ప్రమేయసారము 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< పాశురం 2

 

అవతారిక:

                    జీవాత్మలు తమ స్వరూమైన భగవద్దాసత్వాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలిసి వుంది. కేవలం తెలుసు కోవటమే చాలదు, నిరంతరం శ్రీమన్నారాయణునికి  కైంకర్యం చేస్తూ వుండాలి తప్ప ఇతర ప్రయోజనాలను ఆశించ రాదు. ఒక వేళ జీవుడు శ్రీమన్నారాయణునికి కైంకర్యం చేయక ఇతర ప్రయోజనాలను ఆశించినట్లయితే దాసభావం   కలిగిఉన్నట్లు కాదు. ఆ జీవుడు చెసే పనులకు ప్రయోజనం లేదు. శ్రీమన్నారాయణుడు త్రివిక్రమావతారంలో సకల భువనాలను తన శ్రీపాదాలతో కొలిచి, ఆ భువనాలు, వాటిలో ఉండే జీవులు అన్నీ ఆయనకే చెందినవని నిరూపించాడు. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ పాశురంలో స్వస్వరూపం తెలుసుకొని దాసభావంతో కైంకర్యం చేయని జీవుడు జనన మరణ చక్రం నుండి బయట పడలేడని చెపుతున్నారు.

పాశురము

పలం కొణ్డు మీళాద పావం ఉళదాగిల్

కులం కొణ్డు కారియం యెన్ కూరీర్?

తలం కొణ్డ తాళిణైయాన్ అన్రే తనైయొళింద యావరైయుం

ఆళుడైయాన్ అన్రే అవన్

 

ప్రతిపదార్థము;

పలం కొణ్డు = భగవంతుడి నుండి అనేక ఉపకారాలను పొంది

మీళాద = ఆధ్యాత్మిక చింతనతో బుధ్ధి వికాసించక

పావం = ఇంకా పాపపు చింతనలోనే

ఉళదాగిల్ = ఉంటే

కులం కొణ్డు = దాసులమన్న భావనతో (దాస కులము వారిమని)ఉన్నంత మాత్రాన

కారియం యెన్ కూరీర్ = ఫలితమేముంది చెప్పండి

తలం కొణ్డ = లోకములన్ని కొలుచుకున్న

తాళిణైయాన్ = శ్రీపాదములు గలవాడు

అవన్ = ఆలోకానికి అధిపతి

అన్రే = భూమిని కొలుచుకున్న ఆ కాలంలోనే

యావరైయుం = సకల ప్రాణులను

ఆళుడైయాన్ = తనకు దాసులుగా చేసుకున్న వాడు

అన్రే! = కదా!

వ్యాఖ్యానము:

పలం కొణ్డు మీళాద పావం ఉళదాగిల్ : సంపదలు మొదలగు అల్ప భోగాలకోసం పాకులాడుతూ ,దాని వలన కలిగే దుఖఃము  గురించి  జ్ఞానులు చెప్పే ప్రవచనాలు విని కూడా మళ్ళీ అల్ప ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వటాన్నే పాపకర్మలు  అంటారు. మనసు పదే పదే అల్ప సుఖాలను కోరి వాటినే చింతన చేయటాన్నే  పాప చింతన అంటారు.

        ఆచార్యుల ద్వారా భగవద్గీతా మొదలైన శాస్త్రాల ఉపదేసాలను విని కూడా అల్ప ప్రయోజనాలనిచ్చే లౌకిక విషయ వాంఛ నుండి బయటపడ లేకపోవటమే  పాపకర్మలు చేయటం అంటారు.

కులం కొణ్డు కారియం యెన్ కూరీర్? : భగవద్విషయం తప్ప మిగిలిన విషయాలలోనే ఆశక్తి కలిగి వున్న వారిని భగవంతుడు జనన మరణ చక్రం నుండి రక్షించడు. ఇతర విషయాసక్తులను సమూలంగా వదిలి వేయనిదే తన  శ్రీపాదాల దగ్గరకు చేర్చుకోడు. కాబట్టి భగవద్దాసులమనటం వలన ప్రయోజనం లేదని  తెలియ చెప్పటమే ఈ పాశుర సారాంశము.

       జీవాత్మ ‘ వాడికి మనం దాసులమన్న ‘ జ్ఞానం కలిగి వుంటే ఆ  జీవాత్మను ‘ వీడు మనవాడు ‘ అని ఆదరి స్తాడు. అది ఈ  జీవాత్మ ఉజ్జీవనానికి చాలదా అన్న ప్రశ్నకు తరువాతి పాదంలో జవాబు చెపుతున్నారు.

తలం కొణ్డ తాళిణైయాన్ : ‘ తలం కొణ్డ తాళిణైయాన్ ‘ అంటే భూమినికొలిచిన వాడు అని అర్థము. కాబట్టి ఈ పాదంలో త్రివిక్రమావతారాన్ని గురించి చెపుతున్నారు. మహా బలి ఇంద్రుడి ఏలుబడిలో ఉండిన భూలోక, భువర్లోక , సువరల్లోకాలను  ఏలాలని పెద్ద యాగం చేశాడు. ఇంద్రుడు శ్రీమన్నారాయణుని శరణు కోరాడు. ఇంద్రుడి కోసం భగవంతుడు మహా బలి యాగ శాలలోకి మరుగుజ్జులాగా వెళ్ళి ‘ మావలి తా మూవడి ‘ (మహాబలి ఇవ్వు మూడడు గులు) అని అడిగాడు. ఆ సుందర రూపాన్ని చూసి మహాబలి వెంటనే మూడడుగుల భూమిని దానంగా ఇచ్చాడు. దానం పొందిన నేలను కొలుచుకోవటం కోసం శ్రీమన్నారాయనుడు తన శరీరాన్ని పెంచి ఒక పాదంతో భూలోకాలను, మరొక పాదంతో ఊర్ధ్వ లోకాలను కొలిచాడు. మూడవ అడుగు పెట్టడానికి చోటు లేనందున  మహాబలి తల మీద తన పాదాన్ని ఉంచి కొలుస్తూ పాతాళ లోకానికి పంపి , ఇంద్రుడికి తాను కొలిచిన లోకాలను ఇచ్చాడనేది చరిత్ర.

అన్రే తనైయొళింద యావరైయుం ఆళుడైయాన్ అన్రే అవన్  :‘ అన్రే ‘ : ఆరకంగా కొలుచుకున్న ఆ రోజే

‘ తనైయొళింద యావరైయుం ఆళుడైయాన్ అన్రే అవన్ ‘ తనను తప్ప సమస్తమును కొలిచినవాడు , అందరిని తనకు దాసులుగా చసుకున్న వాడు , తన సంపదను కొలుచుకొని సంతోషించిన వాడు. దీనినే తిరుప్పాణ్ణాళ్వార్లు ‘  “ఉవంద ఉళ్ళత్తినాయ్  ఉలగలం అళందు” అన్నారు . తన దాసులకు తన శ్రీపాద ధూళిని ఇచ్చి ఉజ్జీవింప చేసిన వాడు .’ ఇంతటి ప్రేమ కలవాడు ఎందుకు ఈ లోకంలో పుట్టించి ఇన్ని కష్టాలను ఇవ్వాలి? అంటే జీవులు భగవంతుడిని  మరచి , ఆయన చేసిన ఉపకారాలను మరచి , ఈ లోక ప్రవాహంలో పడి కొట్టు కుంటూ అల్పమైన , అనిత్యమైన విషయాలనే శాస్వతమని భావించి వాటి కోసమే కాలాన్ని వృధా చేస్తున్నాయి. భగవంతుడు తప్ప ఇతర విషయాల మీద కోరిక  వదలనంత వరకు ఈ జనన మరణ చక్రంలో భ్రమణం తప్పదు. లౌకిక విషయాలలో ఆసక్తి పోగొట్టు కోకుండా కేవలం “అడియెన్ “ (దాసుడుని) అన్నంత మాత్రాన చాలదు.

 తిరువళ్ళువర్  “పిఱవి పెరుంకడల్ నీందువర్, నీందార్ ఇఱైవన్ అడి సేరాదార్” అని

                   “పఱ్ఱుగ పఱ్ఱఱ్ఱాన్ పఱ్ఱినై  పఱ్ఱుగ పఱ్ఱు విడఱ్కు” అన్నారు .

నమ్మాళ్వార్లు  “అఱ్ఱధు పఱ్ఱెనిల్ ఉఱ్ఱదు వీడు ఉయిర్” అన్నారు .

ప్రమేయ సారంలో “అవ్వానవర్”, “కులం ఒన్ఱు” “పలం” అనే మొదటి మూడు పాశురాలలో,  ప్రణవం ‘ యొక్క అర్థాన్ని వివరించారు. 4 నుండి 7వ పాశురం వరకు నమః పద అర్థాన్ని చెప్పుతున్నారు.

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2015/12/prameya-saram-3/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment