శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము-5
తీర్త్త ముయన్ఱాడువదుం చెయ్తవంగళ్ చెయ్వనవుం
పార్తనై మున్ కాత్త పిరాన్ పార్పతన్ మున్ చీర్తువరై
మన్నన్ అడియో మెన్నుం వాళ్వు నమక్కీంత్తర్పిన్
ఎన్న కుఱై వేండుం ఇని
ప్రతిపదార్థము:
మున్ = మహాభారత యుధ్ధములో(పార్తనై) మనసు చలించి పోయిన అర్జునుని
కాత్త పిరాన్ = గీతోపదేశము చేసి మనో చాంచల్యమును పోగొట్టిన శ్రీకృష్ణుడు
పార్పతన్ మున్ = వీక్షించక ముందు
తీర్తo = పుణ్య నదీ (పాపములను పోగొట్టుకొనుట కోసము)
ముయన్ఱా = ప్రయత్నములు చేసి
ఆడువదుం = స్నానములు చేయుట
చెయ్తవగళ్ = శరీరమును కృశింపచేయు నోములు
చెయ్వనవుం = ఇంకా ఇతర పుణ్య కార్యములు
శీర్తువరై = ఉన్నతమైన ద్వారకాపతి అయిన శ్రీకృష్ణుడు
నమక్కు = ఆయన దాసులమైన మనకు
అడియోమె = దాసత్వమనే
ఎన్నుం వాళ్వు = సంపదను
ఈంత్తర్పిన్ = అనుగ్రహించిన తరువాత
ఇని = ఇంక ముందు కాలమంతా
వేండుం కుఱై ఎన్న = సాధనముల గురించి, ఫలితముల గురించి కొరత ఏముంది?
అవతారిక:
ద్వయమహామంత్రం లోని పూర్వ భాగం సారార్థం భగవంతునికి శరణాగతి చేయుటే. దీనినే సిద్ధోపాయవరణం అని అంటారు.
సిద్ధోపాయం అనగా ఉపాయమైన పెరుమాళ్ అతి సులుభుడై ఎల్లప్పుడూ శరణ్గాతుల రక్షకై సిద్ధంగా ఉండుట. అందుకే తనను సిద్ధోపాయం అని వ్యవహరిస్తారు. “నీవే నాకు ఉపాయం” అని సిద్ధోపాయమైన పెరుమాళ్ దగ్గర శరణాగతి చేయుట సమయములో మన దగ్గర ఎటువంటి ఇతర ఉపాయముల సంబంధము ఉండకూడదు. అటువంటి సంబంధం ఉన్నచో , వాటిని పూర్తిగా తొలిగించుకొని పెరుమాళ్ ను శరణువేడాలి. ఇట్లు పూర్తిగా ఇతర ఉపాయములు తొలిగించుకోవుట కూడా శరణాగతి లో భాగంగా భావిస్తారు. ఈ విషయం గీతచరమశ్లోకం లో స్పష్టంగా చెప్పారు. చరమశ్లోకం పూర్తిగా తెలుసుకుని పెరుమాళ్ ని శరణాగతి చేసిన వారు ఇతర ఉపాయములలో చలువచూపరు. శేషత్వం అనే ఆత్మ స్వరూపం కు తగినట్లుగా ప్రవర్తిస్తారు. తమ భారమును పెరుమాళ్ పై వదిలివేసి , సంతోషముగా జీవిస్తారు. ఎవరైతే “మన మంచిచెడులు చూచుకొనుట ఇక ఎమ్పెరుమాన్ యొక్క బాధ్యత , మనము ఏమియును చేయనకర్లేదు ” అని తలిచేవారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ తాను కూడా ఇటువంటి అధికారి అని , ఈ పాశురములో అటువంటి స్థితి కలిగిన అధికారి యొక్క మనోస్థితిగురుంచి చెప్పారు.
వ్యాఖ్యానము:
తీర్త్త ముయన్ఱాడువదుం: గంగ, యమున, సరస్వతి వంటి పుణ్య నదులలో శారీరిక , మానసిక క్లేశములను, పాపములను పోగొట్టుకొనుట కొరకు స్నానము చేయుట.
చెయ్తవగళ్ చెయ్వనవుం: “ఊన్వాడఉణ్ణాదుపొరుప్పిడైయేనిండ్రుంపునల్ కులితుమైందునెరుప్పిడైయేనిండ్రుం వీళ్ కనియుమూళిఐయుమెన్నుమివైయేనుగర్న్దుఉడలమ్ తాన్వరుంది” అని ఆళ్వార్ల పాశురములలో చెప్పినట్టుగా తమ పాపములు తొలిగించుకోవుటకు ఉపవాసములు చేయుట, పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చేయుట, రాలిపోయిన ఆకులను మాత్రమే భుజించి శరీరమును కృశింప చేయుట వంటి అనేక రకములైన తపస్సులు చేసి శరీరమును కృశింపచేస్తారు. “తవంగల్” అని బహు వచనములో చెప్పినందుకు సాత్విక దానము, యాగము మొదలగు పుణ్య కార్యములు కూడా ఇందులో చేరి వున్నాయి.
పార్తనై మున్ కాత్త పిరాన్ పార్పతన్ మున్ : కర్మ,జ్ఞాన , భక్తి యోగములను భగవంతుడిని పొందుటకు ఉపాయములుగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అది విన్న అర్జునుడు భగవంతుడికి జీవుడు దాసుడు కదా! దాసుడు స్వతంత్రించి పై ఉపాయములను ఆచరించ వచ్చునా? అన్న సందేహము కలిగింది. దానికి శ్రీకృష్ణుడు ” అర్జునా! పై ఉపాయములను నువ్వు ఆచరించవలసిన అవసరము లేదు. వాటిని పూర్తిగా మరచిపో., నేను గుణ పరిపూర్ణుడను , దాసులకు సులభుడను, దాసుల తప్పులను చూడని వాడను, దాసుల తప్పులను క్షమించు వాడను, సుజ్ఞానము కలవాడను, వాత్సల్యము కలవాడను,ఫలములనిచ్చు వాడను, ఇలాంటి అనేక గుణములు గల నన్ను మాత్రమే నువ్వు ఉపాయముగా స్వీకరిస్తే చాలు. అలా నన్ను ఉపాయముగా స్వీకరించేటప్పుడు ” కృష్ణుడు మన దగ్గర ఏమీ ఎదురు చూడడు, ఆయనకు ఎమీ ఇవ్వనవసరము లేదు. అని పరిపూర్ణముగా విశ్వసించి నన్ను ఆశ్రయించాలి.” అలాగ నువ్వు శరణాగతి చేస్తే జ్ఞానము, శీలము మొదలగు సకల గుణములు కల భగవంతుడినైన నేను , నీ అజ్ఞానము, అలసట, అశక్తత మొదలగు గుణములను సహిస్తాను. నీభారమంతా నామీద ఉంచినట్లుగా భావిస్తాను. ” ఈ స్థితిలో వున్న నిన్ను నేను ఎప్పటికీ వదలి వేయను.” నన్ను పొందడానికి అడ్డంకిగా నీవద్ద ఏ ఏ పాపాలున్నాయో వాటన్నింటినుండీ నిన్ను విడిపిస్తాను. అందువలన నువ్వు శోకించకు.” అని అర్జునుడికి ఉపదేశించి అతని శోకమును పోగొట్టీ అనుగ్రహించాడు. ఇంతటి ఉపకారము చేసిన భగవంతుడి కృపా దృక్కులు పొందుటకు ముందు అని అర్థము.( కృష్ణుడు చెప్పిన మాటలు మనసుకు చేరి స్థిరపడక ముందు).స్వామి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ “పా ర్పదన్మున్” (చూడక ముందే) అనగా పరమాత్ముడైన శ్రీ కృష్ణుడు చూడక మరియు మన తో మాటలు పలుకుటకు (అర్జునిని తో చెప్పినవి) ముందే అని ప్రయోగం చేసారు (మన మనస్సు అర్థము చేసుకునే లోపే అని సూచించుటకు).
వరై మన్నన్ : “పదినారమాయిరవర్ దేవిమార్ పణిశెయ్యతువరైఎన్నుమదిల్నాయకరాగివీత్ ఇరుందమనవాళర్” అనగా పదునారు వేల మంది భార్యలు సేవించు చుండగా ద్వారకలో వేంచేసి వున్న మానస చోరుడు” ఆళ్వార్ అన్నట్లు తనను పొందుటయే ఫలముగా భావించి మరొక ఫలమును కోరని వారు, మరొకరిని ఆశ్రయించని వారు, తనకొక్కడికే భోగ్యోపకరణ మైన వారైన తన దేవేరులకు మానసచోరుడైన ద్వారకాధిపతి.
అడియో మెన్నుం వాళ్వు : వాడికి మనము దాసులమని పూర్ణముగా నమ్మి, ” తనను కాపాడుకోవటానికి స్వప్రయత్నము చేయవలసిన అవసరము లేదని నమ్మి, ఆయనకోసమే ఎదురుచూసే మంచి బుధ్ధిని మనకు ఇచ్చిన తరువాత మనము బాధ పడనవసరం లేదు అని అర్థము. ఆత్మ జ్ఞాన, ఆనంద, శేషత్వ వంటి ఎన్నో గుణములకు స్థానము అయినప్పటికీ వాటి కంటే దాసత్వమే దానికి నిజమైన స్థితి అని తెలుస్తున్నది. ఈ గుణమే నిజమైన సంకేతమవుతుంది. ఉజ్జీవమనగా ఈ దాసగుణమును తెలుసుకునే సమయములో , స్వప్రయత్నమును వీడుట మొదలగు మంచి గుణములు ఏర్పడతాయి. ఇవియే ఆత్మకు ధనము. ఇటువంటి జ్ఞానము కలిగి దాసులుగా జీవించుటయే జీవితము అని అర్థం.
నమక్కీన్దదర్పిన్ : ఈ దాసగుణము ఆత్మకు స్వత సిధ్ధమే కొత్తగా సిద్ధమైనది కాదు. జీవాత్మ కు పరమాత్మ కు గల 9 సంబంధము నిత్యమైనవి. ఈ వాక్యము , ఒక జీవాత్మకు ఇటువంటి సంబంధము కలదని నమ్మి, ఒప్పుకునే సమయ సందర్భమున చెప్పునది. ఇటువంటి జ్ఞానము కలుగుటకు కేవలం శ్రీ వారి నిర్హేతుక జాయమాన కటాక్షంవలనే లభిస్తుంది. చెప్పాలంటే , పెరుమాళ్ “జీవాత్మ పరమాత్మ యొక్క సేవకుడు”అనే జ్ఞానమును కలుగుటకు ఒక సమయమును నిర్ణయించిపెట్టారు.
ఎన్న కుఱై వేండుం ఇని : ఇక కొరత ఏమున్నది? ఇక ముందు ఎటువంటి ఉపాయములను ఆశ్రయించవలసిన పని లేదు. ఆందు వలన కృష్ణుడు అర్జునుడిని చూసి “మాశుచః” శోకింపకు అన్నాడు . అలాగే మనము కూడా భారమును పూర్తిగా భగవంతుడి మీద ఉంచి ప్రశాంతముగా ఉండాలని అర్థము.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-5-thirtha-muyandraduvadhum/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org