నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఏళాం తిరుమొళి – కరుప్పూరం నాఱుమో

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఆరాం తిరుమొళి – వారణమాయిరం

పెరుమాళ్ళ కుశల క్షేమాల గురించి వచ్చిన హనుమానునితో విచారించిన సీతా పిరాట్టి వలె కాకుండా, ఎంబెరుమానుని అంతరంగ దాసుడైన ఆచార్యుని (నిపుణుడు) నుండి, ఎంబెరుమానుని అనుభవం గురించి అడిగే అదృష్టం ఆండాళ్కి కలిగింది. ఆమెకి కలిగిన స్వప్నము చివరలో, ఎంబెరుమానునితో ఆమె ఐక్యమై ఉండవచ్చు. అందుకని ఆండాళ్, ఎంబెరుమానుని దివ్య అదర మకరంద స్మృతులను గుర్తుచేసుకుంటూ, దివ్య పంచాజన్యమైన శంఖత్తాళ్వాన్తో  అడిగి తెలుసుకుంటుంది.  ఎంబెరుమానుని దివ్య అదరముల మకరందము గురించి తెలుసుకోవడానికి కారణాలు ఇవి:

  1. సాధారణంగా రాజు మరియు రాణి సౌకర్యము కోసం రాణి యొక్క అంతఃపురంలో గూనులు, మరుగుజ్జులు ఉన్నట్లే, దివ్య శంఖం ఎంబెరుమానుని నుండి ఎన్నడూ వీడకుండా వారి ఏకాంత సమయంలో కూడా వారితోనే ఉంటారు.
  2. ఎమ్పెరుమానుడు శంఖాన్ని ఊదడానికి తన దివ్య అదరముల మధ్య ఉంచినప్పుడల్లా, శంఖము ఎమ్పెరుమానుడి అదరామృతాన్ని నిత్యము తాగుతుంది.
  3. ఆ పాంచజణ్యము ఎన్నడూ వీడకుండా ఎంబెరుమానుడితోనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, ఎంబెరుమానుడు తన శత్రు నాశనం చేయడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. ఈ సమయంలో చక్రాయుధము ఒక స్వల్ప కాలం పాటు భగవానుని నుండి వీడి ఉంటుంది. అయితే, దివ్య శంఖం మాత్రము భగవానుని నుండి ఎన్నడూ వీడదు. .
  4. అంతేకాక, నల్లని భగవానుడి దివ్య స్వరూపముపైన తెల్లని శంఖము యొక్క సంగమము ఆస్వాదించయోగ్యమైనది అనుభవించదగినది.

ఈ కారణాల వల్ల, దివ్య శంఖంతో మాట్లాడి అడిగి తెలుకోవడం అనేది భగవానునితో మాట్లాడి అడిగి తెలుకోవడం లాంటిది కనుక, ఆండాళ్ ఆ దివ్య శంఖాన్ని అడుగుతోంది. 

మొదటి పాశురము:  నిత్యము భగవానుని దివ్య అదరామృతాన్ని అస్వాదిస్తున్నందున, ఆ రుచి తెలిసిన శంఖాన్ని, ఆ రుచి ఎలా ఉంటుందో తెలపమని వారిని అడుగుతోంది.

కరుప్పూరం నాఱుమో కమలప్పూ  నాఱుమో
తిరుప్పవళ చ్చెవ్వాయ్ దాన్ తిత్తి త్తిరుక్కుమో?
మరుప్పొశిత్త మాదవన్ తన్ వాయ్ చ్చువైయుం నాఱ్ఱముం
విరుప్పుఱ్ఱుక్కేట్కిన్ఱేన్ శొల్లాళి వెణ్ శంగే

శ్వేత రంగులో ఉన్న ఓ శ్రీ పాంచజన్యమా!  కంసుడి రాచపు ఏనుగు అయిన కువలయాపీడం దంతాన్ని విరిచిన శ్రీ కృష్ణుడి దివ్య పెదవుల రుచి మరియు సువాసన ఎలా ఉంటుందని ఆశతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎర్రటి రంగులో ఉండే ఆ ఎంబెరుమానుని దివ్య పెదవులు ఔషద కర్పూరంలా సువాసన కలిగి ఉంటాయా? లేదా తామర పుష్పపు సువాసన కలిగి ఉంటాయా? తీపి రుచి కలిగి ఉంటాయా? నువ్వు నాకు చెప్పాలి.

రెండవ పాశురము: దుష్థులు శిక్షింపబడినట్లే, భక్తులు కూడా రక్షింపబడాలి. తాను పుట్టి పెరిగింది పరోపకారము కొరకు కనుక, తన పనులు కూడా అలాగే ఉండాలి అని ఆమె దివ్య శంఖముతో అంటుంది.

కడలిల్ పిఱందు కరుదాదు పంచశనన్
ఉడలిల్ వళర్ందు పోయ్ ఊళియాన్ కైత్తల
త్తిడరిల్ కుడియేఱి త్తీయ అశురర్
నడలైప్పడ ముళంగుం తోఱ్ఱత్తాయ్ నఱ్చంగే

ఓ అందమైన శ్రీ పాంచజన్యమా! నీవు సముద్రపు లోతులో పంచశనుడు అనే రాక్షసుడి శరీరం నుండి జన్మించి అక్కడే పెరిగావు. కానీ దానితో నిమిత్తం లేకుండా, నీవు అక్కడే నిత్య నివాసుడైన ఎంబెరుమానుడి దివ్య హస్తము వంటి అత్యంత ఉన్నత దశకి చేరుకున్నావు. నీ ధ్వనితో రాక్షసులను భయపెట్టే గొప్పతనం నీకుంది. కాబట్టి ఈ ఉపకారం నీవు నాకు చేయాలి.

మూడవ పాశురము:  దివ్య పాంచజన్య సౌందర్యాన్ని ఆమె ఆస్వాదిస్తుంది.

తడవరైయిన్ మీదే శరఱ్కాల చందిరన్
ఇడైయువావిల్ వందు ఎళుందాలే పోల్ నీయుం
వడ మదురైయార్ మన్నన్ వాసుదేవన్ కైయిల్
కుడియేఱి వీఱ్ఱిరుందాయ్ కోలప్పెరుం శంగే

ఓ అందమైన, బ్రహ్మండమైన శ్రీ పాంచజన్యమా! శరదృతువు సమయంలో పౌర్ణమి రోజున, పర్వతాలనుండి చంద్రుడు ఉదయించినట్లు, నీ వైభవాన్నంతా  తెలియజేస్తూ, నీవు ఉత్తర మధురకి రాజు అయిన వాసుదేవ భగవానుడి దివ్య హస్తములో నిలయమై ఉన్నావు.

నాలుగవ పాశురము: అంతరంగ విషయాల గురించి మాట్లాడే సామర్థ్యం ఉన్న అతడిని, ఎంబెరుమానుడితో తన గురించి మాట్లాడమని ఆమె ప్రార్థిస్తుంది.

చందిర మండలం పోల్ దామోదరన్ కైయిల్
అందరం ఒన్ఱిన్ఱి ఏఱి అవన్ శెవియిల్
మందిరం కొళ్వాయే పోలుం వలంపురియే!
ఇందిరనుం ఉన్నోడు శెల్వత్తుక్కు ఏలానే

కుడివైపుకి మెలిక తిరిగి ఉన్న ఓ శంఖమా! చంద్ర మండలము వలె నీవు దామోదర భగవానుడి దివ్య హస్తములో మెలిక తిరిగి నిత్య నివాసము ఉండి, ఆతని చెవిలో రహస్య విషయాలు మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నావు. స్వర్గాధి పతి అయిన ఇంద్రుడు కూడా నిజమైన నీ సేవా సంపదకి సరితూగలేడు.

ఐదవ పాశురము: ఇతర శంఖాలకి వారు సమానంగా కారని, ఎందుకంటే వారు నిరంతరం ఎంబెరుమానుడి అధర మకరందాన్ని ఆస్వదిస్తారని ఆమె పాంచజన్యముతో అంటుంది.

ఉన్నోడు ఉడనే ఒరు కడలిల్ వాళ్వారై
ఇన్నార్ ఇణైయార్ ఎన్ఱు ఎణ్ణువార్ ఇల్లై కాణ్
మన్నాగి నిన్ఱ మదుసూదన్ వాయ్ అముదం
పన్నాళుం ఉణ్గిన్ఱాయ్ పాంచశన్నియమే!

పాంచజన్యమా! అదే సముద్రంలో నీతో నివసిస్తున్న ఇతర శంఖాలను ఎవరూ పట్టించుకోరు గౌరవించరు.  ఎంతో కాలంగా ఎంబెరుమానుడి నోటి మకరందము నీవు మాత్రమే తాగుతున్నారు. కాబట్టి అదృష్టవంతుడివి నీవే.

ఆరవ పాశురము: ఎమ్పెరుమానుడి నోటిలోని దివ్య జలములో స్నానమాడే అదృష్టాన్ని పొందినందుకు ఆమె అతడిని కీర్తిస్తుంది.

పోయ్ త్తీర్ త్తం ఆడాదే నిన్ఱ పుణర్ మరుదం
శాయ్ త్తీర్ త్తాన్ కైత్తలత్తే ఏరిక్కుడికొండు
శేయ్ త్తీర్ త్తమాయ్ నిన్ఱ శెంగణ్మాల్ తన్నుడైయ
వాయ్ త్తీర్ త్తం పాయ్ందాడ వల్లాయ్ వలంపురియే!

కుడి వైపున మెలిక తిరిగిన ఓ శంఖమా! నిన్ను నీవు శుద్ధి చేసుకోవడానికి గంగా మొదలైన పవిత్ర నదులలో స్నానం మాడేందుకు దూర దూరం వేల్లాల్సిన అవసరం నీకు లేదు. బదులుగా, నారదుని శాపం కారణంగా వృక్ష రూపములో నిలబడి ఉన్న రాక్షసులని కూల్చి నేలమట్టం చేసిన కృష్ణుడి దివ్య హస్థాన్ని అధీష్థించావు. ఎర్రటి నేత్రములు [భక్తుల పట్ల ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది] ఉన్న సర్వేశ్వరుని నోటి మకరందములో స్థిరమై ఉండే అదృష్టాన్ని నీవు పొందావు, నీవు నిత్య స్నానం అక్కడే చేసే అదృష్టాన్ని పొందావు.

ఏడవ పాశురము:  ఎంబెరుమానుడి దివ్య హస్తములో నిలయుడై ఉన్న దివ్య శ్రీ పాంచజన్యము యొక్క అదృష్థాన్ని ఆమె కీర్తిస్తుంది.

శెంగమల నాణ్మలర్ మేల్ తేనుగరుం అన్నన్ పోల్
శెంగణ్ కరుమేని వాసుదేవనుడైయ
అంగైత్తలం ఏఱి అన్నవశం శెయ్యిం
శంగరైయా! ఉన్ శెల్వం శాల అళగియదే

తాజాగా వికసించిన తామర పుష్పము నుండి తేనెలను త్రాగే హంసలాగే, నీవు ఎర్రటి నేత్రములు మరియు నల్లని స్వరూపమున్న కృష్ణ భగవానుడి అందమైన దివ్య హస్థాన్ని అధీష్థించావు. శంఖాలలో ప్రముఖుడివైన ఓ పాంచజన్యమా! నీ సేవా సంపద అపారమైనది.

ఎనిమిదవ పాశురము: శ్రీ పాంచజన్యం పట్ల అమ్మాయిలందరికీ ఉన్న కోపం గురించి ఆమె ప్రస్తావిస్తుంది.

ఉణ్బదు శొల్లిల్ ఉలగళందాన్ వాయ్ అముదం
కణ్ పడై కొళ్ళిల్ కడల్ వణ్ణన్ కైత్తలత్తే
పెణ్ పడైయార్ ఉన్ మేల్ పెరుం పూశల్ శాఱ్ఱుగిన్ఱార్
పణ్ పల శెయ్గిన్ఱాయ్ పాంచశన్నియమే!

పాంచజన్యమా! సమస్థ లోకాలను కొలిచిన ఎంబెరుమానుడి దివ్య నోటి మకరందము నీకు ఆహారము వంటిది. సముద్రము వలె నీల వర్ణుడైన ఆ ఎంబెరుమానుడి దివ్య హస్తము నీవు నిద్రించే చోటు. నీవు నిత్యము ఆతడి అదరములపై లేదా ఆతని హస్తములో ఉంటావు. నీవు ఇలా ఉన్నావు కాబట్టి, అమ్మాయిలందరూ నీపై ఈర్శ పడుతున్నారు.  మమ్మల్నందరినీ పక్కన పెట్టి ఈ అన్యాయమైన పని చేయుట నీకు న్యాయమా? ఇది సరైనదేనా?

తొమ్మిదవ పాశురము: మునుపటి పాశురములో మాదిరిగానే, ఈ పాశురములో కూడా శ్రీ పాంచజన్యముపైన అమ్మాయిలందరూ కోపం ఎలా పెంచుకుంటున్నారో, ఆ విషయము గురించి ఆమె ప్రస్తావిస్తుంది.

పదినాఱూం ఆయిరవర్ దేవిమార్ పార్ త్తిరుప్ప
మదు వాయిల్ కొణ్డాఱ్పోల్ మాదవన్ తన్ వాయ్ అముదం
పొదువాగ ఉణ్బదనైప్పుక్కు నీ ఉణ్డక్కాల్
శిదైయారో ఉన్నోడు? శెల్వప్పెరుం శంగే

నిరంతరం ఎంబెరుమానుడిని అనుభవించే సంపద కలిగిన ఓ పాంచజన్యమా! పదహారు వేల మంది భార్యలు (భగవానుడి) కృష్ణ భగవానుడి దివ్య మకరందాన్ని ఆస్వాదించాలని వేచి ఉన్నారు. ఆ భార్యలందరితో పంచుకోవాల్సిన ఎంబెరుమానుడి అదరామృతాన్ని ఆత్రముగా నీవొక్కడివే అనుభవిస్తే, ఆ స్థ్రీలు నీపై దాడికి రారా?

పదవ పాశురము: ఈ పది పాశురములను నేర్చుకొని పఠించిన వారికి లభ్యమైయ్యే ఫలితము గురించి తెలుపుతూ ఆమె ఈ పదిగాన్ని ముగిస్తుంది.

పాంచశన్నియత్తై ప్పఱ్పనాబనోడుం
వాయ్ంద పెరుం శుఱ్ఱం ఆక్కియ వణ్ పుదువై
ఏయ్ంద పుగళ్ ప్పట్టర్పిరాన్ కోదై తమిళ్ ఈరైందుం
ఆయ్ందేత్త వల్లార్ అవరుం అణుక్కరే

శ్రీ పాంచజన్యము మరియు భగవానుడి మధ్య లోతైన సంబంధాన్ని ఆండాళ్ ఈ పది పాశురముల ద్వారా స్పష్ఠీకరించింది. ఆమె శ్రీవిల్లిపుత్తుర్లో అవతరించింది. ఆమె పెరియాళ్వార్ల ముద్దు బిడ్డ, గొప్ప కీర్తివంతురాలు. ఆండాళ్ దయతో కూర్చిన ఈ పది పాశురాలను నేర్చుకున్నవారు భగవానుడికి నికట సంబంధులు అవుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-7-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment