శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకము 61 – “నీవు మహా గొప్ప వంశములో పుట్టావు? నిస్సహాయ వ్యక్తిలా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు. “నేను గొప్ప వంశములో పుట్టినా, నేను చేసిన లెక్కలేని పాపకర్మల కారణంగా ఈ సంసారములో కూరుకుపోతున్నాను; దయచేసి నన్ను ఉద్ధరించు” అని ఆళవందార్లు ప్రార్థిస్తున్నారు.
జనిత్వాऽహం వంశే మహతి జగతి ఖ్యాతయశసాం
శుచీనాం ముక్తానాం గుణపురుష తత్వస్థితివిదాం।
నిసర్గా దేవ త్వచ్చరణ కమలైకాంత మనసాం
అదోऽధః పాపాత్మా శరణద! నిమజ్జామి తమసి॥
ఆశ్రితులకు అభయమిచ్చు ఓ నా స్వామి! ఈ ప్రపంచములో అతి ప్రసిద్దులు, పరిశుద్దులు, నీతో కలిసి ఉండాలని ఆశించేవారు, చిత్ మరియు అచిత్తుల పరిభాష ఎరిగినవారు, నీ దివ్య చరణ కమలముల యందే నిత్యము ధ్యానించు గొప్ప వ్యక్తిత్వముగల వంశపరంపరలో నెను పుట్టానుకానీ, నేనొక పాపాల పుట్టని, ఆ కారణంగా ఈ సంసార లోతుల్లోకి నేను కూరుకుపోతున్నాను.
శ్లోకము 62 – “ఇంతటి గొప్ప వంశ పరంపరలో నీ పుట్టుక నిరర్థకమయ్యేటంతటి పాపాలు నువ్వేంచేశావు?” అని భగవాన్ ప్రశ్నిస్తున్నారు. “పాపాత్మా” (మునుపటి పాశురములో తెలిపినట్టుగా) అని ఆళవందార్లు విశదీకరింస్తున్నారు.
అమర్యాదః క్షుద్ర శ్చలమతిరసూయాప్రసవభూః
కృతఘ్నో దుర్మానీ స్మరపరవశో వంచనపరః।
నృశంసః పాపుష్థః కథమహమితో దుఃఖజలధేః
అపారాదుత్తీర్ణస్తవ పరిచరేయం చరణయోః॥
అల్పమైన విషయాలను కోరుతూ వేదాల పరిధి దాటిన వాడిని నేను, చంచలమైన మనస్సుతో, అసూయ మూలంగా, నాకు మంచి చేసిన వారికి కూడా హాని తలపెడుతూ, అహంకారము/అహంభావముతో, కామ వ్యసనుడిగా, మోసాలు చేస్తూ, కౄరమైన పనులలో పాల్పడుతూ ఎన్నో పాపకర్మలలో మునిగి ఉన్నాను, ఈ అనంత దుఃఖ సాగరములో ఈదుతూ నేను ఒడ్డుకి చేరేది ఎప్పుడో, నీ దివ్య పాదలను సేవించేది ఎప్పుడో?
శ్లోకము 63 – “నీవు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులను నేను తొలగించనా?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు. “కాకాసురుడు (కాకి రూపాన్ని ధరించిన ఇంద్ర పుత్రుడు) మరియు శిశుపాలుడు చేసిన అపకారములను క్షమించిన విధముగా ఓ రాజాధిరాజా, నా తప్పులను కూడా క్షమించలేవా?” అని ఆళవందార్లు బదులిస్తున్నారు.
రఘువర! యదభూస్త్వం తాదృశో వాయసస్య
ప్రణత ఇతి దయాళుర్ యచ్చ చైద్యస్య కృష్ణా!।
ప్రతిభవం అపరాద్ధు ముగ్ధ! సాయుజ్యదోऽభూః
వద కిమపదమాగస్తస్య తేऽస్తి క్షమాయాః॥
రఘుకుల శ్రేష్ఠుడు శ్రీ రామునిగా అవతరించిన ఓ నా స్వామీ! కాకాసురుడు మహాపాపము చేసినా, అతను శరణాగతుడని నీవు అతనిపై దయ చూపలేదా? ఓ కృష్ణా! అనేక జన్మలలో అనేకానేక పాపములు చేసి చేడికులములో పుట్టిన శిశుపాలుడికి మోక్షాన్ని ప్రసాదించావు కదా? నీ ఓరిమి ఔన్నత్యానికి ఏ పాపము లక్ష్యము కాక ఉండును. దయచేసి వివరింపుము.
శ్లోకము 64 – “నేను స్వతంత్రుడనే, కొందరిని నేను క్షమించి ఉన్నతగతికి చేరుకునేలా చేశాను. కానీ అదే ప్రమాణము అవుతుందా?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు. “సారగ ఒడ్డుపైన ఉండి అందరి సమక్షములో వాగ్దానము (శరణాగతులను రక్షిస్తానని) చేసితివి, శరణాగతులలో నేను లేనా, నేను చేసినది శరణాగతి కాదా?” అని ఆళవందార్లు బదులిస్తున్నారు.
నను ప్రపన్నస్సకృదేవ నాథ!
తవాహస్మీతి చ యాచమానః!
తవానుకంప్యః స్మరతః ప్రతిజ్ఞాం
మదేకవర్జం కిమిదం వ్రతం తే॥
ఓ నా స్వామీ! “నన్ను నేను నీకు సమర్పించుకొంటిని”, “నేను మీకు ప్రత్యేక సేవ చేయాలి” నేను ప్రార్థిస్తున్నాను, నీ వాగ్దానముని (రామ రావణ యుద్ధానికి ముందు (సముద్ర ఒడ్డున విభీషనుడికి తెలియజేశిన)) ధ్యానించుచూ; నీ ఈ వాగ్దానము నాకు మాత్రమే వర్తించదా?
శ్లోకము 65 – ఆళవందార్లు శ్రీరామాయణము అయోధ్య కాండము 18.30లో చెప్పినట్టుగా ‘రామో ద్విర్నాభిభాషతే’ (రెండు తీరులుగా శ్రీ రాముడు మాట్లాడడు) అన్న మాటను నీవు మరచినా, పెరియ ముదలియార్లతో (శ్రీ నాథమునులతో) నా యొక్క సంబంధము (వారి మనుమడిగా జన్మించుట), వారి నుండి సంక్రమించిన జ్ఞానముని దృష్ఠిలో పెట్టుకొని నా దోషాలను పట్టించుకోక నన్ను స్వీకరించాలి”, భగవాన్ బదులిస్తూ “నీవు వచ్చిన పద్దతిలో ఏ దోషము లేదు కనక, అలా చేయుటకు నాకే అభ్యంతరము లేదు” అని ఆళవందార్లకు ఆ వరాన్ని అనుగ్రహిస్తారు. సంతృప్తిపడి ఆళవందార్లు స్తోత్రరత్న ప్రబంధముని ముగిస్తారు.
అకృత్రిమ త్వచ్చరణారవింద
ప్రేమ ప్రకర్షావధిం ఆత్మవంతం।
పితామహం నథమునిం విలోక్య
ప్రసీద మద్వృత్త మచింతయిత్వా॥
ఓ భగవానుడా! నా ప్రవర్తనను నిగ్రహించి, నీ పాదాల యందు సహజ భక్తి ప్రపూర్ణులైన మా తాతగారు నాథమునులను దృష్థిలో పెట్టుకొని దయతో నీవు నన్ను క్షమించాలి.
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-61-to-65-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org