శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః

శ్రీరంగనాయకి తాయారే మన పెరియ పిరాట్టి, శ్రీ మహాలక్ష్మి. ఓరాణ్ వళి గురుపరంపరలో, పెరియ పెరుమాళ్ తరువాతి స్థానంలో ఉన్న ఆచార్యురాలు. ఎంపెరుమాన్ స్వయంగా ఆచార్యుని పాత్రను తీసుకుని, ద్వయ మహామంత్రాన్ని పెరియ పిరాట్టికి ఉపదేశించారు. ఆచార్యుడు అంటే — మనకు మార్గం చూపి, మనలను ఎంపెరుమాన్ వద్దకు చేర్చేవాడు. పెరియ పెరుమాళ్ సర్వ స్వతంత్రుడు — తన సంకల్పం ప్రకారం నడుచుకునే సర్వేశ్వరుడు. కానీ పెరియ పిరాట్టి పరతంత్ర — పూర్తిగా ఎంపెరుమాన్‌పై ఆధారపడిన దివ్య సహచరిణి. స్వామికి పూర్తిగా శరణాగతి చేసిన ఆమె, జీవులకు మార్గదర్శకత్వం చూపు నాయకురాలు
తల్లి ఎంపెరుమాన్ సహచరిణులలో ప్రధానురాలు — పట్టమహిషి. మన పూర్వాచార్యులు ఆమెను పురుషకార భూతై అని స్తుతించారు. పురుషకార భూతైగా, జీవాత్మల లోపాలను దాచిపెట్టి వారి తరఫున ఎంపెరుమాన్‌కు సిఫారసు చేస్తుంది, శరణాగతి చేసిన జీవులను ఎంపెరుమాన్ స్వీకరించేలా చేస్తుంది. జీవులకు మార్గం చూపి, పరమేశ్వరుడు వారిని రక్షించేలా కరుణతో ప్రేరేపిస్తుంది
పెరియ పిరాట్టి వాళి తిరునామం
పఙ్గయప్పూవిల్ పిఱన్ద పావై నల్లాళ్ వాళియే
పఙ్గునియిల్ ఉత్తిరనాళ్ పారుతిత్తాళ్ వాళియే
మఙ్గైయర్‍కళ్ తిలగమెన వన్ద శెల్వి వాళియే
మాల్ అరఙ్గర్ మణి మార్బై మన్ను మవళ్ వాళియే
ఎఙ్గళ్ ఎళిఱ్ శేనై మన్నర్ ఇతం ఉరైత్తాళ్ వాళియే
ఇరుపత్తఞ్జు ఉట్పొరుళ్ మాల్ ఇయమ్బుమవళ్ వాళియే
శెఙ్గమలచ్చెయ్యరఙ్గమ్ శెళిక్క వన్దాళ్ వాళియే
శీరఙ్గనాయకియార్ తిరువడిగళ్ వాళియే
పెరియ పిరాట్టి వాళి తిరునామం — వివరణ
పఙ్గయప్పూవిల్ పిఱన్దపావైనల్లాళ్ వాళియే
‘పఙ్గయ’ అంటే కమలం. కమలంలో అవతరించినందున ఆమెను మలర్మగళ్ అని పిలుస్తారు.
‘పావై’ అంటే మంచి స్త్రీ — అంటే భౌతిక విషయాలపై ఆసక్తి లేకుండా, ఎంపెరుమాన్ పట్ల భక్తితో ఉండే వ్యక్తి. ఆమె కరుణ వల్లనే మనకు ఎంపెరుమాన్‌పై భక్తి ఎలా కలగాలో తెలుస్తుంది. అందుకే ఆమెను నల్లాళ్ అని పిలుస్తారు. కమలంలో జన్మించిన, శుభరూపిణి అయిన పెరియ పిరాట్టి చిరకాలం నిలిచి ఉండుగాక.
పఙ్గునియిల్ ఉత్తిరనాళ్ పారుతిత్తాళ్ వాళియే
పెరియ పిరాట్టి పంగుని నెల, ఉత్తర నక్షత్రం రోజున అవతరించింది. ప్రతి సంవత్సరం శ్రీరంగంలో ఈ రోజున గద్యత్రయం పారాయణం జరుగుతుంది. అప్పుడు నంపెరుమాళ్, శ్రీరంగనాయకి ఇద్దరూ కలిసి దర్శనమిస్తారు, దీనినే శేర్తి సేవ (ఉత్సవం) అంటారు. అదే రోజున ఎంపెరుమానార్ గద్యత్రయం పారాయణం చేసి శరణాగతి చేశారు. ఈ పవిత్రమైన రోజున అవతరించిన పెరియ పిరాట్టి చిరకాలం నిలిచి ఉండుగాక.
మఙ్గైయర్‍కళ్ తిలగమెన వన్ద శెల్వి వాళియే
ఎల్లప్పుడూ పెరుమాళ్ కైంకర్యంలో నిమగ్నురాలైన తాయార్, స్త్రీలకు ఆదర్శం. అపారమైన ఐశ్వర్యం కలిగిన, స్త్రీలలో శిరోమణి అయిన ఆమె చిరకాలం నిలిచి ఉండుగాక.
మాల్ అరఙ్గర్ మణి మార్బై మన్ను మవళ్ వాళియే
ఆమె తిరుమాల్ మణిమార్బులో నిత్యంగా నివసిస్తుంది. నమ్మాళ్వార్ చెప్పినట్లుగా — “అగలగిల్లేన్ ఇరైయుం ఎన్రు” — పెరుమాళ్ళని ఒక్క క్షణం కూడా విడిపోనని ప్రతిజ్ఞ చేసిన తాయార్ చిరకాలం శ్రీమన్నారాయణుని దివ్య వక్షస్థలంలో నిలిచి ఉండుగాక.
ఎఙ్గళ్ ఎళిఱ్ శేనై మన్నర్ ఇతం ఉరైత్తాళ్ వాళియే
‘శేనైమన్నర్’ అంటే శ్రీ విష్వక్శేనులు. ఓరాణ్ వళి గురుపరంపరలో, పెరియ పిరాట్టి తరువాతి ఆచార్యుడు. అంటే విష్వక్శేనులు తన ఉపదేశాన్ని పెరియ పిరాట్టి నుండి పొందాడు. అలా ఆచార్యురాలై శ్రీ విష్వక్సేనునికి ఉపదేశించిన పిరాట్టి చిరకాలం నిలిచి ఉండుగాక.
ఇరుపత్తఞ్జు ఉట్పొరుళ్ మాల్ ఇయమ్బుమవళ్ వాళియే
పెరియ పిరాట్టి ఈ ద్వయ మహా మంత్రాన్ని, దాని అంతరార్థంతో సహా, శ్రీ విశ్వక్సేనులకు ఉపదేశించినారు. అమ్మ, వారికి 4 అచిత్ తత్త్వాలను — పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ భూతాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, అహంకారం,
మహత్, మూలప్రకృతి — ఇవన్నీ వివరంగా బోధించినారు. 25వ తత్వం — జీవాత్మ తత్వం కూడా పెరియ పిరాట్టి విశ్వక్సేనులకు ఉపదేశించినారు. ఈ 25 తత్వాలతో పాటు, 26వ తత్వమైన ఈశ్వర తత్వం — అంటే భగవంతుని పరమ వైభవం — గురించి కూడా అమ్మ ఆచార్యురాలిగా విశ్వక్సేనులకు బోధించినారు. అలాంటి పెరియ పిరాట్టి ఎప్పటికీ నిలచి ఉండాలి
శెఙ్గమలచ్చెయ్యరఙ్గమ్ శెళిక్క వన్దాళ్ వాళియే
ఎర్రకమలాలు వికసించే శ్రీరంగాన్ని శోభాయమానంగా చేయడానికి అవతరించిన ఆమె చిరకాలం నిలిచి ఉండుగాక.
శీరఙ్గనాయకియార్ తిరువడిగళ్ వాళియే
శ్రీరంగనాయకి అయిన పెరియ పిరాట్టి యొక్క దివ్యచరణాలు/తిరువడి చిరకాలం నిలిచి ఉండుగాక.
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org