రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 101- 108

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< మునుపటి శీర్శిక

నూట ఒకటవ పాశురము: ఎంబెరుమానార్ల మాధుర్యము వారి  పవిత్రత కంటే గొప్పదని అముదనార్లు తెలుపుతున్నారు.                           

మయక్కు౦ ఇరు వినై వల్లియిల్‌ పూండు। మది మయంగి
తుయక్కు౦ పిఱవియిల్  తోన్ఱియ ఎన్నై* తుయర్‌ అగత్తి
ఉయక్కొండు నల్గుం ఇరామానుశ।  ఎన్ఱదున్నై ఉన్ని
నయక్కుం అవర్‌క్కు ఇది ఇళుక్కు ఎన్బర్ । నల్లవర్‌ ఎన్ఱు నైందే॥ (101)

 అజ్ఞానము ప్రతిఫలంగా పాపపుణ్యములను రెండు కర్మలతో బంధించి భ్రమింపజేయు పుట్టుకలో జన్మించాను. ఈ కర్మల ప్రతిఫలముగా నేననుభవించు సుఖ దుఃఖముల నుండి విమోచము పొంది ఉద్దరింపబడటానికి రామానుజులు నన్ను స్వీకరించారు. “ఎంబెరుమానార్లు నన్ను అనుగ్రహించారు!” (ఎంబెరుమానార్లు ఉద్దరించారు కనుక) అన్ననా మాటలు, నిరంతము నీ చింతనలో ఉండి నీ పట్ల భక్తి ప్రపత్తులతో ఉన్న వారికి అవమానము వంటిది అని పెద్దలంటారు. ఇక్కడ భావమేమిటంటే, మాధుర్యాన్ని ఆస్వాదించిన వారి మనస్సు, శుద్ధత గురించి ఆలోచించదు [ఎంబెరుమానార్లు నిర్హేతుకముగా తనను తీర్చిదిద్దాలని పడ్డ యాతనలలను అముదనార్లు ఇప్పటి వరకూ వర్ణిస్తూ వచ్చారు (వారి పరిశుద్దత యొక్క ఫలితంగా). కానీ ఎంబెరుమానార్ల యొక్క దివ్య చరణముల సేవలో ఉన్న ఆనందానికి తిరుగులేదు. ఆ కారణంగా అముదనార్లు ఈ పలుకులు పలికారు.]

నూట రెండవ పాశురము: ఈ విశాల ప్రపంచములో తన పట్ల పెరిగిన ఎంబెరుమానార్ల ఔదార్య గుణానికి కారణమేమి అని అముదనార్లు స్వయంగా ఎంబెరుమానార్లని ప్రశ్నిస్తున్నారు.                             

వైయుం మనం ఉన్ కుణంగళై ఉన్ని। ఎన్ నా ఇరుందు ఎం
ఐయన్‌ ఇరామానుశన్‌ ఎన్ఱు అళైక్కుం* అరువివైయేన్‌
శైయుం తొళుం కణ్‌ కరుదిడుం కాణ క్కడల్‌ పుడై శూళ్
వైయం ఇదనిల్। ఉన్ వణ్మై ఎన్నాల్‌ ఎన్ వళర్‌ందదువే॥ (102)

 నీ దివ్య మంగళ గుణముల గురించి ఆలోచించినపుడు నా మనస్సు బలహీనమై పోతుంది. నీ పట్ల దృఢ భావముతో ఉన్న నా జిహ్వ (నాలుక), నీ దివ్య నామములను మరియు నీతో ఉన్న దివ్య సంబంధమునే పలుకుతుంది. అనాదిగా లౌకిక పనులు చేసుకుంటూ గడిపిన నా చేతులు, నీకు నమస్కారములు చేస్తున్నాయి. నా కళ్ళు నిత్యము నిన్నే చూడలని కోరుతున్నాయి. చుట్టూ సముద్రాలతో వ్యాపించు ఉన్న ఈ భూమిపైన నీ ఔదార్య గుణము ఏ కారణము చేత నాపై పెరిగినది?

నూట మూడవ పాశురము: ఎంబెరుమానార్లు వారి కృపతో తన కర్మలను తొలగించి  అనంత జ్ఞానాన్ని ప్రసాదించిన తరువాత తన ఇంద్రియములు ఎంబెరుమానార్ల వైపు మళ్ళినవని  అముదనార్లు వివరిస్తున్నారు. 

వళర్‌ంద వెంగోబం అడంగల్‌ ఒన్ఱాయ్‌। అన్ఱు వాళ్‌ అవుణన్‌
కిళర్‌ంద పొన్ ఆగం కిళిత్తవన్ * కీర్‌త్తి ప్పయిర్‌ ఎళ్లుందు
విళైందిడుం శిందై ఇరామానుశన్ ఎందన్ మెయ్వినై నోయ్
కళైందు నల్ ఞ్ఙానం అళిత్తనన్ । కైయిల్‌ కని ఎన్నవే॥ (103)

తన తనయుడైన ప్రహ్లాదుడిని హింసించిన దురభిమాని హిరణ్యకషిపుని ఛాతిని ఉగ్రస్వరూపములో వేంచేసి భగవాన్ చీల్చాడు. అటువంటి భగవాత్కీర్తితో ఎంబెరుమానార్ల దివ్య మనస్సు ఎల్లప్పుడూ నిండి ఉంటుండి. అటువంటి ఎంబెరుమానార్లు, తన కర్మల కారణముగా తనను ఈ శరీరముతో బంధించి అనుభవింపజేయు దుఃఖములను తొలగించి, అరచేతిలో ఉసిరికాయ (తమిళ సామెత) వంటి స్పష్థమైన జ్ఞానాన్ని ప్రసాదించారు. 

నూట నాల్గవ పాశురము: ఎంబెరుమానార్లు ప్రశ్నించిన ఒక ఊహాత్మక ప్రశ్నకి “ఒక వేళ భగవానుడిని చూస్తే ఏమి చేస్తావు?” అముదనార్లు బదులిస్తూ, ఒక వేళ భగవానుడు తమకు సంబంధించిన విషయములను ప్రత్యక్షపరచినా, ఎంబెరుమానార్ల దివ్య స్వరూపములో  దేదీప్యమానమౌతున్న దివ్య మంగళ గుణాలను తప్పా ఇంకేమీ ఆశించను అని వివరిస్తున్నారు.                   

కైయిల్‌ కని అన్న క్కణ్ణనై క్కాట్టి త్తరిలుం। ఉందన్
మెయ్యిల్‌ పిఱంగియ శీరన్ఱి వేండిలన్ యాన్  నిరయ 
త్తొయ్యిల్‌ కిడక్కిలుం శోది విణ్ శేరిలుం ఇవ్వరుళ్‌ నీ
శెయ్యిల్‌ తరిప్పన్। ఇరామానుశా ఎన్ శెళుంగొండలే ॥ (104)

మేఘమువంటి ఔన్నత్యముగల మరియు ఆ ఔన్నత్యాన్ని మాకు అందించు ఓ రామానుజ! శ్రీకృష్ణ పరమాత్మ అరచేతిలో ఉసిరికాయ వంటి వాడని నీవు చెప్పినా, నీ దివ్య తిరుమేనిపై దేదీప్యమానమౌతున్న నీ దివ్య మంగళ గుణములను తప్పా ఇంక దేనిని పూజించను. నేను దివ్య తేజోమయమైన పరమపదాన్ని చేరుకోవచ్చు లేదా ఈ సంసార సుడిగుండములో చిక్కుకొని ఉండిపోవచ్చు, కానీ కృపతో నీవు ఈ రెండింటిలో ఏది అనుగ్రహించినా, నేనది మహాప్రసాదముగా భావిస్తాను.   

నూట ఐదవ పాశురము: త్యజించబడేది సంసారమని పొందాల్సినది  పరమపదమని అందరు అంటారు (పరమపదమును పొందాలని ఆశించుట కూడా సమానమేనని భావిస్తారు). నీవు ఆశించే స్థానము ఏది? ఈ పాశురము ద్వారా బదులిస్తున్నారు.              

శెళ్ళుందిరై ప్పాఱ్కడల్‌ కణ్‌ తుయిల్‌ మాయన్। తిరువడిక్కీళ్‌
విళుందిరుప్పార్‌ నెంజిల్ మేవు నన్ ఞ్ఙాని * నల్‌ వేదియర్గళ్
తొళుం తిరు ప్పాదన్‌ ఇరామానుశనై త్తొళుం పెరియోర్
ఎళ్లుందిరైత్తాడుం ఇడం। అడియేనుక్కిరుప్పిడమే॥ (105)

సుందరమైన అలలతో నున్న క్షీరసాగరములో భగవానుడు శయనించి ఉన్నాడు. నిద్రిస్తున్నట్లు నటిస్తూ ధ్యానిస్తున్నాడు. ఉత్తమమైన వైదికులచే స్తుతించబడే  ఎంబెరుమానార్లు గొప్ప జ్ఞాని. భగవానుడి దివ్య మంగళ గుణాలలో మునిగి ఉండి వారికి  శరణాగతులై ఉన్న వారి మనస్సులలో వీరి దివ్య చరణాలకు సరైన స్థానము. అటువంటి ఎంబెరుమానార్లని గొప్ప పురుషులు నిరంతరము ఆనందిస్తూ సముద్రములో ఎత్తైన అలలా నాట్యము చేయు ప్రదేశములో నీ దాసులకు దాసుడనై ఉండాలని అశిస్తున్నాను. 

నూట ఆరవ పాశురము: అముదనార్లకి తన పట్ల ఉన్న భక్తి ప్రపత్తులను చూసి, కృపతో అముదనార్ల యొక్క మనస్సును ఎంబెరుమానార్లు ఆశిస్తున్నారు (గ్రహిస్తున్నారు). ఇది చూసి అముదనార్లు, దయతో ఆనందముతో ఈ పాశురమును పలికారు.                     

ఇరుప్పిడం వైగుందం వేంగడం। మాలిరుంజోలై ఎన్నుం
పొరుప్పిడం మాయనుక్కెన్నర్‌ నల్లోర్‌* అవై తమ్మొడుం
వన్దిరుప్పిడం మాయన్ ఇరామానుశన్ మనత్తు ఇన్ఱు అవన్ 
వన్దిరుప్పిడం। ఎందన్ ఇదయత్తుళ్ళే తనక్కు ఇన్బుఱవే॥ (106)

భగవానుడిని యదార్థముగా తెలుకున్న మహానుభావులు, సర్వేశ్వరుని యొక్క స్వరూప, రూప, గుణ, విభూతి పరంగా వారి దివ్య మంగళ స్వరూపతో శ్రీవైకుంఠములో, తిరుమలలో, ప్రఖ్యాతిగాంచిన తిరుమాలిరుంజోలైలో కొండపైన నివాసులై ఉంటారని చెబుతారు.  కృపతో భగవానుడు ఈ అన్ని దివ్య ప్రదేశములతో కలిసి ఎంబెరుమానార్ల దివ్య మనస్సులో నివాసముంటారు. ఎంబెరుమానార్ల కృపతో ఉన్నత స్థలముగా భావించి  ప్రవేశించిన ప్రదేశము నా మనస్సు.

నూట ఏడవ పాశురము: తనపై కృపాతో ప్రేమానురాగములు ప్రదర్శించిన ఎంబెరుమానార్ల యొక్క దివ్య ముఖమును చూస్తూ, ఒకటి సమర్పించుకోవాలని ఆశిస్తున్నానని అముదనార్లు విన్నపిస్తున్నారు.

ఇన్బుత్త శీలత్తిరామానుశ । ఎన్ఱుం ఎవ్విడత్తుం
ఎన్బుత్త నోయ్‌ ఉడల్‌ తోఱుం పిఱందు ఇఱందు * ఎణ్‌ అరియ
ఇన్బుత్తు వీయినుం శొల్లువదొన్ఱుండు ఉణ్ తొండర్గట్కే
అన్బుత్తు ఇరుక్కుం పడి। ఎన్నై ఆక్కి అంగాట్పడుత్తే॥ (107)

అత్యంత సరళ స్వభావముగల ఓ రామానుజ! నేను మీకు ఒక విన్నపాన్ని సమర్పించు కోవాలనుకుంటున్నాను. ఒకవేళ నేను మళ్ళీ మళ్ళీ జన్మించి  జరా వ్యాధితో కూడిన ఈ శరీరాలతో అనేకానేన దుఃఖములను అనుభవించినా,  నిరంతరము నీకోసమే జీవించే వారి పట్ల నేను అన్ని వేళలా అన్ని చోట్లా భక్తి ప్రపత్తులతో ఉండేలా నీవు కృపతో అనుగ్రహించాలి. ఇదే మీకు నా ఎకైక విన్నపము.

నూట ఎనిమిదవ పాశురము: ఈ ప్రబంధము ప్రారంభములో, “ఇరామానుశ చరణారవిందమ్ నామ్ మన్ని వాళ” (మనకు తగినదైన ఎంబెరుమానార్ల దివ్య చరణముల వద్ద జీవించాలి) అని మేలుకోరి అముదనార్లు ప్రార్థించారు. పూర్ణ భక్తిని ఆశిస్తూ పురుషాకారము వహించమని పెరియ పిరాట్టికి విన్నపించుకుంటున్నారు. ఈ ఆఖరి పాశురములో కూడా, కైంకర్య సంపదను అనుగ్రహించే పెరియ పిరాట్టిని చేరాలని కోరుతున్నారు. 

అంగయల్‌ పాయ్‌ వయల్‌ తెన్ అరంగన్ । అణి ఆగమన్నుం
పంగయ మామలర్ పావయై ప్పోత్తుదుం *  పత్తి ఎల్లాం
తంగియదు ఎన్నత్తళైత్తు నెంజే నం తలై మిశైయే 
పొంగియ కీర్‌త్తి। ఇరామానుశన్‌ అడి ప్పూమన్నవే॥ (108)

ఓ మనసా! ఎంతో ప్రఖ్యాతి గాంచినవారు రామానుజులు.  అప్పుడే వికసించిన లేత పుష్పముల వంటి దివ్య చరణములు గల రామానుజుల తిరువడి మాలో భక్తిని అనుభవింపజేయునట్లు మా శిరస్సులపై సరిగ్గా లోటులేకుండా స్థిరపడాలి. అలా సంభవించాలంటే, చేపలు ఆనందంగా ఎగురుకుంటూ ఆడుకునే పొలాలతో చుట్టు ముట్టి ఉన్న శ్రీరంగములో అతి పెద్ద దేవాలయములో శయనించి ఉన్న పెరియ పెరుమాళ్ళ  దివ్య వక్ష స్థలములో నివాసమున్న సహజ మాతృత్వముగల పద్మజ, శ్రీరంగ నాచియార్ని చేరుకోవాలి. 

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-101-108-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment