ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – ఎంబార్ వాళి తిరునామ వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక

<< శ్రీ రామానుజ వాళి తిరునామ వైభవం

ఎంబార్, శ్రీ రామానుజులకు పినతల్లి కుమారుడు. రామానుజుల తల్లి, ఎంబార్ తల్లి — ఇద్దరూ సోదరీమణులు. ఎంబార్ అసలు పేరు గోవింద పెరుమాళ్. వారి జన్మస్థలం మధుర మంగళం (మళలై మంగళం అని కూడా పిలుస్తారు), ఇది శ్రీపెరుంబుదూరుకు సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం.  గోవింద పెరుమాళ్ పునర్వసు (పునర్పూసం) నక్షత్రం నాడు , పుష్య (తై) మాసంలో జన్మించారు.

ఎంబార్ మనకు ప్రసాదించిన గ్రంథాలు- విజ్ఞాన స్తుతి మరియు ఎంపెరుమానార్ వడివళగు పాశురం (“పర్పమెనత్ తిగళ్ పైన్గళళుం…” తో ప్రారంభమయ్యే రామానుజుల రూప మాధుర్య స్తుతి).  గోవింద పెరుమాళ్ళను రామానుజుల దివ్య తిరువడి నీడగా పరిగణిస్తారు. అందుకే వారి తనియన్లో కూడా వారిని “రామానుజ పదచ్ఛాయా” అని పిలుస్తారు. భగవద్విషయంలోని గంభీరమైన అర్థాలను అనుభవించి, ఆనందించి, వాటిని ఇతరులకు వివరించే స్వభావం ఆయనకు ఉండేది . ఆయన లౌకిక విషయాల నుండి పూర్తిగా విరక్తుడై ఉండేవారు. లౌకిక విషయాలపై వారికి అణువంత కూడా ఆసక్తి ఉండేది కాదు.  అలాగే, రామానుజులను ప్రాణాపాయం నుండి రక్షించిన ఘనత కూడా ఆయనదే.  ఇళయాళ్వార్ (రామానుజులు) మరియు గోవింద పెరుమాళ్ (ఎంబార్) యాదవప్రకాశుల వద్ద విద్యాభ్యాసం చేస్తుండగా, యాదవప్రకాశులు మరియు వారి శిష్యులు ఇళయాళ్వార్ యొక్క ప్రతిభను చూసి అసూయపడే వారు. వారిని కాశీ యాత్రకు తీసుకెళ్లి, గంగలో ముంచి చంపాలని కుట్ర పన్నారు.  ఆ సమయంలో గోవింద పెరుమాళ్, ఇళయాళ్వార్‌కు  “దేవర వారు , ఇక్కడ ఉండకండి. వీరు మిమ్మల్ని అంతమొందించాలని యోచిస్తున్నారు.”  అని చెప్తారు . ఇళయాళ్వార్ కూడా కాంచీపురానికి తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకుంటారు.  దేవ పెరుమాళ్ళు మరియు పెరుందేవి తాయార్ ఆయనకు సహచరులుగా ఉండి , వారిని కాంచిపురానికి మార్గదర్శకత్వం చేశారు.

గోవింద పెరుమాళ్ యాదవప్రకాశకులతో కాశీకి వెళ్లినప్పుడు, గంగలో స్నానం చేస్తుండగా, భగవత్సంకల్పం ప్రకారం ఒక లింగం ఆయన చేతిలో ప్రత్యక్షమైంది. యాదవప్రకాశర్ “ఇది రుద్రుని అనుగ్రహం. ఇకమీదట నువ్వు రుద్రుని యొక్క భక్తుడవ్వాలి.”   అని చెప్పారు.  మనసులో కలత చెందిన గోవింద పెరుమాళ్, కాళహస్తికి వెళ్లి కొంతకాలం శివ భక్తుడుగా ఉన్నారు.కాలం గడిచిపోయింది.

ఇళయాళ్వార్ సన్యాసం స్వీకరించి రామానుజులుగా  శ్రీరంగంలో ఉన్నప్పుడు, గోవింద పెరుమాళ్ భగవత్ కైంకర్యంలో తనకు గొప్ప సహాయకులుగా  ఉంటారని  భావించి, తన మేనమామ అయిన పెరియ తిరుమలై నంబి గారిని,  గోవింద పెరుమాళ్‌ను తిరిగి సంప్రదాయంలోకి తీసుకురమ్మని కోరగా!! శివభక్తుడైన గోవిందప్పెరుమాళ్‌ను సంస్కరించి, తిరిగి తీసుకురావడానికి పెరియ తిరుమలై నంబి కాళహస్తికి వెళ్ళి, గోవిందప్పెరుమాళ్‌కు ఉపదేశాలు చేసి, ఆయనను శ్రీవైష్ణవ సంప్రదాయానికి మరల్చారు. పెరియ తిరుమలై నంబి గారు గోవింద పెరుమాళ్‌కు పంచ సంస్కారం చేయించి, ఆయనకు ఆచార్యులుగా వ్యవహరించి, ఆయనను శిష్యులుగా చేరదీశారు. పెరియ తిరుమలై నంబి పట్ల గోవిందప్పెరుమాళ్‌కు అపారమైన కృతజ్ఞతాభావం కలిగింది. అందువల్ల పెరియ తిరుమలై నంబి గారికి కైంకర్యం చేయడాన్ని గోవింద పెరుమాళ్ గొప్ప భాగ్యం (పేరు)గా ,ఆచార్య కైంకర్యం తన జీవిత పరమార్థంగా భావించారు.

ఆ సమయంలో శ్రీ రామానుజులు తిరుమల తిరుపతి వచ్చి  ఒక సంవత్సరం పాటు పెరియ తిరుమలై నంబి గారి వద్ద శ్రీరామాయణ కాలక్షేపం విన్నారు. కాలక్షేపం పూర్తి అయిన తరువాత, రామానుజుల వారు శ్రీరంగానికి బయలుదేరడాని సిద్ధమయినప్పుడు,తనతో పాటు ఉన్న గోవిందప్పెరుమాళ్‌ను రామానుజులతో శ్రీరంగానికి వెళ్లి భగవత్ కైంకర్యంలో నిమగ్నమవ్వమని పెరియ తిరుమలై నంబి గారు ఆదేశించారు.

గోవిందప్పెరుమాళ్‌కు తన ఆచార్యుడైన పెరియ తిరుమలై నంబిని విడిచి వెళ్లాలని లేకపోయినా, ఆచార్య ఆజ్ఞను మీరడానికీ మనసొప్పక, రామానుజులతో కలిసి వెళ్ళారు.దారిలో, ఆచార్య వియోగంతో దుఃఖించి వాడిపోయిన ఆయనను చూసి, రామానుజులు ‘కొంతకాలం తిరుపతిలో పెరియ తిరుమలై నంబి గారితో ఉండి, తరువాత రా’ అని చెప్పి ఆయనను వెనక్కి పంపించారు.

గోవింద పెరుమాళ్ తమ ఆచార్యుల వద్దకు తిరిగి వెళ్లినప్పుడు, పెరియ తిరుమలై నంబి —  “మేము నిన్ను ఇప్పటికే రామానుజులకు అప్పగించాం; ఇకపై నిన్ను మేము స్వీకరించలేము అని అన్నారు. అప్పుడు గోవింద పెరుమాళ్ తమ ఆచార్యుల యొక్క దివ్య తిరువుళ్ళమును గ్రహించి , రామానుజుల వద్దకు తిరిగి వెళ్ళారు.  ఆయన రామానుజుల వారికి ఎంతో ఆనందంతో కైంకర్యం చేయసాగారు అని వారి పూర్తి చరిత్ర ద్వారా తెలుసుకున్నాము.

 శ్రీరంగానికి వచ్చిన తరువాత, రామానుజులు వారికి తిరుకల్యాణం (వివాహం) జరిపించారు. కానీ గోవింద పెరుమాళ్‌కు గృహస్థాశ్రమంపై ఆసక్తి లేకపోయింది.  రామానుజులు గోవింద పెరుమాళ్‌ను తన భార్యతో ఏకాంతంలో ఉండమని ప్రత్యేకంగా ఆదేశించారు.ఆ రాత్రి ఏకాంతంలో ధర్మపత్ని తో కలిసి ఉన్నప్పుడు, ఎక్కడ చూసినా భగవంతుని దివ్యరూపమే కనిపించింది. ఆయన పెరుమాళ్ యొక్క దివ్య దర్శనం గురించి తన భార్యకు వివరించారు. తరువాత రోజు ఈ విషయాన్ని రామానుజులకు చెప్పి, గృహస్థాశ్రమం తనకు అనుకూలం కాదని తెలిపారు. రామానుజులు కూడా దీనిని అంగీకరించి, ఆయనకు సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారు.“ఎంబార్” అనే దివ్యనామం కూడా ప్రసాదించారు.  రామానుజుల తరువాత గురు పరంపరలో తదుపరి ఆచార్యులుగా ఉండి,ఎంబార్ సాంప్రదాయం వర్ధిల్లడానికి ఎంతో తోడ్పడ్డారని చెప్పవచ్చు.

ఎంబార్ వాళి తిరునామములు :

పూవళరుం తిరుమగళార్ పొలివుత్తోన్ వాళియే  

పొయ్గై ముదల్ పదిన్మర్ కలైప్ పొరుళురైప్పోన్ వాళియే  

మావళరుం పూదూరాన్ మలర్ పదత్తోల్ వాళియే  

మకరత్తిల్ పునర్పూసం వందుదిత్తోన్ వాళియే  

దేవుమెప్పొరుళుం పదైక్కత్ తిరుంతినాన్ వాళియే  

తిరుమలైనంబిక్కు అడిమై శెయ్యుమవన్ వాళియే  

పావైయర్గళ్ కలవియిరుళ్ పగలెన్రాన్ వాళియే  

భట్టర్ తొళుం ఎంబార్ పొఱ్పదమిరణ్డుం వాళియే  

పూవళరుం తిరుమగళార్ పొలివుట్రోన్ వాళియే  

పద్మాసనస్థస్థిత అయిన పెరియ పిరాట్టి కృపవల్ల కైంకర్యమనే సంపదచే వెలుగొందిన ఎంబార్ల వైభవం నిరంతరం నిలచి ఉండాలి (పల్లాండు)

పొయ్గై ముదల్ పదిన్మర్ కలైప్ పొరుళురైప్పోన్ వాళియే  

పోయ్గై ఆళ్వార్ మొదలుకొని పది ఆళ్వార్లు అనుగ్రహించిన నాలాయిర దివ్యప్రబంధాల అంతరార్థాలను మనకు వివరించిన ఎంబార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!  ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటనను ప్రస్తావించడం జరిగింది.

శ్రీరంగంలో అరయర్ సేవ జరుగుతున్నప్పుడు, రామానుజుల వారు తమ గోష్ఠితో కలిసి ఆనందించేవారు. అరయర్ సేవ అంటే ఆళ్వార్ల పాసురాలకు అరయర్లు అభినయంతో సేవ సాయించడం. ఎంబార్, అరయర్లు చూపిన అభినయాలకంటే మరింత సుందరమైన ముద్రలను, అభినయాలను చూపించగా, అరయర్లు వాటిని అంగీకరించి, తదుపరి సేవలో ఎంబార్ చూపిన అభినయాలనే చేశారు. రెండోసారి అభినయాలు మారినప్పుడు, రామానుజులు ప్రశంసిస్తూ,  “ఇది ఎంబార్ చూపించిన అభినయమా?” అని అడిగారు. అంతే కాకుండా, ఆళ్వార్ల పాశురాల్లో కలిగే ఏ  సందేహాన్నైనా ఆయన సంకోచం లేకుండా వెంటనే నివృత్తి చేసేవారు.

ఉదాహరణకు — పెరియాళ్వార్ తిరుమొళి 5.4 (ఫలస్తుతి)లోని

“సాయైప్ పోలప్ పాద వల్లార్ తాముం అణుక్కర్గళే”   అనే పంక్తికి, రామానుజుల తిరువడిని శిరస్సుపై దాల్చి,ఒక అద్భుతమైన అర్థాన్ని వివరించారు.ఎంపెరుమాన్‌ను విడిచి ఉండకుండా ఉండేవారే బాగా పాడగలరు అని ఆయన అన్నారు. ఆళ్వార్ల పాశురాలకు అందమైన అర్థాలను అనుగ్రహించే ఎంబార్‌ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

మావళరుం పూదూరాన్ మలర్ పదత్తోన్ వాళియే  

‘మా’ అంటే జంతువులు. పూర్వం శ్రీపెరుంబూదూర్ జంతువులతో నిండిన ఆహ్లాదకరమైన తోటలతో నిండి ఉండేదని చెబుతారు. ఆ శ్రీపెరుంబూదూర్లో అవతరించిన రామానుజుల యొక్క కుసుమకోమలములైన తిరువడిగళ్ళను తన హృదయంలో నిలుపుకున్న ఎంబార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

మకరత్తిల్ పునర్పూసం వందుదిత్తోన్ వాళియే  

మకర మాసం అనగా పుష్య మాసం. పుష్య మాసంలో, పునర్వసు నక్షత్రమున ఈ లోకంలో అవతరించిన ఎంబార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

దేవుమెప్పొరుళుం పడైక్కత్ తిరుంతినాన్ వాళియే  

గోవింద పెరుమాళ్ కాళహస్తిలో శివభక్తుడిగా ఉన్నప్పుడు, పెరియ తిరుమలై నంబి, నమ్మాళ్వార్ తిరువాయ్మొళిలో రెండవ పత్తు రెండవ పదిగం, నాల్గవ పాశురం (2.2.4) – “దేవుం ఎప్పొరుళుం పడైత్త” అనే పాశురాన్ని ఉపదేశించి, “బ్రహ్మను తన నాభికమలం నుండి సృష్టించిన నారాయణుడికే ఆరాధన, పుష్పార్చన తగును.  మరి ఇంకెవరికి తగదు”  అని వివరించారు. 

ఈ  ఉపదేశం విని గోవింద పెరుమాళ్ మనసు మారి, శ్రీవైష్ణవ సంప్రదాయంలోకి ప్రవేశించారు. ఆ విధంగా, నమ్మాళ్వార్ పాశురం “దేవుం ఎప్పొరుళుం పదైక్క” ద్వారా మనస్సు మారిన ఎంబార్ చిరంజీవులు కావాలి (పల్లాండు)!

తిరుమలైనంబిక్కు అడిమై శెయ్యుమవన్ వాళియే  

గోవిందపెరుమాళ్ (ఎంబార్) పెరియ తిరుమలై నంబికి అహర్నిశం కైంకర్యం చేసేవారు.

ఒకసారి రామానుజార్, ఎంబార్ ఆచార్యులైన పెరియ తిరుమలై నంబి మంచాన్ని సర్దుతున్నప్పుడు, ఆయన దానిపై పడుకుని, అటు ఇటు దొర్లి చూసి సంతృప్తి చెందినట్లు దిగటం గమనించారు. రామానుజులు ఎంబార్లను పిలిచి ఆచార్యుల కోసం సర్దిన మంచం మీద అలా పడుకొని లేవటం తప్పుకదా అని అడుగగా, తను అలా పడుకుని ఒక్క చిన్న గడ్డి ముక్క కూడా ఉండకుండా, వేసిన మంచం ఆచార్యులకు సౌకర్యంగా ఉందా అని సరిచూడటనికే తను అలా చేస్తున్నాని విన్నవించారు. రామానుజులు వారి ఆచార్యభక్తిని చూసి ఆశ్చర్యపోయారు.

అందువల్ల, పెరియ తిరుమలై నంబికి ఇలాంటి సంపూర్ణ కైంకర్యం చేసిన ఎంబార్ చిరంజీవులు కావాలి (పల్లాండు)!

పావైయర్గళ్ కలవియిరుళ్ పగలెనృఆన్ వాళియే  

గోవిందపెరుమాళ్ (ఎంబార్) దాంపత్య జీవితం పట్ల ఆసక్తి లేక సన్యాసం స్వీకరించారు. భార్యతో ఏకాంతంలో ఉన్నప్పటికీ, ఆయన ఎక్కడ చూసినా ఎంపెరుమాన్ దర్శనమై, దాంపత్య జీవితం చీకటిగా అనిపించి, దానిని విడిచిపెట్టారు.  అందువల్ల, స్త్రీసంగాన్ని చీకటిగా భావించి, ఉన్నత స్థితిని పొందిన ఎంబార్ చిరంజీవులు కావాలి (పల్లాండు)!

భట్టర్ తొళుం ఎంబార్ పొఱ్పద్మిరణ్దుం వాళియే  

ఎంబార్, కూరత్తాళ్వాన్ కుమారులైన వేదవ్యాస భట్టర్ మరియు పరాశర భట్టర్లకు ఆచార్యులు.  కూరత్తాళ్వాన్ కవల పిల్లల పుణ్యాహవచనం సమయంలో, రామానుజార్ ఎంబార్‌ను పిలిచి, ప్ల్లలను తీసుకొని రమ్మని చెప్పగా, ఎంబార్లు పిల్లల చెవిలో ద్వయమంత్రమును వారికి రక్షగా పఠిస్తూ తీసుకుని వస్తారు. అది గమనించిన రామానుజులు “దేవరీర్, వీరికి ఆచార్యుడిగా మీరు ఉండాలి”   అని ప్రకటించారు.  అందువల్ల, కూరత్తాళ్వాన్ కుమారులు ఎంబార్‌ను తమ ఆచార్యునిగా స్వీకరించారు. అందుకే,  పరాశర భట్టర్ పూజించే ఎంబార్ యొక్క సువర్ణ సమానమైన తిరువడులకు పల్లాండు (చిరకాలం వర్ధిల్లాలి)!

అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి

మూలం : https://divyaprabandham.koyil.org/index.php/2026/01/vazhi-thirunamams-embar-simple/

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org 

Leave a Comment