ఆర్తి ప్రబంధం – 50

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 49

పరిచయము:

మునుపటి పాశురములో చెప్పబడిన వాళ్ళు శ్రీ రామానుజుల దివ్య చరణాల యందు ఆశ్రయం పొందటానికి సిద్ధంగా ఉన్నారు. అల్పమైన, విరుద్ధమైన వాటిపైన వాళ్ళందరూ సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నారని మాముణులు ఆశ్చర్యపోతూ వాళ్ళకి మరొక ముఖ్యమైన విశేషన్ని సలహాగా ఇస్తున్నారు.  శ్రీ రామానుజుల నామ జపము చేయుట ద్వారా, వారు అందరూ కోరుకునే అత్యంత గౌరవనీయమైన బహుమతిని పొందాలని వారు వివరిస్తున్నారు.

పాశురము 50:

అవత్తే అరుమంద కాలత్తై ప్పోక్కి అఱివింమైయాల్
పవత్తే ఉళల్గిన్ఱ పావియర్గాళ్ పలకాలం నిన్ఱు
తవత్తే ముయల్బవర్ తంగట్కుం ఎయ్దవొణ్ణాద
అంద త్తివత్తే ఉమై వైక్కుం సిందియుం నీర్ ఎతిరాశరెన్ఱు

ప్రతి పద్ధార్ధములు:

పావియర్గాళ్ – ఓ!!! పాపులారా!
అఱివింమైయాల్ – అజ్ఞాన వశాత్తు
ఉళల్గిన్ఱ – (మీరు) ఉంటున్నారు
పవత్తే – ఈ లౌకిక ప్రపంచములో
అవత్తే ప్పోక్కి – వ్యర్థముగా
అరుమంద కాలత్తై – శ్రీ రామానుజ నామాలను సులభంగా జపించి ధ్యానం చేయగలిగిన విలువైన సమయం
అంద త్తివత్తే – “పరమ వ్యోమః” అని శృతులచే వర్ణించిన పరమపదము.
ఎయ్దవొణ్ణాద– సామాన్యంగా సాధించలేని ప్రదేశము
ముయల్బవర్ తంగట్కుం – గట్టిగా ప్రయత్నించే వారు
తవత్తే – తపస్సుల చేత
నీర్ – మీరు
పలకాలం – నిత్యమూ
నిన్ఱు – ఏక లక్ష్యముగా
ఎతిరాశరెన్ఱు సిందియుం – మీ మనస్సులలో వారిని (శ్రీ రామానుజ లేదా యతిరాజులను) ధ్యానించుచూ (ప్రయత్నం చాలా చిన్నది అయినప్పటికీ ఫలితం చాలా పెద్దది).
ఉమై – మీరు (నిత్య సంసారులు) చేయగా
వైక్కుం – ఇది నిత్యసూరుల యొక్క ఉన్నత స్థాయిలో మిమ్మల్ని కూడా ఒకటిగా ఉంచుతుంది.

సరళ అనువాదము:

మాముణులు ఈ ప్రాపంచిక ప్రజలతో సంభాషిస్తూ, “నిష్కర్షమైన కఠోర తపస్సులతో పరమపదాన్ని చేరుకోవడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు. విఫలమై చేరుకోలేకపోతున్నారు. కానీ మీరు, అల్పమైన, విరుద్ధమైన వాటిపైన మీ  సమయాన్ని వృధా చేసుకున్నారు. అయినా సరే, మీరు పరమపదము చేరుకునే సులభమైన మార్గం ఒకటి ఉంది. శ్రీ రామానుజుల నామాలను జపించండి, ధ్యానించండి. ఆ నామమే మిమ్మల్ని పరమపదము వరకు తప్పకుండా చేరుస్తుంది.

వివరణ: 

మాముణులు “హే ఈ ప్రపంచంలోని పాపులారా! మీరు మీ జీవితంలో శ్రీ రామానుజుల అద్భుతమైన నామాలను జపించగలిగే సువర్ణ సమయాన్ని వృధా చేసుకున్నారు” అని ఈ లోక వాసులతో అంటున్నారు. ఇప్పుడు ఆ కాలము గడిచిపోయింది, వెనక్కి తిరిగి చూస్తే, విలువైన సమయము వ్యర్థమైనదని మీరు గ్రహించవచ్చు. అయినప్పటికీ, మీ చిన్న ప్రయత్నాలతో అతి విలువైనది ఒకటి వేచి ఉంది. మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నము చేస్తాను. పరమపదము అనేది శృతులలో “తత్ అక్షరే పరమవ్యోమః” గా కీర్తించబడిన లోకమది. ఆ లోకములో నిత్యసూరులు నివసిస్తుంటారు. ఈ చోటుని అత్యున్నత లోకమని, “పరమపదము” అనే పేరు చెబుతుంది.  కఠోర తపస్సులు చేసి ఈ లోకానికి చేరుకోవాలని ప్రయత్నించేవారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి కూడా అది వారి ఇష్టానుసారంగా స్వప్రయత్నాలతో పొందగలిగేది కాదది.  అయినప్పటికీ, అక్కడికి చేరుకోవడానికి సంపూర్ణమైన సులభ మార్గం ఒకటి ఉంది. మీ మనస్సులో శ్రీ రామానుజుల అద్భుతమైన నామాలను జపించి ద్యానించడం తప్పా మరోక మార్గం లేదు. అలా చేస్తే, దానంతట అదే మిమ్మల్ని అక్కడికి తీసుకెళుతుంది. ఈ ప్రయత్నం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ఫలితం అత్యున్నతమైన పరమపద ప్రాప్తిని కలుగజేస్తుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-50/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *