జ్ఞానసారము 1

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

పరిచయం

   మొదటి పాటకు అవతారిక

                    ఆత్మకు అపారమైన ఆనందమును ఇవ్వగలిగినది కుటుంబపు పేరు. దానిని పొందుటకు 1. తిరు మంత్రము 2. ద్వయ మంత్రము   3. చరమశ్లోకము అను మూడు మంత్రముల సారమును ఆచార్య ముఖముగా తెలుసుకోవలసి వుంది. ఈ మూడింటిని  రహస్య త్రయములని అంటారు. దీనిని తెలుసుకోవాలన్న కోరిక వున్న వారికి తప్ప అన్యులకు చెప్పరాదను నియమము కలదు. అందు వలననే వీటిని రహస్య మంత్రములని పేరు. ఈ మూడు మంత్రములు సమస్త వేద సారములుగా విరాజిల్లుతున్నవి. పైగా ఇవి పరమాత్మ స్వరూపమును, ఆయనను పొందు ఉపాయమును, ఆయనను అనుభవించటము వలన కలుగు అపార ఆనందమును తెలియ జేస్తాయి. ఇవి జనన మరణ చక్రములో పడి కొట్టుకొను చేతనులకు ముక్తి మార్గమును తెలుపునవి , మోక్షమును ఇచ్చునవి,  భగవతుడి చేత చెప్పబడినవి.”తిరుమంత్రము ” బదరికాశ్రమములో భగవంతుడు తానే  నరుడిగా  శిష్యుడై అవతరించి ,  నారాయణుడిగా ఆచార్యుడై  అవతరించి ఉపదేశించారు.  ” ద్వయ మంత్రమును ” శ్రీ వైకుంఠములో శ్రీమహాలక్ష్మి కి ఉపదేశించారు.  ” చరమ శ్లోకమును ” మహాభారత యుధ్ధ సమయములో అర్జునుడికి రథము మీద ఉండి చెప్పిన శ్రీమద్భగవద్గీత చివరలో   ఉపదేశించారు. ఈ మూడు మంత్రములు  అనాదిగా గురుపరంపర ద్వారా తరతరాలుగా ఉపదేశింబడుతున్నవి. వీటి ఔన్నత్యము తెలిసిన మన పూర్వాచార్యులకు ఇది పెన్నిధిగా విరాజిల్లినది. అంతే కాక నిత్య అనుసంధానముగా అమరినవి. ((ఈ మూడు రహస్యములు బీరువాలో దాచి పెట్టిన లౌకికమైన సొత్తు వలెకాకుండా , ఎంత ఉపయోగ పరచ గలిగితే అంత ఉపయోగపడేవి. మన పూర్వాచార్యులు వీటిని తమ దినచర్యలో భాగముగా పొందుపరిచారు. అటువంటి గొప్ప ఔనత్యము కలిగినవి ఇవి.

తిరుమంత్రము ” ను  మొదటి రహస్యమని అంటారు. ఇది మూడు పదములతో కూడిన మంత్రము. అవి “ఓం “, “నమః” , “నారాయణాయ ” అనునవి.  “ఓం “,అనే పదము ప్రణవము యొక్క అర్థమును సూక్ష్మముగా తెలియజేస్తున్నది.  “నమః”,”నారాయణాయ ” అనే  పదములు ఓంకారములో చెప్పిన అర్థములను వివరిస్తున్నట్లుగా అమరినవి.( జీవాత్మ, పరమాత్మా స్వరూపం , శేష శేషి సంబంధం, ఈ సంబంధం యొక్క మొదలు, ఎప్పటివరకు ఉంటుందో మరియు ఈ జీవుడు మరి ఇంక ఎవరికైనను శేషిగా ఉండే విషయముల గురించి చెప్పబడినది.)

తిరుమంత్రములోని మధ్యమ పదమైన “నమః” ,చివరి పదమైన “నారాయణాయ ” లోని అర్థాలు క్రమముగా ద్వయ మంత్రములో మొదటి భాగములోను  చివరి భాగములోను చెప్పబడినది. ఈ విధముగా రెండు భాగములతో వున్న ద్వయ మంత్రము , మంత్రములన్నింటిలోను ఉన్నతమైనది .అందువలన ఇది మంత్ర రత్నమని పొగడబదింది. ఇందులోని మొదటి భాగములో భగవంతుడిని శరణాగతి చేయు  మార్గములు చెప్పబడింది. భగవంతుడిని శరణాగతి చేయు నప్పుడు ఇతర సంబంధములన్నింటినీ పూర్తిగా వదిలివేయాలి, అలా చెసే శరణాగతి కూడ ఇతర ప్రయోజనములను పొందడానికి కాక భగవంతుడిని పొందడమే ప్రయోజనముగా వుండాలి. ఇంకను , ఈ శరణాగతి కూడా ఉపాయముగా భావించవలదు.( ఎందుకనగా, అలా భావించిన భగవానుని శ్రీ చరణములు కాకుండా మరి వేరే యొక్క అనగా మనము చేసే శరణాగతి కూడా మోక్షము ను ఇవ్వగలుగుతుంది అన్నట్టుగా ఉంది. మనము చేసేశరణాగతి ఎట్టి పరిస్థితులో మోక్షం ఇవ్వజాలదు).  భగవంతుడి  శ్రీపాదములే శరణమన్న భావనతో శరణాగతి చేయాలి. ద్వయ మంత్రములోని చివరి భాగములో ధృడ అధ్యవసాయము కలవారికి పురుషార్థమైన మహాలక్ష్మితో కూడిన స్వామికి , అర్థాత్ ఆ దివ్య దంపతుల మిథునమునకు కైంకర్యము చేయుట గురించి చెప్పబడింది. 

ఇది శ్రీరామాయణములో సీతారాములకు లక్ష్మణుడు చేసిన కైంకర్యము వంటిది. ఈ  కైంకర్య భాగ్యము విరోధి స్వరూపమిలన్ని తొలగిపోయిన తరువాతనే లభిస్తుంది. రెండు భాగములతో కూడిన ఈ ద్వయ మంత్ర సారమును చరమశ్లోకమనే మూడవ మంత్రములో  వివరించబడము జరిగింది.  ఈ మూడు మంత్రములలోను ద్వయ మంత్రమే ముఖ్యమైనదిగా మన పూర్వాచార్యులు భావించారు.

ద్వయ మంత్రం  తిరుమంత్రము మరియు చరమ శ్లోకం నడుమ అమరినది. ఇది తిరుమంత్రములోని  నమః మరియు నారాయణ పదముల  అర్థమును వివరిస్తుంది అదే సమయము ద్వయములో ని కొన్ని నిగూఢ అర్థంలు వివరించు  చరమ శ్లోకం నుకు ఒక పునాది వేస్తుంది. తిరుమంత్రమునకు మరియు చరమ శ్లోకం లో శ్రీ సంబంధము ఉన్నప్పటికిని  కేవలము ద్వయములోనే ప్రస్ఫుంటగా శ్రీ శబ్దం చెప్పబడినది. ఇంత గొప్పదైన ద్వయ మంత్రములోని మొదటి భాగములో ఏమి చెప్పబడింది. భగవంతుడి శ్రీపాదములకు శరణాగతి చేయటము. అవి రెండు విధములు. ఇప్పుడే పరమపదము పొందాలని కోరటము ఒకటి,అలా కాక నీ శ్రీపాదములకు శరణాగతి చేస్తాను. నువ్వు ఎప్పుడు పరమపదము ఇస్తావో అప్పుడే ఇవ్వు అనటము రెండవది. ఇందులో మొదటిది కోరతగనదిగాను, రెండవది కోరతగనిదిగాను పెద్దలు చెపుతారు. ఇప్పుడే పరమపదము పొందలని చేయు శరణాగతిని గురించి  ఈ జ్ఞానసారములోని మొదటి పాశురమైన  ”  ఊన ఒడల్ శిరై ” లో  చెప్పారు.

pattabhishekam

పాశురము-1

ఊన ఒడల్ శిరై నీత్తు ఒణ్ కమల కేళ్వనడి

త్తేన్ నుగరుం ఆశైమిగు సిందై యారాయ్దానే

పళుంత్తాళ్ విళుం కని పోల్ పత్తత్తు విళుం

విళుక్కాటే తాన్ అరుళుం వీడు

ప్రతి పదార్థము;

ఊన = చీము,నెత్తురుతో కూడిన

ఒడల్ = శరీరము

శిరై = చెరసాల నుండి

నీత్తు = బయటపడి

ఒణ్ కమల కేళ్వన్ = అందమైన తామరయే నెలవైన లక్ష్మీ దేవికి నాథుడైన శ్రీమన్నారాయణుని

అడిత్తేన్ = శ్రీపాదములనె తేనెలను

నుగరుం = అనుభవించు

ఆశైమిగు సిందై యారాయ్ =కోరిక గలవారై

పళువీడుత్తాళ్ = ముదర పండితే

దానే విళుం = తానుగా పడిపోయే

కని పోల్ = పండులాగా

పత్తత్తు = వైరాగ్యముతో (భవ బంధములను చేధించుకొని)

వీళుం = శరణాగతి చేయు

విళుక్కాడు తానే = వైరాగ్యమే

వీడు  అరుళుం = ఉన్నత స్థానమును కల్పించగలదు

వివరణ:

శరీరము, చీము నెత్తురు, మాంసములతోను, నరములు, ఎముకలు, మజ్జ, మలమూత్రములతో కూడినది. దీనిని ” పుండారము” అంటారు. శరీరము మీద ఈగ రెక్కంత తోలు లేచి పోతే , ఈగ,చీమ, కాకి వంటివి వచ్చి వాలుతాయి ( “నాలడియార్ తురవరవియల్”-తూయ్ తన్మై లో -1) . శరీరము లోపలి భాగము బయటి భాగము చేస్తే కాకులను తోలటమే జీవితమవుతుంది.

ఇటువంటి హీనమైన శరీరములోని దోషాలను తెలుసుకొన్న వారికి , ” నేను” అని చెప్పబడే ఆత్మ దీనిలో బందీ అయిన ఖైదీలా (తినుట, వస్త్రము కట్టుకొనుట, జీవించుట) తోస్తుంది. కుండలో పెట్టిన మాణిక్యము యొక్క ప్రకాశము కుండలోనే ఉండి పోయినట్లు, దేహములో ఉన్న ఆత్మ గుణములు దేహములోనే బందీ అయి ఉన్నవి. ఆత్మ ,శరీరములో దాగి ఉన్నది.  ఇది ఆత్మకు భగవంతుడు ఇచ్చిన చెఱశాల దండన అని తెలుసుకోవాలి. దీనిని చెఱశాల శిక్షగా భావించక , భోగముగా భావించుట  మూఢత్వమే అవుతుంది. కావున శరీరము యొక్క వాస్తమైన స్థితిని తెలుసుకున్న వారు జ్ఞానులవుతారు. వారు లౌకిక జీవనము నుండి బయట పడుటకు ప్రయత్నము చేస్తారు. అలా ప్రవర్తించే జ్ఞానులు భగవంతుని దగ్గర శరణాగతి చేయటము తప్ప మరే ఇతర మార్గమును చూడ లేరు. ఈ చెఱ నుండి విడిపించు వాడు భగవంతుడే అని భగద్గీతలో  ఆయనే చెప్పారు.  ఆత్మకు శరీరము ఏర్పడుట పురాకృత కర్మ వలన. అటువంటి కర్మను పోగొట్టుకొనుటకు శరణాగతి ఒక్కటే తప్ప మరేదీ ఉపాయము కాదు. నా పాదములను పట్టి శరణాగతి చేస్తే ఆ చెర నుండి నేను తప్పిస్తాను అన్నాడు భగవంతుడు.

ఒక (బంగారు) పిచ్చుక కట్టిన గూటిని మనము విడదీయ లేము, అలాంటిది భగవంతుడు కట్టిన ఈ శరీరమనే గూటిని మనము విడదీయగలమా? చెఱలో చిక్కిన శ్రీమంతుడికి దానినుండి బయట పడి సుఖభోగములననుభవించిటము కంటే చెఱ నుండి బయటకు రావడమే ముఖ్యముగా తోస్తుంది. అలాగే ఆత్మ ఈశరీరము నుండి బయట పడుటే పెద్ద  విషయముగా తోస్తుంది. కానీ అది అంత సులభము కాదు. దానికి శరణాగతి చేయటము ఒకటే మార్గము. ఆ శ్రియః పతి శ్రీచరణాలలో శరణాగతి చేయటము తేనె లాగా ఎంతో తియ్యనిధి. ఆ  తియ్యదనమును అనుభవించిన వారికి,  మిక్కిలి ప్రీతితో దానిలోనే మునిగి వుండాలని అనిపిస్తుంది. బిడ్డ తల్లి పాలకోసము ఎలా ఆశతో చూస్తుందో ,అలాగే శరణాగతి చేయు వారు, భగవంతుడి శ్రీపాదముల తేనేను ఆస్వాదించుటకు ఆత్రుతతో వుంటారు.  ఆ ఆత్రుతలో తాను గతములో పట్టుకున్న లౌకిక విషయములను వదిలి వేస్తాడు. అవి కూడ వీరిని వదిలి వేస్తాయి అని ఈ పాటలో భావము. చెట్ట మీద పండిన పండు తానే ఎలా పడి పోతుందే, అలాగే భగవంతుని శ్రీపాదములకు చేసే శరణాగతి లౌకిక బంధనాలు తామే వదిలివేసే విధముగా కృప చేస్తుంది.

కావున , శరీరముతో జీవించుటను చెఱగా  గ్రహించి ,దాని నుండి విడివడుటకు భగవంతుని శ్రీపాదములను అనుభవించు కోరిక గలవారు అమ్మవారి కృపతో లౌకిక జీవనముపై గల  కోరికలను పూర్తిగా వదిలి వేసి పురుషకారముతో, భగవంతుని శ్రీపాదములను శారణాగతి చేస్తే  ఆయన వేంటనె  మోక్షమును ప్రసాదిస్తాడు అని ఈ పాటలో చెపుతున్నారు.

ఇంటి పేరు అనగా జనన మరణ చక్రమును వీడి భగవంతుని వద్దకు చేరడము. అటు వైపున ఉండే లౌకిక విషయముల కడు కష్టములు అనే సముద్రమును దాటి ఇటు వైపున ఉండే  శ్రీ  చరణములు చేరుట ” అక్కరై ఎన్నుం అనర్త కడలుళ్ అళుంది ఇక్కరై యేరి ఇళైత్తిరుందేన్ ” (అద్దరి అనే అనర్దమైన సముద్రములో మునిగి ఇద్దరి చేరి చిక్కిపోఅయాను) (  పెరియాళ్వార్ తిరుమొళి-5-3-7) అన్నారు  పెరియాళ్వార్లు.

ఇక్కడ ఒక వేదాంత చర్చ చేయబడింది. శరణాగతియే మోక్షమునిస్తుందని అంటే, భగవంతుడు మోక్షమునిస్తాడని చెప్పటానిని ఖండిస్తుంది కదా? పైగా  శరణాగతి అనే విషయమే తెలియకుండా చేసే చర్యలకు మోక్షమునిచ్చే శక్తి వుందని చెప్పటము వాస్తవానికి వ్యతిరేకము కాదా? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి.

వీటికి సమాదానాలేమిటో చూద్దము:

భక్తుడు చేసే శరణాగతియో, భక్తియో, తపస్సో, నోములో, ఏవైనా సరే భక్తుడిని మోక్షము పొందుటకు అర్హుడిని  చేస్తుంది ,అంతే కాని  మోక్షముని వ్వదు.   శరణాగతికి కరిగి భగవంతుడే  మోక్షమునిస్తాడు. దీనిని,  ” అధికారి విశేషణము”అని శాస్త్రము చెపుతుంది. దీనికి ఉదాహరణ – మెరక ప్రాంతమును తవ్వి లోతు చేసి కట్ట వేస్తారు. వాన పడినప్పుడు నీళ్ళు నిండుతాయి. ఏరు ఏర్పడుతుంది. ఏరు కట్టటము  వాన పