శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః
<< వడక్కు తిరువీధిప్పిళ్ళై వైభవం

పిళ్ళై లోకాచార్యులు– శ్రీరంగం
పిళ్ళై లోకాచార్యులను మన పూర్వాచార్యులు పరమ కారుణికర్ (అత్యంత కరుణామయులు) అని ఘనంగా వర్ణించారు. వారి అవతార చరిత్ర మనకు తెలిసిందే. పిళ్లై లోకాచార్యులు శ్రీరంగంలో, వడక్కుత్తిరువీధిప్పిళ్లై వారి పెద్ద కుమారునిగా అవతరించారు. వడక్కుత్తిరువీధిప్పిళ్లై, తన ఆచార్యులైన నంపిళ్లై వారి తిరునామమే తన కుమారునికి పెట్టి, ఆయనకు “లోకాచార్యర్ (లోకాచార్యులు)” అని నామకరణం చేశారు. వడక్కుత్తిరువీధిప్పిళ్లై, రామానుజులు ఏర్పాటు చేసిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన ముడుంబై నంబి వంశానికి చెందినవారు. అందుకే మణవాళ మామునులు, ఉపదేశరత్నమాలైలో పిళ్ళై లోకాచార్యులను “ముడుంబై అణ్ణల్ ఉలగారియన్” అని అంటారు అంటే ముడుంబై నగరానికి అధిపతియైన లోకాచార్యులు అత్యంత మంగళప్రదమైన స్వామి అని సంభోధించారు. పిళ్ళై లోకాచార్యుల తిరునక్షత్రం ఆశ్వయుజ మాసంలో, శ్రవణా నక్షత్రం నాడు. మన పూర్వాచార్యులు చూపించిన రహస్యార్థాలను, ఆయన పద్దెనిమిది రహస్య గ్రంథాల రూపంలో మనకు అనుగ్రహించారు. రహస్యార్థాలను ఇంత విపులంగా మొదటిసారిగా తాళపత్రాలపై లిఖించినవారు కూడా ఆయనే. అందుకే ఆయనను పరమ కారుణికర్ అని అంటారు.
పూర్వకాలంలో, ఆచార్యులు ఈ రహస్యార్థాలను తమ శిష్యులకు మాత్రమే ఉపదేశించేవారు. అవి ఆచార్య–శిష్య పరంపరలోనే పరిమితమయ్యేవి. కానీ పిళ్ళై లోకాచార్యులు, తమ అపార కరుణ వల్ల, రహస్యత్రయం, సంప్రదాయార్థాలు మరియు తత్వత్రయం విషయాలను వర్గీకరించి, అందరికీ ఉజ్జీవన మార్గం చూపేలా రహస్య గ్రంథాలుగా లిఖించారు. పిళ్ళై లోకాచార్యులు నైష్ఠిక బ్రహ్మచార్యం పాటించారు. లౌకిక విషయాలన్నింటి నుండి విరక్తి కలిగి ఉండి, శతాబ్దానికి పైగా వారు ఈ భూమండలం మీద జీవించారు.సంప్రదాయ వికాసం కోసం, అనేక గ్రంథాల రచన కోసం తమ జీవితాన్ని ధారపోసారు.
ఆయన జీవించి ఉన్న కాలంలో, మొఘలులు శ్రీరంగాన్ని ముట్టడించారు. అర్చావతారంలో (విగ్రహ రూపంలో), ఎంపెరుమాన్ (భగవంతుడు) తనను తాను రక్షించుకోవడానికి తన ‘అర్చా సమాధిని’ (మౌన/ధ్యాన స్థితిని) వీడడు. ఎంపెరుమాన్ తన అర్చా సమాధిని (మౌన స్థితిని) వీడి, కేవలం అరుదైన సందర్భాలలో మాత్రమే తన పరమ భక్తులతో చాలా కొన్ని మాటలు పలికారు. ఆయన పరమశక్తిమంతుడైనప్పటికీ (సర్వశక్తిమంతుడు), అర్చావతారంలో అశక్తుడిలా (శక్తి లేనివాడిలా) కనిపించే గొప్పదనాన్ని ఎంపెరుమాన్ కలిగి ఉన్నారు.
దాడి సమయంలో, భక్తులు పెరియ పెరుమాళ్ ముందు రాతి గోడ కట్టి, నంపెరుమాళ్‌ను తీసుకెళ్లారు. పిళ్ళై లోకాచార్యుల నాయకత్వంలో నంపెరుమాళ్ అనేక దివ్యదేశాలను సంచరించి, 48 సంవత్సరాల తరువాత తిరిగి శ్రీరంగానికి చేరాడు. వృద్ధాప్యంలో కూడా, పిళ్ళై లోకాచార్యులు నంపెరుమాళ్‌ను మధురై సమీపంలోని జ్యోతిష్కుడి (కొడిక్కుళం) వరకు తీసుకెళ్లి అపారమైన బాధ్యతతో రక్షించారు. అక్కడే వారు పరమపదించారు. వారి జీవితం మొత్తం ఎంపెరుమాన్ కోసం గడిపారు.
అంతేకాకుండా, శ్రీవచన భూషణం అవతారికైలో, మణవాళ మామునులు పిళ్ళై లోకాచార్యులను దేవప్పెరుమాళ్ (కాంచీపురం వరదరాజ పెరుమాళ్) అవతారంగా కీర్తించారు. ఆయన తనియన్ (ప్రార్థనా శ్లోకం) లో, సంసారమనే (ఐహిక జీవితమనే) సర్పం కాటుకు గురైన వారికి ఆయన ఒక అరుదైన ఔషధం లాంటివారని చూపబడింది.
పిళ్ళై లోకాచార్యుల వాళి తిరునామములు:
అత్తిగిరి అరుళాళర్ అనుమదియోన్ వాళియే
ఐప్పసియిల్ తిరువోణత్తవతరిత్తాన్ వాళియే
ముత్తినెఱి మఱైత్తమిళాల్ మొళిందరుళ్వోన్ వాళియే
మూదరియ మణవాళన్ మున్బుదిత్తాన్ వాళియే
నిత్తియం నంపిళ్ళైపదం నెంజిల్ వైప్పోన్ వాళియే
నీళ్ వచన భూడణత్తాల్ నియమిత్తాన్ వాళియే
ఉత్తమమాం ముడుంబై నగర్ ఉదిత్తవళ్ళల్ వాళియే
ఉలగారియన్ పదంగళ్ ఊళితొరుం వాళియే
పిళ్ళై లోకాచార్యులు వాళి తిరునామం – సరళ వ్యాఖ్యానం
అత్తిగిరి అరుళాళర్ అనుమదియోన్ వాళియే
అత్తిగిరి అంటే కాంచీపురం. కాంచీపురం వరదరాజ పెరుమాళ్, కాంచీపురం సమీపంలోని మనప్పాక్కం గ్రామంలో నివసించే ఒక ఆర్చకుడి (పూజారి) స్వప్నంలో ప్రత్యక్షమై, కొన్ని ఉపదేశాలు అనుగ్రహించారు. ఎంపెరుమాన్ ఆ ఉపదేశాన్ని మధ్యలోనే ఆపివేయగా, ఆర్చకుడు విచారంతో మిగిలిన ఉపదేశాన్ని కూడా అనుగ్రహించమని ప్రార్థించాడు. అప్పుడు పెరుమాళ్ళు ఇలా అన్నారు “నీవు శ్రీరంగానికి రా. మిగిలిన ఉపదేశాన్ని అక్కడ నేను నీకు అనుగ్రహిస్తాను.” అని చెప్పి అదృశ్యమయ్యాడు. మణప్పాక్కత్తు నంబి శ్రీరంగం చేరుకుని, కాట్టళగియ సింగర్ సన్నిధిలో ఒక ఆచార్యులు కాలక్షేపం (ప్రవచనం) ఇస్తుండటం చూశారు. ఆయన ఎంతో శ్రద్ధగా వినడం ప్రారంభించారు. ఆ ఆచార్యులు తన శిష్యులకు చేస్తున్న ఉపదేశాన్ని విని మణప్పాక్కత్తు నంబి ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే, అది గతంలో కాంచీపురంలో దేవప్పెరుమాళ్ (శ్రీ వరదరాజ స్వామి) తనకు అనుగ్రహించిన ఉపదేశానికి కొనసాగింపుగా ఉంది! ఆ కాలక్షేపం చెబుతున్నది మరెవరో కాదు, శ్రీ పిళ్ళై లోకాచార్యుల వారేనని ఆయన గ్రహించారు. కాంచీపురంలో దేవప్పెరుమాళ్ తనకు ఇచ్చిన ఉపదేశం యొక్క కొనసాగింపు శ్రీరంగంలోని ఈ ఆచార్యునికి ఎలా తెలిసిందోనని ఆశ్చర్యపోతూ, మణప్పాక్కత్తు నంబి ఆ గోష్ఠిలోకి ప్రవేశించి, సాష్టాంగ దండప్రణామం చేసి, పిళ్ళై లోకాచార్యులను “అవరో నీర్?” (ఆయన మీరేనా? — అంటే ఆ ఎంపెరుమాన్ మీరేనా ?) అని ప్రశ్నించారు. దానికి పిళ్ళై లోకాచార్యులు ప్రసన్న వదనంతో “ఆవదు ఏదు?” (అవును, ఇప్పుడు ఏమి చేయాలి?) అని బదులిచ్చారు.ఈ సంఘటన ద్వారా మనం గ్రహించ గలిగేది ఏమిటంటే – పిళ్ళై లోకాచార్యుల వారు దేవప్పెరుమాళ్ యొక్క పరమ కృపతో అవతరించిన సాక్షాత్తు ఆ భగవత్స్వరూపమేనని మనకు వ్యక్తమవుతోంది. దేవప్పెరుమాళ్ యొక్క పూర్ణ అనుగ్రహాన్ని పొందిన శ్రీ పిళ్ళై లోకాచార్యుల వారు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ఐప్పసియిల్ తిరువోణత్తవతరిత్తాన్ వాళియే
ఆశ్వయుజ మాసం, శ్రవణ నక్షత్రంలో అవతరించిన పిళ్ళై లోకాచార్యులు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ముత్తినెఱి మఱైత్తమిళాల్ మొళిందరుళ్వోన్ వాళియే
ముక్తి మార్గాన్ని చూపించే వేదాలతో సమానంగా, ఆయన మనకు తమిళ భాషలో అనుగ్రహించిన రహస్య గ్రంథాలు ఎంతో విశిష్టమైనవిగా భావించబడతాయి. అంతటి ఉన్నతమైన రహస్య గ్రంథాలను మనకు ప్రసాదించిన శ్రీ పిళ్ళై లోకాచార్యుల వారు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
మూదరియ మణవాళన్ మున్బుదిత్తాన్ వాళియే
అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ గారికి తమయ్యనార్ (అన్నయ్య)గా అవతరించిన పిళ్ళై లోకాచార్యులు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
అళగియ మణవాళపెరుమాళ్ నాయనార్ కూడా నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండి, వారి అన్నయ్యలాగే శ్రీవైష్ణవ సంప్రదాయ వికాసానికి అపారమైన సేవ చేశారు. ఆయన రచించిన అద్భుత గ్రంథం “ఆచార్య హృదయం”లో, నమ్మాళ్వార్ వారి తిరువుళ్లం (మనసులో భావం, అంతరార్థం)ను
అత్యంత స్పష్టంగా వివరించారు. అదేవిధంగా, కణ్ణినుణ్ శిరుత్తాంబు, తిరుప్పావై, అమలనాదిపిరాన్ వంటి ప్రబంధాలకు కూడా వ్యాఖ్యానాలు రచించారు.
అళగియ మణవాళపెరుమాళ్ నాయనార్, పిళ్లై లోకాచార్యర్ కంటే కొద్దికాలం ముందే పరమపదానికి (తిరునాడు) చేరారు. ఆ సమయంలో, పిళ్లై లోకాచార్యర్ ఆయన చరమ తిరుమేనిని (చివరి దివ్య శరీరాన్ని) తన మోకాలిపై ఉంచుకుని, విషాదంతో ఇలా అన్నారు: “గీతా చరమశ్లోకార్థాన్ని ఇంత అద్భుతంగా ఇంకెవరు వివరించగలరు? ఇలా నీవు పరమపదానికి వెళ్లిపోయావా!” అంతటి జ్ఞానవంతులైన పిళ్లై లోకాచార్యర్ కూడా తమ్ముడు యొక్క వియోగంతో దుఃఖించారు .అళగియ మణవాళపెరుమాళ్ నాయనార్ గారి గొప్పతనం అటువంటిది.సాధారణంగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎవరైనా పరమపదానికి చేరితే దుఃఖించకూడదని పెద్దలు ఉపదేశిస్తారు. ఎందుకంటే ఆత్మకు అక్కడ లభించే ఆనందం, ఎంపెరుమాన్ ఇచ్చే స్వాగతం — ఇవన్నీ మహోన్నతమైనవి.అయితే, లోకం వారిని కోల్పోయినందుకు సహజంగానే బాధపడుతుంది. ఇంకో ఉదాహరణ — కూరత్తాళ్వాన్ పరమపదానికి చేరినప్పుడు, అన్ని తెలిసిన రామానుజాచార్యులే దుఃఖంతో కన్నీరు పెట్టుకున్నారు. అందువల్ల, మహా భక్తులు లోకాన్ని విడిచిపోతే, ఎంత జ్ఞానవంతులైనా వారి వియోగం హృదయాన్ని తాకుతుంది. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అళగియ మణవాళపెరుమాళ్ నాయనార్ గారికి అన్నయ్యగా అవతరించిన పిళ్లై లోకాచార్యర్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
నిత్తియం నంపిళ్ళైపదం నెంజిల్ వైప్పోన్ వాళియే
తమ తండ్రి యొక్క ఆచార్యులైన నంపిళ్ళై గారి దివ్య చరణాలను నిరంతరం తన హృదయంలో ఉంచుకుని ఆరాధించే మన పిళ్ళై లోకాచార్యులు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
నంపిళ్లై గారి కాలక్షేపాలను వడక్కుత్తిరువీడిప్పిళ్లై తాళపత్రాలపై లిఖించిన విషయం మనకు తెలిసిందే. ఆయన కుమారులు — పిళ్లై లోకాచార్యర్ మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ తండ్రి ద్వారా నంపిళ్లై వారి కాలక్షేపార్థాలను చిన్ననాటి నుంచే నేర్చుకున్నారు. తరువాత, పిళ్లై లోకాచార్యర్ మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ తమ గ్రంథాలలో నంపిళ్లై గారి కాలక్షేపంలో చెప్పబడిన విషయాలను విస్తృతంగా, స్పష్టంగా, సంపూర్ణంగా వివరించారు. అందువల్ల, నంపిళ్లై మహిమను తన హృదయంలో నిత్యం ధ్యానిస్తూ, ఆయన దివ్య తిరువడిని నిత్యం పూజించే పిళ్లై లోకాచార్యర్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
నీళ్ వచన భూడణత్తాల్ నియమిత్తాన్ వాళియే
పిళ్లై లోకాచార్యలు , నంపిళ్లై గారి కాలక్షేపంలో విన్న వ్యాఖ్యానాల ఆధారంగా శ్రీవచనభూషణంలో అన్ని వివరాలను సమగ్రంగా అందించారు. శ్రీవచనభూషణమును మన పూర్వాచార్యులు “దివ్య శాస్త్రం” అని ఘనంగా పిలుస్తారు. ఆయన రచించిన పద్దెనిమిది గ్రంథాలలో ముముక్షుప్పడి, తత్వత్రయం, మరియు శ్రీవచనభూషణం అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. మన పూర్వాచార్యులు ఈ గ్రంథాలను కాలక్షేపం రూపంలో వినిపించేందుకు ఏర్పాట్లు చేశారు.
పిళ్లై లోకాచార్యలు, పూర్వాచార్యుల శ్రీసూక్తులు (పవిత్రమైన ఉపదేశ వాక్యాల)ను అద్భుతంగా సమన్వయపరచి, మనకు శ్రీవచనభూషణం అనే మహాగ్రంథాన్ని అనుగ్రహించారు. ఈ గ్రంథంలో “ఆచార్య అభిమానమే ఉద్ధారకం”, అని చెప్పబడింది.అంటే మోక్షం (ఉద్ధారం) అనేది తన ఆచార్యుని కృప ద్వారానే లభిస్తుంది అని నొక్కి చెప్పబడింది. అందువల్ల, శ్రీవచనభూషణం ద్వారా శ్రీవైష్ణవుల ఆచరణ మార్గాన్ని స్థిరపరిచిన పిళ్లై లోకాచార్యర్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ఉత్తమమాం ముడుంబై నగర్ ఉదిత్తవళ్ళల్ వాళియే
ఇక్కడ నగర్ అంటే వంశముగా అర్థం చేసుకోవచ్చు. ఎంపెరుమానారుల శిష్యులైన ముడుంబై నంబి వంశంలో అవతరించారని మనకు తెలుసు.ఇటువంటి గొప్ప వంశములో అవతరించి, తమ గ్రంథముల ద్వారా సంసారులకు ఉజ్జీవన మార్గం (మోక్ష మార్గం)చూపిన పిళ్ళై లోకాచార్యులు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ఉలగారియన్ పదంగళ్ ఊళితొరుం వాళియే
ఉలగారియన్ అనగా పిళ్ళై లోకాచార్యులు. వారి వాళి తిరునామములు ఉలగారియన్ల తిరువడి వైభవం ఎల్లకాలం శాశ్వతమై ఉండుగాక (పల్లాండు) అనే ఈ పదంతో ముగుస్తుంది.
ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలం: https://divyaprabandham.koyil.org/index.php/2026/01/vazhi-thirunamams-pillailokacharya-simple/
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org CategoriesOther, telugu, vAzhithirunAmams