జ్ఞానసారము 13

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 12

young-narada-muni-with-lord-narayana

 

 అవతారిక

            పరమాత్మ శ్రీపాదములే పరమ ప్రయోజనము అని భావించి, అన్యప్రయోజనములను ఆశించని భక్తులైనా ,ఆత్మ వివేకము లేక ,లౌకిక విషయవాంచలలో పడి కొట్టుకు పోయే వారితో సంబంధము పెట్టు కున్నవారు ఉత్తమ భక్తులౌతారా? అన్న సందేహము కలుగక మానదు. ఆత్మ జ్ఞానము కలిగి పరమాత్మ శ్రీపాద ములే పరమ ప్రయోజనముగా భావించే భక్తులకు లౌకిక సంబంధాలు అంటవు’  అని ఆ సందేహమునకు ఈ శ్లోకములో సమాధానము చెపుతున్నారు.

“ పండే ఉయిరానైత్తుం పంగయత్తాళ్  నాయగర్ క్కే

తొమ్ డామెనత్తెళింద  తూమనత్తార్కు ఉండో

పల కత్తుం తమ్ ఉడంబై పార్థభిమానిక్కుం 

ఉలగత్తవరోడురవు  

ప్రతిపదార్థము

పండే = పరంపరగా

ఉయిరనైత్తుం = ప్రాణాలన్నీ

పంగయత్తాళ్  నాయగర్ క్కే = తామరపూవునే నివాసస్థానముగా చేసుకున్న లక్ష్మీనాధులకే

తొమ్ డామ్  = దాసులు   

ఎన త్తెళింద  = అని తెలుసుకున్న

తూమనత్తార్కు = పరి సుద్ధమైన  మనసు కల వారికి

పలవుం కత్తు = శాస్త్రములన్ని నేర్చి

 తమ్ ఉడంబై  = తమ దేఃములో గోచరమగు అందము, కులము ,అంతస్తు మొదలగు వాటిని

పార్తు = చూసి

అబిమానిక్కుం = అభిమానము పెంచుకొన్న 

ఉలగత్తవరోడు = లోకులతో

ఉరవు ఉండో = సంబంధము ఏర్పడుతుందా

వ్యాఖ్యానము

 పండే ,ఉయిర్ తోండామ్…. అనాది కాలముగా జీవాత్మలన్నీ పరమాత్మకు దాసులే అని చెపుతున్నారు. అన్నీ అనగా కొన్ని మాత్రమే దాసులు ,మరికొన్ని కావు కాబోలు అన్నసందేహమునకు తావు లేకుండా జీవాత్మలన్నీ పరమాత్మకు దాసులే అనిఅర్థము.

పంగయత్తాళ్  నాయగర్ క్కే…(తామరపూవునే నివాసస్థానముగా చేసుకున్న శ్రీమహాలక్ష్మి నాయకుడు ).దాసులైన జీవాత్మలకు నాయకుడెవరు అంటే తామరనే నివాసస్థానముగా చేసుకున్న శ్రీమహాలక్ష్మి నాయకుడు అని ,అర్థాత్ శ్రీమహాలక్ష్మి, శ్రీమన్నారాయణులిరువురు అని బోధపడుతుంది. “నాయకునికే ” అన్న చతుర్థీ విభక్తి ప్రయోగము నారాయణునికి తప్ప మరెవరికీ దాసులము కాదు అన్న విషయాన్నిదృఢపరుస్తున్నది.   

తొమ్ డామెన త్తెళింద  తూమనత్తార్కు …. దాసులమని తెలిసిన పవిత్రమైన మనసు కలవారికి .. అంటే పైన చెప్పిన జీవాత్మలన్ని పరమాత్మకే దాసులని తెలిసిన వారు అని అర్థము. ఈ విషయము ఎక్కడ చెప్పబడింది అంటే తిరుమంత్రములో చెప్పబడింది . ఆ తిరుమంత్రము,దాని అర్థము తెలిసిన పరిశుద్ధ మనస్కులని అంటున్నారు.

ఉండో!….ఉందా! అంటే లేదు అని సమాధానము. తరువాత వచ్చే సంబధం అన్న పదముతో చేర్చి చూస్తే అర్థము బోధపడుతుంది.

పల కత్తుం తమ్ ఉడంబై  పార్థబిమానిక్కుం ….ఎంతో నేర్చినా తమ దేహమును అభిమానించటము  ( దేహాత్మాభి మానము )వీడలేదే! …వేదము, స్మృతి, ఇతిహాసము, పురాణము, తర్కము,వ్యాకరణము మొదలగు శాస్త్రముల న్నీ నేర్చినా దేహత్మాభిమానము వదల లేదు. అంటే తమ దేహమును చూసి కులము,జాతి,మతము, స్థితి                 ( బ్రహ్మచారి , సంసారి, ధనికుడు,పేద మొదలగు ),బేధముల వలన గర్వము కలిగి ఉండుట .

ఉలగత్తవరోడురవు ….ఇలా తమను జాతి ,కుల, మత,స్థితి బేధములచే గొప్పవారిగా భావించే లౌకికులతో సంబంధము

తూమనత్తార్కు…. శుద్ధమైన మనసు గలవారికి  సంబంధము ఉంటుందా ? ఉండదు.అని చెప్పుకోవాలి.

అంతరార్థము….” ఓం “ కారములోని అకారవాచ్యుడైన పరమాత్మకే “ మ “ కార వాచ్యుడైన జీవాత్మలన్నీ దాసులు అని చెప్పబడింది . ఆ జీవాత్మలన్నీ జడములకంటే భిన్నముగా జ్ఞానానందములను  కలిగి వున్నవి, జ్ఞాన స్వరూపములుగా విలసిల్లుతున్నవన్న శాస్త్రవిషయములు తేట తెల్లగా తెలిసిన వారు, ఇవేవి తెలియని దేహాత్మాభిమానము ,దాని వలన కలిగిన అహంకారము గల లౌకికులతో సంబంధము కలిగి వుంటారా?  ఉండరు. దీనికి ఉదాహరణగా ఒక చరిత్ర చెప్పబడింది. తిరువహీంద్రపురములో విల్లుపుత్తూర్ భాగవతులని ఒక సన్యాసి ఉండేవారు .ఆ ఊరి చెరువులో స్నానమాడే సమయములో బ్రాహ్మణులు  స్నానమాడే గట్టును విడిచి వేరొక గట్టులో స్నానమాడేవారు. చూసి చూసి ఒకరోజు ఒక బ్రాహ్మణులు,’మేము స్నానము చేయు గట్టు మీకు పనికి రాదో !’ అని అడిగారు. దానకి వారు,’ స్వామీ! మేము వైష్ణవులము .విష్ణుభక్తులము, విష్ణుదాసులము . మీరు కుల ,మత, జాతి ధర్మములు పాటించు వారు. దేహాత్మాభిమానమునకు దాసులు . అది మనకు పొసగదు అన్నారు. అందువలన జ్ఞానులకు లౌకికులతో పొసగదు అని ఈ పాశురములో చెపుతున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-13-pande-uyir-anaiththum/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment