దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – ఆరవ భాగం (తిరువిరుత్తం, తిరువాశిరియమ్, పెరియ తిరువన్దాది)

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక

అయిదవ భాగం

ఇయఱ్పా లో మునుపటి నాలుగు ప్రబంధాలు అయిన ముదల్ తిరువన్దాది, ఇరణ్డాన్తిరువన్దాది, మూన్ఱాన్తిరువన్దాది, నాన్ముకన్తిరువన్దాది లను ఇప్పటి వరకూ చూశాము.

ఇయఱ్పాలో తదుపరి ప్రబంధాలు మూడు – తిరువిరుత్తం, తిరువాశిరియమ్, మరియు పెరియ తిరువందాది – ఇవన్నీ నమ్మాళ్వార్లలు అనుగ్రహించినవి. వారు  నాలుగు ప్రబంధాలను అనుగ్రహించారు, వాటిలో మూడు ఇయఱ్పాలో ఉన్నాయి. నాలుగవది తిరువాయి మొళి, ఇది దివ్యప్రబంధంలో నాల్గవ వేయిగా ప్రసిద్ధి పొందింది.

ఈ ప్రబంధాలను అనుభవించే ముందు, మనం నమ్మాళ్వార్లల వైభవాన్ని కొద్దిగా సేవిద్దాం. 

నమ్మాళ్వార్లలు తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో, తామ్రపర్ణి నది తీరంలోని దివ్యదేశమైన  ఆళ్వార్ తిరునగరిలో (ఆళ్వార్లుల  జననానికి ముందు ఇది తిరుక్కురుగూరు అని పిలువబడేది) అవతరించారు.

నమ్మాళ్వార్ల అవతరించిన 11వ రోజున వారి తల్లిదండ్రులు వారిని తిరుక్కురుగూరు లోని ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న చింత చెట్టు (తిరుప్పుళియాళ్వార్) వద్ద ఆళ్వార్లులు వేంచేసి ఉన్నారు. ఆ విధంగా వారు ఎంపెరుమాన్ కు మాత్రమే చెందిన వారు అయ్యారు. 

ఆళ్వార్లు వారి జీవితం మొత్తాన్ని ఎలాంటి భౌతిక విషయాల్లో పాల్గొనకుండా, ఆ చెట్టు తొర్రలోనే ధ్యాన స్థితిలో, కేవలం ఎంపెరుమాన్ గుణానుభవంలో మాత్రమే నిమగ్నమై గడిపారు.

వారు కేవలం 32 తిరునక్షత్రలు ఈ భూమిపై వేంచేసి ఉన్నారు. మొదటి 16 సంవత్సరాలు పూర్తిగా ధ్యానంలో గడిపారు. 16వ సంవత్సరం చివరలో మధురకవి ఆళ్వార్లకి దర్శనం ఇచ్చారు. 

మధురకవి ఆళ్వార్లు జన్మస్థలం తిరుక్కోలూర్, ఇది ఆళ్వార్ తిరునగరి సమీపంలో ఉంది. వారు భారతదేశ ఉత్తర భాగంలో ఉన్న వివిధ దివ్యదేశాల్లో ఎంపెరుమాన్ దర్శనార్థం యాత్ర చేయుచుండగా, ఒక్క రోజు ఆకాశంలో దక్షిణ దిశలో ఒక దివ్యమైన వెలుగు దర్శనమైంది. ఆ వెలుగును అనుసరిస్తూ వారు దక్షిణ దిశగా ప్రయాణించి చివరకు తిరుప్పుళియాళ్వార్ వద్దకు చేరారు. అక్కడ నమ్మాళ్వార్ల ధ్యానంలో నిమగ్నంగా ఉన్నారు.

అప్పుడు మధురకవి ఆళ్వార్లు సమీపంలో ఒక రాయి వేసి ప్రశ్నించారు:
“శిత్తత్తిన్ వయిఱిళ్ శిరియతు పిరన్దై ఎత్తత్తై త్తిన్ఱు ఎంగేకిడక్కుం?”

దీనికి నమ్మాళ్వార్లు  “అత్తై తిన్ఱు అంగే కిడక్కుం” అని సమాధానం ఇచ్చారు.
ఈ ప్రశ్న మరియు సమాధానం జీవాత్మ, పరమాత్మ మరియు అచేతన తత్త్వాల (తత్త్వత్రయము) సారాన్ని స్పృశిస్తాయి.

నమ్మాళ్వార్ల సమాధానం విన్న మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు గొప్ప జ్ఞాని అని గ్రహించి, వారిని తన ఆచార్యునిగా, తన సర్వస్వముగా స్వీకరించి, వారికి ఎన్నో సంవత్సరాలు కైంకర్యం చేశారు.

తదుపరి 16 సంవత్సరాలు ఆళ్వార్లు ఈ భూలోకంలో వేంచేసి ఉండి , అనంతరం పరమపదానికి చేరాలని తలంచి, అంతిమంగా పరమపదాన్ని చేరారు. 

అట్టి  నమ్మాళ్వార్లు నాలుగు ప్రభంధాలను అనుగ్రహించారు, ఇవి నాలుగు వేదాల సారాంశంగా చెప్పబడతాయి.

తిరువిరత్తం  – ఋగ్వేదం
తిరువాశిరియం – యజుర్వేదం
పెరియ తిరువందాది – అథర్వణవేదం
తిరువాయ్మొళి – సామవేదం

ఇంకొక ఆసక్తికరమైన సంబంధాన్ని నంపిల్లై, తిరువాయ్మొళి వ్యాఖ్యానంలో వివరిస్తారు. నమ్మాళ్వార్ల అనుగ్రహించిన ఈ నాలుగు ప్రభంధాలు రహస్యత్రయ సారాంశాన్ని కలిగి ఉన్నాయి – తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం – ఇవి వేదాల సారాంశంగా చెప్పబడతాయి. ఈ విశ్లేషణ ప్రకారం:
తిరువిరత్తం– తిరుమంత్రంలోని “ప్రణవం” మరియు “నమః” పదాలను వివరిస్తుంది.
తిరువాశిరియం – “నారాయణాయ” పదార్థాన్ని వివరిస్తుంది.
పెరియ తిరువందాది – చరమశ్లోకాన్ని వివరిస్తుంది.
తిరువాయ్మొళి – ద్వయాన్ని వివరిస్తుంది.

ఇంకొక ఆసక్తికరమైన పోలిక తిరువిరుత్తం మరియు తిరువాయ్మొళి మధ్య ఉంది. తిరువిరుత్తంలోని 100 పాశురాలు, తిరువాయ్మొళిలోని 100 పదిగములతో సంబంధం ఉంది. దీనిని అళగియ మనవాళపెరుమాళ్ నాయనార్ తన అద్భుతమైన “ఆచార్య హృదయం” గ్రంథంలో అద్భుతంగా వివరించారు. ఈ సంబంధం గురించి మరెందరో ఆచార్యులు కూడా వివరించారు. 

ఇప్పుడు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన మొదటి ప్రభంధమైన తిరువిరుత్తాన్ని అనుభవిద్దాం.

నమ్మాళ్వార్ల రెండు స్థితులలో పాశురాలు అనుగ్రహించారు – తన నిజమైన జ్ఞాన స్థితిలో (తానాన నిలై) మరియు ప్రేమతో కూడిన స్థితిలో (ప్రేమ నిలై), ఇందులో నమ్మాళ్వార్ల తనను ఒక స్త్రీగా భావిస్తారు (పెణ్ భావం).
ఈ పెణ్ భావంలో మూడు విధాలుగా ఉంటుంది – తాయ్ (తల్లి), తొళి (చెలికత్తె), తలైమగళ్ (భార్య/నాయిక). ఈ మూడు స్థితులలో నమ్మాళ్వార్ల, జీవాత్మ మరియు ఎంపెరుమాన్ మధ్య ఉన్న మూడు సంబంధాలను చిత్రీకరించారు: ఉపాయం (ఎంపెరుమాన్‌ను చేరేందుకు మార్గం), సంబంధం (నిజమైన బంధం స్వరూపం), ప్రయోజనం (ఎంపెరుమాన్‌ను పొందిన తర్వాత ఉన్న లక్ష్యం).

ఈ ప్రభంధంలో మొదటి మరియు చివరి పాశురాలు తానాన నిలైలో (తన అసలైన స్థితిలో) రచించబడ్డాయి. మిగతా 98 పాశురాలు ప్రేమ నిలైలో (పెణ్ భావంలో) రచించబడ్డాయి.
“మయర్వర మధినలం” – అర్థం: నమ్మాళ్వార్ల, ఎంపెరుమాన్ అనుగ్రహం ద్వారా కలిగిన అపూర్వమైన భక్తి మరియు జ్ఞానంతో మొదటి పాశురంలోనే సందేశాన్ని పంపిస్తారు:
“ఈ లోకం నాకు భరించలేని వేడిని ఇస్తోంది, నేనింకా ఇక్కడ ఉండలేను, నిన్ను చేరదలుచుకున్నాను.”
ఈ సందేశమే “విరుత్తం” అంటే. అందుకే ఈ ప్రభంధానికి పేరు “తిరువిరుత్తం”. మొదటి పాశురంలో నమ్మాళ్వార్ల, ఎంపెరుమాన్‌ను పిలిచి వినమని ప్రార్థిస్తారు – “అడియేన్ శెయ్యుమ్ విణ్ణప్పమే” అనే పదబంధాన్ని ఉపయోగిస్తారు. మనం ఆచార్యుల దగ్గర, ఇతర శ్రీ వైష్ణవుల దగ్గర ప్రార్థన చేసే సమయంలో ఉపయోగించే “విణ్ణప్పం” అనే పదం కూడా నమ్మాళ్వార్ల నుండే వచ్చిందని చెప్పబడుతుంది.

మిగిలిన 98 పాశురాల్లో నమ్మాళ్వార్ల పెణ్ భావంలో పాడుతూ, తాయ్ భావం, తొళి భావం మరియు తలైమగళ్ భావాలను చూపుతూ ఎంపెరుమాన్ నుండి వేరుపడిన బాధను వ్యక్తీకరించారు.

చివరి పాశురమైన శాత్తుమురై పాశురంలో, నమ్మాళ్వార్లు మరోసారి ఈ సంసారం మాయతో కూడి ఉన్నదని, వన్ శేర్ట్ర   (బలమైన బురదలా గట్టిగా పట్టేసే సమ్సారం) అని చెబుతూ, ఎంపెరుమానే ఏకైక రక్షకుడని పునరుద్ఘాటిస్తున్నారు.

ఈ ప్రభంధానికి పెరియవాచ్చాన్ పిళ్ళై  అందించిన అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది. వారికీ ముందు ఉన్న ఆచార్యులు నమ్మాళ్వార్లు ఎవరు అనే విషయాన్ని వివరంగా చెప్పారు. పెరియవాచ్చాన్ పిళ్ళై  ముందు ఉన్న ఆచార్యులు నమ్మాళ్వార్ల‌ను ముక్తాత్మ,  ముక్త ప్రాయర్, నిత్యసూరి లేదా ఎంపెరుమాన్ అవతారంగా వివరించారని చెబుతారు. కానీ పెరియవాచ్చాన్ పిళ్ళై  ఇవన్నీ నమ్మాళ్వార్ల మహిమను చూపించేవే అని సాయించారు. వాస్తవంగా నమ్మాళ్వార్లు తామే చెప్పుకున్నట్టుగా, వారు  ఒక జీవాత్మ మాత్రమే. తిరువిరుత్తం మొదటి పాశురంలో “ఇన్నిన్ఱ నీర్మై యినియామ్ ఉఱామై” అని చెప్పినట్లుగా – పునర్జన్మల బాధను అనుభవించిన జీవాత్మ మాత్రమే. కానీ ఎంపెరుమాన్ యొక్క నిర్హేతుక  కృప వల్లే నమ్మాళ్వార్లకు అప్రాకృతమైన జ్ఞానం, భక్తి లభించింది. ఇది ఎంపెరుమాన్ కృప వల్లే సాధ్యమైంది.
నమ్మాళ్వార్ల చెబుతారు – “ఈ పాశురాలను నేను పాడినట్టు కాదు, ఎంపెరుమానే నా నోటి మీద కూర్చొని పాడించాడు!”

ఈ 98 పాశురాలు పెణ్ భావంలో ఉండి, అన్యాపదేశం (బాహ్య అర్థం) మరియు స్వాపదేశం (లోతైన అంతర్గత అర్థం) రెండింటిని కలిగి ఉన్నాయని చెబుతారు. వాధి కేసరి మనవాళ జీయర్ స్వాపదేశ వ్యాఖ్యానం అనుగ్రహించారు. అలాగే నంపిల్లై మరియు పెరియవాచ్చాన్ పిళ్లై కూడా వ్యాఖ్యానాలు అందించారు.

ఇది తిరువిరుత్తం సారాంశం. 

ఇప్పుడు తిరువాశిరియంని అనుభవిద్దాం.

తిరువాశిరియంపై తన (వ్యాఖ్యానానికి ) ముందుమాటగా, పెరియవాచ్చాన్ పిళ్ళై  తిరువాసిరియం కోసం అందమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేశారు. తిరువిరుత్తంలో,ఆళ్వార్ తన గుణాన్ని, స్వరూపాన్ని మరియు సంసారంలో ఉన్నందున ఎంపెరుమాన్ తో విరహం వల్ల కలిగిన ఆర్తిని వ్యక్తపరిచారు.ఈ లోకంలో ఉండలేని ఆళ్వార్ స్థితిని గ్రహించిన ఎంపెరుమాన్,ఆయనను కొంతకాలం ఇంకా ఈ లోకంలో కొనసాగించేందుకు, వైకుంఠంలో నిత్యసూరులు పొందే దివ్యానందానుభవాన్ని ఆళ్వార్ కు అనుగ్రహిస్తాడు. అదే సంసారంలో ఉన్నప్పటికీ, ఎంపెరుమాన్ యొక్క అందాన్ని అనుభవించిన తరువాత, అళ్వార్ దానిని కీర్తించాలనుకుంటాడు. అందువల్ల తిరువాశిరియంగా పిలవబడే ఏడు అద్భుతమైన పాశురాలు ఉద్భవించాయి. ఈ ఏడు పాశురాలు యజుర్వేదంలోని ఏడు కాన్దాల సరితూగే విశిష్టత కలవు. ఈ ప్రభంధం తమిళ సాహిత్య ప్రకారం “ఆశిరియప్పా” అనే చందస్సులో ఉంది.

ఈ పాశురాములలో ఆళ్వార్లు ఎంబెరుమానుడి దివ్య శరీరం పచ్చల పర్వతం లాగా పచ్చని రంగును కలిగి ఉందని ఆళ్వార్లు చెబుతారు. అన్ని రకాల సంబంధాల ద్వారా మనకు ఎంతో దగ్గరగా ఉన్న ఎంపెరుమాన్ ఉన్నప్పటికీ, ఇతర దేవతలను ఆరాధించడానికి వెళ్తున్నవారు, తమ తల్లికి బదులుగా ఒక కట్టెముక్కను సంరక్షిస్తున్నట్లు అవుతారు అని ఆళ్వార్ వివరిస్తాడు. అంతేకాకుండా, బ్రహ్మాండాన్ని మింగిన తరువాత అలిలై కణ్ణనైగా ( ఆలిలో విరజిల్లిన వటపత్రంలో ఉండే బాలకృష్ణుడిగా) ఆళ్వార్ ఎంపెరుమాన్‌ను చూసి, “ఇతనికంటే గొప్పవాడు ఇంకెవ్వడు ఉండగలడు?” అని ఆళ్వార్ ప్రకటిస్తాడు. ఈ విధంగా, తిరువాశిరియంలో ఆళ్వార్ ఎంపెరుమాన్ యొక్క అందం మరియు కల్యాణగుణాలను వర్ణించారు.

ఇప్పుడు మనం పెరియ తిరువన్దాది అనుభవించబోతున్నాం.ఇది అథర్వణ వేదంలో ఉన్న ముండక ఉపనిషత్తు సారాంశమని చెప్పబడుతుంది.
ఇది చరమ శ్లోక సారాంశమని ఈ వ్యాసంలో ముందుగానే చెప్పబడింది. శ్రీ పుత్తూర్ స్వామి వారు ఈ విషయం బాగా వివరించారు.

తిరువిరుత్తం అనుగ్రహించిన తరువాత, ఎంపెరుమాన్ అనుభవాన్ని నమ్మాళ్వార్ల‌కు ఇవ్వడం వల్ల, ఆ అనుభవం తిరువాశిరియంగా వ్యక్తమైంది. ఇది మరింతగా పెరిగి పెరియ తిరువన్దాదిగా రూపుదిద్దుకుంది. మొదటి పాశురంలో, “ముయత్తి శుమన్దు ఎళున్దు…” అని నమ్మాళ్వార్ల చెబుతున్నారు – ఎంపెరుమాన్ అనుభవాన్ని పాడటానికి తన హృదయం తనకంటే ముందే పరుగెత్తిపోతున్నదని. 86వ పాశురంలో “కార్ కలన్ద మేనియాన్…” అనే పదాలతో, నమ్మాళ్వార్ల ఈ సంసారంలోని ప్రజలు ఎలా కాలక్షేపం చేస్తారు? ఎంపెరుమాన్ దివ్య స్వరూపాన్ని తిలకించకుండా వారు బాధలు ఎలా పోగొంటారు? అని ప్రశ్నిస్తారు. చివరి 87వ పాశురంలో, ఎంపెరుమాన్ మరియు ఆయన నామాలను ధ్యానిస్తూ సంసారులు కాలం గడపాలని నమ్మాళ్వార్ల సూచిస్తున్నారు.

ఇది అందాది శైలిలో రచించబడినది (ప్రతి పాశురం చివరి పదం తర్వాతి పాశురం మొదటి పదంగా ఉంటుంది). అందువల్ల దీనికి “పెరియ తిరువన్దాది” అనే పేరు వచ్చింది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇది పెద్దదేమీ కాదు, గానీ “పెరియ” అనే ఉపసర్గ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఇతర తిరువందాదిల్లో 100 పాశురాలు ఉంటే, ఇందులో 87 మాత్రమే ఉన్నాయి. దీనికి అద్భుతమైన వివరణ ఉంది – నమ్మాళ్వార్ల 75వ పాశురం “పువియుమ్ ఇరువిశుమ్బుమ్…”లో ఎంపెరుమాన్‌ను అడుగుతారు: “శాస్త్రం చెప్పినట్లు, ఇరు లోకాలనీ నీవే నియంత్రిస్తున్నావు, నీవు నా లోపల ఉన్నావు, అప్పుడు నిన్ను నాలో కలిగిన నేనా, నీవా, ఎవరు పెద్దవారు?”” అని. ఆళ్వార్లు వారి వైభవం గురించి వివరించారు కనుక ఈ ప్రబంధానికి పెరియ తిరువందాది అని పేరు వచ్చింది. 

ఇది తిరువిరుత్తం, తిరువాశిరియం మరియు పెరియ తిరువన్దాది సారాంశం. 

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్ 

ఆధారం: https://youtu.be/nUInuo9g6Lk

ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/11/simple-guide-to-dhivyaprabandham-part-6/

మూలము :https://youtu.be/nUInuo9g6Lk

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment