నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పత్తాం తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఒన్బదాం తిరుమొళి – శిందుర చ్చెంబొడి

మొదట్లో ఆమె కాముడు (మన్మథుడు), పక్షులు మరియు మేఘాల పాదాల వద్ద పడి కొంతవరకు ఓదార్పు పొందింది. కానీ ఫలితము లేకపోయింది. భగవానుడు రాకపోయినా, ఆతడిని పోలిన వాటిని చూసి ఆమె తనను తాను నిలబెట్టుకోగలదని అనుకుంది. వసంత కాలంలో వికసించే పూవులపైన విహరిస్తున్న పక్షులను చూసి ఆతడి దివ్య స్వరూపంలోని దివ్య అవయవాలు గుర్తుకు వచ్చి ఆమె బాధ పడింది. ఈ స్థితిలో, ఆమె పెరియాళ్వార్ల వంశంలో తన పుట్టుక మరియు భగవానుడి మాట మాత్రమే ఆమెను ఆదుకోగలవని ఆమె భావించింది. తాను సర్వ రక్షకుడని అందరికీ రక్షణనిస్తానని మాట ఇచ్చినప్పటికీ, ఆతడు సర్వ తంత్ర స్వతంత్రుడు అయినందున ఆతడిని ఎవరూ ప్రశ్నించలేరు. అందువల్ల పెరియాళ్వార్ల దివ్య కుమార్తెగా ఉన్న తన సంబంధమే తనను ఆదుకోగలదని, అదే ఏకైక మార్గమని ఆమె భావించింది. ఇక్కడ కూడా, “భగవానుడు నన్ను వదిలేస్తే?” అని ఆమెకు అనవసరమైన సందేహం ఒకటి కలిగింది, “ఇంకేదైనా జరగవచ్చు కానీ ఇది జరగకపోవచ్చు. అయితే, నాకూ పెరియాళ్వార్లకు మధ్య ఉన్న సంబంధం వృధా పోదు. ఇది ఆతని స్వతంత్ర్యాన్ని మార్చి నన్ను ఆతడి దివ్య పాదాల వద్దకు చేరుస్తుంది” అని తలచి ఆమె తనను తాను మందలించుకుంటుంది. ఒకవేళ “నేను నిన్ను విడిచిపెట్టను” అని భగవానుడు అనిననూ, అది జరగడానికి ఆచార్యుడు అవసరం (ఆచార్యుడు సిఫార్సు పాత్రను పోషిస్తాడు). వాణవదరైయన్ రాజును చూడటానికి పరాశర భట్టర్ శ్రీదేవిమంగళం అనే ప్రదేశంలో ఉన్నప్పుడు, “దేవుడు ఉన్నప్పుడు, ప్రజలందరూ నీ పట్ల భక్తిని చూపడానికి కారణం ఏమిటి?” అని రాజు భట్టర్ని ప్రశ్నించారు. “ఎంబెరుమానుడిని పొందడానికి, ఆతడి భక్తులు గటకర్లలా (కలిపేవారు) వ్యవహరిస్తారు. నేను కూరత్తాళ్వాన్ల కుమారుడిని కాబట్టి వీళ్ళందరూ నాపై గౌరవం చూపుతున్నారు” అని భట్టర్ దయతో బదులిచ్చిరి.

మొదటి పాశురము: ఆమె తన దీన స్థినిని పుష్పాలకు తెలుపుకుంటుంది.

కార్ క్కోడల్ పూక్కాళ్ కార్ క్కడల్ వణ్ణన్ ఎన్మేల్ ఉమ్మై
ప్పోర్ క్కోలం శెయ్దు పోర విడుత్తవన్ ఎంగుఱ్ఱాన్?
ఆర్ క్కో ఇనినాం పూశల్ ఇడువదు? అణి తుళాయ్
త్తార్ క్కోడుం నెంజం తన్నై ప్పడైక్క వల్లేన్ అందో!

ఓ నల్లని కాందళ్ పుష్పమా (ఒక రకమైన కలువ పుష్పము)! నిన్ను చక్కగా అలంకరించి, నాపై యుద్దానికి పంపిన నల్లని మహాసముద్రం వంటి దివ్య స్వరూపముతో ఉన్న ఆ కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు? నేను ఎవరి వద్దకి వెళ్లి నా మొర చెప్పుకోవాలో నాకు నిజంగా తెలియట్లేదు. నా మనస్సు కూడా నాకు సహకరించకుండా అందమైన ఆ తులసీ మాలను  కోరుతుంది. అయ్యో!

రెండవ పాశురము: ఈ బాధ నుండి తనను ముక్తి పరచమని ఆమె  కలువ పుష్పాలను ప్రార్థిస్తుంది.

మేల్ తోన్ఱి ప్పూక్కాళ్! మేల్ ఉలగంగళిన్ మీదు పోయ్
మేల్ తోన్ఱుం శోది వేద ముదల్వర్ వలం కైయిల్
మేల్ తోన్ఱుం ఆళియిన్ వెంజుడర్ పోలచ్చుడాదు ఎమ్మై
మాఱ్ఱోలై ప్పట్టవర్ కూట్టత్తు వైత్తు క్కొళ్గిఱ్ఱిరే

ఎత్తుకి ఎదిగిన ఓ కలువ పువ్వులారా! వేదములు వెల్లడించి నట్లు, ఉన్నత లోకమైన పరమపదములో నిత్య నివాసుడై ఉన్న సర్వోన్నతుడి దివ్య కుడి హస్థములో కనిపించే దివ్య చక్రమా! నీ దివ్య తేజముతో నన్ను ఇలా దహించక, కైవల్య నిష్ఠర్ల (తమ ఆత్మను తాము అనుభవించువారు) గోష్ఠిలో నన్ను చేర్చవా? అనగా ఇందులో అంతరార్ధం ఏమిటంటే, భగవానుడి నుండి ఇలా విరహ వేదనతో బాధ పడే కంటే కైవల్య మోక్షంలో తనను తాను అనుభవించడం మేలు అని అర్థం.

మూడవ పాశురము: పైనుండి ఆమె తన చూపుని మార్చి, పక్కనే మొక్కలపై వాలి ఉన్న దొండ తీగపై పడింది. తాను ముందు చూసిన పుష్పాల రంగు ఎంబెరుమానుడి దివ్య స్వరూపాన్ని గుర్తు చేసి మరింత బాధ పెట్టాయి. ఆ దొండ పండ్లు అతని దివ్య అధరములను గుర్తు చేసి హింసిస్తున్నాయి..

కోవై మణాట్టి! నీ ఉన్ కొళుం కని కొండు ఎమ్మై
ఆవి తొలైవియేల్ వాయళగర్ తమ్మై అంజుదుం
పావియేన్ తోన్ఱి ప్పాంబణైయార్ క్కుం తన్ పాంబు పోల్
నావుం ఇరండుళ ఆయ్ ఱ్ఱు నాణిలియేనుక్కే

దొండ తీగపై లేడిలా ఉన్న ఓ పండు! మీ అందమైన పండ్లతో నా ప్రాణాన్ని తీయకుమా! భగవానుడికి సంబంధించిన విషయాలంటే నాకెంతో భయము. నాకు సంబంధించిన విషయాలకు వస్తే శేషశాయి (ఆదిశేషునిపైన పవ్వలించి ఉన్నవాడు) అయిన ఆ భగవానుడికి రెండు నాలుకలు ఉన్నాయి. తాను శయనించి ఉన్న సర్పమువలే అతను కూడా ఒక నిర్లజ్జుడు.

నాలుగవ పాశురము: దొండ పండ్లు అతని దివ్య అధరములను గుర్తు చేసి బాధిస్తున్నందున, ఆమె తన దృష్టిని మరలించి మరొక వైపు చూసింది. నిండుగా వికసించిన మల్లె పువ్వులపై ఆమె చూపు పడింది. ఎంబెరుమానుడి తెల్లటి పలు వరుస ఆమెకు గుర్తుకు వచ్చి ఎలా బాధ పెడుతున్నాయో ఆమె తెలుపుతుంది.

ముల్లై ప్పిరాట్టి! నీ ఉన్ ముఱువల్గళ్ కొండు ఎమ్మై
అల్లల్ విళైవియేల్ ఆళి నాంగాయ్! ఉన్ అడైక్కలం
కొల్లై అరక్కియై మూక్కరిందిట్ట కుమరనార్
శొల్లుం పొయ్యానాల్ నానుం పిఱందమై పొయ్ అన్ఱే

ఓ లేడీ లాంటి మల్లె తీగా! లోతైన గుణం (ఆమె భావాలను సులభంగా బయటపెట్టదు) ఉన్నదానా! నీవు పుష్పించే తీరుతో నన్ను హింసించవద్దు, భగవానుడి ముత్యాల వంటి దివ్య పలు వరుస నాకు గుర్తుకు వస్తుంది. నేను నీకు లొంగిపోతున్నాను. శూర్పనఖ ముక్కుని కోసి తరిమికొట్టిన దశరథ చక్రవర్తి కుమారుడి మాట అబద్ధం అయితే, పెరియాళ్వార్ల కుమార్తెగా నా జన్మ కూడా అబద్ధం అవుతుంది (ప్రయోజనం ఉండదు).

ఐదవ పాశురము: తనను హింసిస్తున్న మల్లె పువ్వును చూసి ఆమె తన కళ్ళు మూసుకుంది. అయితే, ఆమె తన చెవులు మూసుకోలేక పోయింది.

పాడుం కుయిల్గాళ్! ఈదెన్న పాడల్? నల్ వేంగడ
నాడర్ నమక్కు ఒరు వాళ్వు తందాల్ వందు పాడుమిన్
ఆడుం కరుళక్కొడి ఉడైయార్ వందరుళ్ శెయ్దు
కూడువరాయిడిల్ కూవి నుమ్ పాట్టుక్కళ్ కేట్టుమే

ఓ కోకిలలారా!  ఎలాంటి అపస్వరమైన రాగాలు తీస్తున్నారు? ఎత్తైన తిరువేండం కొండలు తన నివాసముగా ఉన్న ఆ ఎంబెరుమానుడు వచ్చి నన్ను కుదుటపరచినపుడు వచ్చి అప్పుడు పాడుము. గరుడ ధ్వజము ఉన్న ఆ భగవానుడు ఇక్కడకు వచ్చి నాతో ఏకం అయినప్పుడు, నిన్ను పిలిచి నీ పాటలు వింటాము.

ఆరవ పాశురము: ఆమె నెమళ్ల పాదాల యందు పడి, ఎంబెరుమానుడు తనను కాపాడే మార్గాన్ని చూపమని ప్రార్థిస్తుంది.

కణమా మయిల్గాళ్! కణ్ణపిరాన్ తిరుక్కోలం పోన్ఱు
అణిమా నడం పయిన్ఱు ఆడుగిన్ఱీర్ క్కు అడి వీళ్గిన్ఱేన్
పణమాడు అరవణనై ప్పఱ్పల కాలముం పళ్ళి కొళ్
మణవాళర్ నమ్మై వైత్త పరిశిదు కాణ్మినే

గుంపులు గుంపులుగా ఉన్న ఓ నెమళ్ళారా! కృష్ణ పరమాత్ముని పోలిన అందమైన రూపముతో సుందర నృత్యం చేసే మీ దివ్య పాదాల వద్ద పడి నేను మిమ్ములను ప్రార్థిస్తున్నాను. దయచేసి మీ నృత్యాన్ని ఆపండి. విప్పిన వేయి పడగలతో ఆదిశేషుని శయ్యపై శాశ్వతంగా పవ్వలించి ఉండే అళగియ మణవాళన్ (అందమైన వరుడు) నన్ను సృష్టించినది మీ కాళ్లపై పడటం కొరకే.

ఏడవ పాశురము: నృత్యం చేస్తున్న నెమళ్లను చూసి ఆమె “నా స్థితిని గమనించి కూడా మీరు ఇలా నాట్యం చేయడం సరైనదేనా?” అని ప్రశ్నిస్తుంది.

నడమాడి త్తోగై విరిక్కిన్ఱ మామయిల్గాళ్! ఉమ్మై
నడమాట్టం కాణ ప్పావియేన్ నాన్ ఓర్ ముదలిలేన్
కుడమాడు కూత్తన్ గోవిందన్ కోమిఱై శెయ్దు ఎమ్మై
ఉడైమాడు కొణ్డాన్ ఉంగళుక్కు ఇని ఒన్ఱు పోదుమే?

పురి విప్పి నాట్యమాడే ఓ నెమళ్ళారా! మీ నాట్యాన్ని నా కళ్ళతో చూడలేని పాపిని నేను. కుండలతో నృత్యం చేసిన ఆ గోవిందుడు నన్ను పూర్తిగా మోహించి వేదించి బాధిస్తున్నాడు. నా ముందు మీరు ఇలా నాట్యమాడటం సరైనదేనా?

ఎనిమిదవ పాశురము: అన్నీ అలా ఆమెను హింసిస్తుండగా, మేఘాలు కూడా వర్షం కురిపించి హింసించసాగాయి. ఈ రెండు పాశురములతో పెరియ తిరుమలై నంబికి (భగవద్ రామానుజుల మేనమామగారు, వారి పంచ ఆచార్యులలో ఒకరు) లోతైన అనుబంధము ఉంది.  అతను ఈ రెండు పాశురముల ప్రస్తావన వచ్చినప్పుడు వారి కళ్ళు కన్నిటితో నిండిపోయి నోట మాట వచ్చేది కాదు వారికి.  ఈ కారణంగా, శ్రీవైష్ణవులందరూ ఈ రెండు పాశురాలను గంభీరముగా తీసుకోవాలి.

మళైయే! మళైయే! మణ్పుఱం పూశి ఉళ్ళాయ్ నిన్ఱ
మెళుగు ఊఱ్ఱినాఱ్పొళ్ ఊఱ్ఱు నల్ వేంగడత్తుళ్ నిన్ఱ
అళగ ప్పిరానార్ తమ్మై ఎన్ నెంజత్తు అగప్పడ
త్తళువ నిన్ఱు ఎన్నైత్తదైత్తు కొండు ఊఱ్ఱవుం వల్లైయే?

ఓ మేఘమా! పైన లేపనము చేసి  లోపల మైనము కరిగించినట్లే, ఎత్తైన తిరువేంకట కొండలపై నిత్య నివాసుడై ఉన్న ఆ ఎంబెరుమానుడు నన్ను బాహ్యంగా ఆలింగనం చేసుకున్నాడు కానీ లోపలి నుండి నా ప్రాణాన్ని కరిగించి నాశనం చేస్తున్నాడు. నాలో నివాసమై ఉన్న ఆ భగవానుని ఆలింగనము చేసుకొని ఏకం అయిన తర్వాత నీవు వర్షం కురిపిస్తావా?

తొమ్మిదవ పాశురము: దీని తరువాత, సముద్రంలో అలలు ఉప్పొంగగా, ఆ అలలను చూస్తూ ఆమె మాట్లాడసాగింది.

కడలే! కడలే! ఉన్నై క్కడైందు కలక్కుఱుత్తు
ఉడలుళ్ పుగుందు నిన్ఱు ఊరల్ అఱుత్తవఱ్కు ఎన్నైయుం
ఉడలుళ్ పుగుందు నిన్ఱు ఊరల్ అఱుక్కిన్ఱ మాయఱ్కు ఎన్
నడలైగళ్ ఎల్లాం నాగణైక్కే శెన్ఱు ఉరైత్తియే

ఓ మహా సముద్రమా! ఎంబెరుమానుడు నిన్ను అల్లకల్లోలము చేసి చిలికి నీలో ప్రవేశించి నీలో నుండి అమృత రసాన్ని [శ్రీ మహాలక్ష్మి] దొంగిలించాడు. అదే విధంగా, మహోపకారి అయిన ఆ ఎంబెరుమానుడు నాలో ప్రవేశించి నా జీవితాన్ని ఛిన్నాభిన్నము చేశాడు. నీవు వెళ్లి నా బాధని తన శయ్య అయిన తిరుఅనన్తాళ్వావ్ (ఆదిశేషుడు) కి వివరిస్తావా?

పదవ పాశురము: ఆమె తన కంటే ఎక్కువ బాధని అనుభవిస్తున్న తన ఒక చెలిని ఓదార్పు మాటలు చెప్పి ఈ పదిగాన్ని పూర్తి చేసింది.

నల్ల ఎన్ తోళి! నాగణై మిశై నం పరర్
శెల్వర్ పెరియర్ శిఱు మానిడర్ నాం శెయ్వదు ఎన్?
విల్లి పుదువై విట్టుచిత్తర్ తంగళ్ దేవరై
వల్ల పరిశు వరువిప్పరేల్ అదు కాండుమే

ఓ నా ప్రియ మిత్రమా! ఆదిశేషుని తల్పముపై పవ్వలించి ఉన్న మన భగవానుడు శ్రీ మహాలక్ష్మికి పతి అయినందున సుసంపన్నుడు. ఆతడు మహోన్నతుడు. మరోవైపు మనము అతి అల్పులము. ఇలాంటి స్థితిలో మనము ఏమి చేయగలము? శ్రీవిల్లిపుత్తూరుకి నాయకుడైన పెరియాళ్వార్లు తన నియంత్రణలో ఉన్న ఆ భగవానుడిని సాధ్యమైన రీతిలో వారు ఆహ్వానిస్తే, ఆ భగవానుడిని ఆరాధించే అదృష్టం మనకి కూడా కలుగుతుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-10-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment