శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః

ఆళవందార్ అసలు పేరు యామునులు. తరువాత ఆయన యామునాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. చిన్న వయసులో ఒక పండితుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, రాజు అందరు పండితులపై శుల్కం విధించాడు. ఆ ఆజ్ఞ యామునులకు నచ్చలేదు. కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే, రాజసభకు వెళ్లి, రాజపండితునితో వాదంలో గెలిచారు.
వాదానికి ముందు రాజు–రాణి చిన్న యామునులను చూసి ఒకరితో ఒకరు పందెం కట్టుకున్నారు. రాణి — యామునులు గెలుస్తారు అని నమ్మి, అతను ఓడితే నేను జీవితాంతం మీ సేవకురాలిని అవుతాను, అంది. రాజు — “రాజపండితుడు గెలుస్తాడు” అని నమ్మి, “అతను ఓడితే నా రాజ్యం సగం యామునులకు ఇస్తాను” అన్నాడు.
యామునులు గెలిచినప్పుడు, రాణి ప్రేమతో, ఆశ్చర్యంతో —
“ఎమ్మై ఆళవందీరో?” (మీరు నన్ను పాలించడానికి వచ్చారా?) అని అన్నది. అప్పటి నుండి యామునులు “ఆళవందార్” అని పిలవబడ్డారు.
రాజు ఇచ్చిన రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో, మణక్కాళ్ నంబి ఆళవందార్ను కలవ ప్రయత్నం చేశారు. ఆళవందార్ కొరకై ప్రతి నిత్యం తూదువళై ఆకులు (అలర్కపత్రము) అందించేవారు. ఆళవందార్ వాటిని ఆస్వాదించేవారు. కొంతకాలానికి ఆ ఆకులు రావడం ఆగిపోయింది. మడప్పళ్ళిలో (వంటగది) విచారించినప్పుడు, వాటిని తెచ్చే వ్యక్తి రావడం మానేశాడని తెలిసింది. కొంతకాలానికి మణక్కాళ్ నంబి తిరిగి వచ్చి, “మీ తాతగారు మీకు తూదువలై కంటే విలువైన ధనం వదిలి వెళ్లారు” అని చెప్పారు. అప్పుడు వారు భగవద్గీతా ఉపదేశం ఆళవందార్కు బోధించారు. ఉపదేశం ముగిసిన తరువాత — “ఈ గీతోపదేశం చేసిన శ్రీమన్నారాయణుడే మీ తాతగారు మీకు వదిలిన నిజమైన సంపద” అని చెప్పారు. తర్వాత ఆయన ఆళవందార్ను శ్రీరంగానికి తీసుకు వెళ్లారు. పెరియ పెరుమాళ్ దివ్యకటాక్షం ఆళవందార్పై పడింది. అప్పటి నుండి ఆళవందార్ రాజ్యాన్ని విడిచి సన్యాసం స్వీకరించి, శ్రీరంగంలో శిష్యులతో కలిసి జీవించారు. ఈ అద్భుతమైన విషయాలు అన్ని కూడా మనకి ఆళవందార్ల యొక్క జీవిత చరిత్రలో తెలుస్తాయి.నాథమునుల అవతారస్థలం అయిన కాట్టుమన్నార్ కోయిల్ (వీరనారాయణపురం)లోనే ఆళవందార్ కూడా జన్మించారు.
నాథమునులు ఉత్తర భారతంలో ఎన్నో సంవత్సరాలు కైంకర్యంలో ఉండగా, తన మనవడికి యమునైతురైవన్ అనే పేరు పెట్టాలి అని ఆన్నుకున్నారు. ఇది శ్రీకృష్ణుని దివ్య నామాల్లో ఒకటి. అందుకే వారి తలిదండ్రులు ఆయనకు యామునులు అనే పేరు పెట్టారు. ఆయన తిరునక్షత్రం — ఉత్తరాడం (ఉత్తరాషాఢ), మాసం — ఆడి (ఆషాఢ మాసం).
ఆళవందార్ గీతార్థ సంగ్రహం (భగవద్గీతా సారాంశం), సిద్ధి త్రయం, ఆగమ ప్రామాణ్యం, చతుఃశ్లోకి, స్తోత్ర రత్నం గ్రంథాలను మనకు ప్రసాదించారు:
ఆళవందార్ వాళి తిరునామములు
మచ్చణియుం మదిళ్ అరంగం వాళ్విత్తాన్ వాళియే
మఱై నాన్కుం ఓర్ ఉరువిల్ మగిళ్ ఉన్దు కత్తాన్ వాళియే
పచ్చైయిట్ట రామర్ పదం పగరుం అవన్ వాళియే
పాడియైత్తోన్ ఈడేఱప్ పార్వై శెయ్దోన్ వాళియే
కచ్చి నగర్ మాయన్ ఇరు కళల్ పణిందోన్ వాళియే
కదక ఉత్తిరాడత్తుక్ కాలుదిత్తాన్ వాళియే
అచ్చమఱ మనమగిళ్చ్చి అణైందిట్టాన్ వాళియే
ఆళవంధార్ తాళిణైగళ్ అనవరతం వాళియే
ఆళవందార్ వాళి తిరునామములు – వివరణ
మచ్చణియుం మదిళ్ అరంగం వాళ్విత్తాన్ వాళియే
ఎత్తైన ప్రాకారాలతో చుట్టబడిన శ్రీరంగం వైభవాన్ని తన శిష్యుల ద్వారా వ్యాప్తి చేసిన ఆళవందార్ చిరంజీవిగా ఉండాలి. పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్, తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ — ఈ అయిదుగురు ప్రముఖ శిష్యులు శ్రీరంగంలోనే యామునుల నుండి ఉపదేశం పొందారు.
తరువాత పెరియ తిరుమలై నంబి గారు తిరుమలైకి కైంకర్యం చేయడం కోసం వెళ్లారు; తిరుక్కోష్ఠియూర్ నంబి గారు కైంకర్యం చేయడం కోసం తిరుక్కోష్ఠియూర్ వెళ్లారు. ఆళవందార్ ఆజ్ఞతో తిరుక్కచ్చి నంబి గారు కాంచీపురం దేవపెరుమాళ్ళకు తిరుఆలవట్ట కైంకర్యం చేశారు. తన శిష్యుల ద్వారా శ్రీరంగం కీర్తిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆళవందార్ చిరకాలం వర్ధిల్లుగాక.
మఱై నాన్కుం ఓర్ ఉరువిల్ మగిళందు కత్తాన్ వాళియే
“మఱై” అంటే వేదం. ఆళవందార్, మనక్కాళ్ నంబి వద్ద వినయంతో నాలుగు వేదాలనూ వాటి సారాంశాన్నీ అభ్యసించారు. అలాగే వేదసారమైన శ్రీ భగవద్గీతను కూడా ఆనందంతో నేర్చుకున్నారు. అటువంటి ఆళవందార్ పల్లాండుగా వర్ధిల్లాలి.
పచ్చైయిట్ట రామర్ పదం పగరుం అవన్ వాళియే
“పచ్చైయిట్ట” అంటే మంచి పనుల ద్వారా ఎవరినైనా మనసు ఆకర్షించేటట్లుగా ఉండడం. మనక్కాళ్ నంబి స్వయంగా తూదువలై ఆకులు తీసుకుని ఆళవందార్ వద్దకు వచ్చి, ఉపదేశం ద్వారా వారికి మార్గదర్శనం చేశారు. నిత్యం పచ్చైయిట్ట రామ మిశ్రర్ అంటే మణక్కాల్ నంబి గారి దివ్య తిరువడి వైభవాన్ని తలుచుకునే ఆళవందార్లు చిరకాలం వర్ధిల్లాలి.
పాడియత్తోన్ ఈడేఱప్ పార్వై శెయ్దోన్ వాళియే
“పాడియత్తోన్” అంటే శ్రీ భాష్యకారర్ అంటే ఎంపెరుమోనార్ ,( శ్రీ రామానుజులు).రామానుజులు ఎంతో కృపతో మనకి శ్రీ భాష్యాన్ని అందించిన వారు.
ఆళవందార్ తన కటాక్షాన్ని రామానుజులపై కురిపించి, ఆయనను శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యునిగా వెలుగొందేలా చేశారు. కంచిలో యాదవప్రకాశుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న రామానుజులు ( ఆ సమయంలో వారికి ఇళయాళ్వార్ అని పేరు ) యొక్క తేజస్సును చూసి వీరు మహా జ్ఞాని అని తెలుసుకున్నారు.నాథమునిగళ్ ద్వారా తమ వంశంలోకి వచ్చిన భవిష్యదాచార్య విగ్రహంతో రామానుజుల యొక్క పోలికలు ఆళవందార్ గుర్తించారు. కాంచీపురానికి వచ్చి వరదరాజ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసి, ఇళయాళ్వార్ను కలవడానికి వెళ్ళారు.ఆళవందార్లు కరియమాణిక్కమ్ సన్నిధిలో యాదవ ప్రకాశులని,వారి శిష్యులను చూసారు.ఈ సన్నిధి దేవ పెరుమాళ్ సన్నిధికి దగ్గరలో ఉంటుంది.అంత మంది శిష్యులలో వీరే ఇళయాళ్వార్ అని రామానుజులని గుర్తించి,వీరి కటాక్షాన్ని దూరం నుంచే వారికి అంటే ఇళయాళ్వార్లకు అందించారు.ఈ విధంగా భగవద్రామానుజులు మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప ఆచార్యులు అవ్వడానికి ఆళవందార్లు ముఖ్య పాత్ర పోషించారు.
శ్లోకం:
యత్ పదాంభోరుహధ్యాన విధ్వస్త అశేష కల్మషః
వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామి తం
ఈ తనియన్లో రామానుజులు ఇలా అంటారు – “ఆళవందార్ నన్ను అసత్ (ఉనికిలో లేనివాడు) వలె ఉన్న నన్ను సత్గా (ఉనికిలో ఉన్నవాడుగా) మార్చారు.” అటువంటి గొప్పతనంతో ఆళవందార్ చిరకాలం వర్ధిల్లాలి.
కచ్చి నగర్ మాయన్ ఇరు కళల్ పణిందోన్ వాళియే
కచ్చి నగర్ అంటే కాంచీపురం .ఆళవందార్ వారి కటాక్షాన్ని ఎంపెరుమోనార్ల మీద కురిపించడమే కాకుండా కాంచీనగర దేవపెరుమాళ్ పాదాలను శరణుగా తీసుకుని, రామానుజుల వారిని గురు పరంపరలో ఆచార్యునిగా జేయమని ప్రార్థించారు.ఇలా కాంచీపురంలో దేవ పెరుమాళ్శను ప్రార్థించి రామానుజుల వారిని ఆచార్యునిగా చేసిన ఆళవందార్ చిరకాలం వర్ధిల్లాలి.
కదక ఉత్తరాడత్తుక్ కాలుదిత్తాన్ వాళియే
ఆడి (ఆషాడ మాసం), ఉత్తరాషాఢ నక్షత్రంలో అవతరించిన ఆళవందార్ పల్లాండుగా ఉండాలి.
అచ్చమఱ మనమగిళ్చ్చి అణైందిట్టాన్ వాళియే
మనస్సులోని భయాలు తొలగి ఆనందించిన ఆళవందార్ పల్లాండుగా ఉండాలి. రామానుజుల వారిని తమ శిష్యుడిగా చేసుకోవాలి అనేది ఆళవందార్ కోరిక కానీ భగవంతుని ఉద్దేశం (తిరువుళ్ళం) వేరుగా ఉంది.
పెరియ నంబి గారు ఇళయాళ్వార్ను కాంచీపురం నుంచి శ్రీరంగానికి తీసుకువస్తారు.వారు శ్రీరంగం సరిహద్దుకు చేరుకున్నప్పుడు ప్రజలు తీవ్రమైన దుఃఖం మరియు వేదనతో మునిగి ఉండటాన్ని చూస్తారు.విచారించగా ఆళవందార్ తిరునాడు అలంకరించారు (పరమపదించారు) అని వారికి తెలుస్తుంది.ఆళ్వందార్ తన ఆచార్యునిగా ఉండే ఈ వరాన్ని కోల్పోయినందుకు ఇళయ్యాళ్వార్ విచారిస్తారు.
ఇళయాళ్వార్ ఆళ్వందార్ యొక్క దివ్యతిరుమేనికి నమస్కరిస్తారు.ఆ సమయంలో, ఆళ్వందార్ యొక్క మూడు వేళ్లు ముడుచుకుని ఉండటాన్ని అతను గమనిస్తారు. అతను అక్కడ ఉన్న శ్రీవైష్ణవులను ఈ విషయం గురించి విచారించగా, వారు ఆళవందార్ యొక్క నెరవేరని మూడు కోరికల గురించి రామానుజుల వారికి తెలియజేశారు.
1. వ్యాస భగవానుని బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత సిద్ధాంతానుసారం వ్యాఖ్యానం రాయడం
2. తిరువాయ్మొళి యొక్క అర్థాలను ప్రపంచమంతా వ్యాప్తి చేయడం
3. వ్యాస, పరాశర ఋషుల పట్ల కృతజ్ఞత చూపడం .
ఈ కోరికలు నెరవేరనందున వేళ్లు ముడుచుకుని ఉన్నాయని అక్కడ ఉన్న శ్రీ వైష్ణవులు వివరిస్తారు.
ఇవి విని ఇళయాళ్వార్ ఇదే కనుక పెరుమాళ్లు మరియు ఆచార్యుల తిరువుళ్ళం అంటే ఉద్దేశం అయితే “నేను ఆళ్వందార్ యొక్క కోరికలను నెరవేర్చుతాను” అని ప్రతిజ్ఞ చేయగానే, మూడు వేళ్లు ముడుచుకుపోయాయి. అందువల్ల ఆళవందార్ బెంగ తొలగి ఆనందించారని అంటారు.అటువంటి ఆళవందార్ పల్లాండుగా ఉండాలి.
శ్రీ రామానుజులు తమ ప్రమాణం ప్రకారం బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానమైన శ్రీభాష్యం రచించారు. తిరుకురుగైపిరాన్ పిళ్ళాన్తో తిరువాయ్మొళి వ్యాఖ్యానం (వివరణ) రాయమని ఆదేశించారు. కూరత్తాళ్వార్ కుమారులకు వేదవ్యాస, పరాశర నామకరణం చేసి ఆ ఇద్దరి మహర్షుల పట్ల తమ కృతజ్ఞత చూపించారు.వారు ఇరువురు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప ఆచార్యులు అయ్యేటట్లుగా రామానుజుల వారు వారి దివ్య కటాక్షాన్ని వారిపై ప్రసరింపజేశారు.అటువంటి ఆళవందార్ చిరకాలం వర్ధిల్లాలి.
ఆళవందార్ తాళిణైగళ్ అనవరతం వాళియే
ఆళవందార్ దివ్య తిరువడి శాశ్వతంగా లోకానికి మంగళం చేకూర్చాలి.
ఆళ్వార్, ఎంబారుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
మూలం:https://divyaprabandham.koyil.org/index.php/2026/01/vazhi-thirunamams-alavandhar-simple/
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org