శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః
<< ఉయ్యక్కొండార్ (పుండరీకాక్షులు)

శ్రీ రామ మిశ్రులు – మణక్కాళ్
మణక్కాళ్ నంబి యొక్క అసలు పేరు దాశరథి. ఈ ఆచార్యునికి శ్రీ రామ మిశ్రులు అనే ప్రత్యేక నామం కూడా ఉంది. శ్రీరంగానికి సమీపంలోని మణక్కాళ్ అనే గ్రామంలో జన్మించినందున వీరిని మణక్కాళ్ నంబి అని పిలుస్తారు. నంబి అంటే — పూర్ణ గుణ సంపన్నుడు, శ్రేష్ఠమైన గుణాలతో నిండినవాడు — అని అర్థం. తిరుక్కురుంగుడి ఎమ్పెరుమాన్ను కూడా నంబి అని పిలుస్తారు. మధురకవి ఆళ్వార్ కూడా నమ్మాళ్వార్లను తిరుక్కురుగూర్ నంబి అని సంబోధించారు. పెరియాళ్వార్ కాలంలో సెల్వ నంబి అనే ఆచార్యులు పాండ్య రాజ్యంలో మంత్రి కూడా అయ్యారు. అందువల్ల, ఎంపెరుమాన్, ఆళ్వార్, ఆచార్యులు — వీరందరికీ “నంబి” అనే బిరుదు ఉపయోగించబడింది. ఈ పరంపరలోనే శ్రీ రామ మిశ్రర్ కూడా మణక్కాళ్ నంబిగా ప్రసిద్ధి చెందారు.
ఈ ఆచార్యుని మహిమల్లో ఒకటి : శ్రీ నాథమునుల మనవడు అయిన యామునాచార్యులను (ఆళవందార్) తిరిగి శ్రీవైష్ణవ సంప్రదాయంలోకి తీసుకువచ్చి, సంస్కరించి, మహా ఆచార్యునిగా తీర్చిదిద్దడం. యామునాచార్యర్ చిన్న వయసులోనే మహా పండితుడు. తరువాత రాజభోగాలలో మునిగిపోయినప్పుడు, మణక్కాళ్ నంబి అపార కరుణతో ఆయనను సంస్కరించి, భగవద్గీతా సారాన్ని బోధించి, తిరిగి ధర్మమార్గంలో నడిపించారు. మణక్కాళ్ నంబికి తన ఆచార్యులైన ఉయ్యక్కొండార్ పట్ల అపార భక్తి ఉండేది.
మణక్కాళ్ నంబి వాళి తిరునామములు:
తేశమ్ ఉయ్యక్ కొణ్డవర్ తాళ్ శెన్ని వైప్పోన్ వాళియే
తెన్న్ అరంగర్ శీర్ అరుళైచ్ చేర్న్దిరుప్పోన్ వాళియే
దాశరథి తిరునామం తళైక్క వందోన్ వాళియే
తమిళ్ నాథమునియుగప్పైత్ తాపిత్తాన్ వాళియే
నేశముడన్ ఆరియనై నియమిత్తాన్ వాళియే
నీళ్ నిలత్తిల్ పదిన్మర్ కలై నిఱుత్తినాన్ వాళియే
మాశి మగం తనిల్ విళఙ్గ వన్దుదిత్తాన్ వాళియే
మాల్ మణక్కాల్ నమ్బి పదం వైయగత్తిల్ వాళియే
తేశమ్ ఉయ్యక్ కొణ్డవర్ తాళ్ శెన్ని వైప్పోన్ వాళియే
ఉయ్యక్కొండార్ తమ రచనలతో ఈ లోకాన్ని ఉద్దరించారు. మణక్కాళ్ నంబి అంతటి ఘనమైన ఆచార్యులైన ఉయ్యక్కొండార్ యొక్క దివ్యపాదాలను తన తలపై ధరించారు.అటువంటి మణక్కాళ్ నంబి గారు చిరకాలం వర్ధిల్లాలి ( పల్లాండు).
మణక్కాళ్ నంబి తన ఆచార్యునికి అపారమైన భక్తితో అనేక విధాలైన కైంకర్యాలు చేసేవారు. వాటిలో ఒకటి — తమ ఆచార్యుని కుమార్తెలను నది తీరానికి తీసుకెళ్లి, వారి పనులు ముగిసిన తర్వాత సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేవారు. ఒక అన్నయ్యలా చూసుకునేవారు.
ఒకసారి వర్షం వల్ల మార్గం బురదగా మారింది. ఆ బాలికలు బురదలో నడవడానికి సంకోచించారు. అప్పుడు మణక్కాళ్ నంబి స్వయంగా బురదపై పడుకొని, వారు తన వీపుపై కాలు పెట్టుకొని దాటేలా చేశారు. ఇది తెలిసి ఉయ్యక్కొండార్ మొదట అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ నంబి ఇది ఆచార్యుల వారికి ప్రేమతో,భక్తితో చేసిన కైంకర్యమని వినయంగా చెప్పి వారిని శాంతింప చేశారు. ఉయ్యక్కొండార్లు ఆనందించి తమ దివ్య తిరువడిని నంబి తలపై ఉంచి ఆశీర్వదించారు. నంబి తన ఆచార్యుని వద్ద నిత్య కైంకర్య భాగ్యం కోరుకున్నారు. ఇలాంటి భక్తిశ్రేష్ఠుడు చిరకాలం నిలిచి ఉండాలి.
తెన్న్ అరంగర్ శీర్ అరుళైచ్ చేర్న్దరుప్పోన్ వాళియే
దక్షిణంలో ఉన్న అందమైన శ్రీరంగంలో నివసించే శ్రీరంగనాథపెరుమాళ్ వారి కృపకు ఎల్లప్పుడూ పాత్రుడైన మణక్కాళ్ నంబి చిరకాలం వర్ధిల్లాలి.నంబి గారు పెరియ పెరుమాళ్ళతో మొదలయ్యే గురుపరంపర వంశానికి చెందినవారు.అందువల్ల ఆయన ఎల్లప్పుడూ పెరియపెరుమాళ్ యొక్క అనుగ్రహం కలిగి ఉంటారు.
దాశరథి తిరునామం తళైక్క వందోన్ వాళియే
దాశరథి అంటే దశరథుని కుమారుడు—శ్రీరాముడు. నంబి తల్లిదండ్రులు ఆయనకు ఈ పవిత్ర నామం పెట్టారు. వారు నామం సార్థకం చేసుకొని ఆ నామానికి మరింత మహిమను చేకూర్చే విధంగా జీవించారు. ఇలాంటి మణక్కాళ్ నంబి గారు చిరకాలం వర్ధిల్లాలి.
తమిళ్ నాథముని యుగప్పైత్ తాపిత్తాన్ వాళియే
నాథమునిగళ్ తన మనవడు యమునైత్తురైవన్ (ఆళవందార్) శ్రీవైష్ణవ సంప్రదాయంలో మహోన్నత స్థితికి చేరాలని కోరుకున్నారు. అళ్వార్లు రచించిన తమిళ దివ్యప్రబంధాలను తిరిగి సంపాదించి ప్రపంచానికి అందించిన ఆ మహోన్నత ఆచార్యుని సంకల్పాన్ని నెరవేర్చిన మణక్కాళ్ నంబి పల్లాండుగా వర్ధిల్లాలి.
నేశముడన్ ఆరియనై నియమిత్తాన్ వాళియే
ఆళవందార్ రాజభోగాలలో మునిగిపోయినప్పుడు, మణక్కాళ్ నంబి ప్రేమతో, సహనంతో, తెలివైన మార్గాలతో ఆయనను చేరి, శ్రేష్ఠమైన ఆచార్యునిగా తీర్చిదిద్దారు. పెరియపెరుమాళ్ళని ఆళవందార్లను అంగీకరించి,అనుగ్రహించమని ప్రార్థించారు. “మీ తాతగారి పూర్వీకుల సంపద మీకోసం ఉంది” అని చెప్పి , తమ మాటలతో ఆళవందార్లను ఆకర్షించి, శ్రీరంగానికి తీసుకువెళ్లి నిజమైన సంపద పెరియ పెరుమాళ్ళే అతి పెద్ద సంపద అని చూపించారు. ఆ విధంగా మణక్కాళ్ నంబి గారు ఆళవందార్లకు శిక్షణ ఇచ్చి,గొప్ప ఆచార్యునిగా మార్చారు. ఇలాంటి ఆచార్యవర్యులు చిరకాలం వర్ధిల్లాలి.
నీళ్ నిలత్తిల్ పదిన్మర్ కలై నిఱుత్తినాన్ వాళియే
నాథమునిగళ్ నమ్మాళ్వార్ల అనుగ్రహంతో 4000 దివ్యప్రబంధాలను తిరిగి పొందారు. ఉయ్యక్కొండార్ వాటిని నేర్చుకొని వ్యాప్తి చేశారు. మణక్కాళ్ నంబి వాటిని ఉయ్యక్కొండార్ వద్ద నేర్చుకొని ఆళవందార్కు అందించారు. అలా అళ్వార్ల ఉపదేశ పరంపర నిరంతరంగా కొనసాగేలా చేశారు. ఇలాంటి మణక్కాళ్ నంబి చిరకాలం వర్ధిల్లాలి.
మాశి మగం తనిల్ విళఙ్గ వన్దుదిత్తాన్ వాళియే
మాఘ మాసంలో వచ్చే మఖ నక్షత్రంలో జన్మించిన మణక్కాళ్ నంబి తన మహోన్నత జీవితం వల్ల ఆ నెల, ఆ నక్షత్రానికే వైభవాన్ని చేకూర్చారు. ఇలాంటి ఆచార్యులు చిరకాలం వర్ధిల్లాలి.
మాల్ మణక్కాల్ నమ్బి పదం వైయగత్తిల్ వాళియే
మాల్ అంటే ప్రేమ. మణక్కాళ్ నంబి భగవంతుని పట్ల, ఉయ్యక్కొండార్ పట్ల, ఆళవందార్ పట్ల, భక్తులందరి పట్ల అపారమైన ప్రేమ కలిగినవారు. ఆయన తిరువడి మహిమ ఈ లోకంలో ఎన్నో యుగాలు నిలిచి ఉండాలి.
ఆళ్వార్, ఎంబారుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org