స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 41- 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

శ్లోకములు 31-40

శ్లోకము 41 –  ఈ శ్లోకము – భగవానుడికి అతి ప్రియమైన, ధ్వజము మరియు ఇతర దివ్య సేవలందిస్తున్న పెరియ తిరువడి (గరుడాల్వాన్, గరుడ) తో ఎంబెరుమానుడితో కలసి ఉండటాన్ని ఆళవందార్లు ఆనందిస్తున్నారు.

దాస సఖా వాహనమాసనం ద్వజో
యస్తే వితానం వ్యజనం త్రయీమయః ।
ఉపస్థితం తేన పురో గరుత్మతా
త్వదంఘ్రిసమ్మర్ధకిణాంగశోభినా॥

వేదములు అంగములుగా, నీ సేవకునిగా, మిత్రునిగా, వాహనముగా, సింహాసనముగా, ధ్వజముగా, నీకు ఛత్ర చామరములుగా, నీ దివ్య చరణములు ఒత్తిడితో ఏర్పడిన పుమచ్చలతో గుర్తింపబడి ప్రకాశిస్తున్నవాడు గరుడ (గరుడాల్వాన్); అటువంటి గరుడునిచే నీవు పూజలందుకుంటున్నావు.

శ్లోకము 42 – ఈ శ్లోకము – శ్రీ సేనాపతి ఆళ్వానుని (విశ్వక్సేనుడు) సామ్రాజ్యాన్ని, విశ్వక్సేనునిపై తన సమస్త బాధ్యతలని ఉంచి తాను అతని నియంత్రణలో ఉన్న ఎంబెరుమానుడిని  ఆళవందార్లు ఆనందిస్తున్నారు.

త్వదీయభుక్తోజ్జిత శేషభోజినా
త్వయా నిసృష్ఠాత్మభరేణ యద్యథా।
ప్రియేణ సేనాపతినా న్యవేది తత్
తథాऽనుజానంత ముదారవీక్షణైః॥

నీవు (భగవాన్) భుజించిన తరువాత శేషము (మిగిలినది) విశ్వక్సేనులు భుజిస్తారు, లీలా విభూతి మరియు నిత్య విభూతి నిర్వహణ బాధ్యతను నీ నుండి తీసుకోగలిగినవారు; అందరికీ ప్రియమైన వారు, కార్యములు నిర్వహించుటకు నీ యొక్క కను సైగతో అనుమతి తీసికొని వాటిని సుసంప్పన్నము చేసెదరు విశ్వక్సేనులవారు.

శ్లోకము 43 –  “సదా పశ్యంతి సూరయః” (నిరంతరము ఎంబెరుమానుని నిత్యసూరులు కనులారా చూస్తుంటారు) అని విష్ణు సూక్తములో వివరించినట్టుగా ఈ శ్లోకములో ఎంబెరుమానునికి నిత్యసూరులందించే సేవలను ఆళవందార్లు అనుభవిస్తున్నారు. తిరువాయ్మొళి 2.3.10లో “అదియార్గళ్ కుళాంగళై ఉడన్ కూడవదు ఎన్ఱు కొలో?” (నిత్యసూరుల సమూహములో నేనెప్పుడు చేరతానో?) అని ప్రార్థన చేస్తున్నారు.

హతాఖిల క్లేశమలైః స్వభావతః
*సదానుకూల్యైకరసైః తవోచితైః।
గృహీత తత్తత్పరిచాససాధనైః
నిషేవ్యమాణం సచివైర్యథోచితం॥

* ‘త్వదానుకూల్యైక’ అని కూడా పఠించవచ్చు.

కళంకములు మరియు బాధ రహితమైన నిత్యసూరులచే పూజింజబడే ఈ భగవానుడు!  నీ కైంకర్యమే వారి సుఖానుభవంగా ఉండిన,  స్వాభావికంగా, సామర్థ్యం పరముగా నీసాకూప్యము కలిగి కైంకర్యమునకు అవసరమైన సామగ్రి –  పూల దండలు, ధూప దీపములు చేత పట్టుకొని నీ స్వరూపానుగుణంగా నీకు సూచనలు చేస్తూ సేవలందించేవారు నిత్యసూరులు.

శ్లోకము 44 –   శ్రీ రామాయణము అయోధ్య కాండము 31.25వ ఈ శ్లోకములో “భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే” (కొండలలో అడవులలో నీవు సీతమ్మతో వేంచేసి ఉన్నప్పుడు, మీ ఇరువురికీ నేను సకల సేవలందిస్తాను) అని లక్ష్మణులు విన్నపించుకుంటారు. అనేక విధాలుగా రాములవారు సీతమ్మకి అందిస్తున్న సౌక్యములను ఇక్కడ ఆళవందార్లు పరికిస్తున్నారు.

అపూర్వనానారస భావ నిర్భర
ప్రబద్ధయా ముగ్ధ విదగ్ధ లీలయా।
క్షణాణువత్ క్షిప్తపరాదికాలయా
ప్రహర్శమంతం మహిషీం మహాభుజం॥

పిరాట్టిని ఆలింగనంచేసుకొనేటంత పొడుగాటి చేతులున్న ఆజానుబాహుడైన భగవానుడు వారి నైపుణ్యంతో అందమైన  లీలలతో  బ్రహ్మ కాలం కూడా ఒక్క క్షణం లాగా గడుపుతున్నట్లు ఎన్నో ఆహ్లాదకరమైన లీలలతో ప్రతి క్షణము కొత్తగా  అనిపించేలా పెరియ పిరాట్టిని ఆనందపరచుచున్నారు.

శ్లోకము 45 –   పిరాట్టికి ఆనందము కలిగించే కళ్యాణ గుణాలకి నివాసుడైన భగవత్ స్వరూపమును ఈ శ్లోకములో  ఆళవందార్లు అనుభవిస్తున్నారు.

అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన
స్వభావలావణ్య మయామృతోదధిం।
శ్రియః శ్రియం భక్తజనైక జీవితం
సమర్థ మాపత్సఖ మర్థికల్పకం॥

భగవానుడు అనూహ్యమైన, ఆధ్యాత్మిక / దివ్య, అద్భుతమైన, నిత్య యవ్వనము  కలిగి ఉండి, అసీమిత సౌందర్య సాగరుడు,  (శ్రీ మహాలక్ష్మి) శ్రీ కి సంపదగా, తన భక్తులకి ప్రాణముగా, (అల్ప జ్ఞానులకి కూడా తన అనుభవాన్ని కలిగించు వాడు), స్నేహితులకు ఆప్తునిగా,  కోరికలు తీర్చు కల్పవృక్షము వంటివాడు.  

శ్లోకము 46 – ఈ శ్లోకములో – నేనెప్పుడు ఈ లౌకికాంశాలపై ఆసక్తిని వదులుకొని నా జన్మసాఫల్యంగా ఉద్దేశ్యముతో, క్రిందట శ్లోకములలో వివరించిన రూప, గుణ, విభవ గుణములలో సంపూర్ణుడవైన నీ ప్రీతి కొరకై నీ కైంకర్యములో ఎప్పుడు పాల్గొంటానో అని ఆళవందార్లు భగవానుడి చింతనచేస్తున్నారు.

భవంత మేవానుచరన్ నిరంతరం
ప్రశాంత నిశ్శేష మనోరథాంతరః।
కధాऽహమైకాంతిక నిత్యకింకరః
ప్రహర్షయిష్యామి సనాథ జీవితః॥

ఆనవాలు లేకుండా అన్ని బంధముల నుండి విముక్తి పొంది నిన్నే అనుసరిస్తూ,  నిన్నెప్పుడు నిత్య కైంకర్యముతో మెప్పిస్తానో?

శ్లోకము 47 – ఈ శ్లోకమున,  ఆళవందార్లు తన మునుపటి స్థితిని, పొందతగ్గ ఈశ్వరుని విశిష్ట స్వరూపాన్ని చూసి, బ్రహ్మ రుద్రులు మొదలైన వారికి కూడా అందని కైంకర్యము, ఈ భౌతిక అంశాలతో తాకబడని నిత్యసూరులచే కోరబడిన ఆ కైంకర్యమును, ఈ సంసారినైన నేనెలా ఆశించగలను? రాజ భోగములో విషాన్ని ఎలా కలపగలము!”అని భవిస్తూ, “వళవేళుల్గు” అని నమ్మాళ్వార్లు చేసినట్టు తనను తాను ఖండించుకున్నారు.     

దిగషుచిమవినీతం నిర్దయం మామలజ్జం
పరమపురుష! యోऽహం యోగివర్యాగ్రగణ్యైః।
విదిశివసనకాద్యైః ధ్యాతు మత్యంతదూరం
తవ పరిజనభావం కామయే కామవృత్తః||

ఓ పురుషోత్తమ!  (నా స్వంత) ఇష్టాలు మరియు అభిరుచులకు అనుగుణంగా వ్యవహరించడానికి ప్రసిద్ఢుడనైన నేను, నన్ను నేను ఖండించుకోవాలి, అపవిత్రంగా, సంస్కారహీనుడిగా, నిర్లజ్జగా, నిర్దయగా ఉన్న నేను, యోగులలో ఉత్తములుగా భావించబడే  బ్రహ్మ, రుద్రుడు, సనకులు మొదలైనవారు ఆలోచించడనికి కూడా సాధ్యం కాని నీ సేవను కోరుతున్నాను. 

శ్లోకము 48 – ఈ శ్లోకములో – ఆళవందార్లు తన పాపములను తొలగించి కృపతో తనను స్వీకరించమని ఎంబెరుమానునికి  విన్నపిస్తున్నారు. మరో వివరణ – “నన్ను నా లక్ష్యన్ని చేరుకునే దారిలో అడ్డమువచ్చే నా పాపములన్నీ నీవు ఔన్నత్యముతో తొలగించాలి” అని ఆళవందార్లు భగవానుడిని ప్రార్థిస్తున్నారు. ఇంతకు ముందు ఎంబెరుమానుడి యొక్క అత్యున్నత గొప్పతనాన్ని చూసి వెళ్లిపోయి ఇప్పుడు, భగవానుడి సౌలభ్య గుణాన్ని చూసి వారిని ఆశ్రయిస్తున్నారు.

అపరాధసహస్రభాజనం
పతితం భీమభవార్ణవోదరే।
అగతిం శరణాగతం హరే!
కృపయా కేవలమాత్మసాత్కురు॥

ఓ నా దుఃఖాలను తొలగించే ఆపద్భాంధవా! నేను అనేక పాపాలకు పుట్ట లాంటివాడను; నేను ఘోరమైన ఈ సంసార సాగరములో పడ్డాను, నీవు తప్పా నాకు ఆశ్రయము లేదు, నిన్ను శరణు వేడుతున్నాను; నీ కృపతో మాత్రమే, నీవు నన్ను నీవాడిగా స్వీకరించాలి.

శ్లోకము 49 – ఈ శ్లోకములో – “నీలో పుష్కలంగా లోపాలు ఉన్నప్పుడు, ఆ లోపాలను తొలగించుకునే మార్గములను వెదకకుండా లేదా అన్నీ విడిచి నన్ను వేడుకోకుండా, “కృపయా కేవలమాత్మసాత్కురు”(నీ కృప కారణంగా నన్ను స్వీకరించు) అని నన్నెందుకు బలవంత పెడుతున్నావు అని భగవానుడు ఆళవందార్ని ప్రశ్నిస్తున్నాడు. దానికి ఆళవందార్లు బదులిస్తూ “శాస్త్ర అనుష్థానములలో నాకు ఏ జ్ఞానము లేదు” (శాస్త్రములో చెప్పబడిన పద్దతులు /సాధనములు) [ఉపయాంతరములలో పాల్గొనకపోవుట]; నాకు రక్షణ ఎవరు లేరు కాబట్టి, నేను వదులుకోలేను. కాబట్టి కృపతో కూడిన నీ ఒక్క చూపు మాత్రమే నా ఉద్దరణకి సోపానము”.

అవివేక ఘనాన్థ దిఙ్ముఖే
బహుధా సంతత దుఃఖవర్షిణి।
భగవన్! భవదుర్ధినే పథః
స్కలితం మామవలోకయాచ్యుత॥

జ్ఞాన, శక్తి మొదలైన 6 గుణాలలో పరిపూర్ణుడవైన ఓ భగవానుడా!  నీ భక్తులను ఎన్నడు విడువని వాడా!  కారు మబ్బులు అలుముకొని అనేక రకాలుగా ఘోరమైన దుఃఖ వర్షాన్ని కురిపిస్తున్న ఈ సంసారపు చీకటిలో  నేను ధర్మ మార్గము నుండి దారి తప్పాను; నీ చల్లని చూపుతో నన్ను అనుగ్రహించు.

శ్లోకము 50 – ఈ శ్లోకములో – “నీ కృప తప్పా నాకింకే రక్షణ లేదు, నీకు తగిన కృపా పాత్రుడను నేనే; కాబట్టి ఈ అవకాశాన్ని వదలవద్దు” అని ఆళవందార్లు చెబుతున్నారు.

న మృషా పరమార్థమేవ మే
శృణు విజ్ఞాపనమేక మగ్రతః।
యది మే న దయిష్యసే తతో
దయనీయస్తవ నాథ దుర్లభః॥

ఓ నా స్వామి! ముందు దయతో నా విన్నపాన్ని వినండి; (ఇది వినతి) వాస్థవమైనది, తప్పు కాదు; నాపైన నీవు నీ దయ చూపించక పోతే, నన్ను కోల్పోయిన తరువాత, నీ దయ పొందటానికి అర్హత గలవారు నీకు వెరెవరు దొరకరు.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-41-to-50-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment