శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అహమేవ పరంతత్వం
ఎంబెరుమాన్ తన పట్ల అణువు మాత్రము ప్రేమ ఉన్నాకూడా వచ్చి రక్షిస్తాడు, వచ్చి తననెందుకు రక్షించలేదని ఆళ్వారు ఆలోచిస్తున్నారు. తాను సొంత మార్గాలను అనుసరిస్తున్నాడని ఎంబెరుమాన్ ఆలోచిస్తున్నాడేమో నని భావించి, ఆళ్వారు తాను నిస్సహాయుడనని అల్పుడనని ప్రకటిస్తూ ఈ పదిగములో వానమామలై భగవానుడికి శరణాగతి చేస్తున్నారు.
మొదటి పాశురము: “నిన్ను పొందడానికి శాస్త్రంలో పేర్కొన్న ఉపాయముల విహీనుడిని నేను, నీవు లేకుండా జీవించలేను; నీ భక్తులతో కలిసి ఉండటానికి ఇష్టపడే నీవు, ఎల్లప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే నీ పరిధిలో నేను లేనా? ” అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.
నోఱ్ఱ నోన్బిలేన్ నుణ్ణఱివిలేన్ ఆగీలుం ఇని ఉన్నై విట్టు ఒన్ఱుం
ఆఱ్ఱగిఱ్కిన్ఱిలేన్ అరవిన్ అణై అమ్మానే!
శేఱ్ఱు త్తామరై శెన్నెల్ ఊడు మలర్ శిరీవర మంగల నగర్
వీఱ్ఱిరుంద ఎందాయ్ ఉనక్కు మిగై అల్లేన్ అంగే (1)
కర్మయోగ ఫలితాన్ని పొందడానికి నేను కర్మ యోగం చేయలేదు; నా స్వరూప జ్ఞానము గురించి మరియు భగవత్ జ్ఞానము గురించి తెలిపే జ్ఞాన యోగమునూ నేను ఎరుగను; ఈ రెండు యోగముల ద్వారా సాధ్యమయ్యే భక్తి యోగం లేనప్పటికీ, నీ గుణాలను ధ్యానించి ఆస్వాదించిన తర్వాత నీవు లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేకపోతున్నాను. పచ్చని వరి చేనులతో, ఆకర్షణీయమైన లేత కమలములు నిత్యము వికసించే శ్రీవరమంగళ నగర్లో [వానమామలై / తోతాద్రి, నాంగునేరి అని కూడా పిలుస్తారు] నీ భక్తులను తక్షణమే కటాక్షించే విలక్షణమైన రీతిలో ఆసీనుడై ఉన్న ఓ మహోపకారి! సర్వరక్షకుడైన మీ ద్వారా రక్షించబడే, రక్షించదగిన ఆత్మల సమక్షంలో నేను లేనా?
రెండవ పాశురము: “నీ దివ్య చరణాలను పొందడంలో అడ్డంకులు ఏమైనా ఉంటే, నీవే వాటిని తొలగించి, కృపతో నీవు నన్ను రక్షించాలి” అని ఆళ్వారు తెలుపుతున్నారు.
అంగుఱ్ఱేన్ అల్లేన్ ఇంగుఱ్ఱేన్ అల్లేన్ ఉన్నై క్కాణుం అవావిల్ వీళ్ళ్‌ందు నాన్
ఎంగుఱ్ఱేనుం అల్లేన్ ఇలంరై శెఱ్ఱ అమ్మానే
తింగళ్ శేర్మణి మాడ నీడు శిరీవర మంగలనగర్ ఉఱై
శంగు శక్కరత్తాయ్ ! తమియేనుక్కరుళాయే (2)
నిన్నే సాధనముగా ఉంచి శ్రేష్ఠమైన నీ నీలయములోకి నేనింకా ప్రవేశించలేదు. సహనముతో ఓపికగా ఇప్పుడు ఉన్న చోట నేను ఉండనూ లేను. నిన్ను ఆస్వాదించిన తరువాత నేను నీ ప్రేమలో ఆకర్షితుడైయ్యి, ఈ ప్రాపంచిక జనులు ఉన్న స్థితిలో కూడా నేను ఉండనూ లేను. సీతా పిరాట్టికి అడ్డంకి అయిన లంకను నాశనం చేసి, ఆమెను తిరిగి పొందిన ఓ నా స్వామీ! నీ భక్తుల శత్రువులను నాశనము చేయడానికి, నీ భక్తులు కూడా ఆనందించే విశిష్ఠమైన ఆయుధాలున్న ఓ నా స్వామి, కెంపులతో ఆకాశములో చంద్రుని తాకేటంత ఎత్తైన భవనాలున్న శ్రీవరమంగళ నగర్లో నిత్య నివాసుడై ఉన్నవాడా! నీ తోడు తప్పా మరే దిక్కు లేని ఒంటరి నైన నన్ను దయతో ఆశీర్వదించు.
మూడవ పాశురము: “నీ ఆధిపత్యాన్ని వ్యక్తపరిచే విశిష్ఠమైన చిహ్నాలున్న నీవు నన్ను స్వీకరించి నీ సేవలో నిమగ్నుడను చేసిన నీకు ప్రతిఫలముగా నేను ఎటువంటి సహాయం చేయలేను” అని ఆళ్వారు చెబుతున్నారు.
కరుళ పుట్కొడి శక్కర ప్పడై వాన నాడ! ఎన్ కార్ముగిల్ వణ్ణా
పారుళ్ అల్లాద ఎన్నై ప్పొరుళాక్కి అడిమై కొండాయ్
తెరుళ్ కొళ్ నాన్మఱై వల్లవర్ పలర్ వాళ్ శిరీవర మంగలనగర్‌క్కు
అరుళ్ శెయ్దంగిరుందాయ్ ! అఱియేన్ ఒరు కైమ్మాఱే (3)
గరుడ పక్షిని తన ధ్వజంగా, దివ్య సుదర్శన చక్రము తన ఆయుధంగా, పరమపదము తన సామ్రాజ్యంగా కలిగి ఉన్నవాడు ఎంబెరుమాన్; నన్ను అనుగ్రహించిన నల్లని మేఘ వర్ణము కలిగి ఉన్నవాడు అతడు; ఆ రూపంతో, “అసన్నేవ” (అచిత్) లో చెప్పినట్లుగా ఒక అచిత్ గా కూడా పరిగణించబడని నన్ను మార్చి నా స్వరూపాన్ని నేను గ్రహించేలా చేసి, నా వాచిక కైంకర్యమును స్వీకరించాడు. నాలుగు వేదాలలో ప్రావీణ్యం ఉన్న గొప్ప జ్ఞానులు నివసించే శ్రీవరమంగళ నగర్లో నిత్య నివాసుడవై ఉన్న నీకు ప్రతిఫలంగా కృతజ్ఞతతో నేను ఏమీ చేయలేను.
నాలుగవ పాశురము: “నా స్వఇచ్ఛతో భక్త వత్సలుడవైన నిన్ను నేను ఎలా పొందగలను?” అని ఆళ్వారు తెలుపుతున్నారు.
మాఱు శేర్ పడై నూఱ్ఱువర్ మంగ ఓర్ ఐవర్ క్కాయన్ఱు మాయ ప్పోర్ పణ్ణి
నీఱు శెయ్ద ఎందాయ్ నిలంగీండ అమ్మానే!
తేఱు జ్ఞానత్తర్ వేద వేళ్వి యఱా చ్చిరీవర మంగలనగర్
ఏఱి వీఱ్ఱిరుందాయ్ ఉన్నై ఎంగెయ్ద కూవువనే (4)
దుర్యోధనుడు మొదలైనవాళ్ళు పాండవ శత్రువులుగా ఉన్నప్పుడు, పాండవ శ్రేయోభిలాషిగా, పాండవులకు సహాయం చేయాలనే దృఢ నిశ్చయంతో యుద్ధము నిర్వహించి దుర్యోధనుడు మొదలైన వాళ్ళను నేలమట్టం చేశావు; ప్రళయ కాలంలో వరాహమూర్తిగా నీవు భుమిని పైకి ఎత్తావు. శ్రీవరమంగళ నగర్లోకి ప్రవేశించి, స్పష్టమైన జ్ఞానం ఉన్నవారిచే నిరంతరం భగవత్ ఆరాధనలు అందుకుంటూ విలక్షణంగా విరాజిల్లుతున్న ఓ భగవానుడా! నేను నిన్ను ఎలా ప్రార్థించి పొందగలను?
ఐదవ పాశురము: “భక్త వత్సలుడిగా శత్రు నాశనం చేసేందుకు ఈ భూమిపైకి దిగి వచ్చే స్వభావము గల నిన్ను నేను ఎరుగుదును; అటువంటి స్వభావం గల నిన్ను పొందడానికి నేను నా సొంత ప్రయత్నము చేయుట నాకు సముచితమా?” అని ఆళ్వారు భగవానుడితో అంటున్నారు.
ఎయ్ద క్కూవుదల్ ఆవదే ఎనక్కు? ఎవ్వ దెవ్వవ్వత్తుళ్ ఆయుమాయ్ నిన్ఱు
నై తవంగళ్ శెయ్యుం కరుమేని అమ్మానే!
శెయ్ద వేళ్వియర్ వైయ త్తేవరఱా చ్చిరీవర మంగలనగర్
కై తొళ్ళ ఇరుందాయ్ అదు నానుం కణ్డేనే (5)
నిన్ను పొందడానికి నా కోరికను సాధనముగా భావించుట నాకు భావ్యమేనా? ఓ స్వామి! ప్రతికూలమైన రాక్షస సమూహాల వాళ్ళ మధ్య కలిసి, వాళ్ళ మధ్య నిలబడి బౌద్ద రూపాన్ని ధరించి మాయచేసిన ఓ నా స్వామి! నీవు కృతకృత్యులకి [వేదములలో చెప్పబడిన వాటిని అనుసరించేవారు] నిత్యము స్వామిగా మరియు భూమిపై నిత్యసూరులతో పోల్చదగిన శ్రీవరమంగళ నగర్ దివ్యదేశపు నిత్యనివాసుడవు, వారందరిచే సేవలందుకుంటున్న వాడవు; “అందువల్ల, నా అడ్డంకులను తొలగించి, నిన్ను నేను అనుభవించేలా చేయడం నీ కర్తవ్యం” అని ఆళ్వారు సూచిస్తున్నారు.
ఆరవ పాశురము: “భక్త రక్షకుడవని విరాజిల్లుతున్న నీవు కనికరించి నిన్ను నేను సేవించి అనుభవించుటకు నావద్దకు రావాలి” అని ఆళ్వారు విన్నపిస్తున్నారు.
ఏనమాయ్ నిలం కీండ ఎన్నప్పనే కణ్ణా ! ఎన్ఱుం ఎన్నై ఆళుడై
వాన నాయగనే మణి మాణిక్క చ్చుడరే!
తేనమాం పాళిల్ తణ్ శిరీవర మంగలత్తవర్ కై తొళవుఱై
వానమామలైయే అడియేన్ తొళ వందరుళే (6)
వరాహ రూపాన్ని ధరించి భూమిని వెలికి తీసిన నీవు, కృష్ణునిగా, పరమపదములోని ఆనందం వలె ఆనందించే నా వాక్కు సేవలను అందుకుంటూ నన్ను సంరక్షిస్తూ; అరుదైన మాణిక్యము వలె ప్రకాశిస్తూ నిత్యమూ తేనెలను కార్చే మామిడి తోటలతో నిండి ఉన్న శ్రీవరమంగళ నగర్ దివ్య దేశములో నివసిస్తున్నావు, ఈ దివ్య దేశవాసులతో సేవలందుకుంటున్నావు. పరమవ్యోమ [శ్రీవైకుంఠము] నివాసితులు ఆస్వాదించే విశాలమైన పర్వతాన్ని పోలిన దృఢ రూపాన్ని కలిగి ఉన్న ఓ నా స్వామీ! నీ ఆసనాన్ని వదిలి నాపై కృపతో, నీ దాసిడనైన నా వద్దకు రా. వచ్చి నా సెవలనందుకో.
ఏడవ పాశురము: “నా ఉనికికి సంపూర్ణ కారకుడవైన నీవు నా నుండి వేరైయ్యి నా అస్థిత్వాన్ని నాశనం చేయవద్దు” అని ఆళ్వారు తెలుపుతున్నారు.
వందరుళి ఎన్ నెంజిడం గొండ వానవర్ కొళుందే ఉలగుక్కోర్
ముందై తాయ్ తందైయే ! ముళు ఏళ్ ఉలగుం ఉండాయ్
శెందొళిలవర్ వేద వేళ్వి అఱా చ్చిరీవర మంగలనగర్
అందమిల్ పుగళాయ్ ! అడియేనై అగఱ్ఱేలే (7)
ఎంబెరుమాన్ దయతో నా వద్దకు వచ్చి నా హృదయాన్ని అతని నివాసంగా మార్చుకుని నన్ను సంరక్షించి పోషిస్తున్నాడు మరియు పరమపద నివాసితుల సంరక్షణను వృద్ది చేస్తున్నాడు; ఈ ప్రపంచానికే అతడు ప్రథమ తల్లి మరియు తండ్రి వంటివాడు; సమస్థ లోకాలను తన కడుపులో దాచుకొని రక్షకత్వము వహిస్తున్నాడు. అటువంటి అనంత కోటి గుణాలున్న ఎంబెరుమాన్, కైంకర్య రూపముగా వేదానుసారంగా నీజాయతీ పరులచే నిరంతరము భగవత్ ఆరాధనలు అందుకుంటూ శ్రీవరమంగళ నగర్లో నివాసుడై ఉన్నాడు. దయచేసి నన్ను నీనుండి దూరం చేయవద్దు.
ఎనిమిదవ పాశురము: “నేను నిన్ను బహిష్కరించానా?” అని ఎంబెరుమాన్ అడుగుతున్నారు. దానికి ఆళ్వారు “శబ్దము మొదలైన ప్రాపంచిక సుఖాలు అతి చురుకుగా పనిచేసే ఈ సంసారంలో నీవు నన్ను ఉంచారు; ఇది బహిష్కరించుట కాదా?” అని సమాధానమిస్తున్నారు.
అగఱ్ఱ నీ వైత్త మాయ వల్ ఐమ్బులంగళ్ ఆం అవై నన్గఱిందనన్
అగఱ్ఱి ఎన్నైయుం నీ అరుంజేఱ్ఱిల్ వీళ్తి కండాయ్
పగర్ క్కదిర్ మణి మాడ నీడి శిరీవరమంగై వాణనే ఎన్ఱుం
పుగఱ్కరియ ఎందాయ్ పుళ్ళిన్ వాయ్ పిళందానే ! (8)
నీ నుండి దూరమయ్యే వారిని బహిష్కరించడానికి, నీవు సృష్టించిన జయించలేని ఇంద్రియాలను నేను బాగా అర్థం చేసుకున్నాను. నీవు నన్ను కష్టకరమైన బురదలోకి నెట్టివేస్తున్నావేమోనని నేను భయపడుతున్నాను. ఓ! దగదగ మెరిసే మాణిక్యములతో నిర్మించబడిన ఎత్తైన భవనములున్న సిరీవరమంగై దివ్య దేశ నియామకుడా! బకాసురుని ముక్కును చీల్చిన ఓ నా స్వామీ! “ఈ విధంగా ఎంబెరుమాన్ సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ, అతడు నాకు సహాయ పడకుండా నన్ను దూరంగా నెట్టివేస్తున్నాడు” అని ఆళ్వారు భావిస్తున్నారు.
తొమ్మిదవ పాశురము: “శత్రువులను నాశనం చేయుట వలన అనంత సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్న నీవు, దయతో నన్ను ఉద్ధరించాలి” అని ఆళ్వారు భగవానుడికి విన్నపించుకుంటున్నారు.
పుళ్ళిన్ వాయ్ పిళందాయ్ ! మరుదిడై పోయినాయ్ ! ఎరుదేళ్ అడర్‌త్త ఎన్
కళ్ళ మాయవనే ! కరు మాణిక్క చ్చుడరే
తెళ్ళియార్ తిరు నాన్మఱైగళ్ వల్లార్ మలి తణ్ శిరీవరమంగై
ఉళ్ ఇరుంద ఎందాయ్ ! అరుళాయ్ ఉయ్యుమాఱెనక్కే (9)
అద్భుతమైన వ్యక్తిత్వమున్న ఓ ఎంబెరుమాన్! బకాసురుడిని, యమళ, అర్జున మరియు సప్త వృషభాలను (ఎద్దులను) వధించి రహస్యాంశాలను వెల్లడి చేసినవాడా; అందమైన నల్లని మాణిక్యమువలే మెరిసే స్వరూపము ఉన్నవాడా! నాలుగు వేదాలలో స్పష్టత మరియు నైపుణ్యం ఉన్నవారు నివసించే సిరీవరమంగై దివ్య దేశములో కొలువై ఉన్నవాడా! వేరే ఏ ఆశ్రయం లేని నాకు, నీ దివ్య పాదాలను పొందే ఉపాయాన్ని అనుగ్రహించి నన్ను నీవు ఉద్ధరించుము.
పదవ పాశురము: “నా దివ్య చరణములే నన్ను పొందేందుకు మార్గాలు” అని ఎంబెరుమాన్ ఆళ్వారుకి తన పాదాలను చూపిస్తున్నారు. “దీనికి ప్రతిఫలంగా నేను నీకు ఏమీ చేయలేను” అని ఆళ్వారు బదులిస్తున్నారు.
ఆఱెనక్కు నిన్ పాదమే శరణాగ త్తందొళిందాయ్ ఉనక్కోర్
కైమాఱు నాన్ ఒన్ఱిలీన్ ఎనదావియుం ఉనదే
శేఱు కొళ్ కరుమ్చుం పెరుం శెన్నెలుం మలి తణ్ శిరీవరమంగరై
నాఱు పూన్ తణ్ తుళాయ్ ముడియాయ్ ! దెయ్వనాయగనే (10)
ఎత్తైన వరి చేనులు, పొడవైన చెరకు పంటలున్న సిరీవరమంగై దివ్య దేశములో నవోత్తేజమైన తుళసితో అలంకరించబడిన దివ్య కిరీటాన్ని ధరించి నిత్య నివాసుడై ఉన్న నిత్యసూరుల నాయకుడా! ఓ ఎంబెరుమాన్! ఆశ్రయించ తగినవి మరియు సాధించ యోగ్యమైన నీ దివ్య పాదాలను నాకు అనుగ్రహించావు; ప్రతిఫలంగా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నా ఆత్మ నీదే.
పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని భావపూరితముగా ఆనందంతో పఠించేవారు, నిత్యసూరులచేత ఎల్లప్పుడూ ఆనందించబడతారు” అని ఆళ్వారు తెలుపుతున్నారు.
దెయ్వనాయగన్ నారణన్ తిరివిక్కిరమన్ అడి ఇణై మివై
కొయ్ కొళ్ పూం పొళిల్ శూళ్ కురుగూర్ చ్చడగోబన్
శెయ్ద ఆయిరత్తుళ్ ఇవై తణ్ శిరీవరమంగై మేయ పత్తుడన్
వైగల్ పాడ వల్లార్ వానోర్‌క్కారావముదే (11)
నిత్యసూరుల నాయకుడైన సర్వేశ్వరుడు, మాతృ భావముతో నిరపేక్ష సంబంధంతో అతడి అధీనులను స్వీకరిస్తారు; విరిసిన పుష్పాలతో విస్తరించిన ఉన్న ఆళ్వార్తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్ పాడిన వెయ్యి పాసురములలో, శక్తిని కలుగజేయు సిరీవరమంగై దివ్య దేశాన్ని ఉద్దేశించి ఆ ఎంబెరుమాన్ యొక్క దివ్య పాదాలపై కృపతో ఈ పది పాసురములను పాడారు. ఈ పదిగాన్ని అర్థానుసానములతో పాడగలిగేవారు, నిత్యానందాన్ని అనుభవిస్తారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము:https://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-5-7-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org