శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 53
ఈ పాశురములో మొదలుగా పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించిన ఆళ్వార్ల అరుళ్చెయల్ యందుగల అంతఃసారమును చూపునదైన శ్రీవచన భూషణ దివ్యశాస్త్ర వైభవ సారమును కృపచేయుచున్నారు. ఈ పాశురము ద్వారా పిళ్ళై లోకాచార్యులు చేసిన మహోపకారమును కృప చేయుచున్నారు.
అన్నపుగళ్ ముడుమ్బై అణ్ణల్! ఉలగాశిరియన్।
ఇన్నరుళాల్ శెయ్ దకలై యావై యిలుం* ఉన్నిల్
తిగళ్ వశనభూషణత్తిన్ శీర్మై ఒన్ఱుకిల్లై।
పుగళల్ల ఇవ్వార్తై మెయ్ ఇప్పోదు॥
క్రింద పేర్కొనిన విధముగా ఈ విధమైన వైభవమును కలిగిన ముడుమ్బై వంశ ముఖ్యులైన మఱియు మన అందరికీ స్వామియైన పిళ్ళై లోకాచార్యులు తనకు గల గొప్ప కరుణతో వారికి ముందుగా గల ఆచార్యులు, గోపనీయమైన శాస్త్ర విషయములను ఆచార్య – శిష్య ఉపదేశ క్రమములో రక్షింపబడుతూ వచ్చిన వాటిని రహస్య గ్రంథములుగా వ్రాసి/రచించి అందరకీ ఉజ్జీవన మార్గమును చూపినారు. తద్వారా వీరు రచించిన గ్రంథములన్నియూ మహావైభవోపేతమైన శ్రీవచన భూషణముతో పోల్చి విశ్లేషించినచో ఏవిధముగానైననూ సమానము కావు. ఇది ఏమాత్రమూ పొగడ్తల కొఱకు చెప్పునది కాదు, సత్యమైన విషయము. వేదాన్తం మఱియు ఆళ్వార్ల అరుళ్చెయల్ తాత్పర్యము ఆచార్య కృపయే. దాని వైభవమును విస్తారముగా వివరించుటయే ఈ గ్రంథము యొక్క ప్రత్యేకత.
పాశురము 54
ఈ యాబై నాల్గవ పాశురములో ఇట్టి వైభవోపేతమైన ఈ గ్రంథమునకు దానిని అనుగ్రహించిన పిళ్ళై లోకాచార్యులే ఈ గ్రంథమునకు సరియైన తిరునామమును కూడా ధరింపజేసినారని కృపచేయుచున్నారు.
మున్నం కురవోర్ మొళిన్ద వశనజ్ఞ్గళ్
తన్నై మిగకొణ్డు కత్తోర్ దమ్ముయిర్కుం ఇన్నణియా
చ్చేర చ్చమైత్తవరే శీర్ వచనభూషణమెన్
పేర్ ఇక్కలైక్కు ఇట్టార్ పిన్॥
పిళ్ళై లోకాచార్యులకు ముందుగల పూర్వాచార్యులు కృప చేసిన సంప్రదాయ అర్థములతో పొందుపరచబడిన శ్రీ సూక్తులను ఆధారముగా మఱియు పెద్దలను బాగుగా సేవించి వారి వద్ద నుంచి తెలుసుకొనిన శాస్త్ర మఱియు సంప్రదాయ అర్థములను ఒక క్రమములో అమర్చి ఒక ఆభరణము మాదిరిగా ఈ గ్రంథమును రచించినారు. ఆ క్రమములోనే వారే దానికి శ్రీ వచన భూషణమనే తిరునామమును ధరింపచేసినారు. ఏవిధముగానైతే రత్నములతో చేయబడిన ఆభరణమును రత్నాభరణమని అంటామో అదే విధముగా పెద్దల శ్రీ సూక్తులతో చేయబడిన దీనిని శ్రీ వచనభూషణమను తిరునామము సార్థకమైనది. శరీరమునకు ఆభరణము అలంకారప్రాయమే కానీ ఈ గ్రంథము ఆత్మకు ఆభరణముగా శోభిల్లుచున్నది.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-53-54-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org