Category Archives: telugu

జ్ఞానసారము 25

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 24

lord-maha-vishnu

అవతారిక

కిందటి పాశురములో శరణాగతి చేసిన తన భక్తులు తెలియక చేసిన తప్పులను గ్రహించడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు వివరించారు కదా! దానికి కారణము  భగవంతుడు  “వాత్సల్య పరిపూర్ణుడు”. అందు వలన   “వత్సలుడు ” అని పిలువబడతాడు. తన భక్తులు తెలియక చేసిన తప్పులను గణించక పోగా వాటిని దీవెనలుగా స్వీకరిస్తాడు, ఆనందిస్తాడు . అందువలన ఎవ్వరూ బయపడనవసరము లేదు అని చెపుతున్నారు .

“అఱ్ఱం ఉరైక్కిల్ అడైందవర్ పాల్ అంబుయైకోన్

కుఱ్ఱం ఉణరందిగళుం కొళ్గైయనో? – ఎఱ్ఱే తన్

కన్ఱిన్ ఉడంబిన్ వళువన్ఱో? కాదలిప్పదు

అన్ఱదనై ఈన్ఱుగంద ఆ”

ప్రతిపదార్థము

అఱ్ఱం ఉరైక్కిల్ = ఆఖరికి చెప్పేదేవిటంటే

అంబుయైకోన్ = తామారపై వేంచేసి వుండే మహలక్ష్మి ధవుని

అడైందవర్ పాల్ = శరణాగతి చేసిన వారి

కుఱ్ఱం = దోషములను

ఉణర్దు = తెలుసుకొని

ఇగళుం కొళ్గైయనో?= వాటిని ద్వేషించడు

ఎఱ్ఱే  = ఎంత ఆశ్చర్యము!

ఆ = ఆవు

అన్ఱదనై ఈన్ఱుగంద = ఈనిన వెంటనే

తన్ కన్ఱిన్ = తన దూడ యొక్క

ఉడంబిన్ = శరీరముపై

వళువన్ఱో? =  కప్పి ఉన్న మావిని

అన్ఱు = అప్పుడు

కాదలిప్పదు = ప్రేమగా నోటితోస్వీకరించి శుభ్రముచేస్తుంది

వ్యాఖ్యానము

అఱ్ఱం ఉరైక్కిల్……అఱ్ఱం…ఆఖరికి-అనగా చివరికి చెప్పేది ఏవిటంటే

అడైందవర్ పాల్……తనను శరణాగతి చేసిన వారి పట్ల .

అంబుయైకోన్…… శ్రీదేవికి భర్త , లక్ష్మణాదులకు సోదరుడు అయిన శ్రీమన్నారాయణుడు ,’ పాల్ ‘- పట్ల …ఎవరి పట్ల ?భక్తుల పట్ల … ఎవరు? అంబుయైకోన్ …భక్తులు అమ్మవారి పురుషకారము వలననే స్వామిని చేరుకుంటారు. అందు వలన ఇక్కడ శ్రీమన్నారాయణుని ‘ అంబుయైకోన్ ‘ (తామర పై వేంచేసి వుండే మహలక్ష్మి ధవుడు)అన్నారు. ఆమె పురుషకారముతో వచ్చారు కాబట్టి ఆయన వారిని దరి చేర్చుకుంటాడు కదా!జీవాత్మను , పరమాత్మ దగ్గరికి చేర్చేది అమ్మవారి పురుషకారము కావున పరమ్మాత్మ వారి దోషములను గణించడు. అది ఆయన సహజ స్వభావము. ఒక జీవాత్మను , ఆయన స్వీకరించాక .నిజంగా నిండు మనసుతో అంగీకరించారా లేక ఏదో పోనీలే అని స్వీకరించారా ? అన్న విషయమును అమ్మవారు పరీక్షింటము కోసము వారి దోషములను గురించి స్వామితో మాట్లాడతారు . అది విని ఆయన ఆ జీవుడిని  వదిలి వేస్తారా! లేక శిక్షిస్తారా అని చూస్తారు . స్వామి దానికి ‘ ఎన్ అడియార్ అదు సెయ్యార్ సెయ్దారేల్ నన్ఱు సెయ్దార్ ‘ పెరియాళ్వార్ తిరుమొళి 3.9.2 ( నా దాసులు అలా చేయరు.చేస్తే మంచికే చేసి వుంటారు) అని ఆ జీవుడిని నిండు మనసుతో అంగీకరిస్తారు .

కుఱ్ఱం ఉణరందిగళుం కొళ్గైయనో? ……పరమాత్మ “కొళ్గై” (స్వభావమును ) స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ తన ప్రశ్నల ద్వారా రూఢి చేసుకుంటారు. అలా ఎందుకు చేయాలి అంటే చదువరులకు పరమాత్మ స్వభావము బోధపడటము కోసము అని చెపుతారు . పరమాత్మ స్వభావము ఎటువంటిది ? అమ్మవారి పురుషకారముతో తన శ్రీపాదము లను చేరినవాడు ఎటువంటి వాడైనా స్వీకరించటము , వాడు చేసిన దోషములను గుణములుగా చూడటము , వాడి మీద కోపమును చూపక పోవటము ఆయన స్వభావము . అందుకే ఆయన “వాత్సల్యము గలవాడు , వత్సలుడు . వత్సం  అంటే దూడ . దూడ దోషములను ఆవు గుణములుగా స్వీకరించినట్లు  ఆయన తన దాసుల దోషములను గుణములుగా స్వీకరిస్తాడు .

ఎఱ్ఱే తన్ కన్ఱిన్ ఉడంబిన్ వళువన్ఱో? కాదలిప్పదు అన్ఱదనై ఈన్ఱుగంద ఆ”……. ‘ ఎఱ్ఱే ‘ అనేది ఆశ్చర్యార్థకము . స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఎందుకలా అన్నారు ? అంటే ఆవు సాధారణముగా శుభ్రముగా వున్న గడ్డిని తప్ప ఎవరైనా తొక్కినా ,అపరి శుభ్రముగా వున్నా , ఆ గడ్డిని తినదు . కాని తాను ప్రసవించగానే , తన వత్సం  శరీరము మీద వున్న మావి, ఇతర మలినములను తన నోటితో నాకి శుభ్రము చేస్తుంది .అది వాత్సల్యము . “ఈన్ఱ పొళుదిన్ పెరిదువక్కుం”, అలాగే భగవంతుడు తన భక్తులు చేయు తప్పులను ద్వేషించక ప్రేమతో స్వీకరిస్తాడు. మన పూర్వాచారులు ఎప్పుడు భగవంతుడి వాత్సల్యమునకు ఈ వృత్తాంతమునే ఉదాహరణగా చెపుతారు. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్  భగవంతుడి వాత్సల్యమును చూసి ‘ ఎఱ్ఱే ‘ అని అన్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-25-arram-uraikkil/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 24

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 23

svayam11

అవతారిక

కిందటి పాశురములో సంచిత, ఆగామి, ప్రారబ్దమనే  మూడు విధముల కర్మలలో మొదటి రెంటిని  గురించి చెప్పారు. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ఈ పాశురములో  శ్రీమన్నారాయణుడు తనను శరణాగతి చేసిన భక్తులు తెలియక చెసే పాపాలను చూడడు , గణించడు అని వివరిస్తున్నారు.

“వణ్డు పడి తుళబ మార్బినిడై సెయ్ద పిళై

ఉణ్డు పల ఎన్ఱు ఉళం తళరేల్ – తొణ్డర్ సెయ్యుం

పల్లాయిరం పిఱైగళ్ పార్తిరుందుం కాణుం కణ్

ఇల్లాదవన్ కాణ్ ఇఱై”

ప్రతి పదార్థము

వణ్డు పడి = తేనెను గ్రోలుటకు గుంపులు గూడిన తుమ్మెదలు

తుళబ మార్బినిడై = శ్రీతులసి మాలలను హృదయ కమలముపై ధరించిన శ్రీమన్నారాయణుడు

సెయ్ద పిళై = (జీవులు)చేసిన  తప్పులు

పల ఉణ్డు ఎన్ఱు = అనేకములు కలవు అని

ఉళం = ఓ మనసా!

తళరేల్ = చింతించకు

ఇఱై = (ఒక్కసారి శరణమంటే ఎప్పటికీ వదలక కృప చేసే)మన నాయకుడు

తొణ్డర్ సెయ్యుం = తన భక్తులు చేయు

పల్లాయిరం పిఱైగళ్ = వేలాది దోషములను చూచు నపుడు

పార్తిరుందుం = తన జ్ఞానముచే అన్నింటినీ చూడగలిగి కూడా

కాణుం = భక్తుల విషయములో దోషములను చూడవలసి వస్తే

కణ్ ఇల్లాదవన్ కాణ్ = చూడనట్లే వ్యవహరిస్తాడు

వ్యాఖ్యానము

“వణ్డు పడి తుళబ మార్బినిడై  సెయ్ద పిళై…….తేనెను గ్రోలుటకు తుమ్మదలు గుంపులు గూడిన శ్రీతులసి మాలలను హృదయ కమలముపై ధరించిన శ్రీమన్నారాయణుడు తన భక్తులు చేయు వేలాది దోషములను చూడనట్లే వ్యవహరిస్తాడు . ‘ శ్రీమన్నారాయణుడు ‘ అంటే చాలు కదా! మరి స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ‘ శ్రీతులసి మాలలను హృదయ కమలముపై ధరించిన శ్రీమన్నారాయణుడు ‘అని ఎందుకు అన్నారు! …అంటే భక్తులు ఆయన సౌందర్యమును చూసి ఆకర్షింప బడతారు. అలా ఆకర్షింప బడిన వారు తప్పులను చేయరు. అంతే కాదు శ్రీమహాలక్ష్మి కూర్చొని ఊగే తులసి మాల అంటే ఆయనకే ఎంతో ప్రీతి కదా!

ఉణ్డు పల ఎన్ఱు……. శ్రీమన్నారాయణుని శరణాగతి చెసినా ఇంద్రియములచే నియమింపబడిన శరీరము దోషములు చేస్తూనే వుంటుంది. “ఉరన్ ఎండ్ఱుం తోతియాల్ ఓర్ ఐందుం కాప్పాన్”  తిరుక్కుఱళ్(మావటి వాడు కర్ర పట్టుకొని  ఏనుగును నియంత్రిస్తాడు) ఇక్కడ ఇంద్రియములను ఏనుగునుతొను , మనసును కర్ర పట్టుకున్న మావటి వాడితొను పోల్చారు. స్వామి తిరుమంగై ఆళ్వార్లు , “ఐవర్ అఱుతు తిన్ఱిద అంజి నిన్ అడైందేన్” (ఐదుగురు   వెంట పడుతుంటే భయపడి నిన్ను చేరుకున్నాను)అన్నారు. అదే విషయాన్ని స్వామి నమ్మాళ్వార్లు , “ఉణ్ణిలావియ ఐవరాల్ కుమైత్తీత్ఱి” అన్నారు . అందు వలన శరణాగతి చేసినప్పటికీ ఇంద్రియములు నిరంతరము ఆ జీవుడి మీద పెత్తనము చేస్తూనే వుంటుంది . అందువలన దోషములు జరిగుతూ వుంటాయి .

ఉళం తళరేల్ …….అప్పుడు ఈ ఓదార్పు అవసరమవుతుంది . “ఉళం” (మనసు) “ఉళ్ళమే” అన్న పదమునకు సంక్షిప్త రూపము . తమిళ వ్యాకరణము ప్రకారము “మకర ఈరు విళి వేత్ఱుమై” అంటారు .( విభక్తిని తెలియజేస్తున్నారు).

తొణ్డర్ సెయ్యుం…..” తొణ్డర్ ” శ్రీమన్నారాయణుని దాసులు….చేయు తప్పులు. నిరంతరము శ్రీమన్నారాయ ణుని శ్రీపాదములను సేవించె వరే కాక ఆయన భక్తులందరూ దాసులుగానే భావింపబడతారు.

పల్లాయిరం పిళైగళ్ …….అనేక వేల దోషములు… అనగా లెక్కకు మిక్కిలైన దోషములు. దేహములు సత్వ, రాజస, తామసములనే త్రిగుణాత్మకమైనవి. ఈ మూడు గుణములు అనేక దోషములను చేయిస్తూ వుంటుంది.’  పిళైగళ్ ‘_ ‘ పాపములు ‘.రెప్ప పాటులో జీవుడు చేసే పాపములను తొలగించుకోవటానికి అనేక బ్రహ్మ యుగ ములు పడతాయి. అర్థాత్ మన  పాపములను మనమే తొలగించుకోవాలంటే సాధ్యమయ్యే విషయము కాదు. శాస్త్ర విహితమైన కర్మలు ‘ పాపములుగా ‘ పరిగణింప బడతాయి. మనచా ,వాచా ,కర్మణా ఇతరులను దూషించుటము ,  పరుల ద్రవ్యమును కోరుకోవటము , పరస్త్రీ వ్యామొహము , అబద్దాలు చెప్పటము , తినకూడనివి తినటము వంటివి  శాస్త్ర విహితమైన కర్మలు…. చేయకూడనివి. శ్రీమన్నరాయణుని ఇతర దేవతలతో పోల్చడము , ఆయన అవతార ములలో దోషములను వెతకటము , భగవంతుడి విగ్రహమును తయారు చేసిన పదార్థమును శోధించటము , పూజను పూర్తి చేయకుండా ఆపటము , పూజా ద్రవ్యాలను దొంగిలించటము , దొంగతనము చేయు వారికి సహకరించటము మొదలైనవాటిని శాస్త్రము అపచారములుగా చెప్పింది .భాగవత అపచారము , భాగవతులపై ద్వేషమును పెంచుకోవటము కూడా ఈ కోవలోకే వస్తాయి .

ఇఱై పార్తిరుందుం కాణుం కణ్…….తనను శరణాగతి చేసిన వారు ఇవన్నీ చేసినా సర్వజ్ఞుడు ,సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు  అవన్నీ చూడగలిగి కూడా చూడడు.

ఇల్లాదవన్ కాణ్…… ‘ కాణ్ ‘ చూడగలుగు జ్ఞానము…చూడదు. శ్రీమన్నారాయణుడు తన భక్తుల మీద ఉన్న అపారమైన కారుణ్యము చేత చూడడు .’ ఇఱై ‘ అనగా పెరుమాళ్ళు . కొద్దిగా అనే అర్థము కూడ వస్తుంది. అనగా శ్రీమన్నరాయణుడు తన భక్తుల దోషములను కొద్దిగా కూడా చూడడు . దీనినే శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రములో “అవిజ్ఞ్యాత” అన్న  నామము తెలియజేస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-24-vandu-padi-thulaba/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 23

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 22

reclinevishnu

అవతారిక

జన్మకర్మల చక్రభ్రమణములో పడి కొట్టుకుపోతామేమో అని భయపడేవారికి ఈ పాశురములో ఒదార్పు లభిస్తుంది . శరణాగతి చెసిన వారికి కష్టాలు ఉండవు అనినొక్కి చెపుతున్నారు.

“ఊళి వినైక్ కుఱుంబర్ ఒట్టరువర్ ఎన్ఱంజ్చి

ఏళై మనమే! ఇనిత్తళరేల్ – ఆళి వణ్ణన్

తన్నడి క్కీళ్ వీళ్దు శరణ్ ఎన్ఱు ఇఱంతొరుకాల్

సొన్నదఱ్ పిన్ ఉణ్దో? తుయర్”

ప్రతి పదార్థము

ఊళి వినై = పురాకృత పాపములనే

కుఱుంబర్ = దుష్టులులా

ఓట్టరువర్ = పరుగున వచ్చి ఇడుముల పాలు చేస్తుందని

అంజ్చి = భయపడే

ఏళై మనమే! = పిచ్చి మనసా

ఇనిత్తళరేల్ –= ఇక భయపడకు ఎందుకంటే

ఆళి వణ్ణన్ తన్ = కడలి వంటి నీలి రంగులో ఉండే శ్రీమన్నారాయణుని

అడి క్కీళ్ = శ్రీపాదముల మీద

వీళ్దు = పడి

శరణ్ ఎన్ఱు = శరణాగతి చేసి

ఇఱంతు = ప్రార్తిస్తే

ఒరుకాల్ = ఒక్క సారి (రక్షిస్తానని )

సొన్నదఱ్ పిన్ = మాట ఇచ్చిన తరువాత

తుయర్ ఉణ్దో? = కర్మలచేత వచ్చే కష్టాలు ఉంటాయా? ఉండవు కదా!

వ్యాఖ్యానము

ఊళి వినైక్ కుఱుంబర్….. పురాకృత కర్మలు  ఇక్కడ దుర్మార్గుడిలా  పాపిష్టి రూపు దిద్దుకొని  బాదిస్తాయి. దానినే “కురుంబర్”  అన్నారు. ‘ ఊళి ‘ అనగా పురాతన , ‘ వినై ‘ కర్మలు . పురాకృత కర్మలు జీవుడిని పాపిష్టి పనులు చేయటానికి ప్రొత్సహిస్తూ ఉంటాయి . దీనినే  “అళుకాఱు ఎన ఒరు పావి”, అని  “కయమై ఎన్నుం పణ్బుచొల్” అని అంటారు. వస్తు వ్యామొహములు ఆ జీవుడిని , దుష్టుల గుంపు (కయవర్) చుట్టుముట్టి దాడి చేసి నంతగా బాధిస్తాయి . అవి  ఎంత బలీయమైనవి అంటే , మొత్తం ప్రపంచాన్నే దాసోహము చెసుకోగలవు .  వీళ్ళు ఐదుగురు (ఐదు జ్ఞానేంద్రియములు ) విజృంభించి రాత్రిళ్ళుఅందరినీ  గడగడ లాడించే దొంగలలా జీవులను బాధించ  గలవు.

ఓట్టరువర్ ఎన్ఱంజ్చి…….పురాకృత కర్మలు జీవుడి వేంట పడి పరిగెత్తించి బాదిస్తుంటాయి అని భయపడే

ఏళై మనమే!…..ఓ! పిచ్చి మనసా ! భగవంతుడిని ఎవరైనా శరణాగతి చేస్తే ఆయన ఎట్టి పరిస్థితులలోను వదిలి వేయడు ,అందు వలన మనకు భయము లేదు . నిత్యనివాసమైన శ్రీవైకుంఠములో స్థానము ఉంటుంది. అది శరణాగతి మహిమ అని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అంటున్నారు .

ఇనిత్తళరేల్ –……..శరణాగతి చేసేటప్పుడు అనేక అడ్డంకులు ఏర్పడవచ్చు . అయినా భయపడకు మనసా ! అని శ్రీకృష్ణుడు అర్జునిడికి ధైర్య వచనాలు చెప్పినట్టుగా  ఇక్కడ స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ధైర్య వచనాలు చెపుతున్నారు .’ ఇని ‘ అనగా ‘ ఇక ‘…. అంటే శరణాగతి చేసిన తరువాత అని అర్థము.

ఆళి వణ్ణన్……..సముద్ర వర్ణుడు…. సముద్ర మంత లోతైన వాడు అనగా అంతు చిక్కని వాడు . .సముద్రము వంటి నీలి వర్ణుడు ,అందరి ధుఖఃములను  పోగొట్టగల వాడు .

తన్నడి క్కీళ్ వీళ్…..తిరుమంగై ఆళ్వార్లు “ఆళి వణ్ణన్ నిన్ అడియిణై అడైందేన్” సముద్ర వర్ణుడైన స్వామి నీ శ్రీపాదముల మీద పడ్డాను అని అంటున్నారు .

శరణ్ ఎన్ఱు ఇఱంతొరుకాల్ సొన్నదఱ్ పిన్…..ఒక్క సారి శరణాగతి చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ చెయవలసిన అవసరము లేదు . ఆ జీవుడు ఆయన కృపను పొందుటకు అర్హుడవుతాడు.

ఇని ఉణ్దో? తుయర్…….ఒక్క సారి శరణాగతి చేసిన తరువాత ఇంకా దుఖఃము ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుని శ్రీపాదముల మీద పడ్డాదో అప్పుడే ఆ జీవుడి సకల కర్మలను , అనగా పురాకృత ,అగామి  కర్మలను ఆయన తొలగతో స్తాడు . “పోయ పిళయుం పుగుదరువాన్ నింఱనవుం ‘ అని ఆండాళ్   అన్నట్లుగా , పురాకృత కర్మలు నిప్పు పడ్డ దూదిలా కాలి పోతాయి . అగామిని ఆయన గణించడు . కాబట్టి  శరణాగతి  భయపడనవసరము లేదు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-23-uzhi-vinaik-kurumbar/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 22

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 21

paramapadhanathan

అవతారిక

జీవుడు తాను చేసిన  కర్మ మంచిదైనా చెడ్దదైనా దాని ప్రభావమును అనుభవించే తీరాలి.  నీది నూల్ లో  “ఉరఱ్పాల నీక్కల్ ఉఱువర్కుం ఆగా” అని చెప్పబడింది.  కర్మ అగేది కాదు. వర్షము కురవక పోతే ఎవ్వరూ ఏమీ చేయ లేరు. ఒక వేళ ఉధృతముగా కురిసినా ఆపలేరు. అలాగే జీవుడి కర్మ ఫలమును ఎవరూ ఆపలేరు. శ్రీమన్నారాయణుడే వీటిని సృష్టించాడు. పురాకృత పాప పుణ్యములు ఈ జన్మలో ఫలిస్తాయి. ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యములు పైజన్మలో ఫలిస్తాయి. ఇది ఒక చక్రము . జీవుడికి ఎప్పటికైనా ఈ చక్రము నుండి విముక్తి ఉందా? ఈ ప్రశ్నకు  జవాబుగా ఈ పాశురము అమరింది.

ఎప్పటికైనా ఈ కర్మజన్మల  చక్రము నుండి బయట పడగలమా? అంటే ఆ శ్రీమన్నారాయణుని క్రృప ఉంటే ఇవన్నీ నిప్పు పడ్డ దూదిలా కాలిపోతుంది.

“ఉడైమై నాన్ ఎన్ఱుం ఉడైయాన్ ఉయిరై

వడమధురై వందుతిత్తాన్ ఎన్ఱుం – తిడమాగ

అఱిందవన్ తన్ తాళిల్ అడైందవర్కుం ఉణ్డో?

పిఱందు పడు నీళ్ తుయరం పిన్.”

ప్రతిపదార్థము

నాన్ = నేను అనే ఆత్మ

ఉడైమై = భగవంతుడికి దాసుడైన

ఉయిరై ఉడైయాన్ = ఈ ఆత్మను పొందిన వాడు

వడమధురై వందుతిత్తాన్ ఎన్ఱుం = ఉత్తర మధురలో అవతరించాడని

తిడమాగ అఱిందు = దృఢముగా తెలుకున్న వారికి

అవన్ తన్ తాళిల్ = భగవంతుడి శ్రీపాదములను

అడైందవర్కుం =  శరణాగతి చేసిన వారికి

పిన్ పిఱందు పడుం = మళ్ళీ ఒక జనమ నెత్తి పొదవలసిన ఫలితములు

నీళ్ తుయరం = సంచిత కర్మలు

ఉణ్డో? = ఉంటాయా?

వ్యాఖ్యానము

ఉడైమై నాన్ ఎన్ఱుం…..ఆత్మలన్ని శ్రీమన్నారయణుని సొత్తేనని వేదాలన్ని ఘోషిస్తున్నాయి . మనమందరము ఆజ్ఞానమునున్ పొందాలి .

ఉడైయాన్ ఉయిరై వడమధురై వందుతిత్తాన్ ఎన్ఱుం……ఆత్మలన్నింటికి  యజమాని అయిన శ్రీమన్నారయణుడే ఉత్తర మదుర  శ్రీకృష్ణుడుగా అవతరించాడని తెలుసుకోవాలి. ఆయన జీవాత్మల ఉన్నతికై భగవద్గీతలో తాను సర్వ జ్ఞడుననని, సకల జీవులకు యజమానిననీ చెప్పి, ఎవరైతే తనను శరణాగతి చేస్తారో  వారికి పునర్జన్మ లేదని, జన్మ కర్మల చక్రము నుండి విడివడతారని  ఉపదేశించాడు.

తిడమాగ అఱిందు…..దృఢముగా తెలుసుకొని… తెలుసుకోవలసినది అంటే …శాస్త్రములన్నీ శ్రీమన్నారయణుడే సమస్త వస్తువులకు యజమాని అని ఘోషిస్తున్నాయి. ఈ పాశురములో “ఉడమై” “ఉడైయాన్” అని రెండు పదాలను  ప్రయోగించారు. “ఉడమై”…సంపద, జీవులు, సమస్త వస్తువులు , “ఉడైయాన్”….యజమాని. అయిన ప్పుడు, ఆయన వస్తువులను ఆయనే తీసుకుంటాడు. అలా తీసుకోవటములో ఆయనకే ఆనందము . యజమాని తన వస్తువులను స్వీకరించి , భద్రపరచడములో ఆనందమును పొందుతాడు కదా! కాబట్టి జీవాత్మలను ఉద్దరించటము పరమాత్మ ఆనందము కొరకేనని  దృఢముగా తెలుసుకోవాలి .

అవన్ తన్ తాళిల్ అడైందవర్కుం……“ద్వయ” మంత్రములో చెప్పిన విధముగా  “పిరాట్టితో కూడి వున్న శ్రీమన్నారయణుని శ్రీపాదములకు శరణాగతి చేసిన వారికి

ఉణ్డో? పిఱందు పడు నీళ్ తుయరం పిన్…..’ .నీళ్ తుయరం ‘ దీర్గకాలిక కష్టాలుంటాయా? జన్మకర్మల చక్రభమణముంటుందా? ఉండవు .

స్వామి నమ్మాళ్వార్లు  పెరియ తిరువందాది (54)లో ఇలా చెప్పారు.

“వానో మరికడలో మారుదమో, తీయగమో,

కానొ ఒరుంగిఱ్ఱుం కణ్డిలమాల్ – ఆనిన్ఱ

కన్ఱుయర తామెఱిందు కాయుదితార్ తాళ్ పణిన్ణ్దోం

వంతుయరై అవా మరుంగు”

అనగా ఆకాశమా! , గాలా! ,నీరా! , నిప్పా!, ఏది మా కష్టాలన్నింటినీ సునాయసముగా, హఠాత్తుగా తొలగించి వేసింది.! అని ఆశ్చర్య పడుతున్నారు. ఆయనను శారణాగతి చేస్తే , ఆయన కృప వుంటే , ఇలాగే జరుగుతుందన్న దృఢ విస్వాసము ఉండాలని ఈ పాశురములో తెలియజేస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-22-udaimai-nan/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 21

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 20

vishnu-lakshmi-photo

అవతారిక

శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు కష్టాలను ఇచ్చినా అది వారి మీద తనకు గల అభిమానము చేతనే అని ఉదాహరణ సహితముగా ఇక్కడ తెలియజేస్తున్నారు.

పాశురము

“ఆర ప్పెరుంతుయరే సెయ్ దినుం అన్ బర్గళ్ పాల్

వేరిచ్చరోరుగై కోన్ మెయ్ న్నలమాం – తేరిల్

పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం మైందన్ ఉదఱ్ పుణ్ణై

అఱుత్తఱ్కు ఇసై తాదై అఱ్ఱు. “

ప్రతి పదార్థములు

వేరిచ్చరోరుగై కోన్ = సువాస్నలు వెదజల్లు తామరయే నివాసముగా గల శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు

అన్ బర్గళ్ పాల్ = భక్తులకు

ఆర ప్పెరుంతుయర్ = పెను కష్టాలను

సెయ్తిదినుం = కలిగించుట

తేరిల్ = పరిశీలించి చూస్తే

మెయ్ న్నలమాం – = అది నిజమైన ప్రేమ చేతనే అని బోధ పడుతుంది

పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం = భరింపరానిదైనా

మైందన్  = తన ప్రియమైన బిడ్డకు

ఉదఱ్ పుణ్ణై = శరీరములో పుండు పుడితే

అఱుత్తఱ్కు = ఆ భాగమును కోసి చికిత్స చేయవలసి వస్తే

ఇసై తాదై అఱ్ఱు =   అనుమతించే తండ్రి వంటి వాడు

భావము

శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు కష్టాలను ఇచ్చినా అది వారి మీద తనకు గల అభిమానము చేతనే అని ఉదాహరణ సహితముగా ఈక్కడ తెలియజెస్తున్నారు.   తన ప్రియమైన  బిడ్డకు శరీరములో పుండు పుడితే ఆ భాగమును కోసి చికిత్స చేయవలసి వస్తే   అనుమతించే తండ్రి వంటి వాడు శ్రీమన్నారాయణుడు అని అంటున్నారు.

వ్యాఖ్యానము

ఆర ప్పెరుంతుయరే…..’ .తుయర్ ‘ కష్టము. ‘ ప్పెరుంతుయర్ ‘ గొప్ప ,అంతులేని కష్టము. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ‘ఏ ‘ వకారమును ఉపయోగించారు. అనగా పెను కష్టము అంతులేని కష్టము అని అర్థము. కేవలము కష్టమే తప్ప సుఖము మచ్చుకైనా ఉండనిదని అర్థము.

సెయ్తిదినుం…….భగవంతుడే అలాంటి కష్టములనిస్తే…..అంటే ఆ జీవి పురాకృత కర్మ ఫలము ఇచ్చాడన్న మాట . సంచితము , ఆగామి , ప్రారబ్దము అని  కర్మలు మూడు విధములు.  ఈ మూడింటినీ తొలగించ గల వాడు భగవంతుడు మాత్రమే . అయినప్పుడు ఆయన తలచుకుంటే జీవుడి కష్టాలను పోగొట్టలేడా! అంటే తన భకుల మేలు కోరి , వారైకి  ఆభాస బంధములన్ని తొలగి పోవుటకే కష్టాలను ఇస్తాడని అంటారు . “కిత్తదాయిన్ వెత్తెన మఱ”.

“ఇయల్బాగవుం నోంబిఱ్కు ఒన్ఱు ఇన్మై ఉదమై

మయలాగం మఱ్ఱుం  పెయర్తు ”  తిరుకుఱళ్

అనగా శ్రీమన్నారాయణుని శ్రీపాదములను చేరాలనుకునే వారు లౌకిక విషయాసక్తులను తొలగ దోయాలి . ఆయన భక్తులు అలాగే చేస్తారు , కాని ఏదైనా ఒక బంధము వదలక పట్టుకొని వుంటే దాని నుండి విముక్తులను కావించటము కోసము వారికి కష్టాలనుఇస్తాడు. ఒక్కటే కదా అని ఉపేక్షచేస్తే అది పెను వృక్షముగా మారి వారికి ఆత్మహాని కలిగిస్తుంది అని పరిమేల్ అళగర్ అంటున్నారు .

వేరిచ్చరోరుగై కోన్……“చరోరుగం” అనగా తామర . ‘ వేరిచ్చరోరుగం ‘ సువాసన గల తామర . ‘ వేరిచ్చరోరుగై ‘ సువాసన గల తామరలో కూర్చున్నపడతి…. శ్రీమహాలక్ష్మి .’ వేరిచ్చరోరుగై కోన్ ‘ సువాసన గల తామరలో కూర్చున్నపడతికి ధవుడు  . కోన్  అంటే రాజు. ఇక్కడ యజమాని … సువాసన గల తామరలో కూర్చున్నపడతి అయిన   శ్రీమహాలక్ష్మికి యజమాని … శ్రీమన్నారాయణుడు . ఎందుకు ఇక్కడ అమ్మను ఇంతగా ప్రస్తావించారంటే స్వామి సర్వ స్వతంత్రుడు,ఆయన భక్తుల కష్టాన్ని చూడడు. కాని అమ్మ కూడా అక్కడే వుంది కదా! అయినా   కష్టా కడలిలో ఈదవలసిందేనా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది .

మెయ్ న్నలమాం ……నిజమైన ప్రేమ కలవాడు

తేరిల్….తరచి చూడగా….వేరిచ్చరోరుగై కోన్  అంబర్గళ్ పాల్ ఆరప్ పెరుంతుయరే సెయ్తిడినుం తేరిల్ మెయ్న్నలమాం”….అనగా  సువాసన గల తామరలో కూర్చున్నపడతి అయిన   శ్రీమహాలక్ష్మికి యజమాని … శ్రీమన్నారాయణుడు , తన భకుల మేలు కోరి , వారి  ఆభాస బంధములన్ని తొలగి పోవుటకే కష్టాలను ఇస్తాడు . అది ఎలాగంటే….

పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం మైందన్ ఉదఱ్ పుణ్ణై అఱుత్తఱ్కు ఇసై తాదై అఱ్ఱు…… తన ప్రియమైన  బిడ్డకు శరీరములో పుండు పుడితే , ఆ భాగమును కొసి చికిస్త చేయవలసి వచ్చింది. అభిమతించే తండ్రి చికిస్త చేయవద్దని అంటాడా? లేక చేయిస్తాడా? బిడ్ద తాత్కాలికముగా బాధ పడినా శాస్వతముగా రోగము నుండి విముక్తి పొందుతాడు అని కదా సంతోషిస్తాడు! అలాంటి తండ్రి వంటి వాడే శ్రీమన్నారాయణుడు అని అంటున్నారు.  తన భక్తుల కర్మను కాల్చి వేయడానికే వారికి పెను కష్టాల పాలు చేస్తాడు. అమ్మ కూడా ఈ పనిలో  స్వామికి సహకరించి తన బిడ్డలకు శాశ్వత సుఖాలనిస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-21-arap-perunthuyare/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 20

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 19

paramapadhanathan-2

పాశురము

“విరుప్పుఱినుం తొణ్డర్క్కు వేణ్డుం ఇడం అల్లాల్

తిరుప్పొలింద మార్బన్ అరుళ్ సెయ్యాన్ – నెరుప్పై

విడాదే కుళవి విళ వరుందినాలుం

తడాదే ఒళియుమో తాయ్?”

ప్రతి పదార్థము

విరుప్పుఱినుం = అల్పమైన వస్తువులను కొరుకున్నా

తొణ్డర్క్కు = తన భక్తులకు

వేణ్డుం ఇడం అల్లాల్ = తగనిదైతే

తిరుప్పొలింద మార్బన్ = మహాలక్ష్మిని హృదయము నందు ధరించిన శ్రీ మహా విషువు

అరుళ్ సెయ్యాన్ – = అనుగ్రహించడు

కుళవి = అన్నెం పున్నెం తెలియని పసి పిల్లలు

నెరుప్పై = నిప్పును చూసి

విడాదే = ఆట వస్తువుగా బ్రమసి పట్టుకున్నా

తాయ్ = తల్లి

విళ వరుందినాలుం తడాదే ఒళియుమో = ఆ నిప్పులో పడకుండా ఆపకుండా వుంటుందా? ఆపుతుంది.

భావము

శ్రీమన్నారాయణుడు, తన భక్తులు కోరుకున్నంత మాత్రాన వారికి తగని వాటిని అనుగ్రహించడు. ఎలాగంటే అన్నెం పున్నెం తెలియని పసి పిల్లలు నిప్పును చూసి ఆట వస్తువుగా బ్రమసి పట్టుకుంటే , తల్లి పిల్లలు ఆ నిప్పులో పడకుండా ఆపకుండా వుంటుందా? ఆపుతుంది కదా! అని ఈ పాశురములో , స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అంటున్నారు.

వ్యాఖ్యానము

విరుప్పుఱినుం…..శ్రీమన్నారాయణుని , భక్తులు ఎంతో ప్రీతితో, మక్కువతో కొన్ని కోరికలను కోరుకుం టారు. అవి వారికి భవిష్యత్తులో ధుఖః హేతువు కావచ్చును. కానీ వారికి అది తెలియక అదే కావాలని పట్టు పడతారు.  అనుగ్రహించమని వేడుకుంటారు.

తొణ్డర్కు…..దాసులు… భక్తి చేయు వారు భక్తులు. భక్తిచెసి కైంకర్యము చేయుటకు సిధ్ధముగా వున్న వారు ,కైంకర్యము చేయు వారు దాసులు. వారినే ‘ తొణ్డర్’ అంటారు.

వేణ్డుం ఇడం అల్లాల్….. “ఇదం”అనగా సంస్కృతములో “హితము” నకు సమానము . వేణ్డుం ఇడం అల్లాల్ అనగా భక్తుల కోరికలు అన్నీ రెండు పట్టికలుగా స్వీకరింపబడతాయి . ఒకటి హితము, రెండవది హితము కానిది.

తిరుప్పొలింద మార్బన్….ప్రియమైన  పిరాట్టి వేంచేసి వున్నందున ప్రకాశించే హృదయము గలవాడు . ఆళ్వార్లు “కరుమాణిక్క కుంద్ఱత్తు తామరై పోల్ తిరుమార్బు, కాల్, కణ్, కై, చెవ్వాయ్ ఉందియానె”  మరియు “కరుమాణిక్క మలై మేల్, మణి తడం తామరై కాడుగల్ పోల్, తిరుమార్బు వాయ్ కణ్ కై ఉంధి కాల్ ఉడయాడైగల్ సెయ్యపిరాన్”  అన్నారు. ఈ పాశురములో పెరుమాళ్ళ అంగములన్ని దేదీప్యమానముగా విరాజిల్లినాట్లే ఆయన హృదయము కూడా ప్రకాశమానముగా ఉంది అంటున్నారు . స్వామి నమ్మాళ్వార్లు “అలర్ మేల్ మంగై ఉఱయుం మార్బు” ( అలర్ మేల్ మంగచే  ఒరుసుకోబడే  హృదయము )అంటారు.

“మైయార్ కరుంగణ్ణీ కమల మలర్ మేల్

చెయ్యాల్, తిరుమార్వినిల్ సేర్ తిరుమాలె

వెయ్యార్ శుడరాళి సురి సంగమేందుం

కైయ్యా! ఉన్నై కాణ కరుదుం ఎన్ కణ్ణె!!!”                                                          – (తిరువాళిమొళి 9-4-1)

ఈ పాశురములో స్వామి నమ్మాళ్వార్లు స్వామి హృదయకమలమునకు ఆ ప్రకాశము అమ్మవారి వలననే వచ్చింది   అంటూన్నారు.  అమ్మ,స్వామి ఎల్లప్పుడు కూడి వుండి దాసులపై అనుగ్రహమును కురిపిస్తారు అని అర్థము.

అరుళ్ సెయ్యాన్ –……అనుగ్రహించడు. ఏవి  అనుగ్రహించడు? భక్తులు తమకు ఉన్న పరిమితమైన నముతోను, లౌకిక విషయములలో అపేక్ష చేతను తమకు హాని కలిగించు విషయములను అనుగ్రహించమని ప్రార్థించినపుడు , తన సర్వజ్ఞత చేత , భక్తులకు ఆత్మ హాని హేతువగు విషయములను అనుగ్రహించడు .

అరుళాదాల్….. తన సర్వజ్ఞత చేత , భక్తులకు ఆత్మ హాని హెతువగు విషయములను అనుగ్రహించనందున             “ నెరుప్పై విడాదే కుళవి విళ వరుందినాలుం తడాదే ఒళియుమో తాయ్ “ అన్నెం పున్నెం తెలియని పసి పిల్లలు నిప్పును చూసి ఆట వస్తువుగా బ్రమసి పట్టుకుంటే , చూసిన తల్లి పిల్లలు ఆ నిప్పును పట్టుకోకుండా ఆపకుండా వుంటుందా? ఆపుతుంది కదా! అలాగే శ్రీమన్నారాయణుడు తమ భక్తులు అడగరాని కోరికలు అడిగినప్పుడు అనుగ్రహించడు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-20-viruppurinum-thondarkku/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 19

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 18

lord-vishnu-in-anantashayan-AE23_l

అవతారిక

భార్య, పుత్రులు ,  ఇల్లు,పొలము, ఆస్తి మొదలైన వన్నీ నిప్పులా కాలుస్తున్నట్టు భావించేవారికి పరమాత్మకు స్వస్తలమైన పరమపదము అతి సులభము అని ఈ పాశురములో చెపుతున్నారు.

“నల్ల పుదల్ వర్ మానైయాళ్ నవైయిల్  కిళై

ఇల్లం నిలం మాడు ఇవై అనైత్తుం –అల్లల్ ఎన

త్తోన్రి ఎరితీయిర్  సుడుమేల్ అవర్ క్కెళిదాం

ఏఱ్ఱఱుమ్ వైగుందత్తిరుప్పు “

ప్రతి పదార్థము

నల్ల పుదల్ వర్ = సుగుణ రాసులైన పిల్లలు

మానైయాళ్ = మంచితనమునకు మారుపేరైన సహ ధర్మచారిణి

నవైయిల్  కిళై = దోషములే చేయని సహాయకులు

ఇల్లం = నివాసయోగ్యమైన అందమైన ఇల్లు

నిలం = బంగారము పండు భూమి

మాడు = కామధేనువు వంటి పశు సంపద

ఇవై అనైత్తుం –= ఇవన్నీ

అల్లల్ ఎన = దుఖః హేతువని

త్తోన్రి = భావించి

ఎరితీయిల్ = ఆత్మ నాసన  హేతువులుగా అరని మంటలుగా

సుడుమేల్ =  కాలుస్తున్నట్టు

అవర్ క్కు = భావించే వారికి

ఏఱ్ఱఱుమ్ = తమ ప్రయత్నము లేకయే

వైగుందత్తుక్కు =  వైకుంఠమునకు పోవు మార్గము

ఎళిదాం =మహా  సులభము

వ్యాఖ్యానము

“నల్ల పుదల్ వర్…….మంచి పుత్రులు.. అనగా ఇతరులకు హాని కలిగించని,  ఇతరులచే నిందింపబడని ,మంచి గుణములుగల పుత్రులు.

మానైయాళ్……. మంచి భార్య..ఎవరికీ హానితలపెట్టని, ఇబ్బంది కలిగించని , సుగుణాలరాసి అయిన భార్య.

“మనైత్తక్క మాణ్ పుడైయళాగి  తఱ్ కొండాన్ వళత్తక్కాళ్ వాళ్ కై తుణై “ అని తిరుక్కురళ్ లో అనగా, శిలప్పదిగారంలో “అఱ వార్ క్కళిత్తలుం , అందణర్ ఓంబలుం , తుఱత్తోర్ కెదిర్ తలుం , తోల్లోర్ మరబిల్ విరుం దెదిర్ కేడలుం “అన్నారు.  దీని ప్రకారముగా గృహిణి సుగుణ రాశి యై వుండాలి . అధితి అభ్యాగతులను ఆదరించటము , ఆర్తులకు సహాయము చేయటముతో పాటు ప్రసాంతమైన జీవనమునకు అనుసరించ వలసిన మార్గములు తెలిసి వుండాలి . భర్త మనసు తెలిసి నడచుకోవాలి .

నవైయిల్  కిళై…… “నవై “ అనగా దోషములు. “యిల్ “అనగా లేకపోవుట .” కిళై ” అనగా సంబంధములు .అర్థాత్ దోషములు లేని మంచి సంబంధములు . ఇవి లౌకికమైనవి కావు . ప్రయోజ్ఞార్థము ఏర్పరుచుకున్నవి కావు .అవి మనకు   శత్రువులలా పనిచేస్తాయి. స్వామి అరుళాళ పెరుమాళ్ ఏమ్బెరుమానార్ “ నవైయిల్ కిళై “ అంటే భగవద్బందువులతో నిత్య సంబంధమని అన్నారు.

నల్ల ఇల్లం……… మంచి ఇల్లు… నివాసయోగ్యమైనది ,అనేక అంతర గృహములతో  కూడినది, ఆరోగ్యకరము, ఆహ్లాదము, ఆనందము, కలిగించు వాతావరణము గలది మంచి ఇల్లు .

నల్ల నిలం……….. మంచి పొలము… సారవంతమైన నేల గలది ..అనగా ఎరువులు వేయకయే మంచి పంటలు పండే నేల . పుష్కలముగా పంటనిచ్చే నేల . తిరుక్కురళ్ లో “ విళైవదన్ పాత్తియుళ్ నీర్ సొరిందత్తు “ అన్నారు .   ఒక గింజ జల్లుతే నూరు గింజలు పండేది మంచి నేల . పొద్దున్నే విత్తు నాటితే పొద్దు గుమ్కేవరకు చెయ్యేత్తు ఎదగాలట. అలాంటి నేలను ‘ నన్ సెయ్  ‘, పొన్ సెయ్ ‘నేలలు అంటారు .

నల్ల మాడు……….. మంచి ఆవు…అనగా బాగా పాలనిచ్చేది , పొరుగు ఇళ్ళల్లో పడి దొంగ తిండి తిననిది , మనుషులను భయపెట్టనిది . స్వామి అరుళాళ పెరుమాళ్ ఏమ్బెరుమానార్ అభిప్రాయము ప్రకారము చిన్న పిల్లలకైనా పాలనుచేపేది ,అపారముగా పాలనిచ్చేది మంచి ఆవు.

ఇవై అనైత్తుం…. పైవన్నీ ఉన్నవారు చాలా సంతోషిస్తారు .ఇందులో కొన్ని ఉన్నా బాగానే ఆనందిస్తారు.

అల్లల్ ఎన త్తోన్రి……. స్వామి  అరుళాళ పెరుమాళ్ ఏమ్బెరుమానార్ ఈ సంపద అంతా దుఖః హేతువు అంటారు. వీటి వలన కష్టము, శ్రమ , దుఖఃము కలుగుతుంది అంటారు . ’  అల్లల్ ‘ అన్న మాట దీనినే తెలియజేస్తుంది.

ఎరితీయిర్  సుడుమేల్…..పైవన్నీ ప్రజ్వలించే మంటల వంటివి.

అవర్ క్కెళిదాం ఏఱ్ఱఱుమ్ వైగుందత్తిరుప్పు….ఎవరైతే ఈ లౌకికమైన సుఖములను పెను మంటలుగా భావిస్తారో వారికి పరమాత్మ వారి ప్రయత్నమూ లేకుండానే తన నిత్య నివాసమైన పరమపదమునకు చేర్చుకుంటాడు అని అర్థము .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-19-nalla-pudhalvar/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 18

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 17

Dhruva-Vishnu-and-Garuda-thumb

అవతారిక

భగవంతుడు తనపై భక్తి ఉన్నప్పటికీ ,ఆత్మ జ్ఞానము లేక, భగవంతుని తలవని లోకులతో సంబంధము కలిగి   ఉన్నవారికి కూడా సులభుడు. అటువంటి వాడు ఆత్మ జ్ఞానము కలవారికి ఇంకా  సులభుడై ఉంటాడని ఈ పాశురములోతెలియజేస్తున్నారు.

పాశురము

“ఈనమిలా అన్ బర్ ఎన్ ఱాలుం ఎయ్ తిలా

మానిడరై ఎల్లా వణ్ణత్తాలుం – తానఱియ

విట్టార్ కెళియన్ విడాదార్ క్కరవరియన్

మట్టార్ తుళాయలంగల్ మాల్ “

ప్రతిపదార్థము

మట్టు ఆర్ = తేనే స్రవించు

తుళాయలంగల్ = తులసి మాలలు ధరించిన వాడు

మాల్ = తిరుమాల్

ఈనమిలా అన్ బర్ = తన శ్రీపాదములందు భక్తి  లేనివారైనా

ఎన్ ఱాలుం = భక్తి  గలవారైనా

ఎయ్ తిలా = భగవంతుడికి శత్రువులైన (భగవంతుని యందు భక్తి  లేనివారు )

మానిడరై = మానవులను

ఎల్లా వణ్ణత్తాలుం తానఱియ = అన్ని విధముల సంబంధములు గలవని తెలిసిన  వాడై

విట్టార్ క్కు = వదిలివేసిన వాళ్ళకు

ఎళియన్ = సులభుడు

విడాదార్ క్కు = వదలని వాళ్ళకు

అరవరియన్ =  ఇంకా సులభుడు

వ్యాఖ్యానము

ఈనమిలా అన్ బర్ ఎన్ ఱాలుం…….ఈనము అంటే హీనము , దుర్మార్గము. రావణాసురుని దుర్మార్గపు పోకడ వలన అతనిని “పొల్లా అరక్కన్ “ అంటారు. “మున్ పొలా ఇరావణన్  “ (మునుపు దుర్మార్గుడైన రావణుడు )అని తిరుమంగై ఆళ్వార్లు పాశురములో చెప్పారు . అలాగే “ తీయపుంది  కంజన్ “ అని దుర్మార్గుడైన కంసుని గురించి పెరియాళ్వార్లు అన్నారు. కావున రావణునిలా, కంసునిలా దుర్మార్గములను చేయు వారిని “పొల్లా “ అని పేర్కొన్నారు. దీనికి భిన్నమైన వారు ,తనయందు అపారమైన భక్తి గలవారు “ఈనమిలా అన్ బర్ “ అని రూడార్థము . గీతలో “మనసు మరి ఏ ఇతరమైన కోరికలు లేక నన్నే కోరుకునే భక్తులకు నేను పొంద దగిన వాడను “ అని చెప్పుకున్నాడు. అలాంటి  భక్తి గలవారు “ఈనమిలా అన్ బర్ “అని చెపుతున్నారు.

ఎయ్ తిలా మానిడరై ……భగవంతుని యందు కొంచెము కూడా భక్తి  లేని వారు జంతువులతో సమానము. భగవంతుడు మానవ జన్మ ఇచ్చిందే భగవంతుని యందు భక్తి చేయటము కొరకు, అది చేయనివారు పశువుతో సమానము . “ఆన్  విడైయేళన్ రడత్తార్కు  ఆళానార్ అల్లాదార్ మానిడవరల్లర్ ఎన్రు ఎన్ మనత్తు వైత్తెనే (“భగవంతుని యందు భక్తి  లేని వారు మనుషులే కారని నా మనసులో స్థిరపరచుకున్నాను ) అని తిరుమంగై ఆళ్వార్లు తమ పాశురములో అన్నారు. “సెమ్కణ్ మాల్ నామమ్ మరందారై   మానిడమా వైయ్యేన్ “ అని భూదత్తాళ్వార్లు అన్నారు. మహా జ్ఞానులైన ఆళ్వార్ల లాగా నిరంతరము భగవంతుని యందు భక్తి చేయని పాపులు ఈ అల్ప మానవులు అని అర్థము.

దీనినే నమ్మాళ్వార్లు “యాదానుం పఱఱి నీంగుం విరదముడైయార్ ‘అని బుద్దిలేని మనుష్యులను అంటారు. ఇక్కడ “ ఎయిదిలా “ అని కాక “ ఎయిదిలరామ్  “ అని స్వీకరిస్తే భగవంతునికి శత్రువులైన మనుష్యులన్న అర్థము వస్తుంది. దీనినే తిరువళ్ళు వర్ “ ఏదిలార్ కుఱఱమ్ పోల “అన్న కురళ్ లొ చెప్పారు.

ఎల్లా వణ్ణత్తాలుం ……అనగా కూడా తిరుగుట ,వస్తువులు ఇచ్చి పుచ్చుకోవటము ,ఇంకా ఇతర లౌకిక వ్యవహారములు అని అర్థము.

తానఱియ విట్టార్కు ……తమకు తెలిసినదానితోను ,ఇతరులకు తెలిసినదానితోను విడువక హృదయ కమలములో వేంచేసి వున్న భగవంతుడికి కూడా తెలియునట్లు చేయాలి. అలా చేసిన వారికి  పరమాత్మ సులభుడు.” ఉళ్ళువార్ ఉళ్ళిఱెల్లాం  ఉడనిరుమ్డు అఱియుం అవనల్లవా “ (జీవుడి లోపలనే ఉండి అన్నీ తెలుసుకునే  వాడు కదా !) అలాంటివాడు తెలుసుకునేలా లౌకిక  సంబంధమును పూర్తిగా వదిలి వేయాలి అని భావము.

తానూ తెలుసుకున్న వైష్ణవ తత్వము , వైష్ణవ తత్వము  కాదు .లోకము తెలుసుకున్న వైష్ణవ తత్వమే  , వైష్ణవ తత్వము  అని ఆచ్చాన్ పిళ్ళై చెప్పిన ఉదాహరణ ఇక్కడ గ్రహించ  దగినది.

విడాదార్ క్కరవరియన్ ….. అలా వదల లేనివారికి మహా దూరస్తుడు .ఈ సందర్భముగా  “అడియార్కు ఎళియవన్ పిరరుక్కు అరియ విత్తగాన్ “ అన్న నమ్మాళ్వార్ల పాశురమును గుర్తు చేసుకోవాలి .కావున పరమాత్మ భక్తులు లౌకికులతో సంబంధము నేరపరాదని భావము.

మట్టార్ తుళాయలంగల్ మాల్……    భగవంతుడు ఎప్పుడూ తన భుజములపైన, మెడలోను తులసి మాలలను ధరించి వుంటాడు . భగవంతుని తిరుమేనినిస్పృశించటము వలన తులసిమాలలు ఎంతో అందముగా వాసనాభరితముగా ఉంటాయి . అంత అందమైన తేనెలూరు శ్రీతులసిని ధరించిన భగవంతుడని అర్థము. భగవంతుని తిరుమేని సౌదర్యమునకు తులసి మాల సంకేతమని చెపుతున్నారు. “ మట్టార్ తుళాయలంగల్ మాల్ ,ఈనమిలా అన్ బర్ ఎన్ ఱాలుం ఎయ్ తిలామానిడరై ఎల్లా వణ్ణత్తాలుం – తానఱియ విట్టార్ కెళియన్ విడాదార్ క్కరవరియన్ “ అని గ్రహించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-18-inamila-anbar/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 17

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 16

indra-worships-krishna

అవతారిక

ఆత్మ జ్ఞానము గలవాడంటే ఆత్మపరమాత్మకే దాసుడని అదియే నిజమైన ఆత్మ స్థితి అని తెలిసిన వాడు. ఆత్మ స్వరూపమును స్మరించు వారి గురించి కిందటి పాశురములొ చెప్పారు. ఇందులో ఆత్మ జ్ఞానము గలవాడికి, గొప్ప సంపద కూడుట, అది తొలగి పోవుట ,జీవన కాలము పెరుగుట, తగ్గుట , ఆత్మస్వరూపము తెలిసిన వారికి  అహంకారమొ , దుఖఃమొ కలుగవు అని చెపుతున్నారు.

పాశురము

“ ఒన్ ఱిడుగ విన్ణ్ వర్  కోన్ సెల్వ మోళిందుడుగ

ఎఱఱుం ఇఱవాదిరుమ్తిడుగ – ఇన్రే

ఇఱక్కం కళిప్పుం  కవర్వుం ఇవఱఱాల్

పిఱక్కుమో   తఱఱె ళింద పిన్”

ప్రతిపదార్థము

విన్ణ్ వర్  కోన్  = దేవతల నాయకుడైన ఇంద్రుడి

సెల్వం  = సంపద

ఒన్ ఱిడుగ = కొరకున్నను వచ్చి చేరుట

ఒళిందుడుగ = లేక దానంతట అదే పోవుట

ఎఱఱుం ఇఱవాదు  = మరణమే లేకపోవుట

ఇరుమ్తిడుగ = లేక

ఇన్రే ఇఱక్క = ఇప్పుడే మరణించుట

తఱఱె ళింద పిన్ = ఆత్మ స్వరూపము బాగుగా తెలిసిన తరువాత

ఇవఱఱాల్ = ఈ జ్ఞానము వలన

కళిప్పుం కవర్వుం = సుఖము, దుఖఃము

పిఱక్కుమో  =   కలుగుతుందో !

భావము

ఆత్మ స్వరూపము తెలిసిన వారికి సంపద రావటము,పోవటము వలన, అహంకారమో దుఖఃమో కలుగదు అని అర్థము.

వ్యాఖ్యానము

ఒన్ ఱిడుగ విన్ణ్ వర్  కోన్ సెల్వమ్ ….దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడికి భూలోక , భువర్లోక , వర్లోకములను పరిపాలించటము అనేది పెను సంపద . అది కోరకుండానే వచ్చి చెరనీగాక !

ఒళిందుడుగ…. అంతటి పెను సంపద ఇక ఎప్పటికీ దొరకకుండా తొలగి పోనీగాక !

ఎఱఱుం ఇఱవాదిరుమ్తిడుగ ….ఎన్నటికి మృత్యువు దరిచేరక జీవించుగాక !

ఇన్రే ఇఱక్కం…..ఇలా దొరికిన జీవితము ఈ క్షణమే తొలగిపోవు గాక !

కళిప్పుం  కవర్వుం ఇవఱఱాల్ పిఱక్కుమో   తఱఱె ళింద పిన్ …… సంపద వలన ఆనందము- అది తొలగి పోవుట వలన దుఖఃము , జీవించుట వలన సంతోషము- మృత్యువు వలన దుఖఃము లోకులకు సహజము. కానీ అత్మస్వరూపము తెలిసిన వారికి ఎన్నటికి అహంకారమొ , దుఖఃమొ కలుగవు అని అర్థము.

తఱఱె ళింద పిన్ …… ఆత్మస్వరూపము తెలుసుకొనుట అనగా ఆత్మ పరమాత్మకే  చెందినది , పరమాత్మయజమాని ,జీవాత్మ  ఆయనకు దాసుడన్న సత్యమును గ్రహించుట అని తెలియజేస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-17-onriduga-vinnavar/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 16

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 15

I_Intro2

అవతారిక

ఆత్మ స్వరూపము తెలిసిన వారు తమ స్వరూపమును ,ప్రస్తుత స్థితిని తెలిపే విధానాన్నిప్రబంధకర్త  ఈ పాశురములో తెలియ జేస్తున్నారు.

పాశురము

“ తేవర్ మనిశర్ తిరియక్కు తావరమాం

యవైయుం అల్లేన్ ఇలగు ముయిర్ –పూవిన్ మిశై

ఆరణంగిన్ కేళ్వన్ అమలన్ అరివే వడివాం

నారణన్ తాట్కే  అడిమై నాన్  “

ప్రతి పదార్థము

నాన్ = జీవుడైన దాసుడు

తేవర్ = ఇంద్రాది దేవతలు

మనిశర్ = బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన

తిరియక్కు = పశు పక్ష్యాదులు

తావరమాం = చెట్లు, పుట్టలు, కొండల వంటి స్థావరములు

యవైయుం అల్లేన్ = ఏవియు కాను .( పైవన్నీ నిత్యములు కావు .కొద్ది కాలము ఆత్మను ఆశ్రయించి వుండేవి. కావున వాటి ఆత్మకు ఉదాహరణముగా గ్రహించ తగదు )

నాన్ = దాసుడు

పూవిన్ మిశై = తామరలో పుట్టిన

ఆరణంగిన్ = దైవ స్వరూపిణి అయిన శ్రీమహాలక్ష్మికి

కేళ్వన్ = వల్లభుడైన

అమలన్ = దోషరహితుడైన

అరివే వడివాం  = జ్ఞాన స్వరూపుడై ప్రకాశించే

నారణన్ = నారాయణుని

తాట్కే  = శ్రీపాదములకే

ఇలగుమ్ =  జ్ఞానందములుగా వెలిగే

ఉయిర్ –=జీవులకు

అడిమై = దాసుడనవుతాను

జీవులన్నీ నారాయణుని దాసులవుతాయి. దాసత్వము వాటికి సహజ గుణము .

భావము

జ్ఞానాందమయమై ప్రకాశించు ఆత్మఅయిన నేను ,దేవతను కాను ,మనిషిని కాను, జంతువును కాను, చెట్టు,గుట్ట స్థావరము, ఇతరములెవీ  కాను, తామరలో పుట్టిన స్వరూప,రూప గుణ విభవములు గల శ్రీదేవికి వల్లభుడైన, దోషములను సహించలేని వాడైన,  సకల వస్తువులకు ఆధార భూతుడైన , సకల వస్తువులలోను ఉన్న నారాయణునికే దాసుడను అని భావము .

వివరణ

తేవర్ మనిశర్ తిరియక్కు తావరమాం……దేవతలు, మనుష్యులు ,తిర్యక్కులు, జంగమములు, స్థావరములు మొదలగు సమస్త చేతనాచేతనములన్నింటిని  ఆత్మలంటారు.  ఆత్మతాను చేసిన మంచి చెడు పనుల ఫలితముగా దేవశరీరము , మనుష్య శరీరము , తిర్యక్కులు, జంగమములు,స్థావర రూపములుగా జన్మిస్తాయి . వీటి ప్రస్తావన తిరుక్కురళ్ లో చూడవచ్చు.

‘ఊర్వై పదినోన్ఱామ్  ,ఒంబదు మానిడం , నీర్, పరవై నాల్ కాల్ ,ఓర్పప్పట్టు, సీరియపందమా దేవర్ పదినాలు,ఆయన్  పడైత్త అందమిల్ సీర్త తావరం నాలైందు ,మక్కళ్ విలంగు ,పరవై, ఊర్వన్, నీరున్దిరివన్ , పరుప్పదుమ ఎనవినై యేళు పిరప్పాగుమేన్బ “(పదకొండు రకముల సరీసృపాలు, తొమ్మిది రకముల మనుషు లు , జలచరములు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు ఓ పది రకములు, పదునాలుగు రకముల దేవతలు , అనేక రకముల చెట్లు.. అన్నింటిని బ్రహ్మ సృజించాడు. మనుషు లు , జంతువులు, , పక్షులు, జలచరములు , సరీసృపాలు, జంగమములు,స్తావరములు అని జీవులకు జన్మలు ఏడు ) అన్న తిరుక్కురళ్ వలన ఆత్మలు ఎన్ని విధముల జన్మలేత్తుతాయో తెలుస్తున్నది. పై విధముగా ఆత్మ పలు జన్మలెత్తినప్పుడు ఆయా శరీరములను బట్టి నేను దేవతను , నేను మనిషిని, నేను జంతువును నేను స్తావరము, నేను జంగమము, నేను తిర్యక్కును అని భావిస్తుంది. ఆత్మ యొక్క నిజమైన స్థితిని తెలుసుక్కున్న వాడు నేను ఇవేవి కాను ,నేను భగవంతుడి దాసుడను అని భావిస్తాడు.

ఇలగు ముయిర్ నాన్…… నేను ప్రాణమును  జ్ఞానానందముల సంకేతమైన గొప్ప కాంతిని నేను. ఇక్కడ           “ ఇలగు” అన్న ప్రయోగానికి జ్ఞానానందములని, గొప్ప కాంతి అని ,అర్థము . అచేతన వస్తువుల కంటే భిన్నమైన జ్ఞానానందములకు సంకేతముగా, జ్ఞానస్వరూపముగా ఉండేది ఆత్మ స్వరూపము అని తెలియజేస్తున్నారు . తత్వత్రయములో చిత్ ప్రకరణములో ఆత్మ స్వరూపమును చక్కగా వివరించారు. ఆత్మ స్వరూపము “ సెన్రు సెన్రు పరంపరమాయ్ ఎన్ కిరపడియే దేహేంద్రియ, మనఃప్రాణబుద్ది విలక్షణమాయ్ ,అజడమాయ్, ఆనందరూపమాయ్ , నిత్యమాయ్ , అణువాయ్ , అవ్య క్తమాయ్ , అచింత్య మాయ్ ,  నిరవయ మాయ్ ,  జ్ఞానాశ్రయ మాయ్ ,  ఈశ్వరునుక్కు  నియామ్య మాయ్ ,  ధార్య మాయ్ ,  శేష మాయ్ ఇరుక్కుం “,  ( ఆత్మ స్వరూపము అనేక పరంపరలుగా  దేహేంద్రియ, మనఃప్రాణ బుద్ది విలక్షణమై,అజడమై , ఆనందరూపమై ,నిత్యమైన, అణువై , అవ్య క్తమై, అచింత్యమై, నిరవయమై,  జ్ఞానాశ్రయమై,ఈశ్వరునకు నియామ్యమై, ధార్యమై, శేషమై ఉంటుంది.”అని చెప్పారు.)

పూవిన్ మిశై ఆరణంగిన్ కేళ్వన్…..”మలర్ మేల్ ఉరైవాళ్ “ (తిరువయిమొళి4-5-2) పుష్పముపై నివాసముండేది అని నమ్మాళ్వార్ చెప్పినట్లుగా తామర పూవుపై నివసించేది, అందమైన రూపము గలది అయిన అమ్మవారికి వల్లభుడు అయిన వాడు అని అర్థము. దైవీక  స్వరూప,రూప గుణ విశేషములు అన్ని ఉన్న శ్రీదేవికి  ప్రియుడు. ఆమెకు వల్లభుడు అని అర్థము .

అమలన్…..దుష్ట గుణములను ఎదురించువాడు.

అరివే వడివాం నారణన్ ……  జ్ఞానాందములే స్వరూపముగా గలవాడు నారాయణుడు

నారణన్ తాట్కే  అడిమై….. నారాయణుని శ్రీపాదములకే నేను దాసుడను . నారాయణుడు అంటే నారముల  న్నింటిని ధరించిన వాడు, నారములన్నింట ఉన్నవాడు అని అర్థము .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-16-dhevar-manisar/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org