శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక
సకల వేదములు, వేదాంతములు, శాస్త్రముల సారము శరణాగతి. అలాంటి ఉన్నతమైన శరణాగతి శాస్త్రమును ఉపదేశించిన ఆచార్యుల శ్రీపాదములే శరణమని ఈ పాశురములో చెపుతున్నారు.
పాశురము
“వేదం ఒరు నాంగిన్ ఉట్పొదింద మెయి పొరుళుం
కోదిల్ మను ముదల్ నూల్ కూరువదుం-తీదిల్
శరణాగతి తంద తన్ ఇరైవన్ తాళే
అరణాగుం ఎన్నుం అదు”
ప్రతిపదార్థము
తీదిల్ = దోషరహితమైన
శరణాగతి = శరణాగతి శాస్త్రమును
తంద = తనకు ఉపదేశించిన
తన్ ఇరైవన్ = తన దైవమైన ఆచార్యుల
తాళే = శ్రీపాదములే
అరణాగుం = ఆశ్రయించరగిన చోటు
ఎన్నుం అదు = అని చెప్పబడే శరణాగతి విధానమును
ఒరు నాంగు వేదం =ఋగ్ ,యజుర్ , సామ , అధర్వణములనే నాలుగు వేదములలోను
ఉట్పొదింద = నిధిలాగా లోపల దాగి వున్న
మెయి పొరుళుం = సత్యమును
కోదిల్ = దోషములేని
మను ముదల్ నూల్ = మను శాస్త్రము వంటి శాస్త్రములలో
కూరువదుం = చెప్పబడిన ధర్మములు కూడా
అదువే = అవియే
వ్యాఖ్యానము
వేదం ఒరు నాంగిన్ ఉట్పొదింద మెయి పొరుళుం……’ ఒరు ‘ అంగా ఒక …వేదము యొక్కఅసమానమైన వైభవమును తెలియజేస్తూ ఈ పదమును ఇక్కడ ఉపయోగించారు. వేదము ఎవరో ఒకరిచే రాయబడినది కాదు, అపౌరుషేయాలు . అందు వలన ఇందులో అసంభద్దము , పక్షపాతము,అనుమానములకు తావు లేదు . వేదములో చెప్పినది సత్యము. సత్యము కానిది అందులో లేదు.
నాంగు…....ఋగ్ ,యజుర్ , సామ , అధర్వణములనే నాలుగు వేదములు ఎనిమిది పోగుల దారములతో కట్టినట్లుగా అష్టాక్షరి మహా మంత్రములో చెప్పిన శ్రీమన్నారాయణుని దాచి వుంచింది. అర్థాత్ అష్టాక్షరి మహా మంత్రము సకల వేదములలోను అంతరంగముగా నిధిలాగా ఇమిడి వున్నది . తిరుచంద విరుత్తములో “ఎట్టినోడుం ఇరణ్డెనుం కయిఱినాల్ అనంతనై కట్టి” అని చెప్పినట్లుగా వేదము అన్నింటికి ప్రమాణము .ఇక్కడ ‘నాంగు ‘అనగా వేదములో ఎక్కడో ఏ మూలనో చెప్పుటకాదు , శాఖోపశాఖలుగా విస్తరించిన వేదము అంతటా ఈ అష్టాక్షరి మంత్ర ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణుని గురించిన సత్యము వ్యాపించి వున్నదని అర్థము.
కోదిల్ మను ముదల్ నూల్ కూరువదుం.……కోదు..దోషము…అది లేకపోవుట కోదిల్. అర్థాత్ ఒకదానిని మరొకటిగా మార్చి చెప్పు దోషము . ఉదాహరణకు ముత్యపుచిప్పను చూసి వెండి అని తప్పుగా చెప్పకుండా ముత్యపుచిప్ప అని చెప్పుట . ఇటువంటి దోషములు లేనిది మను ధర్మ శాస్త్రము . మనువుకు కోదిల్ అన్న ప్రయోగము చేయుట వలన , మనువు యొక్క ప్రామాణికత్వము తెలుస్తున్నది . దీని వలన మను విషయ ములో ప్రమాణ నిర్ధారణకు ఇంక పరిశోధన ఎదీ చేయనవసరము లేదని అది మందు వంటిదని అర్థము . ఉన్నది ఉన్నట్లుగా చెప్పె ఇతిహాసములు“సాత్విక స్మృతులు, శ్రీవిష్ణు పురాణము, శ్రీమద్భాగవతము, శ్రీమహాభారతము , పాంచరాత్ర ఆగమములు . మనుశాస్త్రముతో సహా ఈ శాస్త్రములన్ని“అష్టాక్షరి మహా మంత్రము” లో చెప్పబడిన శరణాగతి శాత్రమును ఏకకంఠముగా ఘోషిస్తున్నవి . కావున శరణాగతి శాత్రమునే వేదము మొదలగు వాటిలో చెప్పబడినది అని ఇక్కడ చెపుతున్నారు .
తీదిల్ శరణాగతి తంద ..…….తీదు ….ఏ దోషము చెప్పలేనిది . శరణాగతిని గురించి చెప్పిన గ్రంధములలోనే ఇతర మార్గములైన జ్ఞాన యోగము,భక్తి యోగము మొదలైన వాటి గురించి కూడా చెప్పబడినది. వాటిని ఆచరించే వారికి చేయదగిన, చేయదగని నియమములు అనేకము చెప్పబడినవి . కాని శరణాగతిలో ఇటువంటి నియమములేవీ లేకుండా ఆచరించుటకు సులభముగా వుంటుంది , అందుకే దోషములు లేనిది అన్నారు . ప్రత్యక్షముగా భగవంతుని శ్రీపాదములను పట్టుకోవటమే శరణాగతి . ( ప్రపత్తి )ఈశ్వర అంటే భగవద్విషయ వాక్యము . శరణాగతి అంటే భగవంతుడనే అర్థమును చెపుతున్నారు . ఇటువంటి శరణాగతి శాస్త్రమును ఇచ్చుట తీవ్రమైన దుర్భిక్షములో వున్నవాడికి అపారమైన సంపదను ఇచ్చినట్లే అవుతుంది .
తన్ ఇరైవన్ …….తమ ఆచార్యుని ‘ మాత్తుం మనైయుం ‘ అన్న పాశురములో అష్టాక్షరిని ఉపదేశించిన వారుగా చెప్పుకున్నారు . ఇక్కడ శరణాగతి ఇచ్చిన వారని చెప్పుకుంటున్నారు . అర్థాత్ అష్టాక్షరి మంత్రమునకు , శరణాగతి మంత్రమునకు భేదము ఉందని తేటతెల్లముగా తెలుస్తున్నది . అష్టాక్షరి అని ప్రస్పుటముగాను, శరణాగతి అని గోప్యముగా చెప్పబడింది . తిరుమంత్రము , ద్వయము , చర్రమశ్లోకము అనే మూడు మహా మంత్రములలో మొదటి ,చివరి మంత్రములలో అర్థమును గోప్యము చేసి మంత్రమును బహిరంగముగా చెప్పుట మన ఆచార్యుల అలవాటుగా వస్తున్నది . అలా కాక శరణాగతి అని చెప్పబడే ద్వయమంత్రము అర్థమునే కాక, శబ్దమును కూడా గోప్య పరచి మనసులోనే అనుసంధానము చేసుకునే అచారము కలదు . దీని వలన ద్వయమంత్రము యొక్క ఔన్నత్యము బొధపడుతున్నది . దీని విషయముగా నంజీయర్ అనే అచార్యులు ద్వయమమత్రములో భగవంతుడి అందమైన రూపమును గురించి , దాని గుణములను గురించి పరమాత్మ స్వరూపము ,ఆయన గుణ విశేషణములు , నిత్యులు, ముక్తులు నిత్యానందులుగా వుండుట గురించి చెప్పుట వలన ఇక్కడ మోక్షము కోరుకొను వారు శరణాగతి చేయు దాసులకు ద్వయ మంత్రమే ఆనందాబుధిలో తేలుస్తుంది అని అన్నారు . అందు వలన ద్వయ మహా మంత్రమునుపదేశించిన ఆచార్యులు తనకు దైవము అనగా అందరికి దైవమైన భగవంతుడిలా కాక తనకు మాత్రమే దైవమని చెపుతున్నారు .
తాళే.…….. అంత గొప్ప తన దైవము శ్రీపాదములే తనకు ఉత్తారకమని చెపుతున్నారు . భగవంతుని ఆశ్రయించిన వారికి , ఆచార్యుని ఆశ్రయించిన వారికి ఆ శ్రీపాదములే ఉత్తారకమని భావము . తాళే అన్న పదములోని ఏవకారము శిష్యునికి చేయు ఉపకారమును ఆచార్యులు తప్ప మరెవరూ చేయలేరని బొధపడుతున్నది .
అరణాగుం ఎన్నుం అదు………..అరణ్ ..అనగా చేరదగిన స్థానము అని అర్థము , అది ఆచార్యుల శ్రీపాదములే . ఈశ్వ రుడు అన్న పదములో నాయకత్వము ,మార్గము , ఉపయోగము అని మూడు అర్థములు చెప్పబడుతున్నవి . ఈ మూడిటిని కలిగి ఉన్నవాడు భగవంతుడు . ‘ తన్ ఇరైవన్ ‘ అనగా ఆచార్యుల శ్రీపాదములే ఉత్తారకము . అవే నడిపించునవి ,అవే మార్గమును నిర్దేశించునవి , అవే అంతిమ ప్రయోజనము అని అర్థము .
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-31-vedham-oru-nangin/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org