ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – పరాశర భట్టర్ వాళి తిరునామ వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక

<< ఎంబార్ వాళి తిరునామ వైభవం

పరాశర భట్టర్ , కూరత్తాళ్వాన్‌కు జన్మించిన ఇద్దరు కుమారుల్లో ఒకరు.  పరాశర భట్టర్  జన్మించిన వెంటనే, శ్రీ రామానుజులు ఇలా అన్నారు: “ఈ కుమారుడిని పెరియ పెరుమాళ్ మరియు పెరియ పిరాట్టికి దత్తత  ఇవ్వండి, ఈ బాలుడు వారి కుమారుడిగా పెరగాలి.”  కూరత్తాళ్వాన్ అచ్చం అలాగే చేశారు మరియు ఆయన నిజంగానే పెరియ పెరుమాళ్ మరియు పెరియ పిరాట్టి యొక్క కుమారుడిగా పెరిగారు.  అందుకే వారు “తెన్నరంగర్ మైందాన్” అని పిలువబడ్డారు.అంటే శ్రీరంగనాథుని యొక్క కుమారులు అని అర్థం. వారు  శ్రీరంగంలో, వైశాఖ మాసం, అనురాధ నక్షత్రంలో అవతరించారు. చిన్న వయసులోనే వారిలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం కనిపించేది. చిన్నప్పుడు ఆయన ఒకసారి శ్రీరంగ వీధుల్లో ఆడుకుంటూ ఉండగా, వారి తిరుత్తగప్పనార్ అంటే వారి తండ్రి గారు అయిన కూరత్తాళ్వాన్ “ సంతై (పాఠం) నేర్చుకోవడానికి పాఠశాలకు వెళ్లలేదా?” అని అడిగారు  భట్టర్  వెంటనే “నిన్న చెప్పిన పాఠమే ఇవాళ కూడా చెబుతున్నారు అని బదులు ఇవ్వగా కూరత్తాళ్వాన్ అందుకు  “ఒక పాఠాన్ని నాలుగు–ఐదు సార్లు వింటేనే గుర్తు ఉంటుంది” అని తండ్రి గారు అనగా, భట్టర్  “నిన్న నేర్చుకున్నదంతా నాకు గుర్తుంది.  అని చెప్పి పాఠాన్ని పూర్తిగా అప్పచెప్పి చూపించారు.

భట్టర్  మనకు అనేక అమూల్య గ్రంథాలను అనుగ్రహించారు.  అవి,శ్రీరంగరాజ స్తవం, అష్టశ్లోకీ , శ్రీ గుణరత్న కోశం, భగవద్గుణ దర్శనం (విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం).   అష్టశ్లోకిలో — తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం — ఈ మూడు మహామంత్రాల సారాన్ని, మంత్రాక్షరాలను ఉచ్చరించకుండా, అద్భుతమైన ఎనిమిది శ్లోకాలలో అందంగా అనుగ్రహించారు.

శ్రీరంగరాజ స్తవం అనేక శాస్త్రార్థాలను కలిగిన స్తోత్ర గ్రంథం.   శ్రీ గుణరత్న కోశం  శ్రీరంగనాయకి (పెరియ పిరాట్టి) వైభవాన్ని తెలిపే గ్రంథం.  భగవద్గుణ దర్పణం గ్రంథంతో విష్ణు సహస్రనామానికి అద్భుతమైన వ్యాఖ్యానం అందించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ప్రమాణంగా అనేక అర్థాలను ఆయన ఉదాహరించారు.ఆయన తరువాత వచ్చిన ఓరాణ్ వళి ఆచార్యులు వారి వ్యాఖ్యానాలను “భట్టర్  నిర్వాహం” (ఉపదేశాలు/ముగింపు)అని గౌరవంగా పేర్కొన్నారు.  భట్టర్ , శ్రీ రంగనాథ–శ్రీ రంగనాయకి దంపతులను తన తల్లిదండ్రులుగా భావించారు, తన గ్రంథాల్లోనే  “పిరాట్టి నన్ను తూలిలో (ఊయలలో) పెట్టి పెంచింది”   అని పేర్కొన్నారు.  అంతటి భాగ్యం,  వైభవం  ఆయనది. వారు శ్రీరంగనాథుని యొక్క పురోహిత సేవను నిర్వహించినందున, వారిని “శ్రీరంగ పురోహితులు” అని కూడా పిలిచేవారు.

పరాశర భట్టర్  వాళి తిరునామములు

తెన్నరంగర్ మైందన్ ఎనచ్చిఱక్కవందోన్ వాళియే   

తిరునెడుంతాణ్డకప్ పొరుళైచ్ చెప్పుమవన్ వాళియే  

అన్నవయల్ పూదూరన్ అడి పణిందోన్ వాళియే  

అనవరతం ఎంబారుక్కు ఆట్శెయ్వోన్ వాళియే  

మన్నుతిరుక్కూరనార్ వళం ఉరైప్పోన్ వాళియే  

వైగాసి అనుడత్తిల్ వందుదిత్తోన్ వాళియే 

పన్నుకలై నాల్వేదప్ పయంతెరిందోన్ వాళియే  

పరాశరనాం శీర్ భట్టర్ పారులగిల్ వాళియే  

తెన్నరంగర్ మైందన్ ఎనచ్ చిఱక్కవందోన్ వాళియే  

శ్రీరంగనాథుని యొక్క మైందన్ (కుమారుడు) అనే ఘనతను పొందిన పరాశర భట్టర్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

తిరునెడుందాణ్దకప్ పొరుళైచ్ చెప్పుమవన్ వాళియే  

తిరునెడుందాండకం గ్రంథం తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించిన చివరి దివ్య ప్రబంధం. ఈ అద్భుతమైన ప్రబంధంలో,తిరుమంగై ఆళ్వార్లు సకల శాస్త్రాల సారాన్ని  నిక్షిప్తం చేశారు. పెరియవాచ్చాన్ పిళ్ళై వారి వ్యాఖ్యానంలో, మొదటి మూడు పాశురములలోనే సమస్త శాస్త్రార్థములు చూపబడ్డాయని చెప్పబడింది.ఈ ప్రబంధముపై పరాశర భట్టర్లుకు అపారమైన పాండిత్యం ఉండెను.భట్టర్ మాధవాచార్యులను (తరువాత నంజీయర్గా, వేదాంతిగా పేరొందినారు)  తిరునెడుందాండకమును ప్రమాణముగా చేసి వాదమున జయించిరి.అలా భట్టర్ సంవాదంలో గెలిచిన పిదప  అధ్యయనోత్సవం యొక్క మొదటి రోజున శ్రీరంగమునకు వేంచేసిరి.  రంగనాధునకు మేలైనాడులో (తిరునారాయణపురం వద్ద) వేదాంతిపై తన విజయం గురించి పెరియ పెరుమాళ్ళకు విన్నవించగా, ఎంపెరుమాన్ మిక్కిలి సంతోషించి, మా ఎదుట కూడా తిరునెడుందాండకం సేవించవలసినదిగా ఆజ్ఞాపించారు. భట్టర్ అలా తిరునెడుందాండకం ఎంపెరుమాన్ సన్నిధిలో సేవించినట్లు మనకు తెలుస్తుంది. నేటికీ ఈ సాంప్రదాయం శ్రీరంగంలో  కొనసాగుతున్నది. శ్రీరంగంలో అధ్యయనోత్సవం ముందు రోజు అరయర్ స్వాములు తిరునెడుందాండకమును ఎంపెరుమాన్ సన్నిధిలో విన్నవిస్తారు.  ఆ విధంగా తిరినెడుందాండకంలోని లోతైన అర్థాన్ని అవగాహన చేసుకొన్న భట్టర్ వైభవం చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

అన్నవయల్ పూదూరన్ అడి పణిందోన్ వాళియే.

పూర్వ కాలంలో శ్రీపెరుంబుదూరులో పచ్చని పైర్లు, సరస్సులు కనువిందు చేస్తూ ఉండేవి. అలాంటి అందమైన శ్రీ పెరుంబూదూర్లో జన్మించిన రామానుజుల తిరువడిని సేవించుకున్న భట్టర్ చిరకాలం వర్ధిల్లాలి. ఆ కాలంలో రామానుజులు చిన్ని భట్టర్ల చేత నంపెరుమాళ్ సన్నిధిలో పాశురాలు సేవింపచేసేవారు. అలా సేవిస్తుండగా చూసి, గోష్ఠితో తమకు ,భట్టర్లకు భేధంలేదని, భట్టర్ తమతో సమానమని చెప్పేవారు.  అందుకే రామానుజుల వారి శిష్యులైన అనంతాళ్వాన్ మరియు కిడాంబి ఆచ్చాన్ పరాశర భట్టర్లు కన్నా పెద్దవారు అయినప్పటికీ భట్టర్లకు, రామానుజుల వారికి ఇచ్చే ప్రత్యేక గౌరవమే ఇచ్చేవారు. అలాంటి భట్టర్ల వైభవం చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

అనవరదం ఎంబారుక్కు ఆట్చెయ్వోన్ వాళియే  

ఎంబార్ భట్టర్లకు ఆచార్యులు అని మన అందరికీ తెలిసినదే. భట్టర్లు తమ ఆచార్యులు అయిన ఎంబార్ మరియు తండ్రి గారు అయిన కూరత్తాళ్వాన్ పైన ఇరువురి పట్ల అపారమైన గౌరవం కలిగి ఉండిరి. భట్టర్లు ఇరువురు కూడా ఇరువురిని ఆచార్యులుగా భావించిరి.ఎందుకనగా కూరత్తాళ్వాన్లు ఇరువురికి తిరుమంత్రార్ధమును ఉపదేశించిరి. 

మన్నుతిరుక్కూరనార్ వళమురైప్పోన్ వాళియే 

తండ్రి అయిన కూరత్తాళ్వానుల పట్ల పరాశర భట్టర్ మరియు సోదరుడు అయిన వేద వ్యాస భట్టర్లు ఎంతో గౌరవంతో ఉండేవారు.ఒకసారి కూరత్తాళ్వాన్ తిరువాయిమొళిలో 1.2.10 – “ఎమ్ పెరుక్కన్ నలత్తు ఒణ్ పొరుళీఱిల వణ్ పుగళ్ నారణన్ తిణ్కళల్ సేరే” ( నారాయణుడే సకల జీవాత్మలకు అధినాయకుడు.ఆయన ఎన్నో కళ్యాణ గుణాలు కలిగినవాడు.ఉదాహరణకి ఆనందం మొదలైనవి.సర్వ శేషి అయిన శ్రీమన్నారాయణుని పాద కమలములను శరణు వేడి ఆశ్రయించండి)( ఈ పాశురం తిరుమంత్రం అర్థం చెబుతుంది)అనే పాశురాన్ని వ్యాఖ్యానించేటప్పుడు , తమ పుత్రులు కాలక్షేప గోష్టిలో ఉండడం చూసి , ఈ పాశురం అర్థం మీరు మీ ఆచార్యులు అయిన ఎంబార్ వద్ద తెలుసుకోండి.అని అన్నారు.మన సాంప్రదాయంలో ఆచార్య నిష్ఠ అటువంటిది.పరాశర భట్టర్లు మరియు వేద వ్యాస భట్టర్ వారి తండ్రి గారిని కూడా ఆచార్యులుగా భావించేవారు.అందుకు ఆచార్య ఆజ్ఞగా ఇరువురు కూడా ఎంబార్ల దగ్గరకు వెళ్ళ సాగారు.వారు వెళ్ళిన తరువాత కూరత్తాళ్వాన్ల మనసు కలత చెందింది. తిరువాయిమొళిలో పాశురమైన “మిన్నిన్ నిలైయిల మన్నుయిరాక్కైగళ్” గుర్తుకు వచ్చి ఈ జీవితము మెరుపు వలె అస్థిరము. వారు ఈ తిరుమంత్ర అర్థం నేర్చుకోవడానికి ఎంబార్ల వద్దకు చేరే లోపు వారికి ఏదైనా జరగవచ్చు అని భయపడి వెంటనే తమ కుమారులను పిలిపించి,ఆ గోష్టిలోనే తిరుమంత్ర ఉపదేశం అనుగ్రహించెను.అందుకని కూరత్తాళ్వాన్లను భట్టర్లు తమ ఆచార్యులుగా భావించేవారు.కూరం అనే అద్భుతమైన క్షేత్రంలో అవతరించిన కూరత్తాళ్వాన్ల యొక్క వైభవమును వర్ణించగలిగిన సామర్థ్యము గల పరాశర భట్టర్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు). 

వైగాసి అనుడత్తిల్ వందుదిత్తోన్ వాళియే  

భట్టర్ వైశాఖ మాసంలోని అనురాధ  నక్షత్రంలో అవతరించారు. ప్రపన్న జన కూటస్థులైన నమ్మాళ్వార్ తిరునక్షత్రం వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం తర్వాతి రోజు వారు అవతరించారు.ఆయన చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

పన్నుకలై నాయీ వేదప్ పయంతెరిందోన్ వాళియే  

ప్రబంధాలూ మరియు నాలుగు వేదాలూ చెప్పే తత్వార్థాన్ని స్పష్టంగా తెలిసిన భట్టర్ కీర్తి చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

పరాసరనాం సీర్ భట్టర్ పారులగిల్ వాళియే  

ఆళవందార్లకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి, పరాశర మహర్షి మరియు వేదవ్యాస మహర్షి వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో,రామానుజుల వారు కూరత్తాళ్వాన్ కుమారులకు పరాశర భట్టర్ మరియు వేదవ్యాస భట్టర్ అనే నామకరణం చేశారు. ఇలాంటి సద్గుణ సంపన్నులైన  పరాశర భట్టర్ యొక్క కీర్తి ఈ లోకంలో చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి 
శ్రీ తేజ రామానుజ దాసి 

మూలం : https://divyaprabandham.koyil.org/index.php/2026/01/vazhi-thirunamams-bhattar-simple/

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org 

Leave a Comment