమన్నారాయణుని వైభవం) ఈ ప్రపంచమంతటా వ్యాపించడం మొదలైంది.వీరు ఆళ్వార్లలో మొదటి ఆళ్వార్.ఎంపెరుమాన్ మనకు మొట్ట మొదటి ప్రబంధం వీరి ద్వారానే ఇచ్చాడు.తిరుక్కచ్చి పట్టణం శ్రీవైష్ణవ సంప్రదాయం వృద్ధికి ముఖ్యమైన కారణాలలో/కేంద్రాలలో ఒకటి.  ఈ కారణం వల్లనే తిరుక్కచ్చి పట్టణం కీర్తి పొందింది. తిరుక్కచ్చిలో అవతరించిన పొయిగై ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

వైయంతగళి నూరుమ్ వగుత్తురైత్తాన్ వాళియే

వీరు అంతాది క్రమంలో (ఒక పాశురంలోని చివరి పదం తరువాతి  పాశురానికి మొదటి పదం అవుతుంది) 100 పాశురాలు రచించారు. “వైయం తగళియా వార్కడలే నెయ్యాగ” అనే మొదటి పాశురంతో మొదలయ్యే ముదల్ తిరువందాది అనే గ్రంథాన్ని అనుగ్రహించిన ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

వనశమలర్ క్కరువదనిల్ వన్దమైందాన్ వాళియే

ఆళ్వార్ ఒక తామర పుష్పములో అవతరించారు.ఆ పుష్పమే ఆయనకు తల్లి గర్భంలా మారింది.ఆ గర్భం నుంచే ఆయన అవతరించారు.ఈ విధంగా అవతరించిన ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)! ఈనాటికీ ఆళ్వార్ అవతరించిన సరస్సును మనం చూడవచ్చు.ఆళ్వార్ ఆ సరస్సులోని పుష్పం నుండే అవతరించారు అని మనకు తెలుస్తుంది.

వెయ్య కదిరోన్ తన్నై విళక్కిట్టాన్ వాళియే

సూర్యుడిని ‘కదిరవన్’ అని పేర్కొంటూ ఆళ్వార్ ఒక దీపాన్ని వెలిగించారు. ‘వైయమ్ తగళియా వార్కడలే నెయ్యాగ వెయ్య కదిరోన్ విళక్కాగ’ అని ఆళ్వార్ ఆ క్రమాన్ని చూపించారు. ఈ విధంగా ఆళ్వార్ సూర్యుడిని దీపానికి రూపకంగా ఉపయోగించారు! అటువంటి పొయిగై ఆళ్వార్ పల్లాండుగా వర్ధిల్లాలి.

వేంగడవర్ తిరుమలైయై విరుమ్బవన్ వాళియే 

పొయిగై ఆళ్వార్‌కు తిరువేంగడముడయాన్ (శ్రీ వేంకటేశ్వర స్వామి) పట్ల అపరిమితమైన భక్తిభావం ఉండేది. ఆయన తన ప్రబంధమైన ‘ముదల్ తిరువందాది’లో తిరువేంగడముడయాన్‌ను కీర్తిస్తూ అనేక పాశురాలను రచించారు. అటువంటి పొయిగై ఆళ్వార్ ఎన్ని సంవత్సరాలైనా పల్లాండుగా వర్ధిల్లాలి!

పొయిగైముని వడివళగుమ్ పొఱ్పదముమ్ వాళియే 

పోయిగై ఆళ్వార్‌ను ఒక ముని అని పిలుస్తారు. ముని అంటే, తన మనస్సులో సదా ఎమ్పెరుమాన్ (శ్రీమన్నునారాయణుడు) యొక్క వైభవాన్ని ధ్యానిస్తూ, నిరంతరం ధ్యానంలో మునిగి ఉండేవారు. vAri అందమైన తిరుమేని మరియు బంగారము (ధనము) వలే కోరదగిన తిరువడికి పల్లాండు!

పొన్ముడియుమ్ తిరుముగముమ్ భూతలత్తిల్ వాళియే 

పొయ్గై ఆళ్వార్ల అందమైన శిరస్సును అలంకరించియున్న కిరీటము యొక్క వైభవము ఈ భూమిపై అనేక సంవత్సరములు వర్ధిల్లుగాక! వారి ప్రకాశమానమైన తిరుముఖ మండలం ఈ భూమిపై దీర్ఘకాలము వరకు ప్రకాశించుగాక! (పల్లాండు)

భూదత్తాళ్వార్ వైభవం:

