నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – మూన్ఱాం తిరుమొళి – కోళి అళైప్పదన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఇరండామ్ తిరుమొళి – నామమాయిరం

మునుపటి పదిగములో, ఆండాళ్ మరియు ఇతర గొల్ల పిల్లలు కలిసి సంతోషంగా ఉన్నారు. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు “వీళ్లని ఇలానే వదిలితే, కలయిక కారణంగా వాళ్ళు సంతోషాన్ని భరించలేక తమ ప్రాణాలు కూడా కోల్పోవచ్చు” అని అనుకున్నారు. అందుకని కృష్ణుడి నుండి వాళ్ళని వేరు చేసి గదిలో పెట్టి తాళం వేశారు. ఈ పరిస్థితిలో, కృష్ణుడుతో పాటు ఆ గొల్ల భామలు విరహములో తపించడం ప్రారంభించారు [ఒకరినొకరు చూడలేక]. ఇది గమనించి, వారి బంధువులు, తల్లిదండ్రులు “వీళ్లని ఇలాగే విడదీసి వదిలేస్తే, వీళ్ళ ప్రాణానికే ప్రమాదము” అని భావించారు.  అలాగని ఈ గొల్లపిల్లలని కృష్ణుడుతో కూడా ఉంచలేము, అది కూడా ప్రమాదమే. అందువల్ల వారికి మంచి భర్తలు లభించేలా పణి నీరాట్టం (వేకువ జామున నదిలో స్నానం చేయడం) అనే నోముని వాళ్ళని చేయనిద్దాము.  ఆ సమయంలో వాళ్ళు కొద్దిసేపు కృష్ణుడుతో ఉండటానికి అవకాశము దొరుకుతుంది, ఇక ఆ బాధను పట్టించుకోరు” అని తలచారు. తెల్లవారకముందే నదిలో స్నానం చేయాలని వాళ్ళందరూ ఆ బాలికలకు చెప్పారు. జరుగుతున్న ఈ ఘట్టంపై కృష్ణుడు  నిఘా వేసి ఉంచాడు, ఈ విషయం తెలుసుకొని, ఉదయాన్నే నది స్నానానికి వెళుతున్న గోపబాలికల వెనకాల తాను వెళ్ళాడు. అమ్మాయిలు ఎంత జాగ్రత్త పడినా, వాళ్ళు స్నానానికి వెళుతున్న అదే నదికి వాళ్ళ వెనక తానూ వెళ్ళాడు. పశు కాపరుల అమ్మాయిలు కావడంతో, వారు నది ఒడ్డున వాళ్ళ వస్త్రాలు తీసి ఉంచి, స్నానం కోసం నదిలోకి ప్రవేశించారు. అక్కడికి వచ్చిన కృష్ణుడు, అన్ని వస్త్రాలను తీసుకొని, అక్కడే ఉన్న కురుంద వృక్షముపైకి ఎక్కాడు. అమ్మాయిలు స్నానం చేసి నదిలో నుండి బయటకు వచ్చిన తర్వాత, తాము ఉంచిన చోట వస్త్రాలు కనిపించక పోయే సరికి, కలవరపడి, “ఆకాశం ఎత్తుకెళ్లిందా? దిక్కులు ఎత్తుకెళ్ళాయా? నది తీసుకుందా లేదా కృష్ణుడు వాటిని తీసుకున్నాడా?” అని ఆలోచిస్తుండగా  కురుంద చెట్టుపైన కృష్ణుడిని చూసి ఏమి జరిగిందో వాళ్ళు ఊహిస్తారు. వారి వెనక వచ్చి వారికి తెలియకుండా తమ వస్త్రాలను దొంగిలించినట్లే, అతడిని ఏదో ఒకవిధంగా ఏమార్చి అతడి నుండి తిరిగి తమ వస్త్రాలను పొందాలని నిర్ణయించుకున్నారు. వారు అతడిని  రకరకాలుగా అభ్యర్ధించారు, చివరికి వారి బాధలను చెప్పి మొరపెట్టుకుంటారు. అతడు వాళ్ళ వస్త్రాలను తిరిగి ఇచ్చి వారితో సంతోషంగా ఉంటాడు.

మొదటి పాశురము: వారు అనుభవిస్తున్న బాధని తెలుపుతూ, చేతులు జోడించి ప్రార్థిస్తూ ఆ కన్యలు వాళ్ళ వస్త్రాలను కోరుతున్నారు. 

కోళి అళైప్పదన్ మున్నం కుడైందు నీరాడువాన్ పోందోం
ఆళియం శెల్వన్ ఎళుందాన్ అరవణై మేల్ పళ్ళి కొండయ్!
ఏళైమై ఆఱ్ఱవుం పట్టోం ఇని ఎన్ఱుం పొయ్గైక్కు వారోం
తోళియుం నానుం తొళుదోం తుగిలై ప్పణిత్తరులాయే

ఆదిశేషుని శయ్యపైన పవ్వళించే ఓ దేవాది దేవా!  నదిలో నిండా మునిగి స్నానం చేయాలనే ఉద్దేశ్యముతో కోడి కూయక ముందే ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు, సూర్యుడు కూడా ఉదయించాడు. ఇక్కడ మేము చాలా బాధను అనుభవిస్తున్నాము. ఇకపై, ఈ నదికి మేము రాము. మా స్నేహితులు నేను నిన్ను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము. దయచేసి మాపై దయచూపి మా వస్త్రాలను మాకు ఇవ్వుము.

రెండవ పాశురము: తనతో కలవాలని కోరకుండా వాళ్ళు తమ వస్త్రాలను కోరుతున్నారని  కృష్ణుడు భావిస్తున్నాడు. అందుకని, నది ఒడ్డున ఉన్న ఇంకొన్ని వస్త్రాలను తీసుకొని కృష్ణుడు చెట్టుపైకి ఎక్కాడు. అది చూసిన గోప బాలికలు తమ వస్త్రాలను తిరిగి ఇవ్వమని బాధతో అభ్యర్థిస్తున్నారు. 

ఇదువెన్ పుగుందదింగందో! ఇప్పొయ్గైక్కు ఎవ్వాఱు వందాయ్?
మదువిన్ తుళాయ్ మడి మాలే! మాయనే! ఎంగళ్ అముదే!
విదియిన్మైయాల్ అదు మాట్టోమ్ విత్తగ ప్పిళ్ళాయ్! విరైయేల్
కుది కొడరవిల్ నడిత్తాయ్! కురుందిడై కూఱై పణియాయ్

ఏమి జరుగుతుంది ఇక్కడ! అయ్యో! నీవు ఏ దారినుండి వచ్చి ఈ చెరువుకి చేరుకున్నావు? తేనెలు కారుతున్న తులసి మాలతో కట్టిన కిరీటాన్ని ధరించిన ఈ మహానుభావా! అద్భుతమైన లీలలాడే వాడా! మాకు అమృతమైన మధువులాంటి వాడా! నీతో ఉండలేక పోవడం మా దురదృష్టము. ఓ లీలాధారి! తొందరపడవద్దు. విషపూరితమైన కాలియ సర్పముపైకి దూకి నాట్యమాడినవాడా! నీవు మాపై దయ చూపి ఆ కురుంద చెట్టుపైన ఉంచిన మా వస్త్రాలను మాకు ఇవ్వుము.

మూడవ పాశురము: వస్త్రాలు తిరిగి ఇస్తానని కృష్ణుడు చెప్పినప్పుడు అతడిని నమ్మి కొంతమంది గోపబాలికలు నదిలో నుండి బయటకు వచ్చారు. వారితో అతడు తీరికగా ప్రేమతో మాటలు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, తమ వస్త్రాలు తిరిగి ఇస్తే ఆ ప్రదేశాన్ని విడిచివెళ్ళి పోతామని విన్నపించుకున్నారు. 

ఎల్లే! ఈదెన్న ఇళమై? ఎమ్మనిమార్ కాణిల్ ఒట్టార్
పొల్లాంగు ఈదెన్ఱు కరుదాయ్ పూంగురుందు ఏఱి ఇరుత్తి
విల్లాల్ ఇలంగై అళిత్తాయ్! నీ వేండియ దెల్లాం తరువోం
పల్లారుం కాణామే పోవోం పట్టై ప్పణిత్తరుళాయే

విల్లుతో లంకను నాశనం చేసినవాడా! అయ్యో! ఎలాంటి ఆట ఇది! ఇక్కడ ఏమి జరిగిందో మా తల్లులకు తెలిస్తే, వారు మమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వరు. మేము ఇలా వస్త్రాలు లేకుండా  ఉండటం మాకు సరికాదని నీవు ఆలోచించడం లేదు. నీవు పువ్వులు వికసించిన కురుంద వృక్షముపైన ఉన్నావు. నీకు ఏదికావాలో అది మేము ఇస్తాము. ఎవరూ చూడని విధంగా మేము మీ ఇంటికి వస్తాము. దయచేసి మా పట్టు వస్త్రాలను మాకు ఇవ్వుము.

నాలుగవ పాశురము: వాళ్ళు ఇలా మాట్లాడుతుండగా, వాళ్ళని భయపెట్టేలా కృష్ణుడు ప్రవర్తించగానే, అది చూసి, వాళ్ళు తమ బాధని వ్యకతము చేస్తూ తమపై దయ చూపమని ప్రార్థిస్తారు.

పరక్క విళిత్తు ఎంగుం నోక్కి ప్పలర్ కుడైందాడుం సునైయిల్
అరక్క నిల్లా కణ్ణ నీర్గళ్ అలమురుగిన్ఱన వా పారాయ్
ఇరక్కమేల్ ఒన్ఱుం ఇలాదాయ్! ఇలంగై అళిత్త పిరానే!
కురక్కరశు ఆవఱిందోం కురుందిడై క్కూఱై పణియాయ్ 

విల్లుతో లంకాను నాశనం చేసినవాడా! ఈ సరస్సులో ఎంతో మంది స్నానం చేస్తున్నారు. ఈ ప్రదేశం ఒడ్డు చుట్టూ ఉన్న అన్ని దిక్కులలోకి చూడు, మేము ఆపడానికి ఎంత ప్రయత్నిచినా మా కళ్ళనుండి కన్నీళ్లు కారడం ఆగట్లేదు. ఓ సానుభూతి లేని వాడా! చెట్లు ఎక్కే కోతులకు నాయకుడవని మేము గ్రహించాము. దయచేసి కురుంద చెట్టుపైన ఉన్న వస్త్రాలను మాకివ్వు.

ఐదవ పాశురము: ఆండాళ్ ముముక్షువుల వంశంలో జన్మించినందున (ముక్తి పొందాలని కోరుకునే ఆళ్వార్ల వంశం), ఎంపెరుమానుని దివ్య సంకల్పము ఏమిటో ఆమెకు తెలుసు. గజేంద్రుడు ఆర్తితో పిలిచినప్పుడు, తన మహాత్మ్యం చూడకుండా వెంటనే వచ్చి రక్షించాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గజేంద్రుడు అనుభవించిన దాని కంటే ఎక్కువగా బాధను తాము అనుభవిస్తున్నారని ప్రార్థిస్తున్నారు. కావున తమ వస్త్రాలను తిరిగి ఇవ్వాలని ఆమె కోరుతుంది. 

కాలై క్కదువిదుగిన్ఱ కయలొడు వాళై విరవి
వేలై ప్పిడిత్తు ఎన్నైమార్గళోట్టిల్ ఎన్న విళైయాట్టొ?
కోల చ్చిఱ్ఱాడై పలవుం కొండు నీ ఏఱి ఇరాదే
కోలం కరియ పిరానే! కురుందిడై క్కూఱై పణియార్ 

నల్లని దివ్య రూపాము ఉన్న ఓ భగవానుడా! పీతలు చేపలు కలిసి మా కాళ్లను కొరుకుతున్నాయి. నీవు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావని మా సోదరులకు తెలిస్తే, వాళ్ళు తమ బల్లాలతో పరిగెత్తుకు వచ్చి నిన్ను తరుముతారు; అది కూడా ఒక లీలగా మారుతుందేమో? అందమైన చిన్ని చిన్ని పీతాంబరములు ధరించి ఆ కురుంద చెట్టుపైన కూర్చొని ఉండకుండా, దయచేసి మా వస్త్రాలను మాకు ఇవ్వ వచ్చుకదా.

ఆరవ పాశురము: ఇక్కడ ఈ పాశురములో, తామర కాడలు వాళ్ళకి గుచ్చుకొని ఎలా బాధపడుతున్నారో వివరిస్తూ అతడిని ప్రార్థిస్తున్నారు.

తడత్తవిళ్ తామరై ప్పొయ్గై త్తాళ్గళ్ ఎం కాలైక్కదువ
విడత్తేళ్ ఎఱిందాలే పోల వేదనై ఆఱ్ఱవుం పట్టోం
కుడత్తై ఎడుత్తు ఏఱవిట్టు క్కూత్తాడ వల్ల ఎం కోవే!
పడిఱ్ఱై ఎల్లాం తవిర్ందు ఎంగళ్ పట్టై ప్పణిందరుళాయే

విశాలమైన తామర పుష్పాలతో నిండి ఉన్న ఈ చెరువులో, ఆ కాడలు మా కాళ్ళను కొరికేస్తున్నాయి. విషపూరితమైన తేళ్లు మమ్మల్ని కరిసి నంత బాధను అనుభవిస్తున్నాము. ఉట్టి కుండలను పగులగొట్టి నాట్యము చేయగల ఓ మా నాయకుడా! నీవు చేస్తున్న ఈ అల్లరిని ఆపి, మాపై దయ చూపి మా పట్టు వస్త్రాలను మాకివ్వుము. 

ఏడవ పాశురము: తమలాంటి అమ్మాయిలను ఇబ్బంది పెట్టవద్దని, అనుచితమైన పనులు చేయవద్దని వాళ్ళు అతడిని ప్రార్థిస్తున్నారు.

నీరిలే నిన్ఱు అయర్ క్కిన్ఱోం నీది అల్లాదన శెయ్దాయ్
ఊరగం శాలవుం శేయ్ త్తాల్ ఊళి ఎల్లాం ఉణర్వానే
ఆర్వం ఉనక్కే ఉడైయోం అమ్మనైమార్ కాణిల్ ఒట్టార్
పోర విడాయ్ ఎంగళ్ పట్టై పూన్గురున్దు ఏఱి ఇరాదే 

ఎవ్వరూ లేని ప్రళయ కాలములో కూడా అందరినీ రక్షించాలని భావించేవాడా! మేము ఈ నీటిలో నిలబడి అవస్థ పడుతున్నాము. నీకిది న్యాయమేనా?  మేము నీ నుండి తప్పించుకోవాలనుకున్నా, మా ఊరు ఇళ్లు ఇక్కడికి ఎంతో దూరంగా ఉన్నాయి. అయ్యో! నీవు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నా మాకు నీపై ప్రేమ ఆగట్లేదు. మా తల్లులు మమ్మల్ని నీతో ఇలా కలిసి చూస్తే, వాళ్ళు మళ్లీ మమ్మల్ని ఇక్కడికి రానివ్వరు. విచ్చుకున్న పువ్వులతో ఉన్న ఆ కురుంద చెట్టుపైన అలా కూర్చోకుండా మాపై దయ చూపి మా పట్టు వస్త్రాలను మాకు ఇవ్వుము.

ఎనిమిదవ పాశురము: ఎవరి సమక్షంలో మేము సిగ్గుపడతామో ఆ బంధువులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి ఎదుట అల్లరి చేయవద్దు, మేము సిగ్గుపడెలా చేయవద్దు.

మామిమార్ మక్కళే అల్లోం మఱ్ఱు ఇంగు ఎల్లారుం పోందార్
తూమలర్ క్కణ్గళ్ వళర త్తొల్లై ఇరా త్తుయిల్వానే
శేమమేల్ అన్ఱిదు శాల చ్చిక్కెన నాం ఇదు శొన్నోం
కోమళ ఆయర్ కొళుందే! కురుందిడై క్కూఱై పణియాయ్ 

పగలంతా అల్లరి చేష్టలు చేసి అలసి సొలసి లేత పుష్పాల వంటి ఆ నేత్రాలను మూసుకొని పడుకున్న వాడా! ఇక్కడ ఉన్నవారిలో నీ అత్త కూతుర్లు మాత్రమే కాకుండా, నీ అత్తలు వారి తల్లులు ఇతర బంధువులు కూడా ఉన్నారు. నీ ఈ చిలిపి చేష్ఠలు నీకు తగినవి కావు. మేము నీకు నిజం చెబుతున్నాము.  ఓ పశువుల కాపరుల వంశానికి అంకురము లాంటివాడా! మాపై దయ చూపి మా వస్త్రాలను మాకు ఇవ్వుము.

తొమ్మిదవ పాశురము: ఎంబెరుమానుడు రెండు స్థితులలో ఉంటారు – అతన్ని కీర్తించే వారి కార్యాలు సంపన్నము చేస్తాడు; అతడిని కీర్తించ కుండా దూషించే వారి కార్యాలు కూడా సంపన్నము చేస్తాడు. అతడిని స్తుతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం వాళ్ళు పొందలేదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు అతడిని దూషించి వారికి ఫలము దొరుకుతుందో లేదో చూద్దామని నిర్ణయించుకుంటారు.

కంజన్ వలై వైత్త అన్ఱు కారిరుళ్ ఎల్లిల్ పిళైత్తు
నెంజు తుక్కం శెయ్య ప్పోందాయ్ నిన్ఱ ఇక్కన్నియరోమై
అంజ ఉరప్పాళ్ అశోదై ఆణాడ విట్టిట్టిరుక్కుం
వంజగ ప్పేయ్ చ్చి పాలుండ మశిమైయిలీ! కూఱై తారాయ్ 

కంసుడు నిన్ను చంపాలనుకున్నప్పుడు చిమ్మ చీకటి రాత్రిలో నీవు తప్పించుకుని, ఈ సరస్సులో నిలబడి ఉన్న కన్యలను బద్ధపెట్టడానికి ఇక్కడికి వచ్చావు.  యశోదా పిరాట్టి నిన్ను భయపెట్టాలని తిట్టదు కూడా. నీ అల్లర్లు మితిమీరేవరకు నిన్ను ఏమీ అనదు. పూతన పాలతో పాటు తన ప్రాణాన్ని కూడా త్రాగిన ఓ నిర్లజ్జుడా! మా వస్త్రాలను మాకు ఇవ్వుము.

పదవ పాశురము: ఈ పదిగము నేర్చుకున్న వారికి ప్రయోజనాన్ని వివరిస్తూ ఆండాళ్ ఈ పదిగాన్ని పూర్తి చేస్తుంది.

కన్నియరోడు ఎంగళ్ నంబి కరియ పిరాన్ విళైయాట్టై
పొన్నియల్ మాడంగళ్ శూళ్ంద పుదువైయర్కోన్ బట్టన్ కోదై
ఇన్నిశైయాల్ శొన్న మాలై ఈరైందుం వల్లవర్ తాం పోయ్
మన్నియ మాదవనోడు వైగుందం పుక్కు ఇరుప్పారే 

నల్లని కణ్ణపిరాన్ (కృష్ణుడు) గొల్ల పిల్లలతో ఎన్నో అద్భుతమైన లీలలు చేశాడు. అందమైన బంగారు భవనాలతో చుట్టుముట్టిన శ్రీవిల్లిపుత్తూర్కి నాయకుడైన పెరియాళ్వార్ల కుమార్తె ఆండాళ్ దయతో మధురమైన సంగీతంతో ఆ దివ్య లీలలను పాశురాలలో కూర్చింది. ఈ పది పాశురాలను నేర్చుకోగలిగిన వారు అర్చరాది మార్గాన వెళ్లి  శ్రీవైకుంఠం చేరుకుంటారు. అక్కడి నిత్య నివాసి అయిన శ్రీమాన్నారాయణతో కలిసి పరమానందంతో జీవిస్తారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-3-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment