నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఒన్బదాం తిరుమొళి – శిందుర చ్చెంబొడి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఎట్టాం తిరుమొళి – విణ్ణీల మేలప్పు

ఎనిమిదవ పదిగములో, ఆండాళ్ అతి శిథిలమైన స్థితిలో కొన ఊపిరిలో గోచరించింది. భగవానుని వద్దకు వెళ్లి ఆమె స్థితిని తెలపడానికి మేఘాలున్నప్పటికీ, ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే వర్షించి మొత్తానికే మాయమయ్యాయి. ఆ వర్షం కురిసిన చోట్ల అనేక పుష్పాలు వికసించాయి. ఆ పుష్పాలు భగవానుని దివ్య అవయవ సౌందర్యముతో కూడిన ఆతడి దివ్య స్వరూపము గుర్తు చేసి ఆమెను మరింత బాధ పెట్ట సాగాయి. సాధారణంగా ఈ ప్రపంచములో నిండు చంద్రుడు, చల్లని గాలి, పువ్వులు మొదలైనవి తమ ప్రియునితో ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయి, అదే ప్రియుడు తనతో లేనప్పుడు బాధను కలిగిస్తాయి. తీవ్ర విహర వేదనతో బాధపడుతుండడంతో, పైన పేర్కొన్నవి ఆమెను ఎలా కష్థ పెడుతున్నాయో ఈ పది పాశురములలో మరియు తరువాతి పది పాశురములలో (10వ పదిగము) ఆమె తెలిపింది. నమ్మాళ్వార్లు “ఇన్నుయిర్ చ్చేవల్”(తిరువాయ్మొళి 9-5 పదిగం) లో అనుభవించిన అనుభవాన్ని ఆమె ఈ రెండు పదిగములలో అనుభవిస్తోంది. ఈ పదిగము తిరుమాలిరుంజోలై ఎంబెరుమానునితో ఆమె అనుభవానికి సంబంధించినది.

మొదటి పాశురము:  సీతాకోక చిలుకలు అటు ఇటూ ఎగురుతూ తిరుమాలిరుంజోలైని కనిపించకుండా కప్పివేశాయి.  అళగర్ [అళగర్/ కళ్ళళగర్ సుందరత్తోళ్ ఉడైయాన్ అని తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న భగవానుడి దివ్య నామాలు] వేసిన వలలో నుండి తప్పించు కోవడం మనకి సాధ్యమా అని ఆమె ఆశ్చర్యపోతోంది.

శిందురచ్చెంబొడి ప్పోల్ తిరుమాలిరుంజోలై ఎంగుం
ఇందిరగోపంగళే ఎళుందుం పరందిట్టనవాల్
మందరం నాట్టి అన్ఱు మదురక్కొళుం శాఱు కొండ
శుందరత్తోళ్ ఉడైయాన్ శుళలైయిల్ నిన్ఱు ఉయ్ దుంగొలో?

తిరుమాలిరుంజోలైలో ఎర్రటి సీతాకోక చిలుకలు తమ రెక్కలు విప్పుకొని అటు ఇటూ ఎగురుతున్నాయి. సీతాకోక చిలుకలు పుష్పాల నుండి తేనెను (పుష్పామృతం) తీసి త్రాగుతాయి. మంతర పర్వతముతో క్షీర సాగరాన్ని చిలికి దేవతలకి అమృతాన్ని ప్రసాదించిన సుందరత్తోళుడైయాన్ (తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న భగవానుడు) అమృత రసం లాంటి పిరాట్టిని పొందారు. అయ్యో! అటువంటి భగవానుడి ప్రేమ వలలో నుండి బయటపడుట మనకు సాధ్యమా?

రెండవ పాశురము: అళగర్ ఎంబెరుమానుడు తన భుజాలపై ధరించిన మాలని నేను ఆశిస్తున్నాను. నా ఈ బాధను నేను ఎవరికి చెప్పుకోవాలి?

పోర్ క్కళిఱు పొరుం మాలిరుంజోలై అం పూంబుఱవిల్
తార్ క్కొడి ముల్లైగళుం తవళ నగై కాట్టుగిన్ఱ
కార్ క్కొళ్ పడాక్కళ్ నిన్ఱు కళఱి చ్చిరిక్కత్తరియేన్
ఆర్ క్కిడుగో? తోళి! అవన్ తార్ శెయ్ద పూశలైయే

యుద్ధ ఏనుగులు ఆడుకుంటూ పోట్లాడుకుంటూ ఉండే ప్రదేశం తిరుమాలిరుంజోలై. అటువంటి తిరుమాలిరుంజోలై కొండ లోయలలో మల్లె తీగలపై ఉన్న మల్లె మొగ్గలు నాకు అళగర్ల తెల్లటి చిరునవ్వుని గుర్తు చేస్తున్నాయి. పడా (ఒక ఔషధ గింజలు) మొక్కల పువ్వులు దృఢంగా నిలబడి “నీవు నా నుండి తప్పించుకోలేవు” అని నన్ను చూసి నవ్వుతూ అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. ఓ మిత్రమా! ఆతడి దివ్య తోమాలను (భుజాలపైన వాలి ఉన్న మాల) గుర్తుచేసుకొని నేను అనుభవించిన క్షోభని ఎవరికి తెలుపుకోవాలి?

మూడవ పాశురము: ఆతని దివ్య ఛాయకి పోలిన పుష్పాలను చూస్తూ, “అతడు చేసినది న్యాయమేనా?” అని ఆమె అడుగుతుంది.

కరువిళై ఒణ్మలర్గాళ్! కాయా మలర్కాల్! తిరుమాల్
ఉరువొళి కాట్టుగిన్ఱీర్ ఎనక్కు ఉయ్వళక్కు ఒన్ఱు ఉరైయీర్
తిరువిళైయాడు తిణ్ తోళ్ తిరుమాలిరుంజోలై నంబి
వరి వళైయిల్ పుగుందు వంది పఱ్ఱుం వళక్కుళదే

ఓ అందమైన అపరాజిత (ముదురు నీలం రంగు పువ్వులు) పుష్పాలారా! ఓ అల్లి పుష్పాలారా! మీరు ఆ దివ్య తిరుమాల్ యొక్క దివ్య స్వరూపాన్ని నాకు గుర్తు చేస్తున్నారు. దయచేసి నేను తప్పించుకునే మార్గాన్ని చెప్పండి. పిరాట్టి విలయాడే ధృఢమైన భుజాలు వక్ష స్థలమున్న వాడు, గుణసంపూర్ణుడైన తిరుమాలిరుంజోలై అళగర్ నా ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా నా చేయి పట్టుకొని నా గాజులు దోచుకొని వెళ్లిపోయాడు. ఇది సరైనదేనా?

నాలుగవ పాశురము: ఆమెను హింసిస్తున్న ఐదు క్రూరమైన ద్రోహులను ఆమె దూషిస్తుంది.

పైంబొళిల్ వాళ్ కుయిల్గాళ్! మయిల్గాళ్! ఒణ్ కరువిళైగాళ్!
వంబ క్కళంగనిగాళ్! వణ్ణప్పూవై నఱుమలర్గాళ్!
ఐంబెరుం పాదగర్గాళ్! అణి మాలిరుంజోలై నిన్ఱ
ఎంబెరుమానుడైయ నిఱం ఉంగళుక్కు ఎన్ శెయ్వదే?

విశాల తోటలలో నివసించే కోకిలారా! ఓ నెమళ్లారా! ఓ అందమైన పుత్రంజీవిక (ముదురు నీలం) పుష్పమా! ఓ తాజా కస్తూరీ పుష్పమా! మంచి రంగు సువాసనతో ఉన్న ఓ కాయ పుష్పమా! ద్రోహులలైన మీ ఐదుగురికి అందమైన తిరుమాలిరుంజోలై అళగర్ని పోలిన అందమైన రంగు ఎందుకు ఉంది? (నన్ను బాధపెట్టడానికేనా?)

ఐదవ పాశురము: తాను ఎవరిని ఆశ్రయించాలో చెప్పమని అక్కడ ఉన్న తుమ్మెదలను, సెలయేరులను, తామర పువ్వులను ఆమె అడుగుతుంది.

తుంగ మలర్ ప్పొళిల్ శూళ్ తిరుమాలిరుంజోలై నిన్ఱ
శెంగణ్ కరుముగిలిన్ తిరు ఉరుప్పోల్ మలర్ మేల్
తొంగియ వండినంగాళ్! తొగు పూంజునైగాళ్! శునైయిల్
తంగు శెందామరైగాళ్! ఎనక్కు ఓర్ శరణ్ శాఱ్ఱుమినే

నీల మేఘ వర్ణుడు, అందమైన కమలముల వంటి ఎర్రని నేత్రములున్న వాడు, ఆహ్లాదకరమైన నందన వనాలతో నిండి ఉన్న తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న అళగర్ ఎంబెరుమానుడి యొక్క సుందర రూపంలా కనిపించే అందమైన పుష్పముపై స్థిరపడిన భ్రమర సమూహమా! ఒకరి నొకరు తాకుతూ ప్రవహించే అందమైన ఓ సెలయేరులారా! ఆ సెలయేరులలో ఉన్న ఎర్రటి తామర పువ్వులారా! నేను ఎవరిని ఆశ్రయించాలో దయచేసి నాకు చెప్పండి.

ఆరవ పాశురము: ఆమె నూరు కుండల వెన్న మరియు నూరు కుండల చక్కెర పొంగలిని సమర్పించుకుంటానని ఆశించింది. ఎన్నో సంవత్సరాల తరువాత ఎంబెరుమానార్లు ఆమె కోరికను నెరవేర్చారు, ఆండాళ్ చేత “నం కోయిల్ అణ్ణర్ (శ్రీరంగం నుండి వచ్చిన నా అన్న)” అని  కొనియాడబడ్డారు.

నాఱు నఱుంపొళిల్ మాలిరుంజోలై నంబిక్కు నాన్
నూఱు తడావిల్ వెణ్ణెయ్ వాయ్ నేర్ందు పరావి వైత్తేన్
నూఱు తడా నిఱైంద అక్కారవడిశిల్ శొన్నేన్
ఏఱు తిరువుడైయాన్ ఇన్ఱు వందు ఇవై కొళ్ళుంగొలో?

సువాసనతో నిండిన సెలయేరులున్న తిరుమాలిరుంజోలైలో గుణ సంపూర్ణుడైన ఎంబెరుమానుడు నిత్య నివాసుడై ఉన్నాడు.  ఆ ఎంబెరుమానుడికి నూరు కుండల వెన్నని నా వాక్కు ద్వారా సమర్పించాను. ఆపై,  ఈ పలుకుల ద్వారా నూరు కుండల చక్కెర పొంగలిని సమర్పించుకున్నాను.  దినదినము తన సంపద ఎదిగిపోతున్న అళగర్ ఎంబెరుమానుడు, ఈ రోజు ఈ నా రెండు సమర్పణలను దయతో స్వీకరిస్తాడా?

ఏడవ పాశురము: అళగర్ ఎంబెరుమానుడు తన సమర్పణలను స్వీకరిస్తే, ఆతనికి మరిన్ని కైంకర్యాలు నిర్వహిస్తానని ఆమె తెలుపుతుంది.

ఇన్ఱు వందు ఇత్తనైయుం అముదు శెయ్దిడ ప్పెఱిల్ నాన్
ఒన్ఱు నూఱు ఆయిరమాగ క్కొడుత్తు ప్పిన్నుం ఆళుం శెయ్వన్
తెన్ఱల్ మణం కమళుం తిరుమాలిరుంజోలై తన్నుళ్
నిన్ఱ పిరాన్ అడయేన్ మనత్తే వందు నేర్ పడిలే

దక్షిణ దిశ నుండి సువాసనతో నిండిన  చల్లని గాలులు వీసే తిరుమాలిరుంజోలై కొండపై నా స్వామి అళగర్ నిత్య వాసుడై ఉన్నాడు. ఆ అళగర్ దయతో నూరు కుండల వెన్న మరియు నూరు కుండల చక్కెర పొంగలిని స్వీకరిస్తే, అంతటితో ఆగకుండా, ఆతడు నా మనస్సులో నివాసుడై ఉంటే, నేను వందల వేల కుండల వెన్న మరియు చక్కెర పొంగలిని సమర్పించుకొని ఆతడికి కైంకర్యాలు చేస్తాను.

ఎనిమిదవ పాశురము: అళగర్ రాక గురించి పిచ్చుకలు చెప్పిన మాటలు ప్రకటన నిజమేనా అని ఆమె అడుగుతుంది.

కాలై ఎళుందిరుందు కరియ కురువి క్కణంగళ్
మాలిన్ వరవు శొల్లి మరుళ్ పాడుదల్ మెయ్ మ్మైకొలో?
శోలై మలై ప్పెరుమాన్ తువరాబది ఎంబెరుమాన్
ఆలిన్ ఇలైప్పెరుమాన్ అవన్ వార్ త్తై ఉరైక్కిన్ఱదే

నల్లటి పిచ్చుకల మందలు ఉదయాన్నే లేచి, సర్వాధిపతి అయిన తిరుమాలిరుంజోలై ప్రభువు గురించి, లేత మర్రి ఆకుపై పవలించి ఉన్న శ్రీ ద్వారకాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళు ‘పణ’ సంగీత రాగాలతో పాడుకుంటూ ఆతడి రాకను ప్రకటిస్తున్నాయి. ఇది నిజంగా జరుగుతుందా?

తొమ్మిదవ పాశురము: కొన్నపూవు చెట్టు వలె నన్ను నేను వృధా చేసుకుంటున్నాను, నేను ఎప్పుడు ఆ భగవానుడి శంఖ నాదము వింటానో, ఆతడి విల్లు యొక్క నారి శబ్దము ఎప్పుడు వింటానో?

కోంగలరుం పొళిల్ మాలిరుంజోలయిల్ కొన్ఱైగళ్ మేల్
తూంగు పొన్ మాలైగళోడు ఉడనాయ్ నిన్ఱు తూంగుగిన్ఱేన్
పూంగొళ్ తిరుముగత్తు మడుత్తు ఊదియ శంగొలియుం
శార్ంగ విల్ నాణొలియుం తలైప్పెయ్వదు ఎంజ్ఞాన్ఱు కొలో

తిరుమాలిరుంజోలైలో వృక్షాల తోటలు ఎన్నో ఉన్నాయి, ఆ కొండ లోయలలో బంగారు పుష్ప మాలల క్రిందకి వేలాడుతున్న కొన్న పుష్పాల మాదిరిగానే  నేను కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా మిగిలిపోతున్నాను. ఎంబెరుమానుడి సుందర దివ్య అదరములపై ఉంచ బడిన శ్రీ పంచజన్య శబ్దం, ఆతడి శారంగ విల్లు యొక్క నారి (తీగ) శబ్దం ఎప్పుడు నా చెవిన పడుతుందో? (ఈ పుష్పాలను తిరుమాలిరుంజోలై అళగర్ స్వామికి సమర్పించరు)

పదవ పాశురము: ఈ పది పాశురములని పాడిన వారికి లభించే ఫలితాన్ని తెలియజేస్తూ ఆమె దశాబ్దాన్ని పూర్తి చేస్తుంది.

శందొడు కార్ అగిలుం శుమందు తడంగళ్ పొరుదు
వందు ఇళియుం శిలంబు ఆఱు ఉడై మాలిరుంజోలై నిన్ఱ
శుందరనై శురుంబార్ కుళల్ కోదై తొగుత్తు ఉరైత్త
శెందమిళ్ పత్తుం వల్లార్ తిరుమాళ్ అడి సేర్వర్గళే

రెండువైపులా చందనపు వృక్షాలతో సువాసనలు వెదజల్లుతూ నూపుర గంగ ప్రవహిస్తున్న తిరుమాలిరుంజోలైలో అళగర్ నిత్య నివాసుడై ఉంటాడు.  అందమైన పుష్పాలతో అలంకరించిన తన శిరోజాలపై భ్రమరాలు ఝంకారాలు చేస్తున్న ఆండాళ్, తిరుమలిరుంజోలైలో భగవానుడిపై దయతో ఈ పది పాసురాలను కూర్చింది. ఈ పది పాశురాలను పఠించగల సామర్థ్యం ఉన్నవారు శ్రీమన్నారాయణుని దివ్య చరణాలను పొందుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-9-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *