ఆళ్వార్/ఆచార్య వాళి తిరునామాలు – మధురకవి ఆళ్వార్ – సరళ వివరణ

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక 

<< నమ్మాళ్వార్

మధురకవి ఆళ్వార్లు ఆళ్వార్ తిరునగరి సమీపంలోని తిరుక్కోళూర్ దివ్య దేశంలో జన్మించారు. ఆయన చైత్ర మాసంలో, చిత్తా నక్షత్రం నాడు  అవతరించారు.  వారు 11 పాశురాలతో కూడిన “కణ్ణినుణ్ శిరుత్తాంబు” అనే అద్భుతమైన ప్రబంధాన్ని రచించారు.  వారు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల సేవలోనే పూర్తిగా నిమగ్నమైపోయారు. ఆచార్య భక్తికి  ఒక పరిపూర్ణ నిదర్శనంగా ఎలా ఉండాలో ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు.

మధురకవి ఆళ్వార్ల యొక్క వాళి తిరునామములు:

చిత్తిరైయిల్ చిత్తిరై నాళ్ సిఱక్క వందోన్ వాళియే

తిరుక్కోళూర్ అవదరిత్త సెల్వనార్ వాళియే

ఉత్తర గంగా తీరత్తు ఉయర్ తవత్తోన్ వాళియే

ఒళి కదిరోన్ తెఱ్కు ఉదిక్క ఉగందు వందోన్ వాళియే

పత్తియొడు పదినొన్ఱుమ్ పాడినాన్ వాళియే

పరాంగుశనే పరన్ ఎన్ఱు పత్తినాన్ వాళియే

మత్తిమమామ్ పదప్ పొరుళై వాళ్విత్తాన్ వాళియే

మధురకవి తిరువడిగళ్ వాళి వాళి వాళియే

మధురకవి ఆళ్వార్ యొక్క వాళి తిరునామములు – సరళ వివరణ:

చిత్తిరైయిల్ చిత్తిరై నాళ్ సిఱక్క వందోన్ వాళియే

మధురకవి ఆళ్వార్ల జన్మ నక్షత్రం చైత్ర మాసంలోని చిత్తా నక్షత్రం. ఆయన జన్మించడం వల్లే ఈ చిత్తా నక్షత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా కీర్తించబడింది. అటువంటి మధురకవి ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

తిరుక్కోళూర్ అవదరిత్త సెల్వనార్ వాళియే

మధురకవి ఆళ్వార్ల అవతార స్థలం తిరుక్కోళూర్ దివ్యదేశం – ఇక్కడి పెరుమాళ్ళ తిరునామం శ్రీ వైత్తమానిధి పెరుమాళ్. కైంకర్యశ్రీ (భగవత్ సేవ అనే అత్యున్నత సంపద) మరియు ఆచార్య భక్తిని కలిగి ఉన్నందున ఈ ఆళ్వార్లను “సెల్వనార్” (మహా సంపన్నులు) అని పిలుస్తారు. అటువంటి ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

ఉత్తర గంగా తీరత్తు ఉయర్ తవత్తోన్ వాళియే

మధురకవి ఆళ్వార్లు భారత దేశంలోని ఉత్తర ప్రాంతాలలో అనేక సంవత్సరాలు నివసించారు మరియు పవిత్ర గంగా నది తీరాన వారు తపస్సు ఆచరించినట్లు ప్రతీతి. అటువంటి మధురకవి ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)! 

ఒళి కదిరోన్ తెఱ్కు ఉదిక్క ఉగందు వందోన్ వాళియే

మధురకవి ఆళ్వార్లు ఉత్తర భారత భూభాగంలో కైంకర్యం చేస్తూండగా, దక్షిణ దిశ నుండి ప్రసరించిన ఒకానొక దివ్య తేజస్సు వారిని సమ్మోహితుల్ని చేసింది. అమితమైన ఉత్సుకతతో, ఆ కాంతిని అనుసరిస్తూ వారు దక్షిణాపథం వైపు పయనమయ్యారు. అలా తిరుక్కురుగూర్ క్షేత్రంలోని ఒక పవిత్ర చింత వృక్షాన్ని చేరుకోగా, ఆ దివ్య జ్యోతి మరేదో కాదు –  యోగ సమాధిలో మునిగి ఆ వృక్షమూలాన ఆసీనులైన నమ్మాళ్వార్ల నుండే ఉద్భవిస్తున్నదని వారు గ్రహించారు. అప్పుడు మధురకవి ఆళ్వార్లు ఆ యోగివర్యులను ఉద్దేశించి, ‘శెత్తదిన్ వయిరిల్ శిఱియదు పిఱందాల్, ఎత్తై తిన్ఱు ఎంగే కిడక్కుమ్’ (అచేతనమైన ఈ దేహంలో అణుస్వరూపమైన జీవాత్మ ప్రవేశిస్తే, అది దేనిని అనుభవిస్తూ ఎక్కడ నివసిస్తుంది?) అని ప్రశ్నించారు. అందుకు నమ్మాళ్వార్లు తమ ప్రథమ వచనాన్ని పలుకుతూ, ‘అత్తై తిన్ఱు అంగేయే కిడక్కుమ్’ (ఆ జీవాత్మ దేహగత సుఖదుఃఖాలనే భుజిస్తూ, ఆ శరీరంలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది) అని ప్రత్యుత్తరమిచ్చారు. ఈ జ్ఞానోపదేశానికి పరమానందభరితులైన మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్లను పరమ జ్ఞానిగా గుర్తించి వారి చరణారవిందాలను ఆశ్రయించారు. నాటి నుండి తమ ఆచార్యులకు సర్వవిధ కైంకర్యాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్నారు. ఆ విధంగా సూర్యకాంతి వలె దక్షిణ దిక్కు నుండి వీచిన దివ్య జ్యోతికి ఆకర్షితులై, తమ పరమాచార్యులను కనుగొన్న మధురకవి ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

పత్తియొడు పదినొన్ఱుమ్ పాడినాన్ వాళియే

మధురకవి ఆళ్వార్ అత్యంత భక్తిప్రపత్తులతో 11 పాశురములతో కూడిన ‘కణ్ణినుణ్ శిరుత్తాంబు’ అనే దివ్య ప్రబంధాన్ని రచించారు. సాధారణంగా చాలా దివ్యదేశాలలో దివ్యప్రబంధ సేవాకాలం పెరియాళ్వార్ అనుగ్రహించిన ‘తిరుప్పల్లాండు’తో ప్రారంభమవుతుంది. కానీ, నమ్మాళ్వార్ల అవతార స్థలమైన ‘ఆళ్వార్ తిరునగరి’లో మాత్రం, ఈ సేవాకాలం ‘కణ్ణినుణ్ శిరుత్తాంబు’ తోనే మొదలవుతుంది.  భగవంతుడైన ఆ ఎంపెరుమానార్‌ను సేవించడానికి ముందే, ఒక నిజమైన భక్తుడు తన ఆచార్యునికి దాసోహములు అనాలని (విధేయుడై ఉండాలని) మధురకవి ఆళ్వార్ ఈ ప్రబంధం ద్వారా నొక్కి చెప్పారు.  పెరుమాళ్ళ యొక్క శ్రీచరణాలను ఆశ్రయించడానికి అత్యంత సులువైన, నిశ్చయమైన మార్గం మన ఆచార్యుని పట్ల నిష్కల్మషమైన భక్తి, శరణాగతి కలిగి ఉండటమేనని మన పూర్వాచార్యులు సైతం నిరూపించారు. మధురకవి ఆళ్వార్‌ తన ఆచార్యులైన నమ్మాళ్వార్లపై గల అనన్య భక్తితో, కేవలం ఆయనను కీర్తిస్తూనే ఈ 11 పాశురాలను రచించి గానం చేశారు.  ఇటువంటి మహోన్నతమైన మధురకవి ఆళ్వార్ల కీర్తి ఆచంద్రార్కముగా వర్ధిల్లుగాక (పల్లాండు)!

పరాంగుశనే పరన్ ఎన్ఱు పత్తినాన్ వాళియే

నమ్మాళ్వార్లకు శఠకోపన్, పరాంకుశన్ వంటి ఇతర తిరునామాలు (పేర్లు) కలవు. ‘అంకుశం’ అంటే ఏనుగును అదుపు చేయడానికి మావటివాడు ఉపయోగించే సాధనం. నమ్మాళ్వార్ తన దివ్య ప్రబంధమైన ‘తిరువాయిమొళి’ అనే అంకుశంతో ఆ పెరుమాళ్ళనే తన భక్తిపాశంతో వశం చేసుకున్నారు. అందుకే ఆయనకు ‘పరాంకుశన్’ అనే తిరునామం సార్థకమైంది.  మన పూర్వాచార్యులు ఈ నామానికి మరొక అద్భుతమైన భావాన్ని కూడా అందించారు. నమ్మాళ్వార్ తన ప్రబంధాల ద్వారా వేదాల యొక్క గూఢార్థాలను జగత్తుకు ప్రకటించారు; ఆ దివ్య జ్ఞానంతో పరమతాలను, అన్య సిద్ధాంతాలను ఖండించి, వాటి అనుయాయులకు సన్మార్గాన్ని చూపించారు. ఈ కారణంగా కూడా ఆయనను ‘పరాంకుశన్’ అని పిలుస్తారు.మధురకవి ఆళ్వార్ అటువంటి పరాంకుశులైన తన ఆచార్యులనే సర్వస్వముగా భావించి, కేవలం ఆ నమ్మాళ్వార్ల శ్రీచరణాలనే గట్టిగా ఆశ్రయించారు. ఇటువంటి మహోన్నతమైన మధురకవి ఆళ్వార్ల కీర్తి ఆచంద్రార్కముగా వర్ధిల్లుగాక (పల్లాండు)!

మత్తిమమామ్ పదప్ పొరుళై వాళ్విత్తాన్ వాళియే

అత్యంత విశిష్టమైన మంత్రాలలో ‘తిరుమంత్రం’ (అష్టాక్షరీ మంత్రం) పరమ పవిత్రమైనది. ఇందులో ప్రణవం, నమః, నారాయణాయ అనే మూడు పదాలు ఉన్నాయి. వీటిలో మధ్యమ పదం ‘నమః’. మధురకవి ఆళ్వార్ ఈ ‘నమః’ అనే పదం యొక్క పరమార్థాన్ని తమ జీవితాంతం ఆచరించి చూపించారు. ‘నమః’ అంటే “నేను నా కొరకు కాదు” (నా స్వార్థం కొరకు కాదు) అని భావం. ‘మః’ అంటే “నేను నా కొరకే జీవిస్తున్నాను” అని అర్థం; ‘నమః’ ఆ భావాన్ని పూర్తిగా నిరసిస్తూ, జీవాత్మ తన స్వార్థం కోసం బ్రతకడం లేదని స్పష్టం చేస్తుంది. అంటే, ఒక జీవాత్మ తన సొంత సుఖాల కోసమో లేదా ఇతరుల కోసమో కాక, కేవలం ఆ పెరుమాళ్ళ యొక్క  కైంకర్యం (సేవ) కోసమే జన్మించిందని దీని అంతరార్థం.  భగవంతుని కొరకే జీవించడం అంటే, ఆయన పరమ భక్తులైన భాగవతులకు దాసోహమనడమే! ఎందుకంటే, ఒక జీవాత్మ యొక్క నిజమైన స్వరూపానికి (స్వభావానికి) ఇదే పరమావధి. జీవాత్మ స్వరూపంలో మొదటి మెట్టు భగవంతునికి విధేయుడై ఉండటం, అయితే ఆ స్వరూపానికి ఆఖరి మరియు అత్యున్నతమైన శిఖరం భగవద్భక్తులకు దాసుడై ఉండటం. వీటినే సంప్రదాయంలో వరుసగా ‘ప్రథమ పర్వం’, ‘చరమ పర్వం’ అని పిలుస్తారు. మధురకవి ఆళ్వార్ నేరుగా ఆ భగవంతుని కంటే, భగవద్స్వరూపులైన నమ్మాళ్వార్లకే లొంగి ఉంటూ, ఈ ‘చరమ పర్వ’ నిష్ఠకు నిలువెత్తు రూపంగా జీవించారు. తిరుమంత్రం నడిమధ్యలో ఉన్న ‘నమః’ పద శబ్ధానికి అంతరార్థం ఈ జగత్తుకు ఇంతలా అవగతమైందంటే, దానికి కారణం మధురకవి ఆళ్వార్లకు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్లపై గల అనన్య భక్తే! ఇటువంటి మహోన్నతమైన మధురకవి ఆళ్వార్ల కీర్తి చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

మదురకవి తిరువడిగళ్ వాళి వాళి వాళియే

మధురకవి ఆళ్వార్ల యొక్క ‘వాళి తిరునామమ్’ వారి దివ్య శ్రీచరణాల వైభవాన్ని కీర్తిస్తూ ముగుస్తుంది! అటువంటి ఆళ్వార్ల పవిత్ర మైన శ్రీచరణాలు రాబోవు మరెన్నో యుగాల వరకు వర్ధిల్లుగాక (పల్లాండు)

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి 

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org