శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 11వ పాశురము లో తొండరడిప్పొడి ఆళ్వారుల గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు.
మన్నియ సీర్ మార్గళియిల్ కేట్టై ఇన్ఱుమానిలత్తీర్
ఎన్నిదనుక్కు ఏత్తం ఎనిల్ ఉరైక్కేన్ – తున్ను పుగళ్
మామఱైయోన్ తొణ్దరడిప్పొడి ఆళ్వార్ పిఱప్పాల్
నాన్మఱైయోర్ కొణ్డాడుం నాళ్
ఓ ప్రపంచ ప్రజలారా! శ్రీ వైష్ణవ మాసంగా కీర్తిగాంచిన మార్గళి మాసంలో జ్యేష్ట నక్షత్రం రోజు యొక్క గొప్పతనాన్ని నేను మీకు వివరిస్తాను వినండి. ఎమ్పెరుమానార్ (శ్రీ రామానుజ) వంటి వేద నిపుణులు స్తుతించే రోజు ఇది, వేదార్ధాలని ఎరిగి మరియు సంపూర్ణంగా భగవానుడి భక్తుల దాసత్వంలో మునిగిన తొండరడిప్పొడి ఆళ్వార్ జన్మించిన రోజు ఇది.
శ్రీ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పూర్వాచార్యులలో ఒకరు) ఆచార్య హృదయం 85వ చూర్ణికలో చూపించారు, యోగనిద్ర నుండి భగవానుడిని మేల్కొలపడానికి సుప్రభాతం పాడిన వారు, అతను తొండరడిప్పొడి ఆళ్వార్ అని అతను తులసిబ్రుత్యరుడు (ఎమ్పెరుమానుడికి తులసితో సేవ చేయడనికి ఇష్టపడేవాడు) అని పిలుస్తున్నారు. తొండరడిప్పొడి ఆళ్వార్ తన తిరుమాలై ప్రబంధంలో “తుళబత్తొణ్డాయ తొల్ సీర్ తొండరడిప్పొడి ఎన్నుం అడియనై” (తులసితో సేవ చేసే సేవకుడు) అని తనను తాను అలా పిలుచుకున్నారు. యోగనిద్ర నుండి భగవానుడిని మేల్కొలిపే ఈ గొప్ప ప్రబంధం తిరుప్పళ్ళియెళుచ్చి.
ఈ ప్రబంధానికి సరళమైన వివరణ మన పూర్వాచార్యుల వ్యాఖ్యానముల సహాయంతో వ్రాయబడింది.
*****
తనియన్లు
తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయమ్ |
ప్రాబోధికీం యోకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంతమీడే ||
శ్రీవైకుంఠంలో ఒక రాజులా పూజింపబడే పరవాసుదేవుడు, ఆదిశేషునిపై పవళించి ఉన్న, జ్ఞానం వంటి పవిత్రమైన గుణాలను కలిగి ఉన్నపెరియ పెరుమాళ్ని (శ్రీరంగంలో విగ్రహ రూపంలో ఉన్న ఎమ్పెరుమాన్) మేల్కొలిపేందుకు పద్యాల మాలను మనకిచ్చిన తొండరడిప్పొడి ఆళ్వార్ని నేను ప్రశంసిస్తున్నాను.
మణ్డంగుడియెంబర్ మామఱైయోర్
మన్నియశీర్ త్తొండరడిప్పొడి తొన్నగరం
వండు తిణర్ త్త వయల్ తెన్న రంగత్తమ్మానై
పళ్ళి ఉణర్తుం పిరాన్ ఉదిత్త ఊర్
తొండరడిప్పొడి ఆళ్వార్ అవతరించిన స్థలము తిరుమణ్డంగుడి అని వేద నిపుణులు తెలియజేస్తున్నారు. చుట్టూ తూనీగల సమూహాలతో నిండిన పొలాలు ఉన్న తిరువరంగంలో పవ్వలించి ఉన్న పెరియ పెరుమాళ్ని మేల్కొలపడం ద్వారా ఆళ్వార్ మనకు ఎంతో సహాయము చేశారు.
*****
మొదటి పాశురము. పెరియ పెరుమాళ్ని మేల్కొలపడానికి పరలోక వాసులు అందరూ శ్రీరంగానికి వస్తారని ఆళ్వార్ తెలియజేస్తున్నారు. దీని నుండి శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆరాధింపబడతాడని, మిగతా దేవతలు, స్వర్గలోక నివాసులు, దేవలోక వాసులు అందరూ ఆ ఎమ్పెరుమానుడిని ఆరాధిస్తారని స్పష్టమవుతుంది.
కదిరవన్ కుణదిశై చ్చిగరం వన్దణైందాన్
కనైయిరుళ్ అగన్ఱదు కాలైయం పొళుదాయ్
మదు విరిందొళుగిన మామలర్ ఎల్లాం
వానవర్ అరశర్గళ్ వన్దు వన్దీండి
ఎదిర్ దిశై నిఱైందనర్ ఇవరొడుం పుగుంద
ఇరుంగళిఱ్ఱీట్టముం పిడియొడు మురశుం
అదిర్ దలిళ్ అలై కడల్ పోన్ఱుళదు ఎంగుం
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే
తిరువరంగంలో నివసించే ఓ స్వామి! రాత్రి చీకటిని తరిమివేస్తూ తూర్పు కొండల నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. వెలుతురు రాగానే, వికసిస్తున్న పువ్వులు నుండి తేనె కారుతుంది. దేవలోక వాసులు మరియు రాజులు మీ దృష్టి అనుగ్రహ ప్రసాదంగా పొందడానికి మొదట మేము వచ్చాము లేదు మేము వచ్చాము అని ప్రస్తావించుకుంటూ ఆలయ దక్షిణ ద్వారం వద్ద పెద్ద సమూహంగా గుమిగూడారు. వారితో పాటు వారి వాహనాలు అయిన మగ ఆడ ఏనుగులు, వివిధ సంగీత వాయిద్యులు కూడా వచ్చారు. నీవు నిద్ర నుండి మేల్కొంటావని చూసి వాళ్ళు ఉత్సాహంగా చప్పట్లు కొడుతుంటే ఆ ధ్వని అన్ని దిశలలో ప్రతిధ్వనిస్తుంది, సముద్ర అలల నుండి వచ్చే మహాధ్వనిల అనిపిస్తుంది అని వారి వివరిస్తున్నారు.
రెండవ పాశురము. తూర్పు దిక్కు వాసులు వారి దినచర్య మొదలుపెట్టారు. వేకువ రాకను సూచిస్తూ హంసలను మేల్కొలుపుతున్నారు. మీ భక్తుల పట్ల ప్రేమానురాగము చూపించి, నీవు నీ దివ్య నిద్రలో నుండి మేలుకోండి.
కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి
కూరన్దదు కుణతిశై మారుదం ఇదువో
ఎళుందన మలర్ అణై ప్పళ్ళికొళ్ అన్నం
ఈన్బని ననైంద తం ఇరుం శిఱగుదఱి
విళుంగియ ముదలైయిన్ పిలం పురై పేళ్వాయ్
వెళ్ళెయిరుర అదన్ విడత్తినుక్కనుంగి
అళుంగియ ఆనైయిన్ అరుందుయర్కెడుత్త
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే
తూర్పు దిక్కు నుండి వస్తున్న గాలి విరిసిన మల్లెల తీగలను మెల్లిగా రాసుకుంటూ వీస్తోంది. ఆ పువ్వుల తల్పంపైన నిద్రిస్తున్న హంసలు, అవి తమ అందమైన రెక్కలపై పడిన సన్నని మంచును వర్షంలా విదిలించుకుంటూ నిద్ర లేస్తున్నాయి. తిరురంగంలో దివ్య నిద్రలో ఉన్న ఓ స్వామీ! గజేంద్రుని కాలును పదునైన విషపూరిత దంతాలతో కొరికి, దాని గుహ లాంటి నోటితో అతని కాలును మ్రింగడానికి ప్రయత్నించిన మొసలిని నీవు వధించి ఏనుగు కష్టాన్ని తీర్చావు. నీవు ఇక మేల్కొని ఇప్పుడు నీ కృపా వర్షాన్ని మాపై కూడా కురిపించాలి.
మూడవ పాశురము. సూర్యుడు తన కిరణాలతో నక్షత్ర కాంతిని దాచివేస్తున్నాడు. దివ్య చక్రాయుధమును పట్టుకొని ఉన్న భగవానుడి దివ్య హస్తాన్ని ఆరాధించాలని తాను కోరుకుంటున్నానని ఆళ్వార్ వివరిస్తున్నారు.
శుడరొళి పరన్దన శూళ్ దిశై యెల్లాం
తున్నియ తారకై మిన్నొళి శురుఙ్గి
పడరొళి పశుత్తనన్ పనిమది ఇవనో
పాయిరుళ్ అగన్ఱదు పైమ్పొళిల్ కముగిన్
మడలిడై క్కీఱి వణ్ పాళైగళ్ నాఱ
వైకఱై కూరన్దదు మారుదం ఇదువో
అడలొళి తిగళ్ తరు తిగిరియం తొడక్కై
అరంగత్తమ్మా! పళ్ళియెళున్దరుళాయే
సూర్యుని కిరణాలు ఇప్పుడు అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాయి. దట్టమైన నక్షత్రాల నుండి వచ్చే కాంతి ఇప్పుడు దాగిపోయింది. చల్లని చంద్రుడు కూడా తన కాంతిని కోల్పోయాడు. అంతటా వ్యాపించి ఉండిన చీకటి మటుమాయమయ్యింది. ఉదయాన్నే వక్క చెట్టు ఆకుల గుండా వీస్తున్న గాలి తీపి సువాసనను తనతో పాటు తీసుకువస్తోంది. చేతిలో బలమైన దివ్య చక్రము ఉన్నవాడా! తిరురంగంలో దివ్య విశ్రాంతి తీసుకుంటున్న ఓ స్వామి! నీవు ఇక మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపై కురిపించాలి.
నాల్గవ పాశురము. తాను భగవానుడిని ఆనందించనివ్వకుండా అడ్డంకిగా ఉన్న తన శత్రువులను రామావతార సమయంలో నాశనం చేసినట్లుగా హతం చేయడానికి మేల్కోమని, ఆళ్వారు భగవానుడికి విన్నపించుకుంటున్నాడు.
మేట్టిళ మేదిగళ్ తళైవిడుం ఆయర్గళ్
వేయ్ం కుళలోశైయుమ్ విడై మణి క్కురలుమ్
ఈట్టియ ఇశై దిశై పరన్దన వయలుళ్
ఇరిందిన శురుమ్బినం ఇలంగైయర్ కులత్తై
వాట్టియ వరిశిలై వానవర్ ఏఱే
మాముని వేళ్వియై కాత్తు అవపిరదమ్
ఆట్టియ అడుతిఱళ్ అయోత్తి ఎమ్మరశే
అరంగత్తమ్మా! పళ్ళియెళున్దరుళాయే
గో బాలురు తమ గేదెలు మేయడానికి వదిలి తమ పిల్లనగ్రోవిని వాయించుకుంటున్నారు, వాటి మెడలో కట్టిన గంటల శబ్దం అన్ని దిక్కులలో వ్యాపించింది. గడ్డిపరకల మీద ఉన్న తూనీగలు కూడా శబ్దం చేయడం ప్రారంభించాయి. ఓ శ్రీ రామా, శత్రువులను చీల్చివేసే సారంగ విల్లు ఉన్నవాడా, అత్యున్నత తత్వమైనవాడా! రాక్షసులను నాశనం చేసి మా ప్రభువుగా మారినవాడా, విశ్వామిత్రుడనే ఋషిని తన యాగం సంపన్నము గావించడంలో సహాయం చేసినవాడా, అవబ్రుతస్నానం (దివ్య స్నానం) కావించినవాడా, శత్రువులను నాశనం చేసే బలముగల అయోధ్యకు ప్రభువు అయినవాడా! తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్నవాడా! నీవు ఇక మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపై కురిపించాలి.
ఐదవ పాశురము. తనను ఆరాధించడానికి దేవలోక వాసులు పుష్పాలతో వచ్చాయని ఆళ్వార్ వివరిస్తున్నారు. నీవు నీ సేవకుల మధ్య తేడా చూపవు కాబట్టి, నీవు మేల్కొని అందరి సేవలను స్వీకరించాలి.
పులంబిన పుట్కళుం పూమ్ పొళిళ్గళిన్ వాయ్
పోయిఱ్ఱు క్కంగుళ్ పుగుందదు పులరి
కలన్దదు కుణదిశై కనై కడలరవం
కళి వణ్డు మిళఱ్ఱియ కలమ్బగన్ పునైన్ద
అలంగళ్ అం తొడైయళ్ కొణ్డు అడియిణై పణివాన్
అమరర్గళ్ పుగున్దనర్ ఆదలిల్ అమ్మా
ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిళ్
ఎంబెరుమాన్ పళ్ళియెళుందరుళాయే
వికసించిన పువ్వులతో నిండిన తోటలలో పక్షులు ఆనందంగా కిలకిలలాడుతున్నాయి. రాత్రి పోయి వేకువ వచ్చింది. తూర్పున ఉన్న మహాసముద్రం యొక్క అలల శబ్దం అన్ని దిక్కుల్లో వినబడుతుంది. నిన్ను ఆరాధించడానికి, దేవలోక వాసులు పూలదండలతో వచ్చారు, వాటిలో నుండి తుమ్మెదలు తేనె త్రాగాలని ప్రయత్నిస్తున్నాయి. లంకాధిపతి అయిన విభీషణునిచే పూజింపబడేవాడా! తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్నవాడా! నీవు ఇక మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపై కురిపించాలి.
ఆరవ పాశురము. మీచే నియమించబడిన దేవలోక సేనాధిపతి అయిన సుబ్రమణ్యుడు, ఇతర దేవలోక వాసులు, వారి భార్యలు, వారి వాహనాలు, వారి అనుచరులతో పాటు వేంచేసారు. వారు నిన్ను ఆరాధించడానికి వచ్చారు, నీవు వారి కోరికలు తీర్చాలి కాబట్టి, నీవు ఇక మేల్కొని నీ కృపా వర్షాన్ని వారిపై కూడా కురిపించాలి.
ఇరవియర్ మణి నెడుం తేరొడుం ఇవరో
ఇఱైయవర్ పదినొరు విడైయరుమివరో
మరువియ మయలినన్ అరుముగనివనో
మరుదరుమ్ వశుక్కళుమ్ వన్దువన్దు ఈణ్డి
పురవియోడు ఆడలుమ్ పాడలుమ్ తేరుమ్
కుమర తణ్డమ్ పుగున్దు ఈణ్డియ వెళ్ళమ్
అరువరై అణైయ నిన్ కోయిల్ మున్నివరో
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే
పన్నెండు ఆదిత్యులు (సూర్య దేవతలు) వారి రథాలలో వేంచేసారు. ఈ ప్రపంచాన్ని పరిపాలించే పదకొండు రుద్రులు కూడా వేంచేసారు. ఆరు ముఖాలున్న సుబ్రమణ్యుడు తన నెమలి వాహనంలో వేంచేసారు. నలభై తొమ్మిది మరుతులు మరియు ఎనిమిది వాసులు [ఇతర దేవలోక వాసులు] మీ దర్శనము కోసం వరుసలో తను ముందని కాదు తాను ముందని గొడవపడుతున్నారు. ఒకరికొకరు దగ్గరగా నిలబడి, వారి రథాలపై, గుర్రాలపై దేవతలందరూ పాడుతూ నృత్యం చేస్తున్నారు. మీ దృష్థి పడేలా, సుబ్రమణ్యునితో సహా దేవతలందరూ తిరువరంగం ముందు సమావేశమయ్యారు, ఇది ఒక విశాల పర్వతంలా కనిపిస్తుంది. తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్నవాడా! నీవు ఇక మేల్కొని నీ దయా వర్షాన్ని మాపై కురిపించాలి.
ఏడవ పాశురము. దేవతలందరితో పాటు ఇంద్రుడు మరియు సప్త ఋషులు ఆకాశంలో సమావేశమై మిమ్మల్ని ప్రశంసిస్తున్నారని ఆళ్వార్ వివరిస్తున్నారు. నీవు నీ దివ్య నిద్ర నుండి మేల్కొని వారికి మీరు దర్శనము ఇవ్వాలి.
అన్దరత్తమరర్ గళ్ కూట్టంగళ్ ఇవైయో
అరున్దవ మునివరుం మరుదరుం ఇవరో
ఇన్దిరన్ ఆనైయుమ్ తానుమ్ వన్దివనో
ఎమ్పెరుమాన్ ఉన్ కోయిలిన్ వాశల్
శున్దరర్ నెరుక్క విచ్చాదరర్ నూక్క
ఇయక్కరుమ్ మయంగినర్ తిరువడితొళువాన్
అన్దరం పార్ యిడమిల్లై మత్తిదువో
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే.
ఓ ప్రభూ! ఇంద్రుడు తన ఐరావతం మీద వచ్చి మీ ఆలయ ప్రవేశద్వారం వద్ద వేచి ఉన్నాడు. ఇంకా, వారి అనుచరులతో పాటు స్వర్గం నుండి వచ్చిన స్వర్గలోక వాసులు, సనకాదులు, మరుతులు, వారి అనుచరులు, యక్షులు, గాంధర్వులు, విద్యాధరులు అందరూ వచ్చి ఆకాశంలో ఒకరినొకరు తోసుకుంటూ నిలబడి ఉన్నారు. మీ దివ్య పాదాలను ఆరాధించాలన్న మైకంతో వారందరూ వేచి ఉన్నారు. ఓ స్వామి, తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్న ఓ భగవాన్! దయచేసి మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపైన కురిపించండి.
ఎనిమిదవ పాశురము: నిన్ను ఆరాధించడానికి అత్యంత సముచితమైన ప్రాతఃకాల సమయం ఆసన్నమైనది. నువ్వు తప్ప వేరే కోరిక లేని ఋషులు, నిన్ను ఆరాధించడానికి అవసరమైన సామగ్రితో వేంచేసారు. కాబట్టి, దయచేసి దివ్య నిద్ర నుండి మేల్కొని వారికి దర్శనము ఇవ్వండి.
వంబవిళ్ వానవర్ వాయుఱై వళఙ్గ
మానిదికపిలై ఒణ్ కణ్ణాడిముదలా
ఎమ్పెరుమాన్ పడిమైక్కలం కాణ్డర్కు
ఏఱ్పనవాయిన కొణ్డు నన్ మునివర్
తుంబురు నారదర్ పుగున్దనర్ ఇవరో
తోన్ఱినన్ ఇరవియుం తులంగు ఒళి పరప్పి
అంబరతలత్తు నిన్ఱు అగల్ కిన్ఱదు యిరుళ్ పోయ్
అరంగత్తమ్మా పళ్ళియెళుందరుళాయే
ఓ స్వామీ, నా నాథా! ప్రముఖ ఋషులు, తంబురు మరియు నారద మహర్షి, సువాసనగల స్వర్గంలో నివసించే దేవతలు, కామధేనువు నీ తిరువారాధనం చేయడానికి అవసరమైన దివ్య పత్రాలు, సంపద, అద్దం మొదలైన వస్తువులతో వచ్చారు. చీకటి తొలగి సూర్య కిరణాలు అన్ని ప్రదేశాలలో వ్యాపిస్తున్నాయి. తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్నవాడా! నీవు ఇక మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపైకూడా కురిపించండి.
తొమ్మిదవ పాశురము. ప్రముఖ సంగీతకారులు మరియు నృత్యకారులు మిమ్మల్ని మేల్కొలిపి మీకు సేవలను అందించడానికి సమావేశమయ్యారు. నిద్రనుండి మేల్కొని వారి సేవలను స్వీకరించమని ఆళ్వారు భగవానుడికి విన్నపిస్తున్నారు.
ఏదమిళ్ తణ్ణుమై ఎక్కం మత్తళి
యాళ్ కుళల్ ముళువమోడు ఇశై దిశై కెళుమి
కీదంగళ్ పాడినర్ కిన్నరర్ గరుడర్ గళ్
కన్దరువర్ అవర్ కంగులుళ్ ఎల్లాం
మాదవర్ వానవర్ శారణర్ ఇయక్కర్
శిత్తరుం మయంగినర్ తిరువడిత్తొళువాన్
ఆదలిల్ అవర్కు నాళ్ ఓలక్కమరుళ
అరంగత్తమ్మా పళ్ళియెళుందరుళాయే
కిన్నరులు, గరుడలు, గంధర్వులు తదితర అనేక దేవలోక వాసులు ఎక్కం, మత్తళి, వీణ, మురళి మొదలైన వివిధ సంగీత వాయిద్యాలతో వాయిస్తున్నారు, ఆ సంగీతము అన్ని దిక్కులలో వ్యాపించి ఉంది. కొందరు రాత్రంతా ఇక్కడే ఉన్నారు, మరి కొందరు వేకువజాము వచ్చారు. ప్రముఖ ఋషులు, దేవతలు, చారణులు, యక్షులు, సిద్ధులు అందరూ మీ దివ్య పాదాలను ఆరాధించడానికి వచ్చారు. తిరువరంగంలో దైవిక యోగ నిద్రలో ఉన్న ఓ ప్రభూ! దయచేసి మేల్కొని మీ దయను మాపై చూపడండి. మీ విశాలమైన సభలో వారికి స్థానమివ్వండి.
పదవ పాశురము. మొదటి తొమ్మిదిపాశురము లో, ఆళ్వార్ తన కృపను ఇతరులపై కురిపించమని భగవానుడిని ప్రార్థించారు. ఈ పాసురములో, పెరియ పెరుమాళ్ తప్ప వేరే ఏ ఇతరిని ఎరుగని ఆళ్వార్ భగవానుడి కృపను తనపై కురిపించమని విన్నపిస్తున్నారు, .
కడిమలర్ కమలంగళ్ మలర్ న్దనయివయో
కదిరవన్ కనైకడల్ ముళైత్తననివనో
తుడియిడై యార్ శురి కుళల్ పిళిందు ఉదఱి
తుగిల్ ఉడుత్తు ఏఱినర్ శూళ్ పునల్ అరంగా
తొడై ఒత్త తుళవముం కూడైయుం పొలిన్దు
తోన్ఱియ తోళ్ తొండరడిప్పొడి యెన్నుం
అడియనై| అడియనెన్ఱు అరుళి ఉన్నడియార్కు
ఆళ్ పడుత్తాయ్ పళ్ళియెళుందరుళాయే
పవిత్రమైన దివ్య కావేరి చుట్టూ ప్రవహిస్తున్న తిరురంగంలో దివ్య నిద్రలో ఉన్న ఓ శ్రీరంగనాథ! మహాసముద్రము నుండి పైకి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ సువాసనగల తామర పువ్వులు వికసించాయి. సన్నని నడుమున్న స్త్రీలు నదిలో స్నానం చేసిన తరువాత , వారి వస్త్రాలను ఆరబెట్టి, నవీన వస్త్రలతో గట్టుకి చేరుకున్నారు. తేజస్సుగల భుజాలతో తుళసి దండలు కలిగిన బుట్టను పట్టుకొని ఉన్న తొండరడిప్పొడి అని పిలువబడే ఈ సేవకుడిని స్వీకరించండి, దయచేసి మీ సేవకుడిగా మరియు మీ సేవకులకు సేవకుడిగా నన్ను స్వీకరించండి. ఈ కారణం కోసమే నీవు నీ దివ్య నిద్ర నుండి మేల్కొని నాపైన నీ కృపా వర్షాని కురిపించాలి.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppalliyezhuchchi-simple/
మూలము : http://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org