శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
దివ్యప్రబంధాన్ని అరులిచ్చేయల్ అని కూడా పిలుస్తారు. ప్రబంధం అంటే బంధించేది అని అర్ధం. ఆళ్వార్లుల ప్రబంధాలకు భగవంతుడైన ఎంపెరుమాన్నే భక్తులతో కలిపి బంధించే శక్తి ఉంది. అలాగే, అది భక్తులను భగవద్ విషయాలలో నిమగ్నులయ్యేలా చేసి, వారిని ఎంపెరుమాన్తో బంధిస్తుంది. అందువల్ల దాన్ని ప్రబంధం అంటారు.
దివ్యప్రబంధం సంసారిక లోపాలకు అందనిది. ఇది మనల్ని నిష్కళ్మషమైన, శుద్ధమైన భగవద్ అనుభవంలో నిమగ్నులయ్యేలా చేస్తుంది.
వేదం ఒకే శాస్త్రమైనా వేదవ్యాసుడు జనులకు సులభంగా అర్ధం కావడానికి దానిని నాలుగు భాగాలుగా విభజించాడు, ఆ నాలుగు వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం.
అదే విధంగా శ్రీ నాథమునులు దివ్యప్రబంధాన్ని నాలుగు భాగాలుగా విభజించారు, మొదలాయిరం, రెండామాయిరం, ఇయఱ్పా / మూన్రామ్ ఆయిరం, నాంగామ్ ఆయిరం.
దివ్య ప్రబంధంలోని నాలుగు భాగాలు:
మొదటి ఆయిరం లో పెరియాళ్వార్, ఆండాళ్ నాచ్చియార్, కులశేఖర ఆళ్వార్, తొండరడిపొడి ఆళ్వార్, తిరుప్పాణ్ ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుమళిశై ఆళ్వార్ (తిరుచ్ఛంద విరుత్తం) అనుగ్రహించిన ప్రబంధాలు చేర్చబడ్డాయి.
రెండవ ఆయిరం లో పెరియా తిరుమొళి, తిరుక్కుఱున్దాణ్డకమ్, తిరునెడున్దాణ్డకమ్ ఉన్నాయి.
మూడవ ఆయిరం లో ఇయఱ్పాను చేర్చారు. ఇది గద్య రూపం, రాగం-తాళం లేకుండా పఠించబడే గద్యం.
తమిళంలో సాహిత్యానికి మూడు భాగాలు ఉంటాయి:
- ఇయల్ (గద్య రూపం) – గానం ఉండదు.
- ఇసై – సంగీతరూపంలో ఆలపింపబడేది .
- నాటకం – నాటికల రూపం.
నాంగామాయిరం లో నమ్మాళ్వార్లు రచించిన తిరువాయ్మొళి ఉంటుంది
దివ్యప్రబంధం మన శ్రీవైష్ణవ సంప్రదాయానికి జీవనాడి వంటిది. నమ్మాళ్వార్లను ఆళ్వార్ల నాయకునిగా భావిస్తారు.
నమ్మాళ్వార్ల రచనలు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, తో సమానము.
- తిరువిరుత్తం – 100 పాశురాలు – ఋగ్వేదానికి సమానమైనది
- తిరువాసిరియం – 7 పాశురాలు – యజుర్వేదానికి సమానం
- పెరియ తిరువందాది – 87 పాశురాలు – అథర్వణవేదానికి సమానం
- తిరువాయ్మొళి – 1102 పాశురాలు – సామవేదానికి సమానం
వేదాల 6 అంగాలు ఉన్నట్టే, తిరుమంగై ఆళ్వార్ రచనలు నమ్మాళ్వార్ రచనలకు వేదాంగాలవంటి సహాయ రచనలు:
వేదాంగాలు అంటే శిక్ష (ఉచ్చారణ), వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం (పదార్థ వివరణ), జ్యోతిషం, కల్పం (కర్మానుష్ఠానాలు).
మిగతా ప్రబంధాలు అన్నీ నమ్మాళ్వార్ల రచనలకు అంగాలుగా భావించబడతాయి.
దివ్యప్రబంధాల ఉద్దేశ్యం – ఎంపెరుమాన్ కు మంగళాశాసనం చేయడం.
ఆళ్వార్ల పాశురాలను పునఃపునః అనుసంధానం చేయడం ద్వారా, మనం భగవంతునికి మంగళాశాసనం చేస్తున్నవారమవుతాం.
పొన్నడిక్కాళ్ జీయర్ “తిరుప్పావై స్వాపదేశం” లో పేర్కొన్నట్లు, ప్రతిరోజూ తిరుప్పావై పారాయణం చేయడం ద్వారా మన గురుపరంపరను, ద్వయ మహామంత్రాన్ని స్మరిస్తున్నాం, మంగళాశాసనం చేస్తున్నాం.
అరులిచ్చేయల్ (దివ్యప్రబంధం) మొత్తం అర్చావతార అనుభవానికే ఉద్దేశించబడింది. శ్రీ రామునిగా అవతారాన్ని స్వీకరించిన పరమాత్మని వివరించడానికి వేదం శ్రీమద్ రామాయణంగా అవతారాన్ని స్వీకరించినదని ఈ సూత్రం వివరిస్తుంది. ఈ విషయం అళగియ మణవాళపెరుమాళ్ నాయనార్ తన “ఆచార్య హృదయం” లోని 70వ చూర్ణికలో స్పష్టంగా వివరించారు.
అక్కడ నాయనార్ “వేద-వేద్య” న్యాయాన్ని ఆధారంగా తీసుకొని ప్రమాణం-ప్రమేయం చక్కగా వివరించారు.
- వేదం – భగవంతుని పరత్వాన్ని (పరమపదనాథుడు) వివరిస్తుంది
- శ్రీ పాంచరాత్రం – వ్యూహమూర్తులను వివరిస్తుంది
- మనుస్మృతి – అంతర్యామి రూపాన్ని వివరిస్తుంది
- రామాయణం, మహాభారతం – విభవావతారాలను (రాముడు, కృష్ణుడు) వివరిస్తాయి
- అరులిచ్చేయల్ (తమిళ వేదం) – అర్చావతార భగవంతుని గురించి వివరిస్తుంది
ఎంపెరుమాన్ కొంతమంది జీవాత్మలను ప్రత్యేకంగా ఎంపిక చేసి, తన దివ్యసౌందర్యాన్ని, కళ్యాణ గుణాలను చూపించి, భూత భవిష్యత్ వర్తమానాల్నీ గ్రహించగలిగే నిర్దోషమైన జ్ఞానాన్ని ఇచ్చి వారిని “ఆళ్వార్లుగా” తీర్చిదిద్దాడు.
“ఆళ్వార్” అనే పదానికి అర్థం – భగవద్విషయంలో నిగ్నమైపోయినవారు.
ఇయఱ్పా సాధారణంగా ఉత్సవమూర్తుల పురప్పాడులో (రథోత్సవంలో) పఠించబడుతుంది
ఇయఱ్పా
తమిళంలో సాహిత్యానికి మూడు భాగాలు ఉంటాయి.
ఇయల్ – ఇది సాధారణంగా సంగీతంతో పాడబడదు మరియు రాగ తాళాలకు పెట్టబడదు.
ఇసై – ఇది రాగం, తాళంతో సంకలితమైన పద్ధతిలో ఉంటుంది. ముదల్ ఆయిరం, రెండాం ఆయిరం, తిరువాయ్మొళి (నాంగామ్ ఆయిరం) అన్నీ ఈ “ఇసైపా” రూపంలో ఉన్నాయి. ఈ 3000 ప్రవంధాలకూ తాళం, రాగం నిర్వచించబడినవి.
నాటకం- నాటిక.
ఇయఱ్పా – ఇది మూడవ ఆయ్యిరం, అంటే మూడవ 1000 పాశురాలు. ఈ “ఇయఱ్పా” విభాగానికి చెందిన ప్రవంధాలు ఇవే:
- ముదల్ తిరువందాది-పొయ్ గైయాళ్వార్
- ఇరణ్డాన్తిరువన్దాది- భూతత్తాళ్వార్
- మూన్ఱాన్తిరువన్దాది- పేయాళ్వార్
- నాన్ముకన్తిరువన్దాది- తిరుమళిశై ఆళ్వార్
- తిరువిరుత్తం – నమ్మాళ్వార్
- తిరువాశిరియం – నమ్మాళ్వార్
- పెరియ తిరువందాది- నమ్మాళ్వార్
- తిరువెళుకూర్ట్రిరుక్కై – తిరుమంగై ఆళ్వార్
- శిరియ తిరుమడల్ – తిరుమంగై ఆళ్వార్
- పెరియ తిరుమడల్ – తిరుమంగై ఆళ్వార్
- రామానుశనూత్తన్దాది- తిరువరంగత్తు అముదనార్
ముదల్ ఆయిరంలో తిరుపల్లాండు ముందు పాడబడుతుంది, కానీ మొట్టమొదటి ప్రబంధం – పొయ్గై ఆళ్వార్ యొక్క ముదల్ తిరువందాదియే.
పెరియవాచ్చాన్ పిళ్ళై తన వ్యాఖ్యానంలో ప్రతి ఆళ్వార్ ఎంపెరుమాన్ వేర్వేరు రూపాలపై దృష్టి పెట్టారని చెబుతారు. ఆయన ఇలా వివరిస్తారు:
- శుక మహర్షి మొదలైన వారు మరియు ముదల్ ఆళ్వార్లు – పరత్వం పై దృష్టి.
- సనకాది మునులు(సనక, సనాతన, సనంధన, సనత్కుమార) మరియు తిరుమళిశై పిరాన్ అంతర్యమిత్వంలో మునిగిపోయారు.
- వాల్మీకి, కులశేఖర ఆళ్వార్ – రామావతారంపై.
- పరాశర, వేదవ్యాస, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్ – కృష్ణావతారం పై.
- నారదుడు, తొండరడిప్పోడిఆళ్వార్, తిరుప్పాణాళ్వార్ – శ్రీరంగనాథునిపై.
- శౌనకుడు మరియు తిరుమంగై ఆళ్వార్ – అన్ని అర్చావతారాలపై.
అయితే ప్రతి ఆళ్వార్లుకీ వేర్వేరు దృష్టి ఉన్నా, వారి మంగళాశాసనాల ద్వారా అర్చావతారాన్ని సమష్టిగా అనుభవించారు.
ముదల్ ఆళ్వార్లు
- పొయ్గై ఆళ్వార్ – తిరువెక్కా యథోక్తకారి దేవస్థానానికి సమీపంలోని చెరువులో అవతరించారు.
- భూతత్తాళ్వార్ – తిరుక్కడల్మల్లై స్థలశయనపెరుమాళ్ ఆలయానికి సమీపంలోని చెరువులో జన్మించారు.
- పేయాళ్వార్ – తిరుమయిలై కేశవ పెరుమాళ్ ఆలయం సమీపంలోని బావిలో జన్మించారు.
ఈ ముగ్గురిని సాధారణంగా కలిపి సేవిస్తారు, అందుకు కారణం:
- వరుసగా మూడు రోజుల పాటు జన్మించారు – పొయ్గై, భూతత్త, పేయాళ్వార్.
- ద్వాపరయుగం చివరి మరియు కలియుగం ప్రారంభం మధ్యకాలంలో అవతరించారు – యుగ సంధి.
- వీరంతా అయోనిజులు – మానవ స్త్రీ గర్భంలో కాకుండా పుష్పాల నుండి అవతరించారు.
- జన్మించగానే భగవంతుడి పై పరమ భక్తితో జీవించారు.
- ఓ దశలో ఒకరినొకరు కలుసుకున్నారు, ఆ తరువాత కలిసి తిరుమల, తిరుపతి వంటి దివ్యదేశాలను సందర్శించారు. వీరిని “ఓడిత్ తిరియుమ్ యోగిగళ్” అంటారు – ఎప్పుడూ యాత్ర చేస్తున్న యోగులు.
ఈ ముగ్గురు కలిసి చూసేందుకు ఎంపెరుమాన్ తాను స్వయంగా ఏర్పాటుచేశాడు. ఒక రోజు రాత్రి, గాలివానలతో కూడిన రాత్రి సమయంలో వీరిని తిరుక్కోవలూర్ లోని ఓ చిన్న కుట్టీకి (గుడిసె) రప్పించాడు.
అందులో ఒకరికి పడుకునే స్థలం, ఇద్దరికి కూర్చునే స్థలం, ముగ్గురికి నిలబడే స్థలముంటుంది.
- ముందుగా పొయ్గై ఆళ్వార్ వచ్చారు – పడుకోవచ్చు
- తర్వాత భూతత్తాళ్వార్ వచ్చారు – ఇద్దరూ కూర్చున్నారు
- చివరగా పేయాళ్వార్ వచ్చారు – ముగ్గురు నిలబడ్డారు
అందులో స్థలం కుదరకపోయినా, భగవత్కథాలోలులై, పరమాత్మ భావంలో తలదాల్చారు.
ప్రపంచంలో అందరూ వ్యక్తిగత ప్రదేశాన్ని కోరుకుంటారు. కానీ ఈ ముగ్గురు ఆళ్వార్లు మాత్రం ఆత్మపై దృష్టిపెట్టి, శరీరాన్ని పక్కనపెట్టి, పరస్పరం స్నేహంగా స్థలాన్ని పంచుకున్నారు.
ఎంపెరుమాన్ “ఎంత చక్కటి భాగవత్ గోష్టి! వీరితో కలిసి ఉండాలని నేను వీరిని ఇక్కడికి రప్పించాను.” అనుకుని, పిరాట్టి తో పాటు వేంచేసాడు. ఆళ్వార్లు ఉన్న చిన్న గుడిసెలో ప్రవేశించారు – అది చీకటిగా ఉంది.
ఇప్పుడు, ఎవరరో వచ్చారని తెలుసుకుని, చూడాలనుకున్నరు.
ముదల్ తిరువందాది
పొయ్ గై ఆళ్వార్లు, భగవంతుని స్మరణతో భూమిని ప్రమిదగా, సముద్రాన్ని నెయ్యిగా, సూర్యునిని జ్యోతిగా ఊహించి, ఆ ప్రదేశాన్ని ప్రకాశింపచేసి ఎమ్పెరుమాన్ ని చక్కటి పదాలతో అర్చించారు. ఆ పరమాత్మను తలచినప్పుడు మన దుఃఖ సముద్రం దూరమవుతుంది.
*వైయమ్ తకళియా| వార్ కడలేనెయ్యాగ|
వెయ్యకతిరోన్| విళక్కాగ |నెయ్యి
శుడరాళియాన్ అడిక్కే| శూట్టినేన్ శొల్ మాలై|
ఇండియాని నీఙ్గుగవే ఎన్ఱు||
ఈ పాశురంలో అనుమాన ప్రమాణాన్ని స్వీకరించారు. మనము ఈ ప్రపంచ సౌందర్యాన్ని చూస్తున్నాము అంటే దానిని ఎవరో సృష్టించారన్న విషయం తార్కికంగా స్పష్టమవుతుంది. వేదాలు కూడా ఈ జగత్తు భగవంతుని సృష్టి అని చెబుతున్నాయి. కాబట్టి ఇది శాస్త్రానుకూలమైన అనుమానమవుతుంది.
పాశురం 15:
ముదలావార్ మూవరే, అం మూవరుల్లుమ్
ముదలావాన్, మూరి నీర్ వణ్ణన్ – ముదలాయ
నల్లాన్ అరుల్ అల్లాల్, నామనీర్ వైయగత్తు
పల్లార్ అరులుమ్ పళుదు
బ్రహ్మా, విష్ణువు, శివుడు – వీరంతా ప్రధానమైన దేవతలు అయినప్పటికీ, వీరందరిలో విశిష్టుడైనవాడు విస్తృతమైన సముద్రవర్ణాన్ని కలిగిన శ్రీమన్నారాయణుడు. ఆయనే జగత్కారణుడు. ఆయనయొక్క కృప మాత్రమే మోక్షమివ్వగలదు. ఇతరుల కృప మోక్షమివ్వలేదు కనుక వ్యర్ధము. ఇది ఎమ్పెరుమాన్ పరత్వాన్ని స్థాపిస్తుంది.
పాశురం 53:
శెన్ఱాల్ కుడైయామ్| ఇరున్దాల్ శిఙ్గాశనమామ్|
నిన్ఱాల్ మరవడియామ్| నీళ్ కడలుళ్| ఎన్ఱుమ్
పుణైయామ్ మణివిళక్కామ్| పూమ్ పట్టామ్ పుల్ గుమ్
అణైయామ్| తిరుమాఱ్కు| అరవు||
పిరాట్టి తో కలసి ఉన్న భగవంతునికి ఆదిశేషుడు అనేక విధాలుగా సేవ చేస్తాడు. ఆయన బయలుదేరినప్పుడు అయనకు గొడుగవుతాడు, కూర్చున్నప్పుడు సింహాసనమవుతాడు, నిలబడ్డప్పుడు పాదరక్షలవుతాడు, విశ్రాంతిచెందినప్పుడు పడకగా మారతాడు. ఇవన్నీ నిష్కామభక్తితో చేసే సేవలు. భగవంతుడు ప్రేమతో చేసిన సేవను ఆనందంగా స్వీకరిస్తాడు.
చివరి పాశురం:
ఓర్ అడియుమ్ శాడు ఉదైత్త| ఒణ్ మలర్ చ్చేవడియుమ్|
ఈ రడియుమ్| కాణలామ్ ఎన్నెఞ్జే| ఓరడియిల్
తాయవనైక్కేశవనై| త్తణ్డుళాయ్ మాలై శేర్|
మాయవనై యే| మనత్తువై ||
ఓ మనసా! అన్ని లోకాలను కొలిచిన పాదాలను, శకటాసురుణ్ని తొక్కిన పవిత్ర పాదాలను తలచు. అసుర కేశిని చంపినవాడిని,అద్భుతమైన చేష్టితములు చేసిన కేశవుడిని మనసులో స్థాపించు.” అర్థమేమిటంటే, భగవంతుడే లక్ష్యం మరియు ఆయనే సాధనం అనే జ్ఞాననన్ని ఈ పాశురం ప్రసాదిస్తుంది.
ఇరణ్డాన్తిరువన్దాది – పాశురం 1:
అన్బే తగళియా, ఆర్వమే నెయ్యాగా,
ఇన్బురుకుశిన్దై ఇడుతిరియా – నన్బురుగి
జ్ఞానచ్ఛుదర్ విలక్కు ఏరిగినేన్ నారాణర్కు
జ్ఞానత్తమిళ్ పురింద నాన్
ఇక్కడ ఆళ్వార్లు భగవంతునిపై ప్రేమతో, ఆరాధన భావంతో జ్ఞానదీపాన్ని వెలిగించారు. ప్రేమను ప్రమిదగా, తపనను నెయ్యిగా, జ్ఞానాన్ని వత్తిగా తీసుకుని, పరమాత్ముని కోసం ఈ పాశురాన్ని సమర్పించారు. ఇది పరభక్తిని ప్రతిబింబిస్తుంది.
పాశురం 21:
తామ్ఉళరే, తమ్ముళ్ళతో ఉళ్ళుళదే, తామరైయిన్
పూవుళదే, ఏత్తమ్ పొళుదుణ్డే, వామన్
తిరుమరువు, తాళ్ మరువు శెన్నియరే,శెవ్వే
అరునరకం, శేర్వదు అరిదు
ఇక్కడ ఆళ్వార్లు ప్రశ్నిస్తున్నారు – మన వద్ద శరీరం ఉంది, మనస్సు ఉంది, తామర పుష్పం ఉంది, సమయం ఉంది, వామన మూర్తి ఉన్నాడు, ఆయన పాదాలను తలపై ఉంచుకున్నాం – అయినా ఎందుకు మనం ఆయన్ని సేవించడం లేదా? ఇది విచిత్రమైన విషయం.
చివరి పాశురం 100:
మాలే నెడియానే, కణ్ణనే, విణ్ణవర్ క్కుమ్
మేలా, వియన్ తుళాయ్ కణ్ణియనే,మేలాల్
విళవిన్ కాయ,కన్ఱినాల్ వీళ్ త్తవనే,ఎన్ఱన్
అళవన్ఱాల్,యానుడైయఅన్బు
“ఓ భక్తులపై అపారమైన ప్రేమ కలవాడా! ఓ పరిమాణించలేని పరమాత్మా! ఓ నిత్యసూరులకు అధిపతివైన వాడవు! ఓ తులసిమాల ధరించినవాడవు! ఓ కృష్ణునిగా అవతరించినవాడవు! నీపై ఉన్న నా ప్రేమ పెరిగిపోయింది.” అని ఆళ్వార్లు పరమభక్తితో పాడుతున్నారు.
మూన్ఱాన్తిరువన్దాది
పూదత్తాళ్వాలు, పొయిగై ఆళ్వార్లు విలిగించిన జ్యోతిని పేయాళ్వార్లు దర్శించారు.
మూన్ఱామ్ తిరువందాదిలోని మొదటి పాశురంలో,
తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తిగళుం
అరుక్కణ్ ఆణి నిఱముమ్ కణ్డేన్,శెరుక్కిళరుమ్
పొన్నాళి కండేన్ పురిసంగం కైక్కండేన్
ఎన్నాళి వణ్ణన్ పాలిన్ఱు
ఈ పాశురంలో ఎంబెరుమాన్ ని, పిరాట్టిని కళ్లతో దర్శించిన అనుభూతిని పేయాళ్వార్ ప్రకటిస్తున్నారు. మొదటి, మరియి చివరి పాశురాల్లో “తిరు” పదం మనకు కనిపిస్తుంది.
రెండవ పాశురంలో:
ఇన్ఱే కళల్ కణ్డేన్ ఏళ్ పిరప్పుం యాన్ అఱుత్తేన్
పొంతూయ్ వరైమార్విల్ పూంథుళాయి – అంధ్రు
తిరుక్కండు కొండ తిరుమాలే ఉన్నై
మఱుక్కండు కొండు ఎన్ మనం
ఇందులో, పరమాత్మ పాదాలను కీర్తిస్తారు..
16వ పాశురంలో:
వన్దు ఉదైత్త వెణ్ తిరైకళ్, శెంపవళవెణ్ ముత్తం,
అన్ది విలక్కుమ్ అణి విలక్కామ్** – ఎన్నై
ఒరుఅల్లిత్త తామరైయాళ్ * ఒన్రియ శీర్ మార్వన్*
తిరువల్లిక్కేణియాన్ శెన్ఱు**
ఈ పాశురంలో తిరువల్లిక్కేణి లో వేంచేసిఉన్న పెరుమాళ్ళను మనగళాశాసనం చేస్తున్నారు.
పాశురం 57:
పొలిందు ఇరుంద కార్వానిల్ మిన్నే పోల్ తోన్ఱి
మలిన్దు తిరువిరుంద మార్వన్ – పొలింద
గరుడన్ మేల్ కండ కరియాన్ కలళే
తెఱుళ్ తన్మేల్ కండాయ్ తెలి
ఈ పాశురంలో గరుడ వాహనుడైన ఎమ్పెరుమాన్ ని కీర్తిస్తున్నారు. పరమాత్మా వేదపురుషుడు, గరుడాళ్వార్ ఆయన పరత్వాన్ని సూచిస్తున్నాడు.
చివరి పాశురం:
శార్వు నమక్కెన్ఱుమ్ చక్కరత్తాన్ తణ్డుళాయ్
తార్ వాళ్, వరైమార్పన్ తాన్ ముయఙ్గుమ్, కారారంద
వానమరం మిన్ ఇమైక్కుం వణ్ణతామరై నెడుంకణ్
తేనం అరుం పూమేల్ తిరు
పెరియ పిరాట్టి మనకు దిక్కు. ఆమెను తన వక్షస్థలం లో నిలుపుకున్న వాడు మనకు శరణం.కనుక, ఆళ్వార్లు తాయార్ల తో మొదలు పెట్టి, వారితోనే ముగిస్తారు.
నాన్ముగన్ తిరువందాది:
మొదలు ఆళ్వార్లు ఎంపెరుమాన్ మాత్రమే తెలుసుకోవాల్సిన, పొందవలసిన వాడని చెప్పగా, ఏకైక ఆనందయోగ్యుడిగా స్థాపించగా, తిరుమళిసై ఆళ్వార్ ఆ అనుభవంలో ఉన్న కలుపును తొలగిస్తారు. భగవంతుని అనుభవించటానికి అడ్డుగా ఉండే కలుపు ఏమిటి? ఇతర దేవతలను ఆరాధించడమే ఆ ప్రధానమైన కలుపు. ఈ దివ్య ప్రబంధమైన నాన్ముగన్ తిరువందాధిలో, ఇతర దేవతలను పరమేశ్వరునిగా భావించే సంసారులకు, ఆ ఇతర దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుని ఆధీనంలోనే ఉన్నారని ఆళ్వార్లు బోధిస్తారు. ఈ జగత్తుకు ఏకైక నియంత కూడా శ్రీమన్నారాయణుడే అనే సత్యాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తారు.
తనియన్:
నారాయణన్ పడైత్తాన్ నాన్ముకనై, నాన్ముకనుక్కు
ఏరార్ శివన్ పిఱన్దానెన్నుమ్ శొల్, శీరార్
మొళిశెప్పివాళలామ్, నెఞ్జమే, మొయ్ పూమ్
మళిశైప్పరనడియే వాళ్ త్తు
నారాయణుడు బ్రహ్మాను సృష్టించాడు, ఆయన నుండి శివుడు జన్మించాడు.
ఈ అపూర్వమైన పాశురాన్ని మనకు అందించినవారు, పుష్పాలతో నిండిన తోటలు గల మళిశై అనే పట్టణంలో అవతరించిన మహోన్నతులు అయిన తిరుమళిశై ఆళ్వార్.
పాశురం 35:
తాళాల్ ఉలగం అళంద అశై వేకొల్?
వాళా కిడందరుళుం – నీళోదం
వందలైక్కుం మామయిలై మావల్లిక్కేణియాన్
ఐందలై వాయ్ నాగత్తణై
తిరువల్లిక్కేణి ఎంపెరుమాన్ మహిమను ఆళ్వార్లు కీర్తిస్తారు. ఆదిశేషునిపై శయనించుచున్న పరమాత్మా! లోకాలన్ని కొలిచావు కాబట్టి విశ్రాంతి తీసుకుంటున్నావా? అలలతో ముంచుకొస్తున్న తిరుమయిలై మహాక్షేత్రంలో, తిరువల్లిక్కేణి అనే మహత్తరక్షేత్రంలో నివాసం తీసుకున్నావా?
పాశురం 43:
మంగుల్ తోయ్ చెన్ని వడ వేంగడత్తానై
కంగుల్ పుగుందార్గళ్ కాప్పణివాన్ – తింగళ్
శడైయేఱ వైత్తానుమ్ తామరై మేలానుమ్
కుడైయేఱత్తామ్,కువిత్తు క్కొండు
ఇతర దేవతలు సాత్విక స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మను మంగళాశాసనం చేస్తారు. వారు కైంకర్యానికి కావలసిన ఉపకరణాలను తీసుకువచ్చి, పరమాత్మునికి మంగళాశాసనం చేస్తారు.
పాశురం 68:
తిఱంబేల్ మిన్ కండీర్ తిరువడి తన్ నామం
మఱందుం పుఱన్దొళామాన్దర్ – ఇరైంజియుం
శాదువరాయ్ పోదుమిన్గళెన్ఱాన్ నమనుం తన్
తూదువరై, క్కూవిచ్చెవిక్కు
మూగ్గురు ఆళ్వార్లు ఎంపెరుమాన్ పరత్వాన్ని స్థాపించారు. తిరుమజిసై ఆళ్వార్, ఎంపెరుమాన్ ఒక్కరినే ప్రార్థించవలసినదని, ఇతర దేవతల్ని ప్రార్థించడం తగదని బోధిస్తారు.
ఈ పాశురంలో యముడు తన దూతలతో వైష్ణవుల వద్దకు వెళ్లవద్దని ఆజ్ఞాపిస్తాడు.
శ్రీ వైష్ణవులు ఎంబెరుమానుడి పాదాలను కూడా మరచిపోవచ్చు, కానీ వారు ఇతర దేవతలను సేవించరు.
పాశురం 96:
ఇనియఱిందేన్ ఈశర్కుం నాన్ముగర్కుమ్ దెయ్ వమ్
ఇనియఱిందేన్ ఎంబెరుమాన్! ఉన్నై – ఇనియఱిందేన్
కారణన్ నీ కర్ట్రవై నీ కఱ్పవై నీ నల్ కిఱిశై
నారణన్ నీ నన్కఱిందేన్ నాన్
ఓ నా ప్రభూ! బ్రహ్మా మరియు రుద్రులకు నీవే పరమేశ్వరుడని నేను తెలుసుకున్నాను. నీ సహజ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను – నీవే సమస్త సృష్టికి మూలకారణము, ఇప్పటివరకు నేర్చిన సమస్త తత్వాలు నీవే, ఇంకా భవిష్యత్తులో నేర్చబోయే అంతటినీ నీవే. నీవే సర్వజగత్తుకు రక్షకుడవు. నీవే నా నారాయణుడవు.
ఇది ముదల్ తిరువందాదులు (పొయిగై , భూతత్త, పేయ్), మరియు తిరుమళిసై ఆళ్వార్లు వారి నాన్ముగన్ తిరువందాదికి సంబంధించిన సంక్షిప్త పరిచయం.
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్
ఆధారం: https://www.youtube.com/watch?v=m43vDKvv9dE&list=PLcJLpGJlP9mo0F6_Uo0G6u6Ey5KRBbc2w&index=6
ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/11/simple-guide-to-dhivyaprabandham-part-5/
కోశం : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org