భూదత్తాళ్వార్ల యొక్క అవతార స్థలం తిరుక్కడల్మల్లై అనే దివ్యదేశం.ఈ క్షేత్రాన్ని ఈనాటి మన వాడుక భాషలో మహాబలిపురం అని పిలుస్తున్నారు.ఈ దివ్యదేశంలో ఉన్న దివ్యమైన సరస్సులో ఉండే పుష్పం నుండి వీరు ఆవిర్భవించారు. వీరి తిరునక్షత్రం ఆశ్వీయుజ మాసంలో వచ్చే ధనిష్ఠ నక్షత్రం. వీరు ఇరండామ్ తిరువందాది ప్రబంధాన్ని అనుగ్రహించారు.ఈ గ్రంథంలో 100 అంతాది పాశురాలు (ఒక పాశురంలోని చివరి పదం తరువాతి  పాశురానికి మొదటి పదం అవుతుంది) ఉంటాయి.  వీరు కూడా పొయిగై ఆళ్వార్లలాగా నిత్యం పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలలో మునిగిపోయేవారు.  ముదల్ ఆళ్వార్లకు పెరుమాళ్ళ యొక్క త్రివిక్రమ అవతారంతో అద్వితీయమైన అనుబంధం ఉంది.  ఎంపెరుమాన్ త్రివిక్రముడిగా ఒక మహా విశ్వరూపం దాల్చి, ఈ సర్వలోకమూ కూడా తన యొక్క సొత్తే అని నిరూపించి చూపించాడు.

భూదత్తాళ్వార్ల యొక్క వాళి తిరునామములు:

అన్బే తగళి నూఱుం అరుళినాన్ వాళియే  

ఐప్పసియిల్ అవిట్టత్తిల్ అవతరిత్తాన్ వాళియే 

నన్పుగళ్శేర్ కురుక్కత్తి నాణ్మలరోన్ వాళియే

నల్ల తిరుక్కడల్మల్లై నాదనార్ వాళియే 

ఇన్బురుగు సిందై తిరియిట్ట పిరాన్ వాళియే

ఎళిల్ జ్ఞానచ్చుడర్ విళక్కై యేత్తినాన్ వాళియే 

పొన్పురైయుం తిరువరంగర్ పుగళురైపోన్ వాళియే 

భూతత్తార్ తాళినై యిప్పూతలతిల్ వాళియే 

భూదత్తాళ్వార్ల యొక్క వాళి తిరునామములు సరళమైన వివరణ

అన్బే తగళి నూఱుం అరుళినాన్ వళియే 

ఇరండామ్ తిరువందాది అనే గ్రంథం 100 పాశురాలు కలిగి ఉంటుంది.ఈ గ్రంథంలో మొదటి పాశురం, “అన్బే తగళియా ఆర్వమే నెయ్యాగ” అనే పదాలతో మొదలు అవుతుంది.అటువంటి భూదత్తాళ్వార్ అనేక సంవత్సరాలు పల్లాండుగా ఉండాలి.

ఐప్పసియిల్ అవిట్టత్తిల్ అవతరిత్తాన్ వాళియే 

భూదత్తాళ్వార్ ఆశ్వీయుజ మాసంలో, ధనిష్ఠా నక్షత్రం నాడు అవతరించారు.వారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు) ఉండాలి!

నన్పుగళ్శేర్ కురుక్కత్తి నాణ్మలరోన్ వాళియే

కురుక్కత్తి అనేది మాధవి కొడి అని పిలవబడే ఒక లత. అది చాలా ప్రసిద్ధి కలిగిన లత.ఆ లతలో ఉండే ఒక పుష్పం నుండి,ఆళ్వార్ అవతరించారు. పొయిగై ఆళ్వార్ల వలె వీరు కూడా తల్లి గర్భం నుంచి జన్మించలేదు, అందుకే వీరు అయోనిజులు. అటువంటి భూదత్తాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

నల్ల తిరుక్కడల్మల్లై నాదనార్ వాళియే 

భూదత్తాళ్వార్ తిరుక్కడల్మల్లై పట్టణానికి అదిపతిగా నిలిచారు. వారు చిరకాలం వర్ధిల్లాలి!! ఆళ్వార్ ఎంపెరుమాన్ భక్తులకు ఎందరికో మార్గదర్శనం చేశారు.

ఇన్బురుగు సిందై తిరియిట్ట పిరాన్ వాళియే

ఆళ్వార్ ఎంపెరుమాన్ మీద ఉన్న ప్రేమనే వత్తిగా చేసి దీపం వెలిగించారు.  అటువంటి ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి.

ఎళిల్ జ్ఞానచ్చుడర్ విళక్కై యేత్తినాన్ వాళియే 

ఆళ్వార్ ఎంపెరుమాన్ గురించిన సత్యమైన జ్ఞానాన్ని ఉపయోగించి దీపం వెలిగించారు. అటువంటి ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి.

పొన్పురైయుం తిరువరంగర్ పుగళురైపోన్ వాళియే 

విలువైన బంగారం లాంటి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు కొలువై ఉన్నారు.భూదత్తాళ్వార్ ఆయన మీద గొప్ప ప్రేమ పెంచుకొని,తాము రచించిన అనేక పాశురాలలో పెరుమాళ్ళను కీర్తించారు.అటువంటి భూదత్తాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి.

భూతత్తార్ తాళినై యిప్పూతలతిల్ వాళియే 

అప్పిళ్లై గారు అటువంటి భూతత్తాళ్వార్ యొక్క దివ్య తిరువడి వైభవం ఈ లోకంలో అనేక సంవత్సరాలు చిరకాలం వర్ధిల్లాలి అని చెప్పారు.

పేయాళ్వార్ వైభవం:

పేయాళ్వార్లు తిరుమైయిలై అనే క్షేత్రంలో, ఆశ్వీయుజ మాసంలో వచ్చే శతభిషా నక్షత్రం నాడు అవతరించారు. వీరు మూన్ఱామ్ తిరువందాది అనే ప్రబంధాన్ని అనుగ్రహించారు. 100 పాశురాల గల ఈ గ్రంథం అంతాది పాశురాలతో కలిగి ఉంటుంది. పొయిగై ఆళ్వార్లు మరియు భూతత్తాళ్వార్లు వలె వీరు కూడా పెరుమాళ్ళు యొక్క కళ్యాణ గుణాలలో మునిగిపోయేవారు.

పేయాళ్వార్ యొక్క వాళి తిరునామములు:

తిరుక్కణ్డేన్ ఎను నూఱుమ్ శెప్పినాన్ వాళియే

శిఱంద ఐప్పసియిల్ సదయం శెనిత్త వళ్ళల్ వాళియే 

మరుక్కమళుం మైయిలై నగర్ వాళ వందోన్ వాళియే 

మలర్కరియ నెయిదల్ తనిల్ వందుదిత్తాన్ వాళియే 

నెరుక్కిడవే ఇడైకళియిల్ నిన్ఱ శెల్వన్ వాళియే

నేమిశంగన్ వడివళగై నెంజిల్ వైప్పోన్ వాళియే 

పెరుక్కముడన్ తిరుమళిశై పిరాన్ తొళువోన్ వాళియే

పేయాళ్వార్ తాళినై ఇప్పెరునిలత్తిల్ వాళియే

పేయాళ్వార్ వాళి తిరునామములు – సరళ వివరణ :

తిరుక్కణ్డేన్ ఎను నూఱుమ్ శెప్పినాన్ వాళియే

పొయిగై ఆళ్వార్ మరియు భూతత్తాళ్వార్ వెలిగించిన దీపాల సహాయంతో, పేయాళ్వార్ మొదటిసారిగా పిరాట్టి మరియు ఎంపెరుమాన్ యొక్క దివ్య మంగళ తిరుమేనిని (విగ్రహం) దర్శించారు. ఆ ఆనందంతో ఆయన “తిరుక్కణ్డేన్ పొన్మేని కణ్డేన్” అని మొదలయ్యే 100 పాశురాలు పాడారు. అటువంటి పేయాళ్వార్ వైభవం చిరకాలం వర్ధిల్లాలి!!

శిఱంద ఐప్పసియిల్ సదయం శెనిత్త వళ్ళల్ వాళియే

అత్యంత దానగుణం కలిగినవారు,శుభప్రదమైన ఆశ్వీయుజ మాసంలో శతభిషా నక్షత్రమున అవతరించిన పేయాళ్వార్ పల్లాండుగా ఉండాలి!పేయాళ్వార్ యొక్క ఉదారత్వాన్ని పొగడడానికి కారణమే ఆయన దయాగుణం. అది ఎటువంటిది అంటే! పిరాట్టి మరియు ఎంపెరుమాన్ దర్శనం తాను పొందినప్పుడు,ఆ ఆనందాన్ని తాను మాత్రమే అనుభవించి ఆయన ఆగిపోలేదు.ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవడానికి ఆయన పాశురాలు రచించారు.

మరుక్కమళుం మైయిలై నగర్ వాళ వందోన్ వాళియే

మరువము పువ్వుల (మరిక్కొళుందు) సువాసనలతో నిండిన మైలాపూర్ పట్టణంలో ఆయన అవతరించి అక్కడే నివసించారు.అటువంటి పేయాళ్వార్ పల్లాండుగా ఉండుగాక.

మలర్కరియ నెయిదల్ తనిల్ వందుదిత్తాన్ వాళియే

వీరు నల్ల కలువ (నెయ్దల్) పుష్పంలో అవతరించారు.వీరు కూడా తల్లి గర్భం నుంచి జన్మించలేదు (అయోనిజులు).అటువంటి పేయాళ్వార్ పల్లాండుగా ఉండుగాక!!

నెరుక్కిడవే ఇడైకళియిల్ నిన్ఱ శెల్వన్ వాళియే

ఒక తుఫాను రాత్రి, తిరుక్కోవలూర్ దివ్యదేశంలో,ముగ్గురు ఆళ్వార్లు ఇరుకైన వసారాలో నిలబడి ఉన్నప్పుడు, వారు ముగ్గురూ తొక్కిసలాటను అనుభవించారు మరియు ఆ చీకటి రాత్రిలో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. నాల్గవ వ్యక్తి తోపుడు ఎక్కువైపోయింది.ఆయన ఎవరో కాదు,తన భక్తులతో కలిసి ఉండాలని సర్వేశ్వరుడే పిరాట్టితో కూడి ఆళ్వార్ల మధ్యలోకి వచ్చాడు.చీకటిగా ఉన్నందున పోయిగై ఆళ్వార్ మరియు భూతత్తాళ్వార్ తమ తమ పాశురాలతో దీపాలు వెలిగించారు.ఆ దీపపు కాంతిలో పెరుమాళ్ మరియు పిరాట్టి యొక్క దర్శనం మొట్ట మొదట పేయాళ్వార్లకే అయ్యింది.పెరుమాళ్ళ యొక్క అనుగ్రహ సంపదతో కూడిన వ్యక్తిగా ఆ వసారాలో నిలబడి, మిగిలిన ఇద్దరు ఆళ్వార్లతో కలిసి పెరుమాళ్ మరియు పిరాట్టి దర్శనం పొందిన పేయాళ్వార్ పల్లాండుగా ఉండాలి!

నేమిశంగన్ వడివళగై నెంజిల్ వైప్పోన్ వాళియే 

ఒక శ్రీ హస్తంలో సుదర్శన చక్రం,ఇంకో శ్రీ హస్తంలో పాంచజన్య శంఖంతో దర్శనమిచ్చిన పెరుమాళ్ళ యొక్క అత్యంత తేజోమయమైన రూపాన్ని దర్శించినది పేయాళ్వారే!అటువంటి పేయాళ్వార్ పల్లాండుగా ఉండుగాక!!

పెరుక్కముడన్ తిరుమళిశైప పిరాన్ తొళువోన్ వాళియే

పేయాళ్వార్లను తిరుమళిశై ఆళ్వార్ గొప్ప భక్తితో పూజించేవారు. తిరుమళిశై ఆళ్వార్ ఇతర తత్వాలలో కూడా బాగా పాండిత్యం కలవారు.అనేక ఆధ్యాత్మిక మార్గాలను లోతుగా విశ్లేషించిన తరువాతనే,శ్రీమన్నారాయణుడు మాత్రమే పరత్వము అని తీర్మానించారు.పేయాళ్వారే తిరుమళిశై ఆళ్వార్ సంస్కరణకు కారకులు అయ్యారు. పేయాళ్వార్ మరియు తిరుమళిశై ఆళ్వార్ ఇరువురు ఒకే కాలం వారు అని అర్థమవుతుంది.చరిత్ర ప్రకారం తిరుమళిశై ఆళ్వార్ తన యోగ శక్తులను సహాయంతో 4,700 సంవత్సరాలు ఈ భూమిపై జీవించారు. తిరుమళిశై ఆళ్వార్ పెరుమాళ్ళపై జ్ఞానం,భక్తి లోపించాయని పేయాళ్వార్ గుర్తించారు. అందుకే ఆయన బుద్ధికి విజ్ఞప్తి చేసి,గొప్ప జ్ఞానోపదేశం ఇచ్చి, శ్రీమన్నారాయణుడి యొక్క గొప్ప భక్తుడిగా మార్చారు.ఆ రోజు నుంచి తిరుమళిశై ఆళ్వార్ పేయాళ్వార్లకు భక్తుడిగా మారిపోయారు. అటువంటి పేయాళ్వార్ పల్లాండుగా ఉండుగాక!!

పేయాళ్వార్ తాళినై ఇప్పెరునిలత్తిల్ వాళియే

అటువంటి పేయాళ్వార్ యొక్క విశాలమైన తిరువడి (పాద) కమలముల వైభవం ఈ భూమిపై పల్లాండుగా ఉండుగాక!

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

ప్రూఫ్ రీడింగ్ చేసిన వారు : లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి 

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org