తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 31 – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 21 – 30

paramapadham

 పాశురము 31

 అవతారిక:  తిరువాయ్మొళి నాలుగవ పత్తు మొదటి దశకము అయిన ‘వరునాయగమాయ్ ‘ అనే పాశురాలలో, అల్పము అస్థిరము అయిన కైవల్యము మీద ఆశపడకుండా ప్రల ప్రదుడు, ప్రాప్యుడు అయిన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, తరించండి అని ఉపదేశించారు. 

ఒరునాయగమాయ్ * ఉలగుక్కు * వానోర్
ఇరునాట్టి * లేఱియుయ్క్కుం * ఇన్బం తిరమాగా *
మన్నుయిర్ ప్పోగం తీదు * మాలడియైయే ఇనిదామ్ * 
పన్నియివై * మాఱనురైప్పాల్ (31)

ప్రతిపదార్థము:
ఉలగుక్కు = ఈ ప్రపంచానికమతటికీ
ఒరునాయగమాయ్ = ఏకఛత్రాధిపతిగా
ఉయుయ్క్కుం ఇన్బం = అనుభవించే ఆనందం కంటే
వానోర్ = దేవతలచే
ఇరు నాట్టిల్ = ఉన్నతమని భావించే స్వర్గానికి
ఏఱి = వెళ్ళి
ఉయుయ్క్కుం  = అనుభవించే
తిరమాగా = అస్థిరమైన  భోగాలు
మన్నుయిర్ ప్పోగం = ఈ లోకంలోని భోగాలు
తీదు = అల్పమే
మాలడియైయే = శ్రీయః పతి శ్రీపాదాలను
ఇనిదామ్ = అనుభవించడమే స్థిరమైన ఆనందము
యివై = ఇవి
మాఱన్ పన్ని ఉరైప్పాల్ = మాఱన్ అనే నమ్మాళ్వార్లు పరిశీలించి బోధించిన విషయము

భావము: ఈ లోకంలో ఏకఛత్రాధిపత్యం వహించే అనుభవించే ఆనందంగాని, దేవతలు స్వర్గంలో అనుభవించే ఆనందం గాని శాశ్వతము, స్థిరము కావు. శ్రీయః పతి శ్రీపాదాలను చేరి వాటికి కైంకర్యం చేయడమే నిజమైన స్థిరమైన ఆనందం అని నమ్మాళ్వార్లు మనకు బోధించిన విషయాన్ని మామునులు ఈ పాశురంలో చక్కగా అనుగ్రహించారు.

పాశురము 32

అవతారిక: తిరువాయ్మొళి నాలుగవ పత్తు రెండవ దశకములో నమ్మాళ్వార్లు శ్రీమన్నారాయణుని వివిధ అవతారాలను ఆయాకాలాలలో ఆయా క్షేత్రాలలో అనుభవించాలని ఆశపడ్డారు. ప్రళయ కాలంలో వటపత్రశాయి నుండి ద్వాపరంలోని కృష్ణావతారం వరకు అనుభవించాలని కోరుకున్నారు. ఆ దశక సారాన్నే మామునులు ఈ పాశురంలో అనుగ్రహించారు..

పాలరైప్పోల్ శీళ్గి * ప్పరనళవిల్ వేట్కైయాల్ *
కాలత్తాల్ దేశత్తాల్ * కైకళిన్డ * శాల
అరిదాన బోగత్తిల్ * ఆశైయుఱ్ఱు నైందాన్*
కురుగూరిల్ వన్డు ఉదిత్త కో * (32)

ప్రతిపదార్థము:
కురుగూరిల్ = ఆళ్వార్ తిరునగరిలో
వన్డు ఉదిత్త = అవతరించిన
కో  =  ఆళ్వార్లు
పాలరైప్పోల్ = పసి బిడ్డలాగా
శీళ్గి =  అలిగి
ప్పరనళవిల్ వేట్కైయాల్ = పరమాత్మ పై ప్రేమతో
కాలత్తాల్ దేశత్తాల్ * కైకళిన్డ = కాలాంతర దేశాంతరములైన
శాల అరిదాన = చాలా అరుదైన
బోగత్తిల్ = భోగములో
నైందాన్ = కోపించాడు

భావము: పరమాత్మ మీద గల అపారమైమ ప్రేమ చేత  కాలాంతర దేశాంతరాలలో చేసిన అవతారాలను ఇప్పుడు అనుభవించాలని, కైంకర్యము చేయాలని  నమ్మాళ్వార్లు కోరుకున్నారు. అది లభించకపోవడముతో చిన్న పిల్లవాడిలాగా ఏడ్చారు, కోపగించుకున్నారు, అలిగారు అన్న విషయాన్నే మామునులు ఇక్కడ తెలియజేశారు..

 పాశురము 33 

 అవతారిక: ఈ పాశురము 4 వ పత్తు 3 వ దశకములోని ‘కోవై వాయాళ ‘ కి సంక్షిప్తమై  ఉంది. కాల ప్రభావము వలన వచ్చిన అవరోధాలను తొలగదోసి, మహిమాన్వితుడైన పరమాత్మ తన కళ్యాణ గుణములతో  ఆళ్వార్లకు గుణానుభవాన్ని కలిగించిన వైభవాన్ని ఈ దశకంలో నమ్మాళ్వార్లు పొందారు.  దీనినే సంక్షిప్తంగా మామునులు ఈ పాశురంలో అనుభవింపజేశారు.

కోవాన ఈశన్ * కుఱైయెల్లాం తీరవే
ఓవాద కాలత్తు * ఉవాదిదనై * మేవి
కళిత్తడైయ క్కాట్టి * క్కలన్డ  గుణ మాఱన్ *
వళుత్తుదలాల్ * వాన్డదు ఇంద మణ్ * (33)

ప్రతిపదార్థము:
కోవాన వీశన్ = సర్వ శేషి అయిన పరమాత్మ
కుఱైయెల్లాం తీరవే = (నమ్మాళ్వార్ల )దుఃఖాలన్నీ తొలగించి
ఓవాద కాలత్తు = ఆగని కాల గమనాన్ని
ఉవాదిదనై = గొప్పగా  నిర్భందించి
మేవి కళిత్తు = ఆయనతో కూడి ఆనందించి
అడైయ క్కాట్టి = ఏవైతే ఆళ్వార్లు కోరుకున్నారో ఆ గుణాలను బాహ్యంగా కనపరచి
క్కలన్డ  గుణమ్ = ఆళ్వార్లతో కూడు కృపా గుణమును
మాఱన్ వళుత్తుదలాల్ = మారన్ అనబడే నమ్మాళ్వార్లు కీర్తించారు
ఇందమణ్ = (యందు వలన )ఈ భువి
వాన్డదు = ఉజ్జీవించింది

భావము:  సర్వ శేషి అయిన పరమాత్మ (నమ్మాళ్వార్ల) దుఃఖాలన్నీ తొలగించి గొప్పగా నిర్భందించి ఆయనతో కూడి ఆనందించారు. ఏవైతే ఆళ్వార్లు కోరుకున్నారో ఆ గుణాలను బాహ్యంగా కనపరచి ఆళ్వార్లతో కూడు కృపా గుణమును మారన్ అనబడే నమ్మాళ్వార్లు కీర్తించారు. అందువలన ఈ భువి ఉజ్జీవించింది.

పాశురము 34

 అవతారిక:  4 వ పత్తులోని ‘మణ్ణ్నై ఇరుందు‘ 4 వ దశకసారాన్నే మామునులు ఈ పాశురంలో చెప్పారు.  నాయకుడిని ఎడబాసి నాయకి అనుభవించే విరహవేదనను చూడలేక తల్లి చెపుతున్న పాశురాలు ఇవి. పరమాత్మతో సంబంధం ఉన్న వస్తువులను, ఆయన లాగ ఉండే వస్తువులను చూసి వాటినే పరమాత్మగా భ్రమించింది ఆళ్వార్ నాయిక. ఆ భ్రమలో పాడిన పశురాల సంక్షిప్తంగా ఈ పాశురం అమరింది.

మణ్ణులగిల్ మున్ కలందు * మాల్ పిరిగైయాల్ * మాఱన్
పెణ్ణిలైమైయాయ్ * క్కాదల్ పిత్తేఱి * ఎణ్ణిడిల్ మున్
పోలిముదలాన * పొరుళై అవనాయ్ నినైందు *
మేల్విళుందాన్ * మైయల్దనిన్ వీఱు * (34)

ప్రతిపదార్థము:
మణ్ణులగిల్ = ఈ లోకంలో
మాల్ = భక్తులపట్ల ప్రేమతో పిచ్చివాడైన పరమాత్మ
మున్ కలందు = మునుపు ఆళ్వార్లతో కూడి
పిరిగైయాల్ = విడిపోయినందున
మాఱన్ = ఆళ్వార్లు
పెణ్ణిలైమైయాయ్ = ప్రియ సఖిలాగా
క్కాదల్ పిత్తేఱి = ప్రేమతో పిచ్చెక్కి
ఎణ్ణిడిల్ = ఆయన విడిపోయిన విరహావేదనలో చింతిస్తుండగా
మున్ పోలిముదలాన పొరుళై = పరమాత్మను పోలిఉన్న వస్తువులను చూసి
అవనాయ్ నినైందు = ఆయనే అని భ్రమపడి
మైయల్దనిన్ వీఱు = అపారమైన ప్రేమలో
మేల్విళుందాన్ =  మునిగిపోయారు

భావము: ఈ లోకంలోనే  ఆళ్వారు నాయకితో శ్రీయఃపతి కలిసి విడిపోయారు. అందువలన ఆళ్వార్లు నాయికా భావనలో భక్తి పారవశ్యత చేత ప్రేమతో పిచ్చివాడైపోయారు.  ఆళ్వార్లు ప్రియ సఖిలాగా విరహా వేదనలో చింతిస్తూ పరమాత్మను పోలి ఉన్న వస్తువులను చూసి ఆయనే అని భ్రమపడి అపారమైన ప్రేమలో పాడిన పశురాల సారాన్ని మామునులు మనకు అనుగ్రహించారు .

పాశురము 35

 అవతారిక: పరమపదములో శ్రీమన్నారాయణుని సంపత్తయిన లక్ష్మీ పతిత్వము, అఖిలలోక నిర్వాహత్వము చూసి  అపారమైన ఆనందాన్ని పొందారు. ఆ ఆనందంలో పాడిన పాశురాలైన ‘వీత్తిరుంద ‘ అనే 4.5 తిరువాయ్మొళి యొక్క సారముగా ఈ పాశురము అమరింది.

వీఱ్ఱిరుక్కుం మాల్ విణ్ణిల్ * మిక్కమయల్ దన్నై *
ఆఱ్ఱుదఱ్కా * త్తన్ పెరుమై ఆనదెల్లాం * తోఱ్ఱవందు
నన్ఱు కలక్కపోత్తి * నంగు ఉగందు వీఱు ఉరైత్తాన్
శెన్ఱ తుయర్ మాఱన్ తీర్ందు * (35)

ప్రతిపాదార్థము:
విణ్ణిల్ = పరమపదములో
వీఱ్ఱిరుక్కుం = ఆనంద స్వరూపుడై వున్న
మాల్ = ప్రేమస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు
మిక్కమయల్ దన్నై = ఆళ్వార్లు గొప్ప గందరగోళపడి
ఆఱ్ఱుదఱ్కా = తొలగించడానికా
త్తన్ పెరుమై ఆనదెల్లాం * తోఱ్ఱవందు = ఆయన సంపద , గొప్పదనం చూసి
నన్ఱు కలక్క = ఆయనతో చేరడానికి (పరమాత్మ)
పోత్తి * నంగు ఉగందు = ఆనందంతో ఆయనను మనసారా కీర్తించి
మాఱన్ = ఆళ్వార్లు
శెన్ఱ తుయర్ తీర్ందు = గతంలో అనుభవించిన దుఃఖం తీరి
వీఱు ఉరైత్తాన్ = తన భాగ్యాన్ని ప్రకటించారు

భావము:  శ్రీయఃపతి పరమ కారుణ్యంతో పరమపదము నుండి ఇక్కడకు వచ్చి ఆళ్వార్లకు తమ సర్వేశ్వరత్వం, శ్రీయః పతిత్వం చూపించారు. ఆళ్వార్ల దుఃఖము, గందరగోళము పోగొట్టారు. ఆళ్వార్లు స్వామిని చూసి ఆనందంతో కీర్తించారు, తన  దుఃఖమును మరచిపోయారు. ఉభయ విభూతులలో తన వంటి అదృష్టవంతులు ఎవరున్నారు? అని పొంగిపోయారు..

పాశురము 36

 అవతారిక: తిరువాయ్మొళిలో ‘తీర్పారై యామిని’ అనే 4 వ పత్తు 6 వ దశకంలో ఆళ్వార్ల పట్ల అపారమైన ప్రేమను  కలిగియున్న శ్రీయః పతిని ప్రత్యక్షంగా చూసి అనుభవించలేక పోయానని ఆళ్వార్లు మోహ పరవశులయ్యారు. ఆళ్వార్ల మీద అభిమానంగల చెలికత్తెలు మొదలైన వారు దీనికొక పరిష్కారం కనుక్కోవడానికి  ప్రయత్నించారు. సుజ్ణానముగల ఆళ్వార్ల  శ్రేయోభిలాషులు. ఆళ్వార్లు పొందని విషయాలు, ఆళ్వార్ల ఇప్పటి పరిస్థితి, పరిష్కారాన్ని గురించి పాడిన పాశురాలు. ఆ పాశురాల సారాన్ని ఇక్కడ  మామునులు మనకు అనుగ్రహించారు.

తీర్ ప్పారిలాద * మయల్ తీరక్క కలన్ద మాల్ *
ఓర్ ప్పాదుమ్ ఇన్రి  * ఉడన్ పిరియ * నేర్ క్క
అఱివళిందు ఉఱ్ఱారుం * అఱక్కలంగ * పేర్ కేట్టు
అఱివు పెఱ్ఱాన్ * మాఱన్ శీలమ్ * (36)

ప్రతిపాదార్థము:
తీర్ ప్పారిలాద = తీర్చేవారు లేక
మయల్ తీర = ఉత్తుంగంగా ఎగసిపడే ప్రేమను మనసారా తీర్చుకోవటానికి
క్కలంద మాల్ = తనతో కూడిన ఆ శ్రీయఃపతి
ఓర్ ప్పాదుమ్ ఇన్రి  * ఉడన్ పిరియ = ఏ కారణము లేకుండా వెంటనే విడిపోగా
ఉఱ్ఱారుం * అఱక్కలంగ నేర్ క్క = చుట్టూ ఉన్న తల్లి ,చెలికత్తెలు అందరూ బాధపడి
అఱివు అళిందు = తెలివి తప్పగా (నమ్మాళ్వార్లు)
పేర్ కేట్టు = పరమాత్మ తిరునామాలను విని
మాఱన్ = నమ్మాళ్వార్లు
అఱివు పెఱ్ఱాన్ = తెప్పరిల్లారు
శీలమ్ = అదియే ఆయన శీలగుణము

భావము: భగవంతుడి మీద అపారమైయాన ప్రేమను కలిగి వున్న నమ్మాళ్వార్లను కలిసిన భగవంతుడు అంతలోనే ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అలా చేయటం వలన తరువాత ఏమి జరుగుతుందని కూడా ఆయన ఆలోచించలేదు. నమ్మాళ్వార్ల మోహమో మునపటి కన్నా తీవ్రమయింది. పక్కనే వున్న తల్లి, చెలికత్తెలు, ఇతర బంధువులు భగవంతుని నామ సంకీర్తన చేయగా అది విని నమ్మాళ్వార్లు తెప్పరిల్లారు. అలా తెప్పరిల్లటమే  ఆయన శీల గుణమును తెలియజేస్తుంది.

పాశురము 37

 అవతారిక: తిరువాయ్మొళిలో ‘శీలమిల్లాఈశన ‘ అనే 4 వ పత్తు 7 వ దశకంలో ఆళ్వార్లు పరమాత్మ తిరునామాలను వినగానే మళ్ళీ స్పృహలోకి వచ్చారు. కాని ఆ తిరునామాలకు యజమాని అయిన శ్రీమన్నారాయణుని అనుభవించలేక పోయానని వాడిపోయిన మనసుతో పాడిన పాశురాల సంక్షిప్త రూపంగా మామునులు ఈ పాశురాన్నిఅనుగ్రహించారు.

శీలమిగు కణ్ణన్ * తిరునామత్తాల్ ఉణర్దు *
మేలవన్ దన్ మేనికండు మేవుదఱ్కు * శాల
వరుంది ఇరువుమ్  పగలుమ్  * మాఱామల్ కూప్పిట్టు *
ఇరున్ దననే * తెన్ కురుగూర్ ఏఱు * (37) 

ప్రతిపదార్థము:
తెన్ కురుగూరేఱు = ఆళ్వా ర్తిరునాగరికి నాయకులైన ఆళ్వార్లు
శీలమిగు కణ్ణన్ = అసంఖ్యాకమైన కళ్యాణగుణములను కలిగి వున్న శ్రీకృష్ణుడి
తిరునామత్తాల్ = తిరునామముల వలన
ఉణర్ందు = మోహపారవశ్యము మునుండి బయటపడి
మేల్  = తరువాత స్వస్థతను పొంది
అవన్ దన్ మేని కండు మేవుదఱ్కు = ఆయన శుద్దతత్వస్వరూపాన్ని చూసి ఆనందించాలని
శాల వరుంది = పాల్ఉ విధాలుగా చింతించి
ఇరువుం పగలుం = రాత్రింపగళ్ళు
మాఱామల్ కూప్పిట్టు * ఇరుందననే = నిర్విరామంగా పిలుస్తూనే ఉన్నారు.

భావము : ఆళ్వార్తిరునాగరికి నాయకులైన ఆళ్వార్లు అసంఖ్యాకమైన కళ్యాణ గుణములను కలిగి వున్న శ్రీకృష్ణుడి  తిరునామముల వలన మోహ పారవశ్యము నుండి బయట పడ్డారు. తరువాత స్వస్థతను పొంది ఆయన శుద్ద తత్వ స్వరూపాన్ని చూసి ఆనందించాలని పలు విధాలుగా చింతించి రాత్రింపగళ్ళు నిర్విరామంగా మొరపెడుతూనే ఉన్నారు.

పాశురము 38

అవతారిక: ఆశ్రయించదగినవాడు, సమస్త దుఃఖాలను పోగొట్టగలిగినవాడు అయిన సర్వేశ్వరుడు రాలేదు, ముఖం చూపలేదు. ఆయన తనను చూడాలని కష్టపడటం లేదు. ఆయనకుపకరించని ఆత్మను, ఆత్మ సహకారులను (కరచారణాలు) విరోదిస్తూ 4 వ పత్తు 8 వ దశకంలో ఆళ్వార్లు పాడిన పాశురాలకు మామునులు సంక్షిప్తంగా అనుగ్రహించిన పాశురము.

ఏఱు తిరువుడైయ * ఈశన్ ఉగప్పుక్కు
వేరుపడిల్ * ఎన్నుడైమై మిక్కఉయిర్  * తేరుంగాల్
ఎన్ దనక్కుంమ్ వేణ్డాఎనుమ్  * మాఱన్ తాళై నెన్ జే! *
నన్ తమక్కు ప్పేఱాగ నణ్ణు * (38)

ప్రతిపదార్థము;
ఏఱు తిరువుడైయ = ఎవరి  హృదయసీమలో శ్రీమహాలక్ష్మి వేంచేసి ఉందో
ఈశన్ = ఆ సర్వేశ్వరుడి
ఉగప్పుక్కు వేరుపడిల్ = హృదములో చోటు లేనప్పుడు
ఎన్నుడైమై = నా ఆభరణాలు
మిక్కఉయిర్  = వాటి కంటే విలువైన, ఉత్తమమైన హృదయము
తేరుంగాల్ = ఎప్పుడైతే తృణీకరించబడుతుందో
ఎన్ దనక్కుమ్ వేణ్డాఎనుమ్  = అవి నాకు కూడా అవసరములేదు  అనే
మాఱన్ = నమ్మాళ్వార్లు
తాళై = శ్రీపాదములే
నెన్ జే = ఓ మనసా
నన్ తమక్కు = మనకు
ప్పేఱాగ నణ్ణు = పరమ ప్రయోజనము భావించు

భావము: ఎవరి హృదయ సీమలో శ్రీమహాలక్ష్మి వేంచేసి ఉందో, ఆ సర్వేశ్వరుడి హృదములో చోటు లేనప్పుడు, నా ఆభరణాలు వాటి కంటే విలువైన, ఉత్తమమైన హృదయము ఎప్పుడైతే తృణీకరించబడుతుందో అవి నాకు కూడా అవసరములేదు అని నమ్మాళ్వార్లు చెప్పారు. ఓ మనసా! అటువంటి భక్తాగ్రేశరుల శ్రీపాదములే మనకు పరమ ప్రయోజనము, మోక్షసాధనము అవుతుంది అనే ఆళ్వార్ల భావాన్ని మామునులు ఈ పాశురములో తెలియజేశారు..

పాశురము 39 

 అవతారిక: నాలుగవ పత్తు ‘నణ్ణాదార్ మురువలిప్ప‘ అనే దశకంలో సంసారుల అనర్థాన్ని చూసి విరక్తితో ఆళ్వార్లు పాడారు. సకల కళ్యాణ గుణాత్మకమైన శ్రీమన్నారాయణుడు నమ్మాళ్వార్లకు తన వైభవాన్ని చూపించాడు. మానసికంగా ఆ వైభవాన్ని అనుభవించిన నమ్మాళ్వార్లు ఐశ్వర్య కైవల్యాలు పరమ హేయమని శ్రీమన్నారాయణుని శ్రీపదాలు మాత్రమే పరమ ప్రాప్యమని ఈ దశకంలో చేతనులకు ఉదేశించారు. ఆ దశక సంక్షిప్తంగా ప్రస్తుత పాశురాన్ని మామునులు మనకు అనుగ్రహించారు.

నణ్ణాదు మాల్ అడియై * నానిలత్తే వల్వినైయాల్ *
ఎణ్ణారా త్తున్బముఱుమ్ * ఇవ్వుయిర్గళ్ * తణ్ణిమైయై
కణ్ణిరుక్క మాట్టామల్ * కణ్ కలంగుం మాఱనరుళ్ *
ఉండు నమక్కు * ఉత్తతుణై ఒన్ఱు (39)

ప్రతిపదార్థము
మాల్ అడియై = పరమాత్మ శ్రీపాదాలను
నణ్ణాదు = శరణాగతి చేయనిదే
నానిలత్తే = ఈ భూమి మీదy
వల్వినైయాల్ = ఘోరమైన పాపాల వలన
ఎణ్ణారా త్తున్బముఱుమ్ = అంతులేని కష్టాలను అనుభవించాలి
ఇవ్వుయిర్గళ్ = ఈ జీవాత్మల
తణ్ణిమైయై = ఏకాంతము (తమకు మాత్రమే పరమాత్మ కృప లభించడం)
కణ్ణిరుక్క మాట్టామల్ = చూస్తూ ఉండలేక
కణ్ కలంగుం = ఆళ్వార్ల కళ్ళు అశ్రు పూరితాలయ్యాయి
మాఱన్ = అలాంటి దయార్థహృదయులైన శఠకోపుల
అరుళ్= కృప
నమక్కు * ఉత్తతుణై ఒన్ఱు ఉండు = మనకు తోడుగా వుందంటుంది

భావము:  పరమాత్మ శ్రీపాదాలను శరణాగతి చేయని చేతనులు ఈ భూమి మీద ఘోరమైన పాపాలను చేస్తూ అంతులేని కష్టాలను అనుభవించడాన్ని నమ్మాళ్వార్లు చూశారు. అది చూసినవారు సహించలేక పోయారు. తమకు మాత్రమే భగవదనుగ్రహము లభించడాన్ని ఈ జీవాత్మలకు లభించక పోవడాన్ని తలచుకుంటే వారి కళ్ళు అశ్రుపూరితాలయివావి. అలాంటి దయార్థ  హృదయులైన శఠకోపుల కృప మనకు తోడుగా వుందంటుంది అని ఈ పాశుర భావము.

పాశురము 40  

 అవతారిక: నాలుగవ పత్తు పదవ దశకం అయిన ‘ఒండ్రుమ్ దేవుమ్’ అనే పాశురాలలో సంసారులకు శరణాగతి చేయడానికి అనుకూలంగా ఉండే పరత్వంతో కూడిన అర్చావతారాన్ని, భోగ్యత్వాన్ని ఆళ్వార్లు పాడారు.

ఒన్ఱుమ్ ఇలైత్తేవు * ఇవ్వులగం పడైత్త మాల్ *
అన్ఱి యెన * ఆరుమ్ అఱియవే * నన్ఱాగ
మూదలిత్తు ప్పేశి అరుళ్ * మొయ్ మ్మగిళోన్ తాళ్ తొళవే *
కాదలిక్కుం ఎన్నుడైయకై * (40)

ప్రతి పదార్థము:
ఇవ్వులగం పడైత్త = ఈ లోకాలన్నింటినీ సృష్టించిన
మాల్ అన్ఱి =సర్వేశ్వరుడు కాక
త్తేవు ఒన్ఱుమ్ ఇలై యెన = మరొక దైవము లేడు అని
ఆరుమ్ అఱియ = అందరు అర్థం చేసుకోవటానికి
నన్ఱాగ మూదలిత్తు = స్పష్టంగా  చెప్పి
ప్పేశి అరుళ్ = కృపతో మాట్లాడి
మొయ్ మ్మగిళోన్ = ప్రబందాలను అనుగ్రహించిన నమ్మాళ్వార్లు
తాళ్ తొళవే =  శ్రీపాదాలను నమస్కరించడానికి
ఎన్నుడైయ కై = నా చేతులు
కాదలిక్కుం = ప్రేమతో ఆతృత పడుతున్నాయి

భావము:  ఈ లోకాలన్నింటినీ సృష్టించిన సర్వేశ్వరుడు కాక మరొక దైవము లేడు అని అందరు అర్థం చేసుకునే విధంగా స్పష్టంగా తన ప్రబంధాలలో నిరూపించిన నమ్మాళ్వార్ల  శ్రీపాదాలకు నమస్కరించడానికి నా చేతులు ప్రేమతో ఆతృత పడుతున్నాయి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-31-40-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment