తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 16 – 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై << పాశురములు 6 – 15 పదహారు మరియు పదియేడవ పాశురములలో, అండాళ్ ఈ సంసారమును, నిత్యసూరుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను, ద్వారపాలకులను, ఆదిశేషుని మొదలైనవారిని మేల్కొలుపుతుంది. పదహారవ పాశురము: ఇందులో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేల్కొలుపుతుంది. నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే  కొడిత్తోన్ఱుమ్ తోరణ వాశల్ కాప్పానే మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్ ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్ తోయోమాయ్ వన్దోమ్ తుయిల్ ఎళప్పాడువాన్ వాయాల్ మున్నమున్నమ్ మాఱ్ఱాదే అమ్మా నీ నేశ నిలైక్కదవమ్ నీక్కు ఏలో రెమ్బావాయ్. అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము. గోప బాలికలైన మాకు మాయావియు, మణివర్ణుడును అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు ‘పఱ’ యను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాటయిచ్చెను.మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చిన వారము కాదు. పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుడిని మేల్కొలుపుటకు వచ్చితిమి. స్వామీ! నీవు ముందుగానే కాదనకుము.  తలుపులు తెరచి మమ్మల్ని లోనికి పోనీయవలెను అని గోపికలు భవన పాలకుని, ద్వారపాలకుని అర్థించిరి. పదియేడవ పాశురము:  ఇందులో ఆమె నందగోపుని, యశోదా పిరాట్టిని, బలరాముడిని మేల్కొలుపుచున్నది. అమ్బరమే తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్ ఎమ్బెరుమాన్  నన్దగోపాలా ఎళున్దిరాయ్ కొమ్బనార్కెల్లామ్ కొళున్దే  కులవిళక్కే ఎమ్బెరుమాట్టి యశోదాయ్ అఱివురాయ్ అమ్బరమ్ ఊడఱుతోంగి ఉలగు అళన్ద ఉమ్బర్ కోమానే ఉఱంగా దెళున్దిరాయ్ శెమ్నొన్ కళల్ అలడిచ్చెల్వా బలదేవా ఉమ్బియుమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్. వస్త్రములు, అన్నము, నీళ్ళను ధర్మము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము. ఓ సుకుమారమైన శరీరములు గల గోపికలకు నాయకురాలా! మా వంశమునకు మంగళదీపము వంటిదానా! మా స్వామినీ! యశోదా! మేల్కొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చికొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా! నీవు నిద్రనుండి మెల్కోవాలి. స్వఛ్చమైన ఎఱ్ఱని బంగారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామా! నీవునూ, నీ తమ్ముడును ఇద్దరూ మీ దివ్య నిద్ర నుండి మెల్కోవలెను. పద్దెనిమిదవ, పంతొమ్మిదవ మరియు ఇరవైయవ పాశురములలో: శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొలిపే విధానములో ఎదో లోపం ఉందని ఆండాళ్ భావించి, నప్పిన్నై పిరాట్టి యొక్క సిఫార్సుతో చేయలేదని గ్రహిస్తుంది. ఈ మూడు పాశురములలో నప్పిన్నై పిరాట్టిని, శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని, దివ్య రూపాన్ని, నిత్య యవ్వనాన్ని, పరమాత్మ యొక్క ప్రియురాలిగా ఆమె పురుషాకారాన్ని కీర్తించింది. కేవలము పరమాత్మను కోరుకొని పిరాట్టిని మరచిపోవుటను మన పూర్వాచార్యులు శూర్పణఖ తో పోల్చారు. అలాగే పరమాత్మను మరచి కేవలము పిరాట్టిని ఆశించడాన్ని రావణునితో పోల్చారు. పద్దెనిమిదవ పాశురము: ఎంత ప్రయత్నించినా శ్రీ కృష్ణుడు మేలుకోక పోయేటప్పటికి, ఆండాళ్ నప్పిన్నై పిరాట్టి (నీళాదేవి) యొక్క సిఫార్సుతో  వారిని మేల్కొలిపే ప్రయత్నము చేస్తుంది. శ్రీ రామానుజులకు అతి ప్రియమైన పాశురమిది. ఉన్దు మదకళిఱ్ఱ నోడాద తోళ్వలియన్ నన్ద గోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కన్దమ్ కమళుమ్ కుళలీ కడై తిఱవాయ్ వన్దెంగుమ్ కోళి అళైత్తన కాణ్ మాదవి ప్పన్దల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగై కూవిన కాణ్ పన్దార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్పాడ చెన్దామరై క్కైయాల్ శీరార్ వళై ఒళిప్ప వన్దు తిఱవాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్. ఏనుగులతో పోరాడగలిగిన వాడును,మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజ బలము గలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లుచున్న కేశ పాశముగల ఓ నప్పిన్నై పిరాట్టి! తలుపు గడియ తెరవుము. కోళ్ళు అంతట చేరి అరచు చున్నవి. మాధవీ లత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. పూబంతిని చేతిలో పట్టుకొనినదానా! నీవు సంతోషముగా లేచి వచ్చి, ఎఱ్ఱతామర పూవును బోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తెలుపు తెరవుము. పందొమ్మిదవ పాశురము: ఆండాళ్ ఇందులో శ్రీకృష్ణుడిని, నప్పిన్నై పిరాట్టిని మేల్కొలుపుతుంది. కుత్తు విళక్కెరియ క్కోత్తుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెన్ఱ పఞ్చశయనత్తిన్ మేలేఱి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్ వైత్తుక్కిడన్ద మలర్ మార్పా వాయ్ తిరవాయ్ మెత్తడం కణ్ణినాయ్ నీ యున్ మణాలనై ఎత్తనై పోదుమ్ తుయిల్ ఎళ ఒట్టాయ్ కాణ్ యెత్తనైయేలుమ్ పిరివాఱ్ఱ గిల్లాయాల్ తత్తువమ్ అన్ఱుత్తగవేలో రెమ్బావాయ్. గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళుగల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు, వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీలాదేవి యొక్క స్తనములపై గల తన శరీరమును ఆనుకుని పరుండి విశాలమైన వక్షఃస్థలము గల శ్రీ కృష్ణా నోరు  తెరచి మాటాడుము. కాటుక పెట్టుకొనిన విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి! నీవు నీ ప్రియుని ఎంత సేపు లేవ నీయవు? ఇంత మాత్రము ఎడబాటు కూడ ఓర్వలేకుండుట నీ స్వరూపానికి, నీ స్వభావమునకు తగదు. ఇరవైయ్యవ పాశురము: ఈ పాశురములో ఆండాళ్ తమను శ్రీ కృష్ణునితో కలిపించి వారిని అనుభవించడములో సహాయపడమని చెబుతూ  నప్పిన్నై పిరాట్టిని ,శ్రీ కృష్ణుడిని మేల్కొలుపుతుంది. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్ శెప్పమ్ ఉడైయాయ్ తిఱలుడైయాయ్ శెఱ్ఱార్కు వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిల్ ఎళాయ్ శెప్పన్న మెన్ ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెలాయ్ ఉక్కముమ్ తట్టు ఒళియుమ్ తన్దున్ మణాళనై ఇప్పోదే యెమ్మై నీరాట్ట ఏలోర్ ఎమ్బావాయ్. ముప్పది మూడు కోట్ల అమరులను వారికింకను ఆపదరాక ముందే పోయి, యుద్దభూమి లో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ! మేల్కొనుము. రక్షణము చేయు స్వభావము గలవాడా! బలము కలవాడా ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కల్గించువాడా! నిర్మలుడా! మేల్కొనుము. బంగారు కలశములను పోలిన స్తనములును, దొండపండువలె ఎఱ్ఱని పెదవియును, సన్నని నడుమును కల ఓ నప్పిన్నై పిరాట్టి (నీలాదేవి)! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును (విసనకఱ్ఱను), కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము. అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-16-20-simple/ పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment