సప్తగాథై – అవతారిక (పరిచయం) – 1 భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

సప్తకాథై

<< మునుపు భాగము

శ్రీమద్ భగవద్గీత (7.18శ్లో) లో పరమాత్మ అనుగ్రహించినట్లు “జ్ఞానీ తు ఆత్మైవ మే మతమ్” (నా ఉద్దేశ్యంలో అలాంటి భక్తులే నా ఆత్మ) అన్నట్టు, సాక్షాత్తు శ్రీరంగనాథులంతటి వారిని రక్షించిన ఏకైక రక్షకులు శ్రీపిళ్ళైలోకాచార్య స్వామివారు. శ్రీహస్తిగిరి పేరరుళాళన్ (దేవరాజ పెరుమాళ్ళు) యొక్క ఆజ్ఞతో శ్రీవచనభూషణం వంటి గొప్ప గ్రంథాన్ని, అనేక రహస్య గ్రంథాలను అనుగ్రహించారు. ఈ గ్రంథాలన్నీ కూడా ప్రమాణ (శ్రీకోశములు), ప్రమేయ (భగవంతుడు), ప్రమాతృ (ఆళ్వార్ ఆచార్యుల) కైంకర్య వైభవాలను వివరముగా క్రమ పద్ధతిలో తెలిపే గొప్ప గ్రంథాలు. ఇటువంటి మహానుభావుల యొక్క శ్రీపాదాలను ఆశ్రయించిన వారు శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై స్వామివారు.

శ్రీహస్తిగిరి పేరరుళాళన్ (దేవరాజ పెరుమాళ్ళు) అపరావతారమే శ్రీపిళ్ళైలోకాచార్యులు అన్న వారి అవతార విశేషము ఎరిగిన శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై గారు, శ్రీపిళ్ళైలోకాచార్యుల వారి అనుగ్రహం వలన, వారి సుస్పష్టమైన జ్ఞాన విశేషాలను ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండేవారు. ఏ విధముగా అనగా తిరువాయ్మొళి [9-4-9] లో శ్రీనమ్మాళ్వార్ అనుగ్రహించినట్లు “తొణ్డర్ క్కు అముదుణ్ణ చ్చొన్మాలై కళ్” (శ్రీవైష్ణవ దాసులకు అమృతపానమై ఉండే శబ్దమాలిక చెప్పితిని) అనే రీతిలో, ఉజ్జీవింపగోరే వారికి అమృతం వంటి తిరువాయ్మొళి, ఆ అంగాలకి అంటే నమ్మాళ్వార్ అనుగ్రహించిన నాలుగు దివ్యప్రబంధాలకు ఉపాంగాలు అనుగ్రహించిన తిరుమంగై ఆళ్వార్ “ఇరున్దమిళ్ నూల్ పులవర్ తిరుమంగై ఆళ్వార్” (గొప్ప ద్రావిడ భాషావేత్త అయిన తిరుమంగై మన్నన్) అని ఆచార్య హృదయం – 43 లో అనుగ్రహించినట్టుగా, మిగిలిన 8 మంది ఆళ్వార్ల ప్రబంధములు, వాటికి తిరుక్కురుగై ప్పిరాన్ మొదలైన వారు కృప చేసిన వ్యాఖ్యానాలను, వాటి తాత్పర్యాలను, వాటిలో ఉన్న శబ్దరస, అర్థరస, భావరస భావాలను ఏ దోషాలు లేకుండా క్రమానుసారంగా అభ్యసించి తెలుసుకున్నారు శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై గారు.

భగవద్ రామానుజులకు ధనుర్దాసు (పిళ్ళై ఉఱఙ్గావిల్లి దాసర్) వలె, నమ్బిళ్ళైకు ఏఱు తిరువుడైయాన్ దాసర్ వలె, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్కు, పిళ్ళై వానమామలై దాసర్ వలె ఈ విళాఞ్జోలై ప్పిళ్ళై గారు శ్రీపిళ్ళైలోకాచార్య స్వామి వారికి అతి సన్నిహితంగా ఉంటూ తమ ఉపచారాలు సమర్పిస్తూ ఆంతరంగిక శిష్యులై, ఆత్మ సమానులై, ప్రాణ సమానులై, నేత్ర సమానులై, వాహన సమానులై, ఆభరణ సమానులై, పాద సమానులై, పాదరేఖా సమానులై, ఛాయా సమానులై, పాదుకా సమానులై, శ్రీపాదాసన సమానులై ప్రకాశించారు.

వీరు పతనం చెందడానికి అవకాశం లేని ఉత్కృష్ఠ జన్మలో అవతరించారు. సహజమైన దాస్య గుణాన్ని కలవారు. సర్వజ్ఞులు. వీరి సర్వజ్ఞత్వం ఎలా ఉండేది అంటే తీతత్త జ్ఞాన తిరువాయ్మొళి ప్పిళ్ళై (ఏ దోషం లేని జ్ఞానం) అని ఆర్తి ప్రబంధం(22) లో చెప్పినట్టుగా తిరువాయ్మొళి ప్పిళ్ళై గారు సర్వజ్ఞులు. శాస్త్రముల ఆద్యంతాలు అన్నీ చూసిన వారు. అలాంటి తిరువాయ్మొళి ప్పిళ్ళై గారు కూడా విళాఞ్జోలై ప్పిళ్ళైగారు వద్దకు వేంచేసి చరమపర్వ నిష్ఠావిశేషాలను ఆలకించేవారట. వీరి తనియన్లో చెప్పినట్టుగా “వాళి నలన్తికళ్ నారణతాతనరుళ్” అన్నట్టుగా ప్రకాశించేవారట శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై స్వామివారు, శిష్టాచారము తెలిసిన పెద్దల చేత మంగళాశాసనం చెయ్యబడిన వారు. ఇంతకీ ఏమిటా శిష్టాచారము అంటే, ఆచార్య హృదయం (85) లో అనుగ్రహించినట్లు “యాగ అనుయాగ ఉత్తర వీడి గళిల్ కాయ, అన్న, స్థలశుద్ధి పణ్ణిన”. అంటే చెబుతున్నారు ఎమ్బెరుమానార్లు పిళ్ళై ఉఱఙ్గావిల్లి దాసర్ (ధనుర్దాసు) వారిని తాము తిరువారాధనకు ఉపక్రమించే ముందు స్పృశించే వారట (కాయ శుద్ధి) అలాగే నమ్బిళ్ళై గారు ఈఱు తిరువుడైయార్ దాసర్ అన్న భాగవతోత్తముల వారి చేత భగవానుని ఆరగింపు ప్రసాదాన్ని ఒక్కసారి స్పృశింప చేసి మరీ ఆహారాన్ని పుచ్చుకొనేవారట, అంటే భాగవతోత్తముల కరస్పర్శ (అన్నశుద్ధి) మరియు నడువిల్ తిరువీధి ప్పిళ్ళై భట్టర్ అన్న వారు కొత్తగా తాము నిర్మింప చేసుకున్న గృహం చుట్టూ పిళ్ళై వానమామలై దాసర్ అన్న భాగవతోత్తములచే ఒక ప్రదక్షిణ చేయించుకొని దానినే ఆ స్థలానికి ప్రోక్షణగా భావించి గృహములోకి ప్రవేశించేరట (స్థల శుద్ధి). ఇలాంటి శిష్టాచారము తెలిసిన పెద్దల చేత మంగళాశాసనం చేయబడ్డారు శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై స్వామివారు.

వీరి ఆచార్యులు అయిన శ్రీపిళ్ళైలోకాచార్యుల వారు అంతిమ సమయములో “మీరు మీ చరమదశ వరకు తిరువనంతపురంలో వేంచేసి ఉండవలసినది” అన్న దివ్యమైన దయగల ఆజ్ఞ మేరకు తిరువనంతపురం వేంచేసి, నమ్మాళ్వార్లు తిరువాయ్మొళిలో [10-2-8] “నడమినో నమర్ కళుళ్ళీర్” (బంధువులారా తిరువనంతపురం పదండి) అని నమ్మాళ్వార్ ఆజ్ఞను పాటించిన వారిలో వీరు ప్రధానులు అనే అతిశయాన్ని తెలిపేటట్లు “పడముడై యరవిల్ పళ్ళి” [10-2-8] (వేయి పడగలు కల ఆదిశేషువు పడకపై) పవ్వళించి ఉన్న పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహాన్ని 3 ద్వారముల నుంచి ముఖ, నాభి, శ్రీచరణాలను సేవించి ఆనందిస్తూ అక్కడే, తిరువనంతపురం లోనే వేంచేసి ఉన్నారు. తరువాత “వాశమే కమళుమ్ శోలై” (సువాసన పరిమళించే తోట) అన్నట్టు ఆ క్షేత్రములో ఉన్న ఉద్యానవనానికి వేంచేసి “గురుం పాదాంబుజమ్ ధ్యాయేత్” (ఆచార్యుల శ్రీపాదాలను ధ్యానించడంలో ఆసక్తి గలవారు) అని “విగ్రహాలోకనపరః” (ఆచార్యుల దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడంలో ఆసక్తి కలవారు) అని, “శ్రీలోకాచార్య పదారవింద మఖిల శ్రుత్యర్ధకోశం సతాం తాం గోష్ఠీం చ తదేకలీన మనసా సంచింతయంతం సదా” (సకల వేదార్ధాలకు నిఘంటువు వంటిదైన శ్రీపిళ్ళైలోకాచార్యుల వారి శ్రీచరణాలను, ఆ మహానుభావుల కాలక్షేపగోష్ఠిని తదేకమైన మనసుతో ఎల్లప్పుడూ ధ్యానం చేసేవారు) అని పలికినట్టుగా శ్రీపిళ్ళైలోకాచార్యుల వారి తేనె స్రవించే ఎఱ్ఱని అందమైన తామర పుష్పపు వంటి శ్రీచరణాలు, ప్రకాశించే పట్టు వస్త్రంతో అలంకరింపబడిన వారి నడుము, యజ్ఞోపవీతంతో, తులసి, తామరపూసల హారాలతో, మణిహారాలతో అలంకరింపబడిన వారి వక్షస్థలం, పూర్వాచార్యుల శ్రీసూక్తులతో నిండిన వారి చిరునవ్వు కరుణని పొంగించే వారి నేత్ర ద్వయం, ఘనమైన వారి శిఖాబంధనం, చంద్రుని వంటి పాలభాగం, తిరునేత్రాలు, ఎఱ్ఱని అధరాలు, యజ్ఞోపవీతం, బంగారు వర్ణాన్ని కలిగిన బాహువులు, విశాలమైన వక్షస్థలం, మణులు కలిగిన హారాలు, నడుముకు ధరించిన ఆభరణం ఎఱ్ఱటి తామరల వలె ఉన్న శ్రీపాదాలతో పద్మాసనంలో ఆసీనులై ఉన్న భంగిమ, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలతో అలరారుతున్న తిరుమేని ఒక శ్రీహస్తంతో జ్ఞానముద్రతో వేంచేసి ఉన్న తమ ఆచార్యులైన శ్రీపిళ్ళైలోకాచార్య స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని ఆపాద కేశాన్తమ్ మరియు కేశాదిపాదాంతమ్ స్ఫష్టంగా విశదంగా, విశదతరంగా, విశదతమంగా, మనస్సులో ధ్యానం చేసేవారు శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై స్వామివారు.

ఆనాడు నంబిళ్ళై వారి గోష్ఠి ఏ విధంగా అయితే “వార్తోఞ్చ వృత్త్యాపి యదీయ గోష్ఠీం గోష్ఠ్యంతరాణాం ప్రథమా భవంతి” (శ్రీనంబిళ్ళై గోష్ఠి లో ఉంఛ వృత్తితో శ్రీసూక్తిని పొందిన వారు కూడా ఇతర గోష్ఠులలో అగ్రగణ్యులుగా ఉంటారు) అన్నట్టుగా శ్రీపిళ్ళైలోకాచార్య స్వామి వారి గోష్ఠి కూడా శ్రీనంబిళ్ళై గోష్ఠిని పోలి ఉండేదట విళాఞ్జోలై ప్పిళ్ళై గారు సదా ఎల్లప్పుడూ ఈ గోష్ఠినే స్మరిస్తూ ఉండేవారట. ఆనాడు శ్రీరామాయణం ఉత్తరకాండ (40-14) లో హనుమ చెప్పినట్టుగా “భావో నాన్యత్ర గచ్ఛతి” (నా మనసు వేరొక విషయాన్ని తలవదు) అన్నట్టుగా. సాలెపురుగు గూడు కట్టుకుని అందులోనే ఉన్నట్లు, అలా వీరు సుందరకాండ (36-42) “నైవ దంశాన్” (కరిచే కీటకాలు కూడా లెక్క చెయ్యకుండా) అనే రీతిలో తమను కీటకములు కరిచినా, పాకినా తెలియక యోగ సమాధిలో వేంచేసి ఉండేవారట. “వాళి ఏఱు తిరువుడైయాన్ ఎన్దై యులకారియన్ శొల్, తిరువుడైయాన్ శీర్” అని వీరి తనియన్లో అనుగ్రహించినట్టుగా వీరు వారి ఆచార్యులైన శ్రీపిళ్ళైలోకాచార్యుల శ్రీసూక్తులను, శ్రీవచనభూషణాది రహస్య గ్రంథాలను ధ్యానిస్తూ తాత్పర్య సారతమార్థ విషయాలను సర్వకాలాలలో అనుభవిస్తూ ఉండేవారు. ఆ అనుభవం ఎంత గొప్పగా ఉండేది అంటే అటు సంసారానికి, పరమపదానికి తేడా లేకుండా “పారులకై పొన్నులకా ప్పార్ క్కవుమ్ పెత్తోమ్” (విశాలమైన ఈ లోకాన్ని పరమపదంగా దర్శించగలిగేము) అన్నట్టు అనుభవించేవారు శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై గారు.

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2022/12/saptha-kadhai-introduction-1/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment