శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకము 51 – “నీ గొప్ప కృపతోనే, ఈ దయ కలిగినవారి మరియు దయ కోరే వారి మధ్య సంబంధము స్థాపించబడింది; ఈ సంధర్భముగా, నీవు నన్ను త్యజించకుండా నన్ను రక్షించాలి”, అని ఆళవందార్లు తెలుపుతున్నారు.
తదహం త్వదృతే న నాథవాన్
మదృతే త్వం దయనీయవా న్న చ।
విధినొర్మితమేతదన్వయం
భగవాన్! పాలయ మా స్మ జీహపః॥
జ్ఞాన సంపూర్ణుడవైన ఓ భగవాన్! నీవు తప్పా వెరెవరినీ స్వామిగా భావించని వాడిని, నీ దయాపాత్రుడిగా నీకు నేను తప్పా వేరెవరు లేరు. నీ కృపతో ఏర్పడిన ఈ సంబంధాన్ని పరిత్యజించకుండా రక్షించాలి.
శ్లోకము 52 – “ఆత్మ యొక్క స్వరూపాన్ని బట్టి రక్షణ ఉండును; నీవు స్వరూప నిర్ధారణ చేసి నాకు శరణాగతి చేయి” అని ఎంబెరుమానుడు తెలియజేస్తున్నారు. తిరువాయ్మొళి 2.9.5లో నమ్మళ్వార్లు “సిఱప్పిల్ వీడు” అని చెప్పినట్టుగా, “నాకు ఎటువంటి నిర్బంధము లేదు; ఈ ఆత్మ నీ పాదపద్మముల యందు శరణాగతి చేసినది” అని ఆళవందార్లు తెలుపుతున్నారు.
వపురాదిషు యోऽపి కోऽపి వా
గుణతోऽసాని యథాతథావిధః।
తదయం తవ పాదపద్మయోః
అహమధ్యైవ మయా సమర్పితః॥
అనేక శరీరాలలో నాదొక శరీరముగా, ఏ గుణాలున్నా సరే [స్వరూప, గుణ]; ఈ విషయాలతో నాకే నియంత్రణ లేదు, కావున, ఆత్మ అను ఈ అంశమును, నేను నీ చరణారవిందముల యందు అప్పుడే సమర్పణ చేసాను..
శ్లోకము 53 – “ఆళవందార్లని కలవరపడు స్థితిలో ఎలా వదలగలను?” అని భగవానుడు ఆలోచిస్తూ, “నీవెవరు, నీవెవరికి నిన్ను నీవు సమర్పించుకున్నావు?” అని అడుగుతున్నారు. తిరువాయ్మొళి 2.3.4 లో “ఎనదావి ఆవియుం నీ…..ఎనదావి యార్? యానార్?” అని నమ్మళ్వార్లు చెప్పినట్టుగా దృఢ నిశ్చయముతో “నీవు నీ సొత్తునే స్వీకరించావు; ఆత్మ సమర్పణం కూడా ఆత్మాపహారం లాంటిది” అని ఆళవందార్లు చెబుతూ తన శరణాగతికి చింతిస్తున్నారు.
మమ నాథ! యదస్తి యోऽస్మ్యహం
సకలం తద్ధి తవైవ మాధవ।
నియతస్వమితి ప్రబుద్దధీః
అథవా కింను సమర్పమామి తే॥
సర్వస్వామి మరియు లక్ష్మీ నాధుడవైన ఓ భగవాన్! నా ఉనికి మరియు నా సొంతమైనవన్నింటికీ నీవే యజమానివి. ఇది తెలిసిన పిదప నేను నీకు సమర్పించగలిగినది ఇంకేముంది?
శ్లోకము 54 – ఆత్మ అపహరణ చర్యగా పరిగణించబడే ‘ఆత్మ సమర్పణము’ తో నేను ఆగటం లేదు. కాబట్టి, నీ నిర్హేతుక కృప తో ఈ శేషత్వమును (మీ పట్ల నా దాస్యం) నాకు అనుగ్రహించితివి, ఈ జ్ఞానమును నీ సేవలో ఉపయోగించడానికి దయచేసి నాకు మూడు స్థాయుల పర భక్తిని ప్రసాదించుము అని ఆళవందార్లు విన్నపించుకుంటున్నారు.
అవబోదితవా నిమాం యథా
మయి నిత్యం భవధీయతాం స్వయం।
కృపయైతదనన్యభోగ్యతాం
భగవాన్! భక్తిమపి ప్రయచ్చ మే॥
ఓ స్వామి! నీ నిష్కామ కృపతో ఈ దాసుడికి సేవాభాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా, దయతో నాకు వేరేచోట లభ్యముకాని భక్తి మాధుర్యాన్ని కూడా ప్రసాదించండి.
శ్లోకము 55 – భగవత్కృపతో సమృద్దిగా భక్తిని పొందిన ఆళవందార్ల పిదప, భగవత్ శేషత్వంతో ఆగకుండా తదీయ శేషత్వం (భగవత్ భక్తులకు దాసునుగా) అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు.
తవ దాస్యసుఖైక సంగినాం
భవనేష్వస్త్వపి కీటజన్మ మే।
ఇతరావసథేషు మాస్మభూత్
అపి మే జన్మ చతుర్ముఖాత్మనా॥
నిన్ను సేవించే దాసుల దివ్య భవనములో (ఇళ్ళలో) ఒక పురుగులానైన జన్మించాలి. ఇతరుల ఇండ్లల్లో బ్రహ్మలా పుట్టినా నాకు స్ఫురించదు.
శ్లోకము 56 – “వైష్ణవ నివాసంలో జన్మించినందుకు అంత కీర్తి నాకు అవసరమా? ఆ ఇంటివారు నన్ను వేరుగా కాకుండా, వాళ్ళల్లో ఒకరిగా ‘నా వారు’ గా భవించి తమ ప్రత్యేక కృపను నాపై కురిపించే విధంగా ఉండాలి”, అని ఆళవందార్లు అడుగుతున్నారు.
సకృత్త్వదాకారవిలోకనాశయా
తృణీకృతానుత్తమ భుక్తిముక్తిభిః।
మహాత్మభిర్ మామవలోక్యతాం నయ
క్షణేపి తే యద్విరహోऽతిదుస్సహః॥
గొప్ప సుఖాలు మరియు ముక్తిని అనుభవించే వారు, అయినా ఒక్కసారి నీ దివ్య స్వరూప దర్శనముతో పోలిస్తే ఆ సుఖాలన్నీ ఒక గడ్డి పరకలా భావించేవారు, ఎవరి ఎడబాటైతే నీవు భరించలేవో, అటువంటి గొప్ప వైష్ణవులు చూపు నాపై పడేలా నాకు అర్హతనివ్వు.
శ్లోకము 57 – శేషత్వము యొక్క అత్యున్నత స్థితి అయిన తదీయ శేషత్వముపై (భగవత్భక్తుల దాసులు) ఆళవందార్లు ధ్యానిస్తున్నారు. శేషత్వపు ఆవల ఉన్నవారి పట్ల విరక్తి నొందుతూ” దయచేసి వాటిని తొలగించండి (నా జీవితము నుండి)” అని భగవానుడిని ప్రార్థిస్తున్నారు.
న దేహం న ప్రాణాన్న చ సుఖమశేషాభిలషితం
న చాత్మానం నాన్యత్ కిమపి తవ శేషత్వవిభవాత్।
బహిర్భూతం నాథ! క్షణమపి సహే యాతు శతధా
వినాశం తత్సత్యం మధుమథన! విజ్ఞాపన మిదం॥
ఓ నా స్వామి! నీ శేషత్వ సంపద రహితమైనదేదైనా – నా ఆత్మ అయినా, నా శరీరమైనా, ప్రాణ వాయువైనా, అందరూ కోరుకునే ఆ భోగభాగ్యాలైనా ఒక్క క్షణం కూడా నేను సహించను; అటువంటి (శేషత్వ రహితమైన) అంశాలన్నీ కనుమరుగైపోనీ. మధు అనే రాక్షసుడిని వధించిన ఓ నా స్వామీ! ఇదియే సత్యము, ఇదే నా విన్నపము.
శ్లోకము 58 – “నాకు క్రోధము కలిగించే భగవత్ అపచారము మొదలైన ఎనేక అమంగళమైన అంశాలున్న ఈ సంసారములో, వాటి పట్ల విరక్తి చూపిస్తూ కైంకర్య మార్గములో అడ్డంకులు తొలగించాలని, పెద్ద పెద్ద యోగులకు కూడా సాధ్యముకానిది కోరుతున్నావు” అని ఎంబెరుమాన్ ఆశ్చర్యపోతుండగా, “అనేక అమంగళ గుణాలను నిర్మూలించే, నీలో ఉన్న అనంతమైన మంగళ గుణాలను ధ్యానిస్తూ ఉండాలనేదే నా కోరిక” అని ఆళవందార్లు బదులిస్తున్నారు.
దురంతస్యానాథేరపరిహరణీయస్య మహతో
నిహీనాచారోऽహం నృపశురశుభస్యాస్పదమపి।
దయాసింధో! బంధో! నిరవధికవాత్సల్యజలధే!
తవ స్మారం స్మారం గుణగణమిదీచ్చామి గతభీః॥
కృపా సాగరుడివైన ఓ నా స్వామీ! నాతో సర్వవిధ సంబంధములన్నీ ఉన్న ఓ నా స్వామీ! తల్లి చూపించే వాత్సల్య కృపా సాగరుడివైన ఓ నా స్వామీ! తొలగించుటకు అసాధ్యమైన, ఆద్యంతములులేని ఘోర పాపాలకు నిలయుడైన నేను, నీ యొక్క కల్యాణ గుణములను పదే పదే ధ్యానిస్తూ నిర్భయముతో నిన్ను ఈ విధముగా కోరుతున్నాను.
శ్లోకము 59 – ముందుటి శ్లోకములో ‘ఇచ్ఛామి’ అని చెప్పినట్టుగా, నీవు నిజంగా (నన్ను) కోరుతున్నావా?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు. “మీ గొప్పతనానికి సరితూగే కోరిక నాలో ఉన్న సంగతి మీ దివ్య సన్నిధిలో వ్యక్తపరచలేని మంద బుద్దిని నేను. నా కోరికను విశద పరచిన మాటలను స్వీకరించి నా బుద్దిని సంస్కరించి నాకది సాధ్యమైయ్యేలా చేయి స్వామి” అని ఆళవందార్లు బదులిస్తున్నారు.
అనిచ్చన్నప్యేవం యది పునరితీచ్చన్నివ రజః
తమశ్చన్నశ్ఛద్మస్తుతి వచనభంగీమరచయం।
తథాऽపీర్థం రూపం వచనమవలంబ్యాపి కృపయా
త్వమే వైవం భూతం ధరణిధర! మే శిక్షయ మనః॥
భూమిని ఉద్ధరించిన ఓ భగవాన్! రజో తమో గుణాలతో కప్పబడి ఉన్న ఈ దాసుడికి అటువంటి కోరిక అంతగా లేకున్నా, నిజమైన కోరిక ఉన్నవారిలా నీకు కపటపు ప్రశంసలు అందిస్తూ, అటువంటి ప్రశంసల కారణముగా గైకొన్న నీవు ఆ కారణముగా నీ అనన్య కృపతో నా బుద్దిని సంస్కరించవలెను.
శ్లోకము 60 – “నీవు కోరిక కూడా లేనివాడివి. నీలో కోరికను సృష్టించిన, తర్వాత నిన్ను రక్షించాలని నీవు కోరుకుంటున్నావు – అలా నేను ఎందుకు చేయాలి?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు. భగవానుడు మరియు తన మధ్య ఉన్న అనివార్యమైన సంబంధాన్ని గురించి ఆళవందార్లు వివరిస్తున్నారు.
పితా త్వం మాతా త్వం దయిత తనస్త్వం ప్రియ సుహృత్
త్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చాసి జగతాం।
త్వదీయ స్త్వద్భృత్యస్తవ పరిజన స్త్వద్గతి రహం
ప్రపన్నశ్చైవం సత్యహమపి తవైవాస్మి హి భరః॥
అన్ని లోకాలకు నీవు తల్లివి, తండ్రివి; ప్రియమైన పుత్రుడివి; నమ్మదగిన మిత్రుడివి (మనసులోని మాటలు పంచుకోగల); ఆచర్యుడివి; నీవే ఉపాయము మరియు నీనే ఉపేయము; నేను నీ వాడను; నీ దాసుడను; నీవే ఏకైక ఉపాయోపేయములుగా ఉన్న వాడిని; ఇటువంటి పరిస్థితిలో నన్ను నీవే రక్షించాలి కదా?
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-51-to-60-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org