శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః
సంప్రదాయంలో ఆచార్యుల ప్రాముఖ్యత
మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో అనేకమంది ఆచార్యులు ఉన్నారు.
అయితే సాధారణంగా మనం ఓరాణ్ వళి ఆచార్యుల వాళి తిరునామాలను జపించడం ఆచారంగా ఉంది. ఓరాణ్ వళి ఆచార్యులు అంటే — ఆచార్య పదవిని అనవధికంగా, విరామం లేకుండా, ఒకరి తరువాత మరొకరు స్వీకరించిన ఆచార్యుల పరంపర.
ఈ పరంపరలో మొదటివారు పెరియ పెరుమాళ్ (శ్రీమన్నారాయణుడు).
మన పూర్వాచార్యులు తమ వ్యాఖ్యానాలలో, రహస్య గ్రంథాలలో— ఎంపెరుమాన్ స్వయంగా ఆచార్య పదవిని కోరుకున్నాడు అని చూపించారు. ఆచార్య స్థానం అత్యంత గౌరవనీయమైనది; ఎవరూ ఎంపెరుమానుకంటే ఆచార్యుడిగా అర్హులు కాదు. అందువల్లే పెరియ పెరుమాళ్ మన గురుపరంపరలో మొదటి ఆచార్యుడిగా నిలిచాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి గీతోపదేశం చేసి ఆచార్యుడిగా వ్యవహరించాడు. బదరికాశ్రమంలో నారాయణ రూపంలో నరునకు తిరుమంత్రం ఉపదేశించారు. అందువల్ల ఎంపెరుమాన్ అనేక సందర్భాల్లో ఆచార్యుడిగా వ్యవహరించాడు.
మన సంప్రదాయంలో ఆచార్యుని శరణాగతి ద్వారానే మోక్షం లభిస్తుంది అని దృఢంగా నమ్ముతాము. అందువల్ల ఆచార్యుడు అత్యున్నత స్థానం పొందుతాడు. సన్నిధిలో మంగళాశాసనం చేసేప్పుడు— పెరుమాళ్‌కు చేసే మంగళాశాసనానికి రెట్టింపు ఆచార్యునికి చేయాలి. దీనినే ఇరట్టై సంభావనై అంటారు. ఇప్పటికీ ఆచార్యులు వచ్చినప్పుడు— ప్రత్యేక సేవలు, మంగళాశాసనాలు చేయడం సంప్రదాయం. పత్రిక (ఆహ్వానం) ఇవ్వాలన్నా—రెండు పత్రికలు ఆచార్యునికి సమర్పించాలి. ఆచార్యుడు మనలను ఎంపెరుమానువరకు తీసుకెళ్లే పరమోపకారి కనుక ఆచార్యునికి ద్విగుణ సత్కారం చేయడం సంప్రదాయం.
ఓరాణ్ వళి ఆచార్యుల పరంపర:
- పెరియ పెరుమాళ్ — శ్రీ రంగనాథుడు (నంపెరుమాళ్) – పరంపరలో మొదటి ఆచార్యుడు.
- పెరియ పిరాట్టి — శ్రీ రంగనాయకి తాయార్ – తల్లి భగవంతునికి అత్యంత ప్రియమైన మరియు ప్రధాన సహచారిణి. ఎంపెరుమాన్ ద్వయ మహామంత్ర ఉపదేశం మొదట పిరాట్టికే చేసి, అమ్మకి శ్రీవైష్ణవ సంప్రదాయంలో తదుపరి ఆచార్య స్థానం ఇచ్చారు.
- సేనై ముదలియార్ — శ్రీ విశ్వక్సేనులు – సేనై ముదలియార్ – మూడవ ఆచార్యులు – పెరియ పిరాట్టి తరువాతి ఆచార్యుడు సేనై ముదళియార్ (శ్రీ విష్వక్సేనులు). వీరు పరమపదంలో నివసిస్తూ, లీలావిభూతిలో జరిగే సృష్టి, స్థితి, లయం, అన్నిటినీ పర్యవేక్షించే సేనాధిపతి.
- నమ్మాళ్వార్ (5000 సంవత్సరాల క్రితం) – ఎంపెరుమాన్ కృపతో నమ్మాళ్వార్లకు మయర్వర మతినలం — నిర్మలమైన జ్ఞానం లభించింది. ఆచార్య పరంపర భూమిపై వ్యాపించేందుకు, ఎంపెరుమాన్ స్వయంగా సేనై ముదళియార్ ద్వారా నమ్మాళ్వారుకు పంచసంస్కారం చేయించి, వారిని ఆచార్యునిగా స్థాపించారు. నమ్మాళ్వార్ ఆళ్వార్లలో ప్రధానులు, ప్రపన్న జన కూటస్థులు — ప్రపన్నులలో మొదటివారు, వైష్ణవ కులపతి — వైష్ణవ సమాజానికి నాయకులు అని ప్రసిద్ధి.
- నాథమునులు – నమ్మాళ్వార్ సుమారు 5000 సంవత్సరాల క్రితం జీవించగా, నాథమునులు సుమారు 1200 సంవత్సరాల క్రితం జీవించారు. మేల్నాడు (తిరునారాయణపురం) నుండి వచ్చిన కొంతమంది శ్రీవైష్ణవులు కాట్టు మన్నార్ కోయిల్లో (నాథమునుల నివాసం) తిరుక్కుడందై ఆరావముదన్ పాశురాలను పాడారు. ఆ పాశురాలు విని నాథమునులు మంత్రముగ్ధులయ్యారు. చివరి పాశురంలోని “కురుగూర్ శఠగోపన్” “ఓరాయిరత్తుళ్ ఇప్పత్తుం” అనే పదాలను గమనించి, ఆ పాశురాలు తీసుకుని ఆళ్వార్ తిరునగరికి వెళ్లారు. అక్కడ మధురకవి ఆళ్వార్ వంశస్థులు “మాకు తెలిసింది కన్నినున్ శిరుత్తాంబు మాత్రమే” అని “తిరుప్పుళియాళ్వార్ చెట్టు క్రింద ధ్యానం చేస్తూ కన్నినున్ శిరుత్తాంబు 12,000 సార్లు జపిస్తే, నమ్మాళ్వార్ ప్రత్యక్షమవుతారు” అని చెప్పగా, నాథమునులు యోగశాస్త్రంలో నిపుణులు కావడంతో, చెట్టు క్రింద కూర్చొని 12,000 సార్లు కన్నినున్ శిరుత్తాంబు జపించారు. నమ్మాళ్వార్ ప్రత్యక్షమై “నీకు ఏమి కావాలి?” అడిగగా నాథమునులు “మీరు రచించిన వెయ్యి పాశురాలు దయచేసి ప్రసాదించండి” అని ప్రార్థించారు. నమ్మాళ్వార్ తన నాలుగు ప్రబంధాలు తిరువాయ్మొళి, తిరువాశిరియం, తిరువిరుత్తం, పెరియ తిరువందాది, ఇతర ఆళ్వార్ల ప్రబంధాలు అన్నీ నాథమునులకు ఇచ్చి, వాటిని నాలాయిర దివ్యప్రబంధంగా సమగ్రంగా అందించారు. అలాగే అరుళిచ్చెయల్ యొక్క సంపూర్ణ అర్థాలను కూడా ఉపదేశించారు.
తదుపరి ఆచార్యులు
- పుండరీకాక్షులు (ఉయ్యకొండార్)
- శ్రీ రామ మిశ్రులు (మనక్కాళ్ నంబి)
- యామునాచార్యులు (ఆళవందార్ – నాథమునుల వారి మనుమలు)
- మహాపూర్ణులు (పెరియ నంబి) — వీరు శ్రీరంగంలో నివసించిన మహానుభావులైన ఆచార్యులు. ఆళవందార్ యొక్క ప్రధాన శిష్యులలో ఒకరుగా గౌరవించబడ్డాడు. అలాగే ఇళయాళ్వార్ (శ్రీరామానుజులు) కు పంచసంస్కారం చేసిన ఆచార్యుడూ వీరే. ఇళయాళ్వార్‌కు ఆళవందార్ శిష్యుడిగా మారాలనే గొప్ప ఆకాంక్ష ఉండేది. అయితే కాంచీపురంలోని దేవపెరుమాళ్, తిరుక్కచ్చి నంబిగళ్ ద్వారా ఇళయాళ్వారుకు ఆజ్ఞాపించి — పంచసంస్కారం పెరియా నంబి వద్దనే స్వీకరించాలి అని చెప్పించారు. దేవపెరుమాళ్ ఆజ్ఞ ప్రకారం, పెరియనంబి స్వయంగా శ్రీరామానుజులకు పంచసంస్కారం నిర్వహించారు.
- ఎంపెరుమానార్ (శ్రీ రామానుజులు) — సంప్రదాయ స్థాపకుడు
- ఎంబార్ (గోవిందపెరుమాళ్, మన సంప్రదాయ అభివృద్ధికి ఎంబార్లు ఎంతో గొప్ప సేవ చేశారు. ఎంపెరుమానార్‌ను విడిచి ఉండలేక, వారినే అనుసరించి పరమపదానికి చేరుకున్నారు)
- పరాశర భట్టర్ – వీరు కూరత్తళ్వానుల కుమారులు మరియు ఎంబార్లకు శిష్యులు
- నంజీయర్ (వేదాంతి జీయర్) – వీరు మొదట మాధవాచార్యులు అని పిలువబడేవారు. పరాశర భట్టార్ వీరిని శ్రీవైష్ణవ సంప్రదాయంలోకి తీసుకువచ్చారు. పరాశర భట్టార్ ప్రేమతో వీరికి “నంజీయర్” — అంటే “మన జీయర్” అనే పేరు పెట్టారు.
- నంపిళ్ళై (లోకాచార్యులు) — ఈడు 36000 పది వ్యాఖ్యానకర్త – వీరికి శాస్త్రాలలో అపారమైన పాండిత్యం, తమిళం–సంస్కృతంలో అద్భుతమైన ప్రావీణ్యం ఉండేది. వీరు రాసిన తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానం ఇప్పటికీ అత్యున్నతంగా భావించబడుతుంది. వీరిని లోకాచార్యులు అని కూడా పిలుస్తారు.
- వడకుత్తిరువీధిపిళ్ళై (శ్రీ కృష్ణ పాదులు) – వీరు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు. నంపిళ్ళై చేసిన కాలక్షేపాన్ని శ్రద్ధగా విని, వాటిని శాస్త్రీయంగా లిఖించి, మనకు అమూల్యమైన వ్యాఖ్యానంగా అందించారు. పిళ్ళై లోకాచార్యులు, అళగియ మనవాళపెరుమాళ్ నాయనార్లు వీరు పుత్రులు
- పిళ్ళై లోకాచార్యులు – శ్రీవైష్ణవ సంప్రదాయానికి స్థంభంలా నిలిచిన మహానుభావుడు. అనేక రహస్య గ్రంథాలు రచించారు. విదేశీ దాడుల సమయంలో నంపెరుమాళ్‌ను రక్షించి, తిరిగి మనకు అందించిన మహోన్నత సేవ వీరిది
- తిరువాయ్మొళిపిళ్ళై (శ్రీశైలేశర్) — వీరు పిళ్ళై లోకాచార్యుల ప్రధాన శిష్యులు. మధురై సమీపంలోని కుంతీనగరంలో జన్మించారు; కొంతకాలం మదురై రాజ్యానికి ప్రధాన సలహాదారుగా పనిచేశారు. పిళ్ళై లోకాచార్యర్ శిష్యుడైన కూర కులోత్తమ దాసర్ వారిని సరిదిద్ది, పిళ్ళై లోకాచార్యుల ఆజ్ఞ ప్రకారం వారిని సంప్రదాయ నాయకుడిగా నియమించారు. ఆళ్వార్ తిరునగరిలో నివసిస్తూ అడవులు, పొదలు తొలగించి పట్టణాన్ని మళ్లీ అందంగా తీర్చిదిద్దారు, ఆదినాథ పెరుమాళ్, నమ్మాళ్వార్ సన్నిధులను పునర్నిర్మించారు, ఆలయారాధనను తిరిగి స్థాపించారు, దాడుల తర్వాత బయట ఉంచిన నమ్మాళ్వార్‌ను తిరిగి పట్టణంలోకి తీసుకువచ్చి, అన్ని కైంకర్యాలు శోభాయమానంగా జరిగేలా చేశారు, తిరుప్పుళియాళ్వార్ చెట్టు క్రింద ఎంపెరుమానార్ విగ్రహం ఉందని స్వప్నంలో దర్శించి, పట్టణం పశ్చిమ భాగంలో చతుర్వేది మంగళం ఏర్పాటు చేసి, భవిష్యదాచార్య సన్నిధిలో ఎంపెరుమానార్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తిరువాయ్మొళి ప్రచారం పట్ల వారికున్న అపారమైన ప్రేమ వల్ల తిరువాయ్మొళి పిళ్ళైగా సంభోదించబడినారు. నమ్మాళ్వార్ మహిమను ఎల్లప్పుడూ గానం చేస్తూ శఠగోప దాసర్ అనే పేరును పొందారు.
- పెరియ జీయర్ — మనవాళ మామునులు – పెరియ జీయర్ — మనవాళ మామునిగళ్ – వీరు ఆళ్వార్ తిరునగరిలో జన్మించి, తిరువాయ్మొళి పిళ్ళై శిష్యుడయ్యారు. భవిష్యదాచార్య సన్నిధిలో ప్రేమతో కైంకర్యం చేశారు. ఎంపెరుమానార్ల పట్ల అపారమైన భక్తి వల్ల వీరిని యతీంద్ర ప్రవణర్ అని పిలుస్తారు. తిరువాయ్మొళి పిళ్ళై పరమపదించిన తర్వాత, మామునిగళ్ శ్రీరంగానికి వెళ్లారు. అక్కడ దాడుల వల్ల దెబ్బతిన్న ఆలయాన్ని పునర్నిర్మించారు, హక్కులు కోల్పోయిన ఆర్చకులు, సేవకుల గౌరవాన్ని తిరిగి స్థాపించారు, కైంకర్యాలు మహోత్సాహంగా జరిగేలా చేశారు, వీరు ఈడు 36000 పది వ్యాఖ్యానం మీద ప్రత్యేక నైపుణ్యం సంపాదించి ఈట్టు ప్పెరుక్కర్ అనే బిరుదు పొందారు, సాక్షాత్తు పెరుమాళ్ళకే ఆచార్యులుగా భావించబడ్డారు. శ్రీరంగంలో నంపెరుమాళ్ స్వయంగా ఆజ్ఞాపించి వారిని అనేక కైంకర్యాలకు నియమించారు. తరువాత నంపెరుమాళ్ ఆజ్ఞతో, మామునిగళ్ ఒక సంవత్సరం పాటు తిరువాయ్మొళి ఈడు 36000 పది కాలక్షేపం చేశారు. ఆ సంవత్సరం మొత్తం ఎంపెరుమాన్ తన ఉత్సవాలను నిలిపివేసి తన కుటుంబంతో కలిసి మామునిగళ్ కాలక్షేపాన్ని ఆనందంగా శ్రవణం చేశాడు. కాలక్షేపం ముగిసినప్పుడు, ఎంపెరుమాన్ చిన్నబిడ్డ రూపంలో ప్రత్యక్షమై, మామునిగళ్‌ను తన ఆచార్యుడిగా అంగీకరించి, “శ్రీశైలేశ దయాపాత్రం…” అనే తనియన్‌ను సమర్పించాడు. తన శిష్యుడిగా ఉండే ఎంపెరుమాన్, తన ఆదిశేష పర్యంకాన్ని మామునిగళ్‌కు సమర్పించి వారిని ఘనంగా సత్కరించాడు. వారిని రమ్య జామాతృ ముని అని కూడా పిలుస్తారు.
ఈ విధంగా, ఓరాణ్ వళి ఆచార్య పరంపరపెరియ పెరుమాళ్‌తో ప్రారంభమై, మనవాళ మామునిగళ్‌తో పరిపూర్ణమై, మామునిగళ్‌ను తిరిగి పెరియ పెరుమాళ్ ఆచార్యుడిగా స్వీకరించడం ద్వారా దివ్యమైన పరంపరగా కొనసాగుతుంది.
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
మూలం: https://divyaprabandham.koyil.org/index.php/2025/12/vazhi-thirunamams-oranvazhi-intro-simple/
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org