ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 10 -11

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 10

ఈ పాశురములో కృత్తిక తర్వాత వచ్చు నక్షత్రము రోహిణీ కావున కార్తీక మాసములో రోహిణీ నక్షత్రము రోజున అవతరించిన తిరుప్పాణాళ్వార్ల వైభవమును లోకులకు మామునులు ఉపదేశిస్తున్నారు.

జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ, ఆళ్వార్లలో తిరుప్పాణాళ్వార్ మరియు ఆచార్య పరంపరలో తిరుకోష్ఠియూర్ నంబి ఈ ముగ్గురూ కూడా రోహిణీ నక్షత్రములోనే అవతరించినారు. అందుచేత ఈ రోహిణీ నక్షత్ర ప్రాశస్త్యము త్రిగుణీకృతమైనది.

కార్తిగైయిల్ రోహిణినాళ్ కాణ్మిన్ ఇన్ఱు కాశినియీర్! వాయ్ త్త పుగళ్ పాణర్ వన్దుదిప్పాల్! ఆత్తియర్ గళ్ అన్బుడనేదాన్ అమలనాదిపిరాన్ కత్తదఱ్పిన్! నన్గుడనే కొణ్డాడుమ్ నాళ్!!

ఓ జనులారా! చూడండి! కార్తీక మాస రోహిణీ నక్షత్ర దినముననే పరమ పవిత్రులైన తిరుప్పాణాళ్వార్లు అవతరించినారు. వేదశాస్త్రములయందు గౌరవము కలిగి అధ్యయనము చేసినవారు, తిరుమంగై ఆళ్వార్లచే కృపచేయబడిన “అమలనాదిపిరాన్” అను ప్రబంధమును నేర్చుకొని అధ్యయనము ద్వారా తెలుసుకొన్నదేమిటంటే “సదా పశ్యంతి సూరయః” అను వేద సారమును ఈ పది పాశులముల ప్రబంధము విశదముగా వివరిస్తున్నదని. అందువలన ఈ రోజును వారు భక్తితో ఆదరిస్తారు.

పాశురం 11

ఈ పాశురములో మామునులు ఈ లోకులకు మార్గశిర మాసములోని జ్యేష్ఠా నక్షత్రములో అవతరించిన తొండరడిప్పొడి ఆళ్వార్ల గురించి చెప్పుచున్నారు. తొండరడిప్పొడి (భక్తాంఘ్రిరేణు) ఆళ్వార్లు వేదములలోని పరమార్థమును బాగుగా తెలిసినవారగుటచే వీరు వేదపండితులచే కొనియాడబడుచున్నారు.

ఈ మాసము యొక్క ప్రాశస్త్యమేమనగా ఎంబెరుమాన్ (పరమాత్మ) తానే స్వయంగా శ్రీమద్భగవత్ గీతలో “మాసానాం మార్గశీర్షోయం” అనగా మాసములలో మార్గశీర్షమును నేనే అని చెప్పారు. అంతేకాక ఈ మాసముననే మన తల్లి ఆండాళ్ పరమ దయతో తిరుప్పావైని పాడినది. ఇంకా మరియొక విశేషమేమనగా ఈ మాసములోని జ్యేష్ఠా నక్షత్రము రోజున జగదాచార్యులైన ఎంబెరుమానార్ (భగవద్రామానుజులు) కు ఆచార్యులైన పెరియ నంబి కూడా అవతరించారు.

మన్నియశీర్ మార్గళియిల్ కెట్టై యిన్ఱు మానలత్తీర్! ఎన్నిదను క్కేత్తమెనిల్ ఉరైక్కేన్ * తున్నుపుగళ్ మామఱైయోన్ తొణ్డరడిప్పొడియాళ్వార్ పిఱప్పాల్! నాన్మఱైయోర్ కొణ్డాడుమ్ నాళ్!!

ఓ జనులారా! మార్గశిరమాస జ్యేష్ఠా నక్షత్రం దేనినైతే వైష్ణవ నక్షత్రమని భావిస్తారో దానిని గురించి తెలుపుచున్నాను జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజుననే వేదసారము భగవత్ కైజ్ఞ్కర్యము (భగవత్ సేవ) అని తెలుసుకొని దానినే తన జీవిత పలమావధిగా భావించి ఆచరించిన తొండరడిప్పొడి ఆళ్వార్ ఆవతరించినారు.

అడియేన్ వేదగోపురం వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-10-11-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment