శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 2
అధ గోష్టీం గరిష్టానాం అధిష్టాయ సుమేధసాం |
వాక్యాలంకృతివాక్యానం వ్యాఖ్యాతారం నమామి తం || 2
ప్రతి పదార్థం
అధ = యతిరాజ వింశతి రచించిన తరువాత
గరిష్టానాం = ఆచార్య స్థానమును పొందదగిన గొప్పదనము కలవారై
సుమేధసాం! = మంచి మేధస్సు గలవారి
గోష్టీం = గోష్టిలో
అధిష్టాయ = చేరి
వాక్యాలంకృతివాక్యాని = శ్రీవచనభూషణములోని వాక్యములను
వ్యాక్యాతారం = వ్యాక్యానము చేయు వారై
తం = మణవాళ మామునులను
నమామి = నమస్కరిస్తున్నాను
భావము
ఇప్పటిదాకా గ్రంధనిర్మాణము గురించి చెప్పి ఇప్పుడు గ్రంధ స్వాధ్యాయములో మరొక మెట్టైన పూర్వాచార్య గ్రంధవ్యాఖ్యానము గురించి వివరిస్తున్నారు. గరిష్ట- అత్యంతం గురవః గరిష్టాః – ఉత్తమమైన ఆచార్యులు అన్న అర్థము. వీరు సుమేధసః .ఒక్కసారి వినగానే అర్థమును పూర్తిగా గ్రహించగలుగుట, అర్థము చేసుకున్న విషయమును మరవకుండా వుండుటను సుమేధా అంటారు.ఇలాంటి వారిలొ గరిష్టులెవరనగా కొయిల్ కందాడై అణ్ణన్ , వానమామలై జీయర్ మొదలైన అష్టదిగ్గజములనబడువారు.
మామునులు ఇప్పటిదాకా యోగములో పరమాత్మను రహస్యముగా అనుభవించారు. దానిని విడిచి శిష్య గొష్థిలో చేరి వారికి శ్రీవచనభూషణములొని అర్థాలను వివరిస్తున్నారు . వచనభూషణములో అనేక వెలలేని రత్నములు పొదిగి రచించుట వలన దానికి ఆ పేరు వచ్చినది. పూర్వాచార్యుల వచనములు ఎక్కువగాను తమ వాక్కులు తక్కువగాను ఉంచి, చదువరులలో జ్ఞాన దీప్తిని వెలిగించే విధముగా పిళ్ళై లోకాచార్యులు ఈ గ్రంధమును కూర్చారు . అది పరమ గంభీరమైనదున దాని లోతులు అర్థమయ్యే విధముగా మామునులు శిష్యులకు బోధిస్తున్నారు. ఖండాన్వయము, దండాన్వ్యము, పద చ్చేదము, వ్యాకరణాంశములు అంతరార్దములు, అన్వయము మొదలగునవన్నీ బాగుగా చెప్పుటనే వ్యాఖ్యానము అంటారు. ఏదైనా ప్రశ్న ఉదయించినపుడు దానిని సహేతుకముగా జవాబులు చెప్పుట. ” సుమేధసః గరిష్టః ” అని కీర్తింపబడిన కొయిల్ అణ్ణన్ లాంటి వారికే బోధపడని శ్రీవచన భూషణమును మామునులు వివరిస్తున్నారు అనటము వలన ఆ గ్రంధము ఎంత లోతైన అర్థములతో కూడీనదో తెలుస్తున్నది. వారి మేధా విలాసము ఎంతటిదో బోధ పడుతుంది. వేదము, స్మ్రుతి,ఇతిహాసములు, పురాణములు, పాంచరాత్ర ఆగమములు, ద్రావిడవేదము మొదలైన గ్రంధముల సారమంతా శ్రీవచనభూషణములో ఇమిడి వున్నది. ఈ ఒక్క గ్రంధమును వివరిస్తే సకల గ్రంధముల సారామును చెప్పినట్లే అవుతుంది. అందువలన ఈ గ్రంధమును మామునులు శిష్యులకు వివరముగా చెపుతున్నారని అర్థము
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-2/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org