తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 21 – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 11 – 20

Mahavishnu-universes

పాశురము 21

అవతారిక: ఆళ్వార్లు తిరుమలిరుంశోలై అనే దివ్యదేశంలోని పెరుమాళ్ళను బాగా అనుభవించి ఆనందించారు. తన అనుభవాన్ని ముడిచ్చోది అనే దశకంలో వివరించారు. ఆ దశక సారాన్ని మామునులు ఈ పాశురంలో అనుగ్రహించారు.

ముడియార్ తిరుమలైయిల్ * మూండు నిన్ఱమాఱన్ *
అడివారందన్నిల్ * అళగర్ వడివళగై
ప్పత్తి * ముడియుం అడియుం * పడికలనుం *
ముత్తుం అనుబవిత్తాన్ మున్ * (21)

ప్రతిపదార్థము:
ముడియార్ = ఉన్నతమైన శిఖరములతో ఉన్న
తిరుమలైయిల్  =  తిరుమాలిరుంశోలై  కొండ మీద
మూండు నిన్ఱమాఱన్ =  స్థిరంగా నిలబడి స్వామి దివ్య గుణాలను అనుభవించిన ఆళ్వార్లు
అడివారందన్నిల్ = కొండ అలిపిరి దగ్గర
అళగర్ = ఆ దివ్య క్షేత్రంలో వేంచేసి వున్న పేరుమాళ్ళైన అళగర్
వడివళగై ప్పత్తి = అందానికి దాసులై  (అళగర్ అంటేనే అందమైనవాడు. ఆ క్షేత్రంలో స్వామి అందానికి దాసులు కానివారు ఉండరు.)
ముడియుం = కిరీటము
అడియుం =  శ్రీపాదములకున్న అందెలు
పడికలనుం = సకల ఆభరణాలు
ముత్తుం = అన్నీ
మున్ = మునుపు
అనుబవిత్తాన్ = అనుభవించారు.

భావము: తిరుమాలిరుంశోలై  కొండ మీద స్థిరంగా నిలబడి దర్శన భాగ్యం కలిగించిన స్వామి దివ్య గుణాలను ఆళ్వార్లు అనుభవించారు. కొండ అలిపిరి దగ్గర ఆ దివ్య క్షేత్రంలో వేంచేసి వున్న పేరుమాళ్ళను అళగర్ అంటారు. అళగర్ అంటేనే అందమైనవాడు. ఆ క్షేత్రంలో స్వామి అందానికి దాసులు కాకుండా ఎవరు ఉండరు. పెరుమళ్ళ అందానికి దాసులైన ఆళ్వార్లు  ఆయన కిరీటము, శ్రీపాదములకున్న అందెలే కాక సకల ఆభరణాలను ధరించి దివ్య మంగళ రూపంలో  దర్శనమిస్తున్న స్వామిని  అనుభవించారు.

పాశురము 22

అవతారిక:  ‘నా కరణముల పరిమితత్వం వలన పరమాత్మను పరిపూర్ణంగా అనుభవించలేక పోయానని ఆళ్వార్లు చింతిస్తూ ‘మున్నీర్ జ్జాలం‘ అనే దశకంలో ఆళ్వార్లు పాడారు. ఆళ్వార్ల ఆర్తిని ఒక దశకంలో వివరించగా మామునులు అదే విషయాన్ని ఒక్కటే పాశురంలో చక్కగా పాడారు.

మున్న ముళగరెళిల్ * మూళ్గుం కురుగయర్కోన్ *
ఇన్నవళవెన్న * ఎనక్కరిదాయ్ త్తెన్న *
కరణ క్కుఱైయిన్ కలకత్తై ! కణ్ణన్
ఇరుమై ప్పడుత్తాన్ ఒళిత్తు (22)

ప్రతిపదార్థము:
మున్నం = మునుపు
అళగర్ = అళగర్ (తిరుమలిరుంశోలై పెరుమాళ్ళు)
ఎళిల్ = అందము చూసి
మూళ్గుం = తలమునకలైన
కురుగయర్కోన్ = ఆళ్వార్లు
ఇన్నవళవెన్న =  పరమాత్మ అపరిమితమైన అందాన్ని పూర్తిగా అనుభవించ లేక
ఎనక్కు = నాకు
అరిదాయ్ త్తెన్న =  అసాధ్యమైనది అని
కరణ క్కుఱైయిన్ కలకత్తై = కరణముల శక్తి  పరిమితమైనది అన్న వేదనను
కణ్ణన్ = కృష్ణుడు
ఒళిత్తు  = తొలగించి
ఇరుమై ప్పడుత్తాన్ =  శాంతింప చేశాడు

భావము: మునుపు తిరుమలిరుంశోలై పెరుమాళ్ళు అళగర్ అందము చూసి ఆనందంలో తలమునకలై ఆళ్వార్లు అందులో మునిగి పోయారు. పరమాత్మ అపరిమితమైన అందాన్ని పూర్తిగా అనుభవించలేకపోయానని, తనకు  అసాధ్యమని  భావించారు. దానికి కారణం తన కరణముల శక్తి పరిమితమైనది అని బాధపడ్డారు. అప్పుడు కృష్ణుడు ఆ వేదనను తొలగించి  శాంతింపచేశాడు.

పాశురము 23

అవతారిక:  తిరుమలలో వేంచేసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి దగ్గర ఉండి ఆంతరంగిక కైంకర్యాలు అన్ని చేయాలని, అలా చేయలేక పోయానాన్న ఆర్తిని  ‘ఒళివిల్  కాలమెల్లామ్‘ అనే దశకంలో ఆళ్వార్లు పాడారు. ఆ భావాన్నే ఈ పాశురంలో మామునులు చెప్పారు.

ఒళివిలా క్కాలం * ఉడనాగి మన్ని
వళువిలా * ఆట్చెయిన్ మాలుక్కు * ఎళుశిగర
వేంగడత్తు ప్పారిత్త * మిక్కనలం శేర్ మాఱన్ *
పూంగళలై నెంజే * పుగళ్ * (23)

ప్రతిపదార్థము:
ఒళివిలా క్కాలం = అనంతమైన కాలము
ఉడనాగి మన్ని = పెరుమళ్ళతోనే ఉండి
మాలుక్కు =  పరమాత్మకు
వళువిలా * ఆట్చెయిన్ = నిర్దోశమైన కైంకర్యము చేయటానికి
ఎళుశిగరమ్  =  ఎత్తైన శిఖరములను కలిగి ఉన్న
వేంగడత్తు = తిరుమలకు
ప్పారిత్త =ఎంతో ఆతృతతో చేరుకొని
మిక్కనలం శేర్ = గొప్ప ఆనందాన్ని పొందే
మాఱన్ =  ఆళ్వార్ల
పూంగళలై = అందమైన పువ్వుల వంటి సుకుమారమైన శ్రీపాదములకు
నెంజే  = ఓ మనసా!
పుగళ్ = (స్తుతి చేయడమే) సార్దకత  కదా!

భావము: ఆళ్వార్లు  అనంతమైన కాలము పెరుమళ్ళతోనే ఉండి ఆయనకు నిరంతరం నిర్దోశమైన కైంకర్యాలను చేయటం కోసం ఎత్తైన శిఖరములను కలిగి ఉన్న తిరుమలకు చేరుకున్నారు. ఓ మనసా! ఎంతో ఆతృతతో అక్కడికి చేరుకొని గొప్ప ఆనందాన్ని పొందే ఆళ్వార్ల అందమైన పువ్వుల వంటి సుకుమారమైన శ్రీపాదములకు స్తుతి చేయడమే సార్దకత కదా!

పాశురము 24

అవతారిక: పరమాత్మ ఆళ్వార్ల ప్రార్థనకు కరిగి తాను సకల చేతనాచేతనములకు అంతర్యామిగా ఉన్నానని చూపించారు. ఆది చూసి ఆనందంతో స్వామిని కీర్తిస్తూ ‘పుగళనల్ ఒరువన్‘ అనే దశకంలో ఆళ్వార్లు పాడారు. దాని సంక్షిప్త రూపమే మామునుల ఈ పాశురము.

పుగళొన్ఱు మాల్ * ఎప్పొరుళుమ్ తానాయ్ *
నిగర్ గిన్ఱ నేర్కాట్టి నిఱ్క * మగిళ్ మాఱన్ *
ఎంగుం అడియై శెయ్య * ఇచ్చిత్తు వాశిగమాయ్ *
అంగడిమై * శెయ్దాన్ మొయ్ంబాల్* (24)

ప్రతిపదార్థము:
పుగళొన్ఱు మాల్ = దోషగుణములే లేని పరమాత్మ
ఎప్పొరుళుమ్ తానాయ్ నిగర్ గిన్ఱ = సమస్త పదార్థాలలో అంతర్యామిగా విరాజిల్లుతున్న (పెరుమాళ్లు)
నేర్కాట్టి నిఱ్క = సత్యమై గోచరించగా
మగిళ్ మాఱన్ = వకుళాభరణ భూషనుడైన ఆళ్వార్లు
ఎంగుం అడియై శెయ్య = అన్ని విధముల కైంకర్యాలు చేయాలని
ఇచ్చిత్తు = కోరి
అంగు = అక్కడ
మొయ్ంబాల్ = నిజమైన జ్జానాన్ని కలిగి వుండి
వాశిగమాయ్ = వాచికమైన
అంగడిమై * శెయ్దాన్ = కైంకర్యాన్ని చేశారు

భావము: సమస్త పదార్థాలలో అంతర్యామిగా విరాజిల్లుతూ దోషగుణములే లేని పరమాత్మ సత్యమై గోచరిస్తున్నారు. ఆ నిజమైన జ్జానాన్ని కలిగి ఉన్నవారు ఆళ్వార్లు. వకుళాభరణ భూషణుడైన ఆయన భక్తితో సమస్త విధముల కైంకర్యాలు చేయాలన్న కోరికతో ఉన్నారు. అందుకు తన కరణములు సహకరించక వాచికమైన కైంకర్యాన్ని చేశారు.

పాశురము 25 

అవతారిక: పరమాత్మకు కైంకర్యం చేసే భాగవత ఉత్తములను కీర్తిస్తూ, అదే సమయంలో అలా కైంకర్యం చేయని వారిని నిందిస్తూ ఆళ్వార్లు తన భక్తిని చాటుకున్నారు. మొయిమామ్ అనే దశక సారాన్ని మామునులు ఇక్కడ మనకు చెపుతున్నారు.

మొయ్ంబారుం మాలుక్కు * మున్నడిమై శెయ్దు ఉవప్పాల్ *
అన్బాల్ ఆట్చెయ్ బవరై * ఆదరిత్తుమ్ * అన్బిలా
మూడరై నిందిత్తుం * మొళిందరుళుం మాఱన్ పాల్ *
తెడరియ పత్తి నెంజే * శెయ్ (25)

ప్రతిపదార్థము:
మొయ్ంబారుం = సర్వ శక్తుడైన
మాలుక్కు = పరమాత్మ మీద
మున్నడిమై శెయ్దు ఉవప్పాల్ = మునుపు కైంకర్యము చేసిన సంతోషంతో
అన్బాల్ ఆట్చెయ్ బవరై = ఎవరైతే ప్రేమతో కైంకర్యం చేస్తారో వారిని
ఆదరిత్తుమ్ = ఆదరించి
అన్బిలా = భక్తి లోపించిన
మూడరై = మూఢులను
నిందిత్తుం = నిందించి
మొళిందరుళుం = కృపతో సలహాలనిచ్చి
మాఱన్ పాల్ = ఆళ్వార్ల వైపు
నెంజే = ఓ మనసా
తెడరియ = దోషరహితమైన
పత్తి శెయ్ =  భక్తిని చెయ్యి

భావము : సర్వశక్తుడైన పరమాత్మ పట్ల దోషరహితమైన, ఉన్నతమైన భక్తిని చెసిన వారిని ఆళ్వార్లు ఆదరించి పొగిడారు. అలా చేయని వారి మూఢత్వాన్ని నిందించారు. పరమాత్మకు కైంకర్యము చేయడంలోని ఆనందాన్ని మునుపే వివరించారు. ఓ మనసా! అటువంటి ఆళ్వార్లను భక్తి చెయ్యి.

పాశురము 26 

అవతారిక: అర్చావతారము దాకా వచ్చిన శ్రీమన్నారాయణుని సౌలభ్య గుణాన్ని నమ్మాళ్వార్లు కొనియాడారు. ఆ వైభవాన్ని మామునులు ఈ పాశురములో కృప చేశారు.

శెయ్య పరత్తువమాయ్ * చ్చీరార్ వియూగమాయ్ *
తుయ్యవిబవమాయ్ * త్తోన్ఱివఱ్ఱుళ్ * ఎయ్దుమవర్కు
ఇన్నిలత్తిల్ * అర్చావతారం ఎళిదెన్ఱాన్  *
పన్నుతమిళ్ మాఱన్ పయిన్ఱు (26)

ప్రతిపదార్థము:
శెయ్య పరత్తువమాయ్ =  ఉన్నతమైన పరత్వము
చ్చీరార్ వియూగమాయ్ = క్షీరాబ్దిలో వ్యూహంగా ఉన్న స్వామి
తుయ్యవిబవమాయ్ = పవిత్రమైన విభవ మూర్తి
త్తోన్ఱివఱ్ఱుళ్ = వీటిలో
ఎయ్దుమవర్కు = శరణాగతి చేసే వారికి
ఇన్నిలత్తిల్ = ఈ లోకంలో
అర్చావతారం = అర్చారూపములో వేంచేసి ఉన్న స్వామి
ఎళిదెన్ఱాన్  = సులభుడు కదా! అని
పన్నుతమిళ్ మాఱన్ = ద్రావిడ వేదాన్ని చెప్పిన మాఱన్
పయిన్ఱు = చెపుతున్నారు

భావము : మూడవ శతకం ఆరవ దశకంలో చేతనులతో కూడి ద్రావిడ వేదాన్ని బాగా ఆకళింపు చేసుకున్న ఆళ్వార్లు ఈ లోకంలో పరమాత్మ విషయంలో శరణాగతి చేసిన వారికి ఉన్నతమైన పరత్వము, పవిత్రమైన అవతారాలు మొదలైన వాటికంటే ఆయన అర్చావతారాలే సులభం అని చెప్పారు. దశకంలో చెప్పిన భావాన్ని మామునులు ఒక్క పాశురములో అందంగా తెలియజేయశారు.

పాశురము 27 

అవతారిక: భాగవతవత్తములే మనం ఆశ్రయించదగిన వారు అని నమ్మాళ్వార్లు మూడవ శతకములోని ఏడవ దశకంలో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ మామునులు చెపుతున్నారు..

పయిలుం తిరుమాల్ * పదం తన్నిల్ * నెంజమ్
తయలుండు నిఱ్కుం * తదియర్కు * ఇయల్వుడనే
ఆళానార్కు ఆళాగుం * మాఱనడి యదనిల్ *
ఆళాగార్ శన్మం ముడియా * (27)

ప్రతిపదార్థము :
పయిలుం = భక్తులతో కూడి వుండే
తిరుమాల్ = శ్రియఃపతి
పదం తన్నిల్ = శ్రీపాదములపై
నెంజమ్ తయలుండు నిఱ్కుం = హృదయము లగ్నమైన
తదియర్కు ఇయల్వుడనే = భక్తులకు ప్రేమతో
ఆళాగం = కైంకర్యము చేయుటము
మాఱన్ = నమ్మాళ్వార్లు కోరుకుంటున్నారు
అడి యదనిల్ = అలాంటి ఆళ్వార్ల శ్రీపాదములకు
ఆళ్ ఆగార్ = ఎవరు కైంకర్యము చేయరో
శన్మం = వారి జన్మపరంపర

భావము: శ్రీయః పతికి కైంకర్యం చేసే భాగవతోత్తముల శ్రీపాదములకు కైంకర్యం చేయాలని ఆళ్వార్లు కోరుకున్నారు. అంతటి ఉత్తములైన ఆళ్వార్ల శ్రీపాదములకు కైంకర్యం చేయనివారికి ఈ లోకంలో జనన మరణ చక్రం నుండి విముక్తి దుర్లభం అని మామునులు చెపుతున్నారు.

పాశురము 28 

అవతారిక: నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి, రెండవ శతకంలోని ముడియాన్ అనే ఎనిమిదవ దశకంలో తమ కరణాలతో పరమాత్మను అనుభవించాలనే కోరికతో ఉన్న విషయాన్ని చెప్పారు. ఆ పది పశురాలలో ఆళ్వార్ల అనుభవాన్ని ఇక్కడ మామునులు ఒక్క పాశురంలో సంక్షిప్తంగా చక్కగా వివరించారు..

ముడియాద ఆశై మిగ * ముఱ్ఱు కరణంగళ్ *
అడియార్ తమ్మై విట్టు * అవన్బాల్ పడియా * ఒన్ ఱొన్ఱిన్
శెయిల్ విరుంబు * ఉళ్ళదెల్లాం తాం విరుంబ *
తున్నియదే మాఱన్ తన్శొల్ * (28)

ప్రతిపాదార్థము:
ముడియాద ఆశై మిగ = నిరంతరం వృద్ది చెందుతున్న ఆనంతమైన ప్రేమ వలన
ముఱ్ఱు కరణంగళ్ = సమస్త కరణాలు
అడియార్ తమ్మై విట్టు = భాగవతులను వదలి
అవన్బాల్ పడియా = పరమాత్మను చేరుకుంటున్నాయి
ఒన్ ఱొన్ఱిన్ శెయిల్ విరుంబు = ప్రతి కరణము తక్కిన కరణాలపని కూడ తామే చేయాలని ఆత్రపడగా
ఉళ్ళదెల్లాం తాం విరుంబ = ఆళ్వార్లు ఆ కరణాలన్నింటి కోరికలు తానే కలిగి వుండి అన్ని రకాల
కైంకర్యాలు చేయాలని కోరుతూ
మాఱన్ తన్శొల్ = మాఱన్ చెప్పిన మాటలు
తున్నియదే = ఉన్మత్తమే

భావము: ఆళ్వార్ల అపారమైన ప్రేమ ఇంకా పెరగగా వారి కరణాలన్నీ ఆయనను వదిలి సర్వేశ్వరుడి దగ్గరకు వెళ్లిపోయాయి. ప్రతి అవయవము తన వంతు ఆనందాన్ని అనుభవించి ఇతర అవయవాల అనుభవాన్ని కూడా పొందాలని ఆతృతను ప్రదర్శించాయి. ఆళ్వార్లు అన్ని అవయవాల అనుభవాన్ని కోరుకున్నారు. అది నిజంగా ఉన్మత్తమైన దశ. ఆ దశలో ఉండి ఆళ్వార్లు ఒక దశకమే చెప్పగా మామునులు దశక సారాన్ని ఒక్క పాశురంలో ఒద్దికగా కుదించి చెప్పారు..

పాశురము 29

అవతారిక: శ్రీమన్నారాయణుని భక్తులు కాని వారికి కైంకర్యము చేయటము నీచమైన కార్యము. శ్రీమన్నారాయణుని భక్తులకు చేసే కైంకర్యము మాత్రమే ఉన్నతమైనదని నమ్మాళ్వార్లు శొన్నాల్ విరోదమ్ అనే దశకంలో చెప్పిన విషాయాన్ని మామునులు ఈ పాశురంలో క్లుప్తంగా తెలియజేశారు.

మన్నాద మానిడరై * వాళ్ త్తుదలాల్ – ఎన్నాగుమ్ ?*
ఎన్నుడనే మాదవనై * ఏత్తుమ్ ఎనుం కురుగూర్ *
మన్నరుళాల్ మాఱుం శన్మమ్
శొన్నావిల్ వాళ్ పులర్ వీర్ !* శోఱుకూఱైక్కాగ *

ప్రతిపదార్థము:
శొన్నావిల్ వాళ్ పులర్ వీర్ ! = నోరార కవిత్వం చెప్పగల కవులారా!
శోఱుకూఱైక్కాగ = తిండి బట్టల కోసం
మన్నాద మానిడరై = అల్పాయుష్కులైన మనుష్యులను
వాళ్ త్తుదలాల్ = కీర్తించడం వలన
ఎన్నాగుమ్ ? = ప్రయోజనమేమున్నది?
ఎన్నుడనే = నాతో కలసి
మాదవనై = మాధవుడిని
ఏత్తుమ్ ఎనుం = కీర్తించండి అని చెప్పిన
కురుగూర్ మన్ = తిరుకురుగూర్ నిర్వహకుడైన ఆళ్వార్ల
అరుళాల్ = కృప చేత
శన్మమ్ మాఱుం = మళ్ళీ మళ్ళీ ఈ లోకంలో జన్మించే బాధ తప్పుతుంది కదా!

భావము: కవిత్వం చెప్పే శక్తిగల కవులారా! తిండి బట్ట కోసం అల్పాయుష్కులైన మనుష్యులపై కవిత్వం చెప్పడం వలన ప్రయోజనమేమున్నది? నోరున్నందుకు ఆ శ్రీయఃపతిని పాడి తరించ మని అందరికీ ఉపదేశించిన తిరుకూరుగూర్ నాయకుడైన మారన్ కృపతో మళ్ళీ మళ్ళీ ఈ లోకంలో జన్మించే బాధ తప్పుతుంది కదా! అని చెప్పిన ఆళ్వార్ల పాశురాల అర్థాన్ని మామునులు సంక్షిప్తంగా ఈ పాశురంలో చెపుతున్నారు.

పాశురము 30 

అవతారిక: పరమాత్మ కైంకర్యం కోసమే నా కరణాలు ఉన్నాయి. అందువలన నాకు కొరత ఏమి లేదు, అని ఆళ్వార్లు శన్మం పలపల అనే దశకంలో పాడిన భావాన్ని మామునులు ఇక్కడ మనకు అనుగ్రహించారు.

శన్మం పలశెయ్దు * తాన్ ఇవ్వులగళిక్కుమ్ *
నన్మై ఉడై  మాల్ * గుణత్తై నాళ్ దోఱుం * ఇమ్మైయిలే
ఏత్తుం ఇన్బం పెఱ్ఱేన్ ఎనుమ్ * మాఱనై యులగీర్ !*
నాత్తళుంబ * ఏత్తుం ఒరునాళ్ * (30)

ప్రతిపదార్థము:
యులగీర్ ! = ఓ మనవులారా
శన్మం పలశెయ్దు = అనేక జన్మలెత్తి
తాన్ ఇవ్వులగళిక్కుమ్ = తానే ఈ లోకులను రక్షిస్తూ ఉన్న
నన్మై ఉడై  = కృపా సముద్రుడైన
మాల్ = పరమాత్మ
గుణత్తై నాళ్ దోఱుం = గుణములను ప్రతి నిత్యం
ఇమ్మైయిలే = ఈ జన్మలో
ఏత్తుం ఇన్బం పెఱ్ఱేన్ = కీర్తించే అదృష్టాన్ని పొందాను
ఎనుమ్ * మాఱనై = అనే మాఱను
ఒరునాళ్ = ఒక్క రోజైనా
నాత్తళుంబ = నాలుక కాయలు కాసేటట్లు
ఏత్తుం = కీర్తించండి

భావము: లోకంలో ఉజ్జీవించె జనులారా! పరమాత్మ అనేక అవతారాలు చేసి నిర్హేతుకమైన కృపతో తానే ఈ లోకులను రక్షిస్తూ ఉన్న కృపా సముద్రుడు. పరమాత్మ గుణములను ప్రతి నిత్యం కీర్తించే అదృష్టాన్ని ఈ జన్మలో పొందాను అనే మాఱను ఒక్క రోజైనా నాలుక కాయలు కాసేటట్లు కీర్తించండి..

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-21-30-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment