పూర్వ దినచర్య – శ్లోకం 29 – ఆరాధ్య శ్రీనిధిం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 28

శ్లోకం 29

ఆరాధ్య శ్రీనిధిం పశ్చాదనుయాగం విధాయ చ |

ప్రసాదపాత్రం మాం కృత్వా పశ్యంతం భావయామి తం ||

ప్రతి పదార్థము:

పశ్చాద్ = తరువాత (మధ్యాహ్న అనుష్ఠానానము తరువాత )

శ్రీనిధిం = శ్రీనే ధరించిన శ్రీమంతుడు (తమ ఆరాధనా మూర్తి)

ఆరాధ్య = భక్తితో

అనుయాగం = భగవంతునికి నివేదించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుటాది అనుయాగము

విధాయ =  చేసి

మాం = గతములో ఈ విషయాలలో విముఖత చూపిన దాసుడిని

ప్రసాదపాత్రం కృత్వా = తమ శేష ప్రసాదముననుగ్రహించి

పశ్యంతం = దాసుడిని కటాక్షించిన

తం = ఆ మామునులను

భావయామి = సదా స్మరిస్తాను

భావము:

ఆరాధ్య….’  యువ రాజును, మదము పట్టిన ఏనుగును,  మనకిష్టమైన అథిధులను ఎలా పూజిస్తామో అలా భగవంతుడిని పూజించాలి.  పతివ్రత తన భర్తను , స్తన్యపానముచేయు బిడ్డను ,  శిష్యుడు తమ ఆచార్యులను , మంత్రములు తెలిసిన వారు తమ మంత్రములను ఏవిధముగా  ఆదరిస్తారో ఆవిధముగా భగవంతుడిని ఆరాదించాలి’ అని శాండిల్య స్మృతిలో చెప్పబడింది.  అదే విధముగా మామునులు శ్రీరంగ నాథుని  ఆరాధించారని భావము. అనుయాగమును అనగా భగవధారాధనను అనుసరించి చేయు భగవత్ శేష ప్రసాదమును స్వీకరించుట. పరిశేషము చేసి,  ప్రాణాయ,   అపానాయ, వ్యానాయ , ఉదానాయ,  సమానాయ అని భగవంతుడి నామములను స్మరిస్తూ  ఆహుతుల రూపములో అన్నమును ఐదు మార్లు స్వీకరించి తరువాత భుజించాలి  అని భరద్వాజులు చెప్పియున్నారు.   శాండిల్యులు మన హృదయములో ఉన్న భగవంతుడిని ధ్యానము చేస్తూ తీర్థమును స్వీకరించి , తరువాత ప్రాణాయ స్వాహా..మొదలగు మంత్రములను ఉచ్చరిస్తూ అహారమును  నోటి ద్వారా హోమము చేసి అన్నములో దోషము లు చూడకుండా (ఉప్పు ఎక్కువుగా, కారం ఎక్కువగా ఉన్నదనో ) ప్రసాదముగా స్వీకరించాలని చెప్పారు.  శుధ్ద్ధమైన,  ఆరోగ్యకరమైన   ఆహారమును మితముగా స్వీకరించాలి.  అది రుచికరముగా, మనసుకు నచ్చినదై,  నేతితో శుధ్ధి చేయబడినదై కంటికింపుగా తగినంత వేడిగా ఉంటేనే  భుజించ తగినదవుతుంది.  ‘అనుయాగం విధాయచ ‘  అని వుండుట చేత మామునులు ముందు   శ్రీవైష్ణవులకు తదీయారాధన చేసిన తరువాత తాము భుజించుట గమనించ తగినది. భగవంతునికి నివేదన చేసిన తరువాత,  భగవంతుడి శేష ప్రసాదము రుచి, వాసన పెరిగి , పవిత్రమైనదై , మెత్తగా , మనో వికల్పాలను తొలగించేది అయిన ప్రసాదముతో ముందుగా శ్రీవైష్ణవులను తృప్తి పరచి,  తరువాత తాము స్వీకరించే వారని ఎరుంబియప్పా మామునుల చరిత్రలో రాసిన విషయమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.  ‘మాం ‘… దాసుడిని….అనగా ఎరుంబియప్పాను గతములో మామునులు తమ మఠములో   తదీయారాధన స్వీకరింపుమని కోరినప్పుడు,  ‘ యతి పెట్టిన అన్నము,  యతి శేషమును స్వీకరించరాదన్న సామాన్య సూత్రముననుసరించి నిరాకరించారు.  ఇప్పుడు  సద్భుధ్ధి కలుగుట వలన  అవైష్ణవ యతుల అన్నమును భుజించరాదని తెలుసుకొని మామునుల శేషమును మహా ప్రసాదముగా స్వీకరించుట  ఉన్నతముగా భావించారు.   ‘ పశ్యంతం భావయామి ‘ తమను సరిదిద్ది ఎప్పుడూ తమపై అపారమని కటాక్షమును కురిపించుచున్న మామునులను  ధ్యానిస్తున్నాను అంటున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-29/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment