శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
ప్రస్తావన
మునుపటి పాశురములో మణవాళమామునులు శ్రీరామానుజులతో ఈ భౌతిక ప్రపంచముచే కలిగిన అగాధచీకటి మరియు అజ్ఞానములో మునిగి ఆర్తి చెందు తనమీద ప్రకాశమును ప్రసరించమని కోరెను. ఈ పాశురమున మామునులు, తాను తన దేహముచే నియంత్రించబడినందు వలన, తన దేహము పోవు దిక్కున తాను పయనించుచుండెనని చెప్పెను. తన ఈ చేష్టముచే తన తండ్రి యగు శ్రీ రామానుజులకు చెడు పేరు తెచ్చునని మణవాళమామునులు చెప్పెను.
పాశురం 19
అల్లుం పగలంమ్ యాన్ ఆక్కై వళి ఉళన్ఱు
సెల్లుమదు ఉన్ తేసుక్కు తీన్గు అన్ఱో?
నల్లార్గళ్ తన్ తనయర్ నీసర్క్కు ఆట్చెయ్య సగిప్పరో
ఎన్దై ఎతిరాసా ఇసై
ప్రతి పద్ధార్ధం
ఎన్దై ఎతిరాసా – ఓ మా తండ్రీ! యత్రిరాశ!
ఇసై – మీరు మాత్రమే ఈ విషయమున తగు చర్య తీసుకోగలరు.
యాన్ – నేను,
అల్లుం పగలుం – రేయింపగళ్ళు
ఆక్కై వళి ఉళన్ఱు – మా దేహము పోవు దిక్కున మేము పోవుచున్నాము, అనగా దేహమునకు బానిసగాయున్నాము
సెల్లుమదు – పై చెప్పబడిన మేము పయనించు మార్గముచే
తీన్గు అన్ఱో? – మీమీద చెడు అభిప్రాయము కలుగదా?
ఉన్ తేసుక్కు – మరియు మీ కీర్తికీ?
నల్లార్గళ్ – బ్రహ్మము గూర్చి తెలుసుకొనుటలో ముందున్న, గొప్ప వారు
తన్ తనయర్ – వారి తనయుని విషయమున
నీసర్క్కు ఆట్చెయ్య సగిప్పరో – ఇట్టి నీచులకు నీచ చేష్టము చేయు వారి (తనయు) ని సహించగలరా ?
సామాన్య అర్ధం
మణవాళమామునులు తన జీవనవిధానము గూర్చి శ్రీ రామానుజులతో చెప్పెను. తాను తన శరీరమునకు ఆధీనుడై , అది ఈడ్చు దారిలో వెళ్ళుచున్నాను అని మామునులు చెప్పెను. మణవాళమామునులు శ్రీ రామానుజులతో ” ఓ మా తండ్రి ! నేను చేయునది మిక్కిలి నీచమైన కార్యము. మీరు ఇప్పుడు దీనిని నిలుపనిచో, అది మా తండ్రి అగు మీకు అపకీర్తిని తెచ్చును, మరియు మీ తనయుడు శాస్త్రములచే చూపబడని మార్గమున పోవుచుండెను కదా? బ్రహ్మము (పరమాత్మ యగు శ్రీమన్ నారాయణుని) గూర్చి తెలుసుకొను మహాత్ములు, ఒకవేళ వారి తనయుడు దారి తప్పి పోయినచో వారు సహించగలరా. వారు వెంటనే తమ తనయుడిని గమనించి, వారిని మరల సరియగు దారిన పెట్టెదరు.” అని పలికెను
వివరణ
ఈ పాశురం యొక్క మొదటి భాగములో మణవాళ మామునులు తన జీవన విధానమును వర్ణించెను. మణవాళ మామునులు, “ఉన్ నామమెల్లాం ఎన్ఱన్నావినుళ్ళే అల్లుం పగలుం అమరుం పడి నల్గ (ఇరామానుస నూత్తంన్దాది తనియన్) అను వాక్యములో సూచించునట్లు, వారు ఎల్లప్పుడు శ్రీ రామానుజుల నామమును జపిస్తు తన జీవనమును కొనసాగించియుండవలెను. మణవాళ మామునులు తనకు శ్రీ రామానుజుల కీర్తనీయ నామములను రేయింపగలు పాడు సువర్ణసమయము చాల ఉండెనని చెప్పెను. కాని మణవాళ మామునులు “అన్నాళ్ నీ తన్ద ఆక్కై వళి ఉళల్వేన్ (తిరువాయ్ మొళి 3.2.1) అను ప్రబంధ వాక్యమున తెలిపినయట్లు ఆ అపూర్వ సమయమును గడిపెనని చెప్పెను. శ్రీమన్నారాయణునిచే ధర్మపరముగా, దైవభక్తితో జీవించుటకు ఇచ్చిన ఈ జీవితమును, తన శరీరము యొక్క అఙ్ఞానుసారం గడిపెను అనునది ఆ ప్రబంధ వాక్యము యొక్క భావము. ఈ శరీరము మనకు శ్రీమన్నారాయణునికి శాస్త్రములలో సూచించినయట్లు కైంకర్యములు చేయుటకే ప్రసాదించబడినది. ఈ సాంసారిక భోగములను అనుభవించుటకు ఈ శరీరమును ఉపయోగించరాదు. అట్లు ఉపయోగించినచో, మనకు ఈ దేహమును ప్రసాదించిన వారికి అనగా శ్రీమన్నారాయణునికే మొదట అపకీర్తి కలుగును. “ఉనక్కుప్ పని సెయ్దిరుక్కుమ్ తవం ఉడయేన్ ఇనిప్పోఇ ఒరువన్ తనక్కుప్ పణిన్దు కడైతలై నిఱ్క నిన్ సాయై అళివు కణ్డాఇ” (పెరియాళ్వార్ తిరుమొళి 5.3.3) అను ప్రబంధములో అదే విషయము పేర్కొనెను. మణవాళమామునులు పెరియాళ్వార్లు అడిగిన అదే ప్రశ్నను అడిగెను. కాని పెరియాళ్వార్లు శ్రీమన్నారాయణుని అడిగెను, మణవాళ మామునులు శ్రీ రామానుజులను మీరు మా తండ్రి అగుటచే అది మీకు అవమాన చిహ్నమగును కదా అని అడిగెను. మణవాళమామునులు తన ఈ వివరణకు సాదృశ్యము చూపెను. మిక్కిలి ఙ్ఞానవైరాగ్యముతో ఎప్పుడు వైకుంఠమును చేరు మార్గమునే ఆలోచిస్తు, శ్రీమన్నారాయణునినే తలచి అతనినే చేర ప్రయత్నించు వారు ఉన్నారు.ఒకవేళ అట్టి వారి తనయుడు జీవితమున దారితప్పి ఘాతుకమైన జీవనమును జీవించుచున్న, అట్టి నీచమైన జీవితమును వారు ఆమోదించెదరా? ఎప్పటికి లేదు కదా. మణవాళమామునులు శ్రీ రామానుజులను “ఓ యతిరాజా! మా తండ్రి! మీరే ఈ విషయమును ముందు చెప్పిరి. కావునా మీరే మమ్ము మీ చెంతకు చేర్చుకొని, కైంకర్యము చేయించుకొని ఈ జీవాత్మను రక్షించుము. అది మీ ఒక్కరికే సాధ్యమగును ” అని చెప్పెను.
అడియేన్ వైష్ణవి రామానుజ దాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/08/arththi-prabandham-19/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org