ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు –పెరియ పెరుమాళ్ వాళి తిరునామ వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక

<< ఓరాణ్ వళి ఆచార్యులు – ఉపోద్ఘాతము

పెరియ పెరుమాళ్‌ను మన గురుపరంపరలో మొదటి ఆచార్యుడిగా భావిస్తారు. “లక్ష్మీనాథ సమారంభాం…” అనే శ్లోకంలో చెప్పినట్లుగా గురుపరంపర శ్రీమన్నారాయణునితో ప్రారంభమవుతుంది. ఈ శ్రీమన్నారాయణుడే శ్రీరంగంలో శయనిస్తున్న శ్రీరంగనాథుడు, అంటే పెరియ పెరుమాళ్.  శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆర్చావతారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే భగవంతుని సౌలభ్యం (ఎవరైనా సులభంగా చేరగలగడం), సౌశీల్యం, కరుణ, అనుగ్రహం, ఇవి అన్నీ సంపూర్ణంగా వ్యక్తమయ్యేది ఆర్చా రూపంలోనే.  ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన క్షేత్రాలు దివ్యదేశాలు. వాటిలో శ్రీరంగం అత్యున్నతమైనది, “భూలోక వైకుంఠం” అని పిలుస్తారు. ఇది తృతీయ విభూతి — పరమపదం కాదు, సంసారం కాదు; రెండింటి మహిమలు కలిగిన ప్రత్యేక స్థలం. ఆళ్వార్లందరూ ఇక్కడ మంగళాశాసనం చేశారు. 

శ్రీరంగనాథుడు “పదిన్మర్ పాడుం పెరుమాళ్” — అంటే పది ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన పెరుమాళ్ అని ప్రసిద్ధి.   అలాగే గురుపరంపరలో ఆళవందార్ నుండి మనవాళ మామునిగళ్ వరకు దాదాపు అందరు ఆచార్యులు శ్రీరంగంలోనే నివసించారు. వారిలో నాథమునిగళ్, ఉయ్యకొండార్, మనక్కాళ్ నంబి శ్రీరంగంలో నివసించారా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. తిరువాయ్మొళిప్పిళ్ళై మాత్రం నమ్మాళ్వార్ పట్ల అపారమైన భక్తితో ఆళ్వార్ తిరునగరిని పునర్నిర్మించి అక్కడే నివసించారు. అందువల్ల, ఈ నలుగురు తప్ప మిగతా  ఆచార్యులు అందరూ శ్రీరంగంలో నివసించడం అనే ఆచారాన్ని పాటించినట్లు తెలుస్తుంది. శ్రీవైష్ణవ ఆచార్యులు మాత్రమే కాదు, ఇతర సంప్రదాయాల ఆచార్యులు కూడా నంపెరుమాళ్ పట్ల ఉన్న భక్తి వల్ల శ్రీరంగంలో నివసించారు. అలాంటి మహిమాన్వితమైన శ్రీరంగంలో శయనిస్తున్న నంపెరుమాళ్ (శ్రీరంగనాథుడు) ఓరాణ్ వళి ఆచార్య పరంపరలో మొదటి ఆచార్యుడిగా గౌరవించబడుతున్నారు.

ఎంపెరుమాన్ తిరునక్షత్రం రోహిణి అని చెబుతారు.  పెరియ పెరుమాళ్‌ను కృష్ణుడితో ఏకరూపంగా భావించే కారణంగా రోహిణినే ఆయన తిరునక్షత్రంగా స్వీకరిస్తారు. కొంతమంది నంపెరుమాళ్ తిరునక్షత్రం రేవతి అని కూడా అంటారు. భగవంతుడు స్వయంగా ద్వాపరయుగంలో పలికిన శ్రీమద్భగవద్గీత మరియు మనవాళ మామునిగళ్‌ను సత్కరించడానికి  వారు కృప చేసిన “శ్రీశైలేశ దయాపాత్రం” అనే తనియన్ — ఇవి ఎంపెరుమాన్ ప్రసాదించిన శ్రీ సూక్తులు. పెరియ పెరుమాళ్ ను  శ్రీరంగనాథుడు అని ప్రసిద్ధిగా పిలుస్తారు.  వారు పరమపదం నుండి తన విమానంతో అవతరించారు. సత్యలోకంలో బ్రహ్మదేవుడు పెరుమాళ్ళను ఆరాధించారు. తరువాత ఇక్ష్వాకు వంశ రాజు బ్రహ్మను ప్రార్థించి, ప్రణవాకార విమానంతో కలిసి ఆయోధ్యకు తీసుకువచ్చాడు. రఘువంశంలో జన్మించిన అందరు రాజులు ఈ పెరుమాళ్‌ను ఆరాధించారు.  శ్రీరామావతారంలో, శ్రీరాముడు స్వయంగా ఈ పెరుమాళ్‌కు ఆరాధన చేశాడు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో “పెరుమాళ్” అంటే ప్రత్యేకంగా శ్రీరాముడు. అందువల్ల, శ్రీరాముడు ఆరాధించిన పెరుమాళ్ కావడంతో వారిని “పెరియ పెరుమాళ్” అని పిలుస్తారు. పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు ప్రణవాకార విమానంతో కూడిన పెరియ పెరుమాళ్‌ను విభీషణునికి బహుమతిగా ఇచ్చి “ఇతనిని ఆరాధించు” అని ఆజ్ఞాపించారు. విభీషణుడు ఆయోధ్య నుండి లంకకు ప్రయాణిస్తున్నప్పుడు, కావేరి రెండు వైపులా ప్రవహిస్తూ దీవిలా కనిపించే శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అనుష్ఠానాల కోసం పెరియ పెరుమాళ్‌ను అక్కడ ఉంచాడు.  అప్పుడు పెరియ పెరుమాళ్  శ్రీరంగంలోని తోటల సౌందర్యాన్ని చూసి ఆనందించి విభీషణునితో, “నీవు లంకకు వెళ్లవచ్చు; నాకు శ్రీరంగం నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని ఆశీర్వదించేందుకు నా దృష్టి దక్షిణ దిశగా ఉంటుంది”  అని అన్నారు.  తిరుమాలై లో చెప్పినట్లుగా – “వండినం మురలుం శోలై మయిలినం ఆలుం శోలై,  కొంణ్డల్ మీదనవుం శోలై కుయిలినం కూవుం శోలై అణ్డార్ కోన్ అమరుం శోలై…”  అంటే: ఝుంకారం చేస్తున్న తేనెటీగలు తిరుగాడుతున్న తోటలు, నృత్యం చేసే నెమళ్లు, ఆలింగనం చేసే మేఘాలు, కోయిలలు కూస్తున్న వనాలు, అలాంటి దివ్యమైన ప్రదేశంలో సర్వేశ్వరుడు ప్రత్యక్షమై స్థిరంగా నివసించారు.  

ఇటుమంటి మహిమాన్వితమైన పెరియ పెరుమాళ్ వాళి తిరునామంలో, ఎంపెరుమాన్ యొక్క ఐదు రూపాలు — పరం, వ్యూహం, విభవం, ఆర్చా, అంతర్యామి — అందంగా చెప్పబడ్డాయి.  పరం – ఈ స్థితిలో ఎంపెరుమాన్ పరమపదంలో (శ్రీవైకుంఠంలో) పరవాసుదేవునిగా నిత్యసూరులతో కలిసి విరాజిల్లుతారు.  వ్యూహం – ఈ రూపంలో ఎంపెరుమాన్ తిరుప్పార్కడల్ / క్షీరాబ్ధిలో శయనిస్తారు. ఇక్కడి నుంచే వారు పరమపదం నుండి భూలోకానికి అవతరించేందుకు సిద్ధమవుతారు. విభవం (అవతారం) – ఈ రూపంలో ఎంపెరుమాన్ భూలోకంలో వివిధ అవతారాలు ధరిస్తారు — కృష్ణావతారం, రామావతారం, నరసింహావతారం, వామనావతారం మొదలైనవి. ఆర్చా (దేవతా రూపం)- తరతరాల ప్రజలు పెరుమాళ్ళ అనుగ్రహాన్ని ప్రసాదించేందుకు, ఎంపెరుమాన్ విగ్రహరూపంలో దేవాలయాలు, మఠాలలో ప్రత్యక్షమవుతారు. ఈ రూపాన్నే ఆర్చావతారం అంటారు. అంతర్యామి (అంతర్యామి స్థితి) – ఈ రూపంలో ఎంపెరుమాన్ అన్ని జీవులలో అంతర్యామిగా ప్రవేశించి, లోపల నుంచే వాటిని నడిపిస్తారు, రక్షిస్తారు.

వాళి తిరునామాలు

తిరుమగళుం మణ్మగళుం శిరక్కవందోన్ వాళియే

శెయ్యవిడైత్తాయ్మగళార్ సేవిప్పోన్ వాళియే

ఇరువిశుంబిల్ వీట్రిరుక్కుం ఇమైయవర్కోన్ వాళియే

ఇడర్కడియప్ పార్కడలై ఎయ్దినాన్ వాళియే

అరియ దయరదన్ మగనాయ్ అవతరిత్తాన్ వాళియే

అంతరియామి త్తువాముం ఆయినాన్ వాళియే

పెరుగివరుం పొన్నినడుప్ పింతుఇన్రాన్ వాళియే

పెరియపెరుమాళ్ ఎంగళ్ పిరాన్ అడిగళ్ వాళియే

పెరియ పెరుమాళ్ వాళి తిరునామం వివరణ

1. తిరుమగళుం మణ్మగళుం శిరక్కవందోన్ వాళియే

వాళి తిరునామం మొదట ఎంపెరుమాన్ శ్రియఃపతి — అంటే శ్రీదేవి సహచరుడు అని చెపుతుంది. స్వామి పెరియ పిరాట్టి (శ్రీదేవి) మరియు భూమిపిరాట్టిల (భూదేవి)శోభ కోసం ఉన్నవారు. అలాగే, పిరాట్టులు తమ వైభవాన్ని ఎంపెరుమాన్ వల్ల పొందుతారు. వారికి ఎంతో మంది దేవేరులున్నా శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ప్రధానమైనవారు. మొదటి పాదంలో శ్రీదేవి మరియు భూదేవి మహిమలు చూపబడతాయి

2. శెయ్యవిడైత్తాయ్మగళార్ సేవిప్పోన్ వాళియే

కృష్ణావతారంలో  నీళాదేవి  గొల్ల పడచు అయిన నప్పిన్నై పిరాట్టిగా, శ్రీదేవి రుక్మిణి దేవి గా,  భూదేవి సత్యభామ దేవి గా అవతరించి కృష్ణ పరమాత్మను సేవించారు. అటువంటి నప్పిన్నై సేవించిన భగవంతుడు చిరకాలం నిలిచి ఉండుగాక!

3. ఇరువిశుంబిల్ వీట్రిరుక్కుం ఇమైయవర్కోన్ వాళియే

“ఇరు అనగా ఇక్కడ విస్తారమైన, విశుంభు అనగా ఆకాశం (పరమపదం). ఎప్పుడూ రెప్ప మూయని కారణం గా ఇమయవర్లు గా పిలువబడే నిత్యసూరులు నివసించే పరమపదంలో విరాజిల్లే నారాయణుడు చిరకాలం నిలిచి ఉండుగాక! ఇది పర రూపాన్ని సూచిస్తుంది.

4.ఇడర్కడియప్ పార్కడలై ఎయ్దినాన్ వాళియే

చేతనుల (జీవుల) దుఃఖాన్ని తొలగించడానికి స్వామి  క్షీరసాగరం (పాల్కడల్) లో శయనించారు. విభవ అవతారం లో భూమి పైకి వేంచేసే ముందు, పరమపదం నుండి పాల్కడలికి దిగి వచ్చి ఎలా చేతనులను దయతో ఉజ్జీవింప చేయాలా అని వ్యూహం చేస్తారు కనుక ఇది వ్యూహ రూపం, అక్కడ నిద్రిస్తున్నట్టు కనిపిస్తారు కానీ మన రక్షణ కోసం నిరంతరం ధ్యానం చేస్తారు. 

ఇక్కడ రెండు గొప్ప అర్థాలు చెప్పబడ్డాయి: 1) జీవుల దుఃఖం తొలగిపోవాలని వ్యూహ రచన చేస్తూ స్వామి క్షీరసాగరంలో శయనించారు. 2) చేతనుల బాధను చూసి తనకే కలిగిన కారుణ్యం తో కూడిన వేదనను తగ్గించుకోవడానికి,   క్షీరసాగరంలో శయనించాడు.  అంతటి కరుణా సముద్రుడైన సర్వేశ్వరుడు చిరకాలం నిలిచి, శాశ్వతంగా కాపాడుగాక — పల్లాండు!

5. అరియ దయరదన్ మగనాయ్ అవతరిత్తాన్ వాళియే

ధర్మాత్ముడైన దశరథ మహారాజు కుమారుడిగా అవతరించిన, శ్రీరామపిరాన్ రూపంలో ప్రత్యక్షమైన ఎంపెరుమాన్ చిరకాలం నిలిచి ఉండుగాక! పల్లాండు! స్వామి దివ్యగుణాలు అత్యద్భుతమైనవి, అవి చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేవి. ఇది ఎంపెరుమాన్ యొక్క “విభవం” స్థితిని సూచిస్తుంది.

శ్రీరామావతారంలో స్వామిని దశరథాత్మజుడు అని చక్రవర్తితిరుమగన్ అని ప్రేమతో పిలుస్తారు.

6. అంతరియామి త్తువాముం ఆయినాన్ వాళియే

ఎంపెరుమాన్ అంతర్యామిగా అన్ని వస్తువులలో, అన్ని జీవులలో ప్రవేశించి, లోపల నుంచే వారిని నడిపిస్తారు. స్వామి చేతన–అచేతన సమస్త భూతాలలో వ్యాపించి ఉన్నారని చెప్పడం ద్వారా, స్వామి యొక్క నాల్గవ రూపమైన “అంతర్యామి” స్థితి వెల్లడవుతుంది.  ఆ సర్వేశ్వరుడు చిరకాలం నిలిచి ఉండుగాక — పల్లాండు!

7. పెరుగివరుం పొన్నినడుప్ పింతుఇన్రాన్ వాళియే

పొంగి ప్రవహించే పొన్ని (కావేరి) నదీ మధ్యలో ఉన్న శ్రీరంగంలో స్వామి శయనిస్తున్నారు.  ఈ పాదం, ఈ దివ్యస్థానాన్ని తన నివాసంగా ఎంచుకున్న ఎంపెరుమాన్‌కు శాశ్వత మంగళం (పల్లాండు) కోరుతుంది

8. పెరియపెరుమాళ్ ఎంగళ్ పిరాన్ అడిగళ్ వాళియే

పెరియ పెరుమాళ్ (శ్రీరంగనాథుడు) వాళి తిరునామం చివరగా,  మనకు అత్యంత ఉపకారకుడైన, మన రక్షకుడైన శ్రీరంగనాథుడికి మంగళం కోరుతుంది.  దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలో ఆర్చా రూపంలో విరాజిల్లే పెరియ పెరుమాళ్ వాళి తిరునామం ద్వారా,  మన గురుపరంపరలో మొదటి ఆచార్యుడు స్వయంగా శ్రీరంగనాథుడే అని స్పష్టమవుతుంది.

తదుపరి — పెరియ పిరాట్టి వాళి తిరునామ వైభవం తెలుసుకుందాం.  పెరియ పెరుమాళ్ గుణానుభవంలోని  ఆనందాన్ని అనుభవించాలంటే,పెరియ పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి) వైభవంతో కలిపి అనుభవించాలి.  ఎందుకంటే ఎంపెరుమాన్ మరియు పిరాట్టి విడదీయరాని దివ్యదంపతులు.

అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి

మూలం: https://divyaprabandham.koyil.org/index.php/2025/12/vazhi-thirunamams-periyaperumal-simple/

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org 

Leave a Comment