శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పరిచయము:
మునుపటి పాశురములో, “ఇంద ఉలగయిల్ పొరుందామై ఏదుమిల్లై అంద పోగ ఆశైయిల్లై” అని మాముణులు అన్నారు. అంటే తనకు ఈ లౌకిక జీవితముపై నిరాసక్తి లేదు, పైగా పరమపదానికి వెళ్ళాలనే కోరిక కూడా లేదని మాముణులు తెలుపుతున్నారు. ఈ మాట చెప్పిన తరువాత, ఈ లోకములో ఇతర మనుషులను చూసి, వారు చేసే మనులను గమనించారు. వాళ్ళు నిరంతరం అపరాధాలు చేసి పాపాలను మూటకట్టుకోడానికి కారణమేమిటో వారు గ్రహించారు. ఈ పాశురములో ఇదే వివరించబడింది.
పాశురము 43:
మాకాంత నారణనార్ వైగుం వగై అఱిందోర్ క్కు
ఏకాంతం ఇల్లై ఇరుళ్ ఇల్లై
మోకాంతర్ ఇవ్విడం ఏకాంతం ఇరుళ్ ఎన్ఱు భయం అఱ్ఱు ఇరుందు
సెయ్వర్గళ్ తాం పావత్తిఱం
ప్రతి పద్ధార్ధములు:
నారణనార్ – సర్వజ్ఞుడు మరియు సర్వశక్తిమంతుడైన శ్రీమన్నారాయణుడు
మాకాంత – లక్ష్మికి పతి
వైగుం వగై – ఈ విశ్వంలోని ప్రతి చేతనాచేతనములలోపల మరియు బయట వ్యాపించిన (ఈ అర్ధం నారాయణ నామములో ఇమిడి ఉంది)
అఱిందోర్ క్కు– ఎవరైతే తెలుకొని అర్థము చేసుకుంటారో
ఏకాంతం ఇల్లై – ఏకాంతం లేదు
ఇరుళ్ ఇల్లై – అంధకారము కూడా లేదు.
మోకాంతర్ – “మోహాంత తమసాస్వృత్తః” అన్న వాఖ్యములో చెప్పినట్లుగా, ప్రాపంచిక విషయాలతో అంధులైన వారు. వారు ఏమీ చూడరు మరియు ఆలోచించరు
ఇవ్విడం ఏకాంతం ఇరుళ్ ఎన్ఱు – ఎవరూ లేని వారికి ఈ ప్రదేశము ఏకాంతమయము.
భయం అఱ్ఱు ఇరుందు – వారు నిర్భయముగా ఉంటారు
సెయ్వర్గళ్ తాం – వారి అజ్ఞానము కారణంగా, మరలా చేస్తూనే
పావత్తిఱం – ఎన్నో ఎన్నో పాపాలు
సరళ అనువాదము:
ఈ పాశురములో, మాముణులు రెండు రకాల మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తున్నారు. మొదటి రకము వాళ్ళు నిత్య తేజోమయుడైన శ్రీమన్నారాయణని ప్రతిచోటా చూస్తారు. అందువల్ల వారు ప్రతిచోటా అతడి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు కాబట్టి వాళ్ళు ఒంటరిగా ఉన్నారని భావించే అవకాశము వారికి ఉండదు. అతడు కాంతితో నిండిన వాడు కాబట్టి వారు చీకటిని ఎరుగరు. మరొక పక్క చూస్తే, ఎంతో మంది దీనిని గమనించక వారు చీకటిలో ఒంటరిగా ఉన్నారని భావిస్తారు. ఇది వారి పతనానికి కారణమై వాళ్ళు అనేక పాపాలలో పాల్పడేలా చేస్తుంది.
వివరణ:
నమ్మాళ్వార్లు తమ తిరువాయ్మొళి (1.10.8) లో “సెల్వ నారణన్” అనే నామాన్ని ఉపయోగించారు. ఆతడు దివ్య పెరియ పిరాట్టి అయిన శ్రీమహాలక్ష్మికి పతి. ప్రతి చేతనాచేతనుల లోపల వెలుపల ఆతడు వ్యాపించి ఉన్నాడు. ఇదే “నారాయణ” నామమునకు సారమని చెప్పబడింది. శ్రీమన్నారాయణ యొక్క ఈ సర్వవ్యాపి గుణాన్ని గ్రహించిన కొంతరు ఉన్నారు. “నారాయణ పరంజోతిః (నారాయణ సూక్తం 4)”, “పగల్ కణ్డేన్ నారాణనైక్కణ్డేన్ (ఇరండాం తిరువందాది 81”), “అవన్ ఎన్నుళ్ ఇరుళ్ తాన్ అఱ వీఱ్ఱిరుందాన్ (తిరువాయ్మొళి 8.7.3) అని ప్రబంధ వాఖ్యాలలో వర్ణించినట్లుగా వాళ్ళు ఆతడిని అన్ని చోట్లా ప్రకాశవంతుడైన పెరుమాళ్లని చూస్తారు. వారు అంధకారం, ఒంటరితనములను ఎన్నడూ ఎరుగరు. వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వారు కారు, నిత్యము వారి తోటి వారితో ఉంటారు. ఒంటరిగా ఉన్నట్టు భావించరు కనుక, వారికి ఎటువంటి భయం ఉండదు. “హృతి నారాయణం పశ్యనాప్య కచ్చత్రహస్తా యస్వతారధౌచాపి గోవిందం తం ఉపాస్మహే (విష్ణు పురాణము)” లో చెప్పినట్లు వాళ్ళు ఎక్కడా చీకటిని చూడరు.
దీనికి విరుద్ధంగా, “మోహాంతకులు” గా ముద్రవేయబడిన మరో రకమైన మనుషులు కూడా ఉన్నారు. “మోహాంత తమసా వృత్తః” అనే వాఖ్యముతో వర్గీకరించబడినట్లుగా, వీళ్ళు అంధకారము కారణంగా ముందు ఏమి ఉందో చూడగల సామర్థ్యం లేని వాళ్ళు. “అంతర్భహిస్సకల వస్తుశు సంతమీశం ఆంధః పురస్తితం ఈవహం అవీక్షమాణః” (యతిరాజ వింశతి 12)” లో వివరించినట్లుగా, శ్రీమన్నారాయణుడు ప్రతి చేతనాచేతనుల లోపల వెలుపల నిత్యము సమానముగా ప్రకాశిస్తాడు. తమ ఆంతరంగిక కళ్ళతో అతడిని చూడలేని వాళ్ళు, ఏదో విరుద్ధంగా చూసి అతడిని గ్రహిస్తారు. ఎవరూ లేని ఒక ప్రదేశాన్ని వారు అక్కడ ఎవరూ లేరని, చీకటి మాత్రమే ఉందని వాళ్ళు భావిస్తారు. “తస్యాంతి కేత్వం వ్రజినం కరోషి” అనే వాఖ్యములో వివరించబడిన విధంగా అది వారిలో నిర్భయాన్ని ప్రేరేపించి, ఎవరు లేరు కదా అని అనేక పాపాలను చేయిస్తుంది. శ్రీమన్నారాయణను గ్రహించని ఈ రకమైన మనుషుల స్థితి ఇదేనని మాముణులు భావిస్తున్నారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-44/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org