స్తోత్రరత్నం – అవతారిక

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

స్తోత్రరత్నం

nathamuni-alavandhar
నథమునులు, ఆళవందార్లు – కాట్టు మన్నార్ కోయిల్

తిరువాయ్మొళి 1.1.1 వ పాశురములో “మయర్వఱ మది నలం అరుళినన్” (భగవానుడి నిర్మలమైన జ్ఞాన భక్తులకు అనుగ్రహపాత్రులైన నమ్మాళ్వార్లు) అని వర్ణించినట్లు సర్వేశ్వరుడైన పరమాత్మ తమ నిర్హేతుక కృపతో తన రూప గుణ స్వరూపాలను, ఐశ్వర్యాదులను వెల్లడి చేశారు. ఆ జ్ఞానమే భక్తి రూప ఆపన్న జ్ఞానము (జ్ఞానము పరిపక్వమై భక్తిగా మారుట) గా మారి, పరభక్తితో (భక్తిలోని ప్రథమ దశ – పూర్ణ భగవత్ జ్ఞానం) భగవత్ గుణాలను నమ్మాళ్వార్లు ఆస్వాదించారు. ఆ తరువాత పరజ్ఞాన (భక్తిలోని తరువాత దశ – భగవానుడిని ప్రత్యక్షంగా చూసినట్లుగా భావించడం) దశకు వారు చేరుకొని, దాని ఫలితంగా పరమ భక్తిని (భక్తిలోని ఆఖరి దశ – పరమపదాన్ని అధిరోహించే ముందు దశ) పొందారు. తత్ఫలితంగా, చాంధోగ్య ఉపనిషత్ 8.12.2లో “పరం జ్యోతిర్ ఉపసంపధ్య” (పరమ కాంతి అయిన నారాయణను పొందుట), ముండకోపనిషత్ 3.1.3 “పరమం సామ్యం ఉపైతి” (అష్ట గుణాల ద్వారా జీవాత్మ భగవానుడి సామ్యం పొందుతాడు), పెరియ తిరుమొళి 11.8.5 వ పాశురం “తమ్మైయే ఒక్క అరుళ్ శెయ్వర్” (ఆ ఆత్మ తనలా మారేలా భగవానుడు అనుగ్రహిస్తాడు), తిరువాయ్మొళి 3.3.1 “వళువిలా అడిమై శెయ్య వేండుం” (నిర్విరామ సేవ చేయాలనే కోరిక), తిరువాయ్మొళి 10.10.11 “అవావఱ్ఱు వీడు పెఱ్ఱ” (నమ్మాళ్వార్, తన కోరికలన్నిటినీ నెరవేర్చుకోవడానికి ముక్తిని పొందాడు) లో చెప్పినట్లు ఆళ్వార్ తన నిజ స్వరూపాన్ని గ్రహించి, భగవత్ కైంకర్యాన్ని పొందారు.

ద్రావిడ ఉపనిషత్ (తిరువాయ్మొళి) యొక్క ఈ రహస్య జ్ఞానాన్ని నమ్మాళ్వార్ల అనుగ్రహంతో పెరియ ముదలియార్ (నాథమునులు) పొందారు. ఆళవందార్లు వారి ఆచార్యులైన నాథమునుల ద్వారా ఈ రహస్య జ్ఞానాన్ని పొంది, వాటిపై చింతన చేస్తూ, సంసారుల స్థితిని చూసి భరించలేక, తమ భాధను ఆపుకోలేక, ఈ రహస్య జ్ఞానాన్ని అజ్ఞానులై ఆ అందరికీ తెలియజేయాలని భావించి, ఉపనిషత్ సారము, అత్యంత కఠినము అయిన ఈ గోప్య జ్ఞానాన్ని సరళం చేసి స్తోత్ర రూపంలో మనముందు ఉంచారు.

భగవత్ విషయం కాని సందర్భాలలో స్తోత్రం అంటే ముఖస్తుతి (లేని గుణాలు ఉన్నట్టుగా చెప్పి ప్రశంసించడం) అని అర్థం. శ్రీ స్తవం 3వ శ్లోకంలో “స్తోత్రం నామ కిమామనంతి” (కవులు పొగిడినట్లు), శ్రీ రంగ రాజ స్థవం పూర్వ శతకంలో “అన్యత్రాతద్గుణోక్తిః” (భగవత్ విషయాలు మినహా, స్తుతించడం అంటే లేని గుణాల గురించి మాట్లాడటం/పొగడటం అని అర్థం) అని చెప్పబడి ఉంది. కానీ, భగవత్ విషయం వర్ణనాతీతమైనదని తైత్రీయ ఉపనిషత్తు ఆనందవల్లి 9.1 వ శ్లోకంలో “యతో వాచో నివర్తంతే” (భగవత్ గుణాలను వర్ణించలేక ఊహకందని వాడని శబ్దాలు/పదాలు దిక్కుతెలియక అలసిపోయి తిరిగి వచ్చాయి) అని చెప్పినట్లు, కేన ఉపనిషత్తు 2.3 లో “అవిజ్ఞాతం విజానతాం” (అన్నీఎరిగినవారికే బ్రహ్మంను పూర్తిగా ఎరుగలేము అని తెలుసు) మొదలైన ప్రమాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి భగవంతుడిని ఇక్కడ ఎలా స్తుతించగలరు? ఆయనను పూర్తిగా గ్రహించలేము కానీ మనం ఆయనను స్తుతించగలము. ఎందుకంటే

  • శ్రీవిష్ణు సహస్రనామం “స్థవ్యః స్థవప్రియః” (ఆతడు స్రుతించదగినవాడు, స్తుతి ప్రియుడు) అని చెప్పబడింది. అనగా భగవానుడు స్తుతి ప్రియుడు అని అర్థం.
  • తిరువాయ్మొళి 2.2.11 వ పాశురం “ఏత్త ఏళులగుం కొండా” (ముల్లోకాలను కొలిచి అందరిచే స్తుతింపబడ్డాడు), తిరువాయ్మొళి 4.3.10 వ పాశురంలో “ఎత్త ఎత్త ఎంగేయ్‌ దుం” (అందరూ స్తుంతిచినా లెక్కలేనన్ని మంగళగుణాలున్నవాడు ఆతడు అని) అని చెప్పబడింది. అనగా లెక్కలేనన్ని గుణాలు ఉన్నవాడు ఆతడు అని అర్థం.
  • భగవత్ స్తుతి తప్ప మన నోటి నుండి మరొకరి ప్రశంస రాకూడదు.

మరొక వివరణ [ప్రాప్యం (లక్ష్యం), ప్రాపకం (మాధ్యమం) పై దృష్టి సాయించే పరిచయం].

[మొదట, లక్ష్యం వివరించబడింది.] పురుషార్థాలు నాలుగని శ్రీవిష్ణు పురాణం 1.18.22 లో “ధర్మార్థ కామ మోక్షాక్యాః పురుషార్థా ఉదాహృతాః | ఇదం చతుష్టయం” అని వివరించబడి ఉంది. అనగా ఆ నాలుగు – ధర్మం (ధర్మ మార్గం, అర్థ (సంపద), కామ (విషయ వాంఛలు), మోక్షాలు మన లక్ష్యాలని అర్థం). పెరియ తిరుమడల్ 11వ పాశురంలో “మన్నుం అఱం పొరుళ్ ఇన్బం వీడు” (ధర్మం, అర్థ, కామ, మోక్షం). వీటిలో, ధర్మం అనేది మన లక్ష్యం, పైగా సాధనం కూడా [అనగా, ధర్మబద్ధమైన పనులు చేయడం మన సాధనం, అలాగే మన లక్ష్యం కూడా],కానీ ఇది కష్టంతో కూడుకున్నది. అర్థం అనేది ఒక స్వతంత్ర లక్ష్యం, అయినప్పటికీ, ఇది తాత్కాలికమైనది, నిలుపుకోవడం కష్టం, ఇతర లక్ష్యాలను సాధించేందుకు అది సాధనం వంటిది. కామం కూడా ఒక స్వతంత్ర లక్ష్యమే, అయినప్పటికీ తాత్కాలికమైనది, నిరాధారమైనది, వినాశకరమైనది [జ్ఞానం వల్ల ఏర్పడిన స్వరూపానికి విరుద్ధంగా], అసహ్యకరమైనది. పైగా కామం అనేది మోక్షానికి అడ్డంకి అని మోక్ష శాస్త్రంలో మన పెద్దలు వివరించారు. ఆళవందార్లు వీటన్నింటినీ పక్కన పెట్టి మోక్షంపైనే తమ దృష్ఠి ఉంచారు. మోక్షంలో కూడా, కైవల్య మోక్షము కాకుండా కైంకర్య మోక్షముపైన తమ దృష్టి ఉంచారు. ఎందుకంటే, ఎంతో ప్రయాస పడి సాధించబడినప్పటికీ, భగవత్ అనుభవంతో పోల్చితే అది అల్పమైన ఫలమని, తమ దృష్టి ఏ కల్మశంలేని భగవత్ ప్రాప్తిపైన కేంద్రీకరించారు. అంతే కాదు, శ్రీవిష్ణు పురాణం 6.5.58, 6.5.59 లో “నిరస్థాతి శయాహ్లాద సుఖభావైకలక్షణా” (పరమానందం తమ పరిచయంగా ఉన్నవాడు) లో చెప్పినట్లు భగవానుడు పూర్ణఆనందమయుడు అని వివరించబడింది. తైత్రీయ ఉపనిషత్ ఆనందవల్లి 7 లో “ఏష హ్యేవానందయాతి” (ఆతడు జీవాత్మకు కేవలం ఆనందాన్ని మాత్రమే ప్రసాదిస్తాడు) అని చెప్పినట్లు, ముండక ఉపనిషత్ లో “పరమం సామ్యముపైతి” (పరమాత్మను పొందడం), పెరియ తిరుమొళి 11.3.5 వ పాశురంలో “తమ్మైయే ఒక్క అరుళ్ శెయ్వర్” (తనను ఆరాధించే వారిని తన వలే అయ్యేలా అనుగ్రహిస్తారు) అని చెప్పినట్లు ఆతడు తమ భక్తులపై కూడా అదే పరమానందాన్ని కుర్పిస్తాడు అని అర్థం. శ్రీ భగవత్ గీత 8.14 వ శ్లోకంలో “తస్యాహం సులభః” (నన్ను పొందడం సులభం) అని చెప్పినట్లు అతనిని సులభంగా పొందగలము. కనుక భగవత్ ప్రాప్తి ఉత్తమ లక్ష్యంగా పరిగణించారు మన పెద్దలు.

భగవానుని పొందే వివిధ అంశాలను ప్రమాణాలతో వివరణలు.

జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న శేష / శేషి సంబంధాన్ని ఆళవందార్లు వివరిస్తున్నారు:

  • శ్వేతాశ్వతర ఉపనిషత్ 6.16 “ప్రధాన క్షేత్రజ్ఞపతిర్ గుణేశః” (భగవానుడు అన్ని తత్వాలకు, ఆత్మలకు అధిపతి; మంగళక గుణాలు కలిగి ఉంటాడు)
  • శ్వేతాశ్వతర ఉపనిషత్ 1.9 “జ్ఞాజ్ఞౌ ధ్వావజావీశనీశౌ” – పరమాత్మ జీవాత్మలు సర్వజ్ఞులు అజ్ఞానులు వంటివారు; వాళ్ళు యజమాని దాసుడు వంటివారు.
  • శ్వేతాశ్వతర ఉపనిషత్ 6.7 “తమీశ్వరాణాం పరమం మహేశ్వరం” (దేవతలకే దేవుడు)
  • నారద పుండరీక (ఋషి) “దాసోహం వాసుదేవస్య” (నేను వాసుదేవుని దాసుడను) అని పలికారు.
  • హారీత స్మృతి, ఈశ్వర సంహిత – శివుడి మాటలు “దాసభూతాః స్వతస్ సర్వే” (స్వాభావికంగా సమస్థ ఆత్మలు పరమాత్మకు దాసులే కాదా?)
  • శ్రీ రామాయణం సుందర కాండం 42.35 హనుమంతుని పలుకులు “దాసోహం కోసలేంద్రస్య” (నేను కోసల రాజ్యానికి ప్రభువైన శ్రీరాముని దాసుడను)
  • సుబాల ఉపనిషత్ 7 “యస్యాత్మా శరీరం” (ఎవరికైతే (పరమాత్మకు) ఈ ఆత్మ శరీరం వంటిదో)
  • యజుర్ ఆరణ్యకం 3.11.21 “అంతః ప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా” (అన్ని జీవులలో ప్రవేశించి నియంత్రించు వాడు భగవానుడు)
  • ఆపస్తంబ సూత్రం 22.1 “పూః ప్రాణినః సర్వ ఏవ గుహాశయస్య” (అన్ని జీవుల హృదయాలు అనశ్వరమైన దోషరహితుడైన పరమాత్మకు నివాసాలు)
  • శ్రీవిష్ణు పురాణం 1.22.86 “తాని సర్వాణి తత్వపుః” (ప్రతీది ఆ పరమాత్మ శరీరమే)

ఆ తరువాత జీవాత్మ పరమాత్మల మధ్య జరిగే ఆనందభరితమైన
సంభాషణ గురించి వివరిస్తున్నారు:

  • పరమ సంహితా “యేన యేన దాతా గచ్ఛతి” (భగవానుడు ఎక్కడికి వెళ్లినా, దాసుడు ఆతనిని అనుసరిస్తాడు)
  • తైత్తిరీయ ఉపనిషత్ “సోశ్నుతే సర్వాన్ కమాన్ సహ బ్రహ్మణ విపశ్చితా” (భగవానుడి దివ్య మంగళ గుణాలను ఆయనతో పాటు జీవాత్మ కూడా ఆస్వాదిస్తాడు), పెరియ తిరువందాది 78 వ పాశురములో “ఓవాద ఊణాగ ఉణ్” (పరమభోగ్యంగా ఆనందిస్తాడు).
  • జితంతే స్తోత్రం 1.13 వ శ్లోకంలో “కామయే వైష్ణవత్వం తు సర్వ జన్మసు కేవలం” (నేను వైష్ణవుడిగా మాత్రమే పుట్టాలని కోరుకుంటున్నాను)
  • శ్రీ రామాయణం అయోధ్య కాండం 31.25 వ శ్లోకంలో లక్ష్మణుడు “అహం సర్వం కరిష్యామి” (నేను అన్ని కైంకర్యాలు చేస్తాను) అని అన్నాడు.
  • తిరువాయ్మొళి 3.3.1 “ఒళివిల్ కామమెల్లాం” (అన్ని కాలాలలో)

వీటి ఆధారంగా, పతీవ్రతయిన భార్య తన భర్తకు ప్రేమతో సేవ చేస్తుందని, అలాగే జీవాత్మ భగవంతుడికి ప్రేమతో కైంకర్యం చేస్తారని అతను ముగించారు.

వివిధ కైంకర్య అంశాలను వివరిస్తున్నారు:

  • శ్రీ విష్ణు పురాణం 6.5.58, 6.5.59 లో “భేషజం భగవత్ ప్రాప్తిః” (భగవానుని పొందడమే పరమౌషధం) అని భగవానుడే సాధించదగిన లక్ష్యం అని చెప్పబడింది, ఆతడే మన కైంకర్యం గ్రహీతుడు, అర్హుడు;
  • ఇది ఛాదోగ్య ఉపనిషత్తు 8.12.2 లో “స్వేన రూపేణాభినిష్పద్యతే” (పరిజ్ఞానము పొందడం/ జ్ఞానము వికసించడం) అని చెప్పబడింది, వికసించిన ఆత్మ స్వచ్ఛమైన భక్తికి నిలయమౌతుంది. కాబట్టి స్వయం సాక్షాత్కారమే ప్రాప్యం (లక్ష్యం);
  • కఠోపనిషత్తు 1.3.9 లో “సోద్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం” (వికసించిన జ్ఞానం సారథిగా, మనస్సును నిగ్రహంగా కలిగి ఉన్నవాడు, ఈ భౌతిక జగత్తుకి ఆవలిన ఉన్న విష్ణు నివాసాన్ని చేరుకుంటాడు) అని చెప్పబడింది. నిత్య విభూతి చెప్పబడింది. నిర్విరామ కైంకర్యం మనకు ఉభించును కనుక, నిత్య విభూతియే మన లక్ష్యం.
  • జితంతే స్థోత్రం 1.4 “నిస్తరంతి మనీషిణః” (అవి భౌతిక లోకాన్ని దాటుతారు) అని వివరించబడింది. అడ్డంకులు (సంసారం) తొలగించడం లక్ష్యం అని చెప్పబడింది, ఎందుకంటే ఇది తమ కైంకర్యానికి అడ్డంకి.

శ్రీ రామాయణం సుందర కాండము 26.5 లో సీతా పిరాట్టి “న హి మే జీవితేనర్థః” (నా రాముడికే నేను దూరమైనపుడు నా ఈ ప్రాణం, ఈ నా దేహం, ఈ ఆభరణాల ఉపయోగం ఏముంది) అని అన్నట్లు, తిరువాయ్మొళి 4.8.1 లో “మణి మామై కుఱైవిలం” (నా అందమైన ముఖ కాంతి దేనికీ ఉపయోగం లేదు), తిరువాయ్మొళి 4.8.9 “ఉడంబినాల్ కుఱైవిలం” (ఈ  శరీర ఉపయోగం లేదు), తిరువాయ్మొళి 4.8.10 “ఉయిరినాల్ కుఱైవిలం” (నా ఉపయోగమే లేదు) అని చెప్పినట్లు వీటిలో ఏవైనా కైంకర్యానికి దారితీయకపోతే వాటిని మన లక్ష్యాలుగా పరిగణించకూడదు.

పతీవ్రతయిన భార్య తన పవిత్రతకు ఎటువంటి లోపం కలుగకుండా తన కంటే నిష్ఠగా తన భర్త యొక్క అల్పమైన శరీరానికి సేవ చేస్తుంది. ఎందుకంటే పవిత్ర భావంతో తన భర్తకు చేస్తుంది కాబట్టి, భార్య ఆ భర్తకు శారీరిక సేవ మాత్రమే చేస్తుందని ఎవరూ చెప్పలేరు. అదే విధంగా, భగవత్ భక్తుడు తదీయ శేషత్వం (భగవత్ భక్తులకు దాసుడిగా ఉండటం) పైనే దృష్టి సారిస్తాడు. ఇదియే లక్ష్యం అని వివరించబడింది [భగవంతుడు వారిపై విశేష కృప కురిపించి ఉండుట వలన భగవత్ భక్తులను భగవానుడి భిన్న భిన్న శరీరాలు/రూపాలుగా పరిగణిస్తారు].

ఆ విధంగా, అలవందార్లు శాస్త్ర సారాంశమైన ఉత్తమ లక్ష్యాన్ని నిర్ధారిస్తుంది.

[ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాలను ఇక పేర్కొన్నారు]

ఈ లక్ష్యం సాధనలో ప్రధాన రెండు సాధనాలు ఉన్నాయి – భక్తి (యోగం), ప్రపత్తి (శరణాగతి).

వీటిలో, భక్తి అనేది వేదన(బాధ), ధ్యానం, ఉపాసన వంటి పదాలను ఉపయోగించి వివరించారు. అది భక్తిగా పరిణమించిన జ్ఞానం; జ్ఞానం పరిపక్వమై భక్తిగా మారుట; భగవానుని ప్రత్యక్ష దృశ్యమానతను సులభతరం చేస్తుంది. కింది ప్రమాణాలు భక్తి స్వభావాన్ని వివరిస్తాయి:

  • తైత్తిరీయ ఉ ఆనందవల్లి 1 “భ్రమవిధాప్నోతి పరం” (బ్రహ్మం ను ధ్యానించేవాడు ఆ పరమ బ్రహ్మాన్ని పొందుతాడు)
  • బృహదారణ్యక ఉపనిషత్తు 6.6.6 “శ్రోతవయో మంతవ్యొ నిధిధ్యాసితవ్యః” (ఆత్మ గురించి వినాలి, ధ్యానం చేయాలి, చింతన చేయాలి. ఆ ఆత్మను చూడవచ్చు)
  • కఠోపనిషత్తు 1.2.23 “నాయమాత్మ ప్రవచనేన లభ్యః” (భక్తి లేకుండా కేవలం శ్రవణం, ధ్యానం వంటి వాటి ద్వారా ఈ పరమాత్మను పొందలేము)
  • ముండకోపనిషత్తు 2.2.9 “తస్మిన్ దృష్టే పరావరే” (ఒక్కసారి ఆ పరమాత్మ దర్శనము పొందిన తరువాత, జీవాత్మ యొక్క కామం, క్రోధం మొదలైనవి నశిస్తాయి, సందేహాలు కర్మలు తొలగిపోతాయి)
  • శ్రీ భగవత్ గీతా 11.54 “భక్త్యా తవణ్యయా శక్య” (భక్తి లేకుండా నన్ను పొందలేను)
  • శ్రీ భగవత్ గీత 18.54 “మద్భక్తిం లభతే పరమ్” (విషయాల పట్ల వైరాగ్యం ఉండేవాడు నా భక్తిని పొందుతాడు)

భక్తి యోగం యజ్ఞ యాగాలతో కూడుకున్న పని; దీనికి కర్మ జ్ఞాన యోగాలతో జోడించి నిర్వహించాలి – కాబట్టి అర్హత ఉన్నవారు మాత్రమే నిర్వహించగలరు [త్రైవర్ణికులు – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములకు చెందిన వాళ్ళు మాత్రమే]; ఫలితం ఎంతో కాలం గడిచాక మాత్రమే లభిస్తుంది; ఈ క్రమంలో క్రిందకు దిగజారే అవకాశం ఉంది.

ఆళవందార్లు ఈ లోపాలతో కూడిన భక్తి యోగాన్ని పక్కన పెట్టి, ఏ లోపాలు లేనిది, శృతి (వేదం), స్మృతి (మను స్మృతి మొదలైనవి) లో నిర్ధారించి ఉన్న, సులభకరమైన ప్రపత్తిని ఉత్తమ సాధనంగా నిర్ణయించారు. ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా ప్రపత్తి అధ్యావసాయాత్మక జ్ఞాన విశేషం (పూర్ణ విశ్వాసం రూపంలో ఉన్న ఒక విశేష జ్ఞానం) అని వివరించారు:

  • శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.18 “ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే” (ముక్తి పొందాలని కోరిక ఉన్న నేను, బ్రహ్మను సృష్టించిన పరమ పురుషునికి శరణాగతి చేస్తున్నాను).
  • తైత్తీయ ఉపనిషత్తు నారాయణవల్లి 50 “న్యాసమాహుర్ మనీషిణో బ్రహ్మాణం” (పరమాత్మని న్యాసగా పండితులు వివరిస్తారు)
  • తైత్తీయ ఉపనిషత్తు నారాయణవల్లి 49 “న్యాస ఇతి బ్రహ్మ” (బ్రహ్మమే న్యాసం)
  • తైత్తీయ ఉపనిషత్తు నారాయణవల్లి 50 “తస్మాన్ న్యాసమేషాం తపసాం అతిరిక్తమాహుః” (అందువలన, ఈ న్యాస (శరణాగతి) అత్యున్నతమైన తపస్సుగా చెప్పబడింది).
  • యజుర్ కాండమ్ 6.5 “తస్మాదపి వద్యం ప్రపన్నం న ప్రతిప్రయచ్ఛంతి” (శరణాగతి చేసినట్లయితే, అతను చంపబడటానికి అర్హత ఉన్నప్పటికీ, ఇతరులతో పోల్చకూడదు).
  • శ్రీ రామాయణం అయోధ్య కాండం 31.2 “స భ్రాతుస్ శరణౌ గాడం నిపీడ్య రఘునందన” (లక్ష్మణుడు తన సోదరుడైన శ్రీరాముని పాదాలను గట్టిగా పట్టుకుని మాట్లాడాడు)
  • శ్రీ రామాయణం యుద్ధ కాండం 18.33 “సకృదేవ ప్రపన్నాయ” (ఒకసారి శరణాగతి చేసినా అతనిని ఎప్పటికీ వదులను).
  • శ్రీవిష్ణు పురాణం 5.23.47 “సోహం త్వం శరమపారం అప్రమేయం” (తన కంటే గొప్పవారు ఎవరూ లేని, అంతులేని, ఊహకి చిక్కని వాడికి నేను శరణాగతుడైనాను)
  • శ్రీ భాగవతం 11.5.41లో “సర్వాత్మనా యశ్ శరణం శరణ్యం నారాయణం లోక గురుం ప్రపన్నః” (ఎవరైతే శ్రీమన్నారాయణునికి పూర్ణ శరణాగతి చేయునో, అతడు దేవతలు, ఋషులు, బంధువులు, పితృలకు ఋణపడి ఉండడు. వారికి దసుడు కాడు.
  • శ్రీ భగవత్గీత 7.14 “మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే” (నాకు శరణాగతి చేసిన వాడు అజ్ఞాన సాగరాన్ని సులభంగా దాటిపోతాడు).
  • శ్రీ భగవత్గీత 18.62 “తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత” (ఓ భరత ఉత్తరాధికారి! ఆ భగవానునికే శరణాగతి చేయుడు)
  • శ్రీ భగవత్గీత 18.66 “సర్వధర్మాన్ పరిత్యజ్య” (అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు మాత్రమే శరణాగతి చేయుడు)
  • శ్రీవిష్ణు పురాణం 1.9.73 “తావతార్థి స్తతా వాంచా” (నీకు శరణాగతి చేసేవరకు మాత్రమే, అతనికి సంపద పైన కోరిక ఉంటుంది, సంపాదించలేదనే చింతన ఉంటుంది)

భగవానుని స్తుతించడానికి బయలుదేరిన ఆళవందార్లు ఎందుకు తమ  ఆచార్యుని [మొదటి మూడు శ్లోకాల్లో నాథమునిని స్తుతించారు] స్తుతించడం ప్రారంభించారు? “కర్ణే స్పృష్టే కడిమ్ చాలయతి” (వారి చెవులు తాకినప్పుడు, తన తుంటిని కదిలించెను) అనే సామెత లాగా ఉంది కాదా? వాస్తవానికి, ఇది క్రింది కారణాలకు సంబంధించినది:

  • భగవత్ స్తుతి చేసేందుకు తనను (ఆళవందార్) సృష్టించినందుకు కృతజ్ఞత
  • భగవానుని స్తుతించగలిగే జ్ఞానం కలిగి ఉండాలి
  • ప్రబంధాన్ని అడ్డంకులు లేకుండా పూర్తి చేయమని ప్రార్థించడం

ఈ స్తుతి మనసులో చేయగలమా? ఈ ప్రబంధం నేర్చుకోవాలనుకునే వారికి గొప్ప ఉపకారం అవుతుంది.

కృతజ్ఞతతో ఆచార్యుని సేవించాలని అనేక ప్రమాణాలు ఘోషిస్తున్నాయి.

  • తైత్తిరీయ ఉపనిషత్తు శీక్షావల్లి 11 “ఆచార్య దేవో భవ” (ఆచార్యుని దేవుడిగా భావించుట)
  • యజుర్ ఆరణ్యకం 4 “నమ ఋషిభ్యో మంత్రకృధ్భ్యః” (మంత్రాన్ని జీర్ణించుకున్న ఋషులను నేను ఆరాధిస్తాను)
  • ఆపస్తంబ సూత్రం 1.1.6 “స హి విధ్యాతస్ తం జనయతి | తచ్చ్రేష్టం జన్మ ||” (ఆచార్యుడు శిష్యునికి జ్ఞానోదయం చేసి పునర్జన్మను ఇస్తాడు; అది దేహ జన్మ కంటే గొప్పది)
  • విష్ణు తత్వం “మంత్రే తద్దేవతాయాంచ తతా మంత్ర ప్రదే గురౌ” (మంత్రానికి, ఆ మంత్రంలో ఉన్న దేవతకు, ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యునికి కట్టుబడి ఉండాలి)

విలువైన రత్నాన్ని మనకెవరైనా ఇస్తే, ఇచ్చిన వ్యక్తి పట్ల కృతజ్ఞతతో ఉండటం మర్యాద. దీనికి శాస్త్ర ప్రమాణం అవసరం లేదు కదా?

మనలో జ్ఞానోదయం కలిగించిన ఆచార్యుని స్తుతించుట మన పెద్దలు సమాన్యంగా ఆచరించారు.

  • మీమాసక – మీమాసక కారికా “అభివంధ్య గురునాదౌ శిష్య ధీపద్మినీరవీన్” (శిష్యులుకు జ్ఞానం, కమలానికి సూర్యుని వంటి ఆచార్యులను మొదట సేవించడం)
  • మను – మను స్మృతి 2.218 “యథా కనన్ కనిత్రేణ” (మనుష్యుడు గొయ్యి తవ్వి నీళ్ళు తెచ్చినట్లు, శిష్యుడు గురువును సేవించడం ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు)
  • వైశంపాయన ఋషి – మహాభారతం ఆది పర్వం 1.27 “యస్య ప్రసాదాత్ వక్ష్యామి నారాయణ కథం ఇమామ్” (జ్ఞాన తేజస్సు కలిగిన వ్యాస భగవానుని అనుగ్రహంతో అపరిమితుడైన నారాయణుని చరిత్రను పఠింగలుగుతున్నాను. ఆతనికి నా వందనాలు).
  • మను – మను స్మృతి 2.117 “లౌకికం వైధికం వా’పి” (ప్రాపంచిక జ్ఞానాన్ని, శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని నేర్పించిన గురువుని ముందు సేవించాలి)

ఇలా ఉండగా, ఆళవందార్లు తమ స్వాచార్యులు (మణక్కాల్ నంబి) ని సేవించుటకు బదులు తమ ఆచార్యుల గురువుని ఎందుకు సేవించారు? తమ స్వాచార్యులను స్తుతించడం కంటే ఆచార్యుడు కోరుకున్న దానిని స్తుతించడం అతి ఉత్తమం; ఆళవందార్లు పెరియ ముదలియార్ (నాథమునులు) స్తుతించుట, తమ ఆచార్యునికి సంతృప్తి కలిగించునని ఆళవందార్లు ఇలా చేసారు. నాథమునులను ఆళవందార్లు ఆశ్రయించుటకు రెండు కారణాలున్నాయి:

  • నాథమునులు, నమ్మాళ్వార్ల కృపతో, ఆళ్వార్ కి భగవాన్ పట్ల  ఉన్న అపారమైన భక్తి కారణంగా ఆర్జించిన జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని ఆయన వరకే పరితం కాకుండా దానిని భావి తరానికు పంచాలని పరితపించిచారు, మన సంప్రదాయానికి దర్శన స్థాపకుడు (అధ్యక్ష ఆచార్యుడు) అయినారు.
  • మణక్కాళ్ నంబి అళవందార్లతో “ఈ సూత్రాలన్నీ నాథమునిచే వివరించబడ్డాయి; అతని దివ్య తిరువడి సంబంధమే నీకు అత్యున్నత లక్ష్యానికి సాధనం.” అన్నారు.

ఈ కారణంగానే, శ్రీవిష్ణు సహస్రనామ భాష్యంలో భట్టర్ “ప్రథమమపి గురుం నాథమీడే” (ప్రథమాచార్యులైన నాథామునులను నేను సేవిస్తున్నాను) అని అన్నారు.

వేదం ప్రారంభంలో మరియు ముగింపులో వేదానికి మూలమైన ‘ప్రణవం’ పఠించినట్లుగా, ఇక్కడ, ఆచార్యుని ప్రారంభంలో మరియు ముగింపులో స్తుతిస్తారు, మధ్యలో భగవానుని స్తుతిస్తారు. మొదటి మూడు శ్లోకాల్లో ఆళవందార్లు నాథమునులను సేవిస్తున్నారు.

మరుసటి శీర్షికలో మొదటి శ్లోకము చూద్దాము,

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2016/12/sthothra-rathnam-introduction/

పొందుపరిచిన స్థానము : https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment