శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
మనం దివ్యప్రబంధం అంటే ఏమిటో, మరియు అది మనకు ఎలా అందిందో చూశాము. మన ఆచార్యుల కృప ద్వారా, ఆళ్వారుల రచనలు దివ్యప్రబంధం అని మనకు తెలిసింది. మన ఆచార్యులు ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు – ఎంపెరుమాన్ దివ్య కృపతో సంసారం నుంచి ఒక ఆత్మ/జీవుడిని ఎంపిక చేసి, పాశురాలను (అరుళిచ్చేయల్) చెప్పించారు.
అరుళిచ్చేయల్ అంటే ఏమిటి:
“అరుళిచ్చేయల్” అనే తమిళ పదం అద్భుతమైనది. దీని అర్థం: దివ్య కృపతో చేయబడినది మరియు ఇవ్వబడినది (అరుళాలే సేయ్యప్ పట్టదు). ఎవరి కృపతో అంటే? మన దివ్య కృపతో. ఆయన కృప వల్ల నే ఆళ్వార్లు ఎంపెరుమాన్ మహిమలను పాడారు. ఆసక్తికరంగా, ఇది ఆళ్వార్ల కృపగా కూడా చెప్పవచ్చు, ఎందుకంటే ఇది వారి స్వయంకృత అనుభవం. అందరు ఆళ్వార్లు తమ హృదయాల్లో దివ్య అనుభవాలు పొందవచ్చు మరియు పరమపదానికి చేరవచ్చు. కానీ, వారి దివ్య కృప వల్లనే ఈ అనుభవాలను పాశురాల రూపంలో మనకు ఇచ్చారు. ఆళ్వార్లు పాశురాలను ఇచ్చినా, కాలక్రమంలో కనుమరుగై పోయాయి. తర్వాత, శ్రీమన్ నాథమునిగళ్ నమ్మాళ్వార్ల అనుగ్రహంతో పాశురాలను పునరుద్ధరించారు. కాబట్టి ఇది ఆచార్యుల కృప కూడా అని చెప్పవచ్చు . ఎంపెరుమాన్, ఆళ్వార్ల, మన ఆచార్యుల దివ్యకృపతో సంపూర్ణంగా నిండి ఉన్నందున దీన్ని అరుళిచ్చేయల్ అంటారు.
జీవనం మరియు ఉజ్జీవనం:
అన్ని ఆత్మలు అనాదికాలంగా సంసారంలో జననం మరియు మరణ చక్రంలో ఉన్నా యి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో
అర్జునుని కి ఇలా చెబుతారు:
“నువ్వు మరియు నేను అనేక జన్మలెత్తాము, కానీ, అర్జున, తేడా ఏమిటంటే, నేను నా అన్ని జన్మలను తెలుసుకుంటున్నాను, కానీ నువ్వు నీ జన్మలను తెలుసుకోలేవు.”
అర్జునుడు అన్ని ఆత్మలకూ ప్రతినిధిగా నిలిచాడు. కాబట్టి, అన్ని ఆత్మలు శాశ్వతంగా అనేక జన్మలు ఎత్తి, జనన మరియు మరణ చక్రంలో ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు.
మన సనాతన ధర్మంలో, అనాది అంటే ఆరంభం లేనిది. ఈశ్వరుడు అనాది, ఆత్మ అనాది, సంసారం కూడా అనాది. ఇవన్నీ కాలం యొక్క పరిధిని దాటిపోయాయి. మనం కేవలం సమయ పరిమితిలోనే ఆలోచిస్తూ వస్తున్నాం, ఆ పరిమితిలో మొదలు మరియు ముగింపు ఉంటాయి. అందువలన, మనం ఆత్మలను ఒక నిర్దిష్ట సమయంలో సృష్టించబడినవని పొరపాటుగా భావించవచ్చు. కానీ, ఆత్మ అనాది కాబట్టి, దాని కర్మ కూడా అనాది మరియు సంసారం కూడా అనాది.
మనం ఈ సంసారంలో అనాదికాలం నుండి లక్షల జన్మలు ఎత్తుతూ ఉన్నాము.
. మనం ఈ పునరావృత జనన-మరణ చక్రం నుండి బయటకు రావాలి, దానిని ఉజ్జీవనం అంటారు. శరీరాన్ని కాపాడటానికి మాత్రమే జీవించడం అంటే జీవనం, కానీ ఆత్మ/జీవానికి లాభాన్ని కలిగించే విధంగా జీవించడం ఉజ్జీవనం.
మనం ఈ సంసారంలో ఉన్న అన్ని కాలాలలో, అజ్ఞానంతో కప్పబడ్డా, ఎంపెరుమాన్ మనకు సహాయం చేస్తున్నారు. అనేక జన్మల తర్వాత మనకు ఆచార్య సంబంధం లభిస్తుంది. అది కూడా కేవలం ఎంపెరుమాన్ దివ్యకృప వల్ల. మనకు స్వయంగా సంసార నుంచి బయటకు రావడానికి సామర్థ్యం లేదు. మన ఆళ్వార్లు, ఆచార్యులు ఈ ప్రపంచం ఎంత ప్రమాదకరమైనదో చెప్పారు. అందువలన, ఒక ఆత్మ చిన్న ప్రేరణ పొందినా, అది కూడా ఎంపెరుమాన్ కృప వల్ల మాత్రమే.
ఆత్మ చేయవల్సిన ఒకే ఒక్క పని ఏమిటంటే – ఎంపెరుమాన్ కృపను ఆడుకోకపోవడమే. ఎంపెరుమాన్ఎల్లప్పుడూ మనకు ఆయనను పొందే మార్గాలను చూపిస్తారు. ఉదాహరణకి, ఒక తండ్రి తన కుమారుడికి సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు, కుమారుడు ఇష్టపడకపోయినా, తండ్రి ప్రేమ వల్ల, నేరుగా కాకపోయినా పరోక్షంగా సహాయం చేస్తాడు. అంతే, ఎంపెరుమాన్ ఎల్లప్పుడూ ఆత్మ ఉజ్జీవనం కోసం ఆలోచిస్తారు, ఆత్మ అజ్ఞానంలో ఉన్నా సరే. ఈ విషయాలన్నీ ఆళ్వార్లు తమ పాశురాలలో చెప్పారు.
ఇప్పటివరకు ముదల్, ఇరండం, మున్రాం ఆయిరం పాశురాలను చూశాము. మున్రాం ఆయిరంలో, తిరువిరుత్తమ్,పెరియ తిరువన్దాది, తిరువాశిరియం చూశాము. ఇప్పుడు తిరువాయ్ మొళిని అనుభవిద్దాం.
తిరువాయి మొళి వైభవం:
తిరువాయి మొళి ను సామవేద సారము మరియు చాందోగ్య ఉపనిషత్ సారము గా పరిగణిస్తూ స్మరించబడుతుంది. సామవేదం సంగీతపరమైనది, అలాగే తిరువాయి మొళి కూడా ఎంతో సంగీతపరమైనది. మొదట, మనకు తిరువాయి మొళి ఎందుకు లభించిందో చూద్దాం. నమ్మాళ్వార్లు ఒక పాశురంలో (ఎన్రైక్కుమ్ ఎన్నై ఉయ్యక్కొండు పొగియ) అంటారు, అంటే ఎంపెరుమాన్ ఆళ్వార్లని కృపతో అనుగహ్రించి, తిరువాయి మొళి ద్వారా ఎంపెరుమాన్ మహిమలను పాడే దివ్యావకాశాన్ని ఇచ్చారు.
మామునులు కూడా తిరువాయ్ మొళి నూట్రాన్దాది ( 69)దీన్ని చెప్పా రు: “ఎన్దనై నీఇఙ్గు వైత్తదుఏదుక్కెన , మాలుమ్ ఎన్దనక్కు ఎన్దమర్కుం ఇన్బమదాం” అర్థం: ఎంపెరుమాన్ ను అడుగుతాడు – “నన్ను ఈ లోకంలో ఎందుకు ఉంచావు?” ఎంపెరుమాన్ సమాధానం ఇస్తారు – “నేను మరియు నా దాసులు నీ పాశురాలను విని దివ్య ఆనందాన్ని పొందుతాము, అదే నిన్ను ఇక్కడ ఉంచిన ఏకైక కారణం.”
తిరువిరుత్తంలో, ఆళ్వార్లు ఇప్పటికే తమకు ఎంపెరుమాన్ నుండి విరహం దుర్భరంగా ఉందని బాధను వ్యక్తం చేశారు. ఆళ్వార్ల నుండి పాశురాలను పొందడం ఎంపెరుమాన్ కు ప్రీతి. కాబట్టి, ఆయన ఆయువును పొడిగించారు, దీని ఫలితంగా తిరువాయి మొళి ఆవిర్భవించింది. ఇలా చేసి, ఎంపెరుమాన్ సంసారంలో ఉన్న ఆత్మలకు ఉజ్జీవనం పొందడానికి సహాయం చేయాలనుకున్నారు.
మాముని తిరువాయి మొళి నూట్రాన్దాదిలో , ఎంపెరుమాన్ సమాధానం ఆళ్వార్ల దివ్య హృదయాన్ని కరిగించింది, వారు ఎంపెరుమాన్ దివ్య ఇచ్ఛ మరియు కృపపై పూర్తి కృతజ్ఞతను భావించాడు.
ఆళ్వార్లు ఒక పాశురంలో చెబుతారు – “తోండర్కు అముదు ఉన్న సొల్ మాలైగల్ సొన్నేన్” అర్థం: ఈ అమృతాన్ని (తిరువాయ్ మొళి) పదాలతో చేసిన మాల అడియార్లకు ఇచ్చానని, వారు అందులో ఆనందం పొందాలని
మధురకవి ఆళ్వార్లు ఒక పాశురంలో చెబుతారు – “నావినాల్ నవిర్ట్రు , ఇన్బమెయ్ దినేన్
నమ్మాళ్వార్ల అమృత పాశురాలను నా నాలుకతో పఠిస్తూ అత్యంత ఆనందాన్ని పొందాను.
మన పూర్వఆచార్యులు కూడా వివరించారు – తిరువాయి మొళి ని పఠించడమే దివ్య అనుభవాన్ని ఇస్తుంది, అర్థం తెలుసుకున్నా లేదా, అది ఆనందాన్ని ఖచ్చితంగా ఇస్తుంది, ఇది తిరువాయి మొళి ప్రత్యేకత.
ఆచార్య హృదయంలో, నాయనార్ చెబుతారు – శ్రీ రామానుజాచార్యులు శ్రీ భాష్యాన్ని రాయడంలో ఎల్లప్పుడూ తిరువాయ్ మొళిని పరిశీలించేవారు .. శ్రీ భాష్యం బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానము. వేదవ్యాసుడు వేదాంతపు లోతైన అర్థాలను సూత్ర రూపంలో ఇచ్చారు. బ్రహ్మసూత్రాల లోతైన అర్థాలను గ్రహ్రించడానికి రామానుజులవారు తిరువాయ్ మొళినే పరిశీలించేవారు.
తిరువాయి మొళి ద్వారా నమ్మాళ్వార్లు అన్ని శాస్త్రాల ముఖ్యమైన అర్థాలను మనకు తెలియజేశారు. దీని ద్వారా తిరువాయి మొళి వైభవాన్ని మనం తెలుసుకుంటాం.
తిరువాయి మొళి యొక్క సంక్షిప్త అవలోకనం
తిరువాయి మొళి యొక్క ఒక తనియన్ లో :
మిక్క ఇఱై నిలైయుమ్| మెయ్యాం ఉయిర్ నిలైయుమ్|
తక్క నెఱియుమ్| తడైయాగి తొక్కియలుమ్|
ఊళ్ వినైయుమ్ వాళ్ వినైయుమ్| ఓదుమ్ కురుకైయర్ కోన్|
యాళిన్ ఇశై| వేదత్తు ఇయల్||
అర్థం: కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) యొక్క ప్రధానులు నమ్మాళ్వార్లు. ఆయన పాశురాలు దివ్య వీణ లాంటి స్వరం కలిగినవి. పాసురాల ద్వారా, ఎంపెరుమాన్ అందరికంటే ఉన్నతమైనవారని (ఇఱై నిలై – పరత్వం), ఆత్మ యొక్క నిజమైనస్థితి (ఉయిర్ నిలై) ను తెలియజేశారు. ఆత్మలు గుణాత్మకంగా ఒకే విధమైనవిగా ఉన్నప్పటికీ, ఈ విశ్వంలో అసంఖ్యాక ఆత్మలు ఉన్నాయని ఆయన చెప్పారు, బ్రహ్మం ఒక్కటి మాత్రమే అని, ఇతర ఆత్మలు లేవని మాయావాద తత్వం వేరుగా చెప్పినట్లే కాదు.
తరువాత, ఎంపెరుమాన్ ను పొందడానికి తగిన మార్గం (తక్క నేరి) చూపించబడింది. ఆత్మను ఎంపెరుమాన్ ను పొందడంలో ఆపుతున్న అడ్డంకి (తడైయాగి తొక్కియలుమ్) ఏమిటి అని వివరించబడింది. ప్రధాన అడ్డంకి మన గత చెడ్డ కర్మలే (ఉళ్ వినై). ఎంపెరుమాన్ ను పొందిన తరువాత, ఆత్మ పరమపదంలో ఎంపెరుమాన్ కి నిత్య కైంకర్యం/సేవను అనుభవిస్తుంది (వాజ్వు).
ఈ తనియన్ తిరువాయి మొళి పాసురాల్లో ప్రదర్శించబడిన అర్థ పంచకాన్ని సూచిస్తుంది:
పరమాత్మ స్వరూపం – పరమేశ్వరుడు శ్రీమన్ నారాయణ
జీవాత్మ స్వరూపం – జీవాత్మ యొక్క నిజ స్వరూపం
ఉపాయ స్వరూపం – ఎంపెరుమాన్ ను పొందడానికి మార్గాలు
విరోధి స్వరూపం – ఎంపెరుమాన్ ను పొందడంలో ఆపే అడ్డంకులు/కర్మ
ఉపేయ స్వరూపం – ఎంపెరుమాన్ ను పొందిన తరువాత పొందే ఆనందం (చివరి ఫలితం)
ఆచార్య హృదయంలో, నాయనార్ తిరువాయి మొళిలో అర్థ పంచకం ఎలా ప్రస్తావించబడిందో వివరిస్తారు. ఆచార్య హృదయం అళిగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఇచ్చిన గ్రంథం.
ఇక్కడ ఆచార్యు శబ్దం నమ్మాళ్వార్లని సూచిస్తుంది, హృదయం నమ్మాళ్వార్ల దివ్య హృదయాన్ని సూచిస్తుంది.
ఈ గ్రంథం తిరువాయ్ మొళి అర్థాలను మరియు నమ్మాళ్వార్ల మహిమలను పత్ర్యేకంగా వెలికితీస్తుంది. ఈ గ్రంథానికి, మనవాళ మామునులు వ్యాఖ్యానాలు అందించారు. చూర్ణికలో (మూన్రిల్ సురుక్కియ ఐన్దు) మామునులు అర్థ పంచకం రహస్య త్రయం లో ఎలా ఉందో వివరిస్తూ, అర్థ పంచకం జ్ఞానాన్ని తిరువాయి మొళిలో విస్తృతంగా చూడవచ్చని చూపించారు.
తిరువాయి మొళిలో అర్థ పంచకం
మామునులు తిరువాయి మొళిలో అర్థ పంచకం జ్ఞానం స్పష్టంగా చూడగలిగిన ప్రత్యేక భాగాలను సూచిస్తారు.
పరస్వరూపం : 4 పదికాలు
ఆళ్వార్లు ఎంపెరుమాన్ యొక్క పరత్వాన్ని – ఆయన స్థితులు, గుణాలు, విభూతులు మొదలైన వాటిని చూపించారు.
పరస్వరూపం :
1.1 – ఉయఱ్వర
2.2 – తిణ్ణన్ వీడు
2.8 – అణైవదు
4.10 – ఒన్ఱుమ్ దేవుమ్
జీవాత్మ స్వరూపం : 4 పదికాలు
ఈ పదికాల్లో ఆళ్వార్లు ఆత్మ యొక్క నిజ స్వరూపం మరియు గుణాలను వివరించారు.
3.7- పయిలుమ్
4.8 – ఏఱాళుమ్
8.8 – కణ్గల్ శివన్దు
8.9 – కరుమాణిక్కమలైమాణిక్కమలై
విరోధి స్వరూపం : 4 పదికాలు
ఆళ్వార్లు ఎంపెరుమాన్ ను పొందడంలో మనకు అడ్డంకి అవుతున్న మార్గాన్ని వివరించారు.
1.2 – వీడుమిన్
3.9 – శొన్నాల్
4.1 – ఒరునాయగమాయ్
9.1 – కొణ్డపెణ్డిర్
ఉపాయ స్వరూపం : 4 పదికాలు
ఈ పదికాల్లో ఆళ్వార్లు ఎంపెరుమాన్ ను పొందడానికి నిర్ధిష్టమైన మార్గాన్ని చూపించారు.
5.7 – నోర్ట్రనోన్బు
5.8 – ఆరవముధే
5.9 – మానేయ్ నోక్కు
5.10 – పిఱన్దవాఱుమ్
ఉపేయ స్వరూపం : 4 పదికాలు
ఆళ్వార్లు ఎంపెరుమాన్ ను పొందిన తరువాత ఆత్మకు లభించే పరమ ఫలితం / ఆనందాన్ని వివరించారు.
2.9 – ఎమ్మావీడు
3.3 – ఓజివిల్ కాలం
8.10 – నేడుమార్కడిమై
10.3 – వేయ్ మరు తోళిణై
తిరువాయి మొళిలో మొత్తం 100 పదికాలు ఉన్నాయి, వాటిలో పై పేర్కొన్న 20 పదికాలు అర్థ పంచకం లోతైన అర్థాలను వివరిస్తాయి. మిగతా 80 పదికాలు కూడా అర్థ పంచకం అర్థాలను మాత్రమే విస్తృతంగా వివరించాయి అని మామునులు ఆచార్య హృదయం వ్యాఖ్యానాల్లో చెప్పారు.
ఆచార్యుల కృప వల్ల మాత్రమే మనం తిరువాయి మొళిలో అర్థ పంచకం ఉన్నదని చూడగలము, మనం స్వయంగా తిరువాయి మొళి నిజమైన అర్థాలను గుర్తించలేము. ఈ కారణం ప్రధానంగా ఆచార్యుల చూర్ణికను సూచించడం. ఆచార్యుల వ్యాఖ్యనాలు లేకుండా తిరువాయి మొళి లోతైన అర్థాలను సులభంగా అర్థం చేసుకోలేమని చెప్పడమే భావం.
పెరియ పెరుమాళ్ – తిరువాయి మొళి సంబంధం
తిరువాయి మొళి కి సంబంధించిన ఒక తనియన్ నుండి:
వాన్ తిగళుమ్ శోలై |మదిల్ అరంగర్ వణ్ పుకళ్ మేల్|
ఆన్ద తమిళ్ మఱైగళ్ | ఆయిరముమ్ | ఈన్ఱ
ముదల్ తాయ్ శడగోపన్ | మొయ్ మ్బాల్ వళర్త|
ఇదత్తాయ్ ఇరామానుశన్||
ఈ తనియన్ , పరాశర భట్టర్ ఇచ్చినది, తిరువాయ్ మొళి పెరియ పెరుమాల్ – శ్రీరంగనాధన్ పై మాత్రమే పాడబడిందని పక్రటిస్తుంది. నమ్మాళ్వార్లు తల్లి వలె, ఈ తిరువాయ్ మొళిని ప్రసాదించారు, ఇది తమిళ్ వేదంగా పరిగణించబడుతుంది, మరియు దానిని పెంపుడు తల్లి ఇరామానుసన్ ద్వారా విస్తృతంగా అందరికి పంపారు. ఈ పాశురాలు, పరిమళ భూమిలోని కోటలో విశ్రాంతి తీసుకున్న అరణ్గనాధన్ మహిమల గురించి పాడబడ్డాయి, ఆ కోట చుట్టూ ఆకుపచ్చ చెట్లు మరియు ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు ఉన్నాయి.
పెరియ పెరుమాళ్ పై మొత్తం తిరువాయి మొళిలో ఒక్కే పదిగం పాడబడింది. అది 7.2 – “కఙ్గులుమ్ పగలుమ్”. ఆ పదిగం లో ప్రతి పాశురం ఎంపెరుమాన్ యొక్క ఒక గుణాన్ని చూపిస్తుంది. ఆ గుణం ప్రతి పదిగం లో మరింత వివరించబడింది (ఒక పదిగం ఒక గుణాన్ని మాత్రమే చూపిస్తుంది). అందువలన, మన పూర్వఆచార్యులు 7.2 లోని పెరియ పెరుమాళ్ యొక్క ఈ 10 గుణాలు తిరువాయి మొళి మొత్తం 100 పదిగాలలో విస్తరించబడ్డాయని వివరిస్తారు. అందువల్ల, పెరియ పెరుమాళ్ తిరువాయి మొళి యొక్క సారూప్యం అనే అవగాహన కలుగుతుంది.
(గమనిక: 1 పత్తు లో 10 పదికాలు ఉంటాయి, 1 పదికంలో 10 పాశురాలు ఉంటాయి)
ఆళ్వార్లు తమ పాసురాలను భిన్న భావాల్లో పాడారు, ఇది“జ్ఞానత్తిల్ తాన్ పేచ్చు ” మరియు “ప్రేమత్తిల్ పెన్ పేచ్చు”. అంటే: ఆళ్వా ర్లు శఠకోపుడిగా పూర్తి జ్ఞానం స్థితిలో ఉన్నప్పుడు పాసురాలను ఇచ్చాడు. ఈ జ్ఞానం అత్యంత ప్రేమ స్థితికి మారినప్పుడు, ఆళ్వార్లు పాసురాలను స్త్రీ భావంలో పాడతారు: నాయకిగా, నాయకి తల్లిగా, నాయకి మిత్రురాలిగా.
తిరువాయి మొళికి వ్యాఖ్యానాలు:
ఎంపెరుమానార్ తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ ను తిరువాయి మొళికి వ్యాఖ్యానాలు రాయడానికి నియమించారు. ఇది మొదటి వ్యాఖ్యానం. తరువాత, ఎందరో ఆచార్యులు తిరువాయి మొళికి వ్యాఖ్యానాలను అనుగ్రహించారు.
తిరువాయి మొళికి 5 ప్రధాన వ్యాఖ్యానాలు ఉన్నాయి:
6000 పడి – తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్
9000 పడి – నంజీయార్
ఈడు 36000 పడి – నంపిళ్ళై (వడక్కు తిరువీధిప్పిళ్ళై ద్వారా గ్రంధస్తం చేయబడింది)
24000 పడి – పెరియ వాచ్చాన్ పిళ్ళై (ఆచార్య నంపిళ్ళై ఆజ్ఞతో చేయబడింది)
12000 పడి – ప్రతిపదార్ధం, వాది కేశరి అజగియ మనవాళ జీయార్ ద్వారా
(గమనిక: ఒక్కో పదిలో 32 అక్షరాలు ఉంటాయి)
మనవాళ మామునిగళ్, అత్యంత ఉత్సాహంతో, ఈడు 36000 పడి వ్యాఖ్యానాల ద్వారా తిరువాయి మొళి అర్థాలను వివరిస్తారు. నంపెరుమాళ్ మామునిగళ్ యొక్క ఉపన్యాసాలను విని కోరికపడతాడు మరియు శ్రీరంగంలోని పెరియ కోయిల్ లో ఒక సంవత్సరం పాటు ఉపన్యాసం ఇవ్వమని ఆజ్ఞాపించాడు.
ఉపన్యాసం పూర్తైన తర్వాత, ఆని తిరుమూలం శుభదినాన, నంపెరుమాళ్ చిన్న బాలుడిగా కనిపించి “శ్రీశైలేశ దయాపాత్రం” తనియన్ సమర్పించి, మనవాళ మామునిగళ్ ను తన ఆచార్యుడిగా స్వీకరించాడు.
ఇలా ఈడు వ్యాఖ్యానం ప్రసిద్ధమై, తిరువాయి మొళి కీర్తి నలుదిశలా వ్యాపించింది.
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్
ఆధారం: https://www.youtube.com/live/W4vjhU2FUlo?si=eFYneOKITgOVfmdG
ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/11/simple-guide-to-dhivyaprabandham-part-8/
కోశం : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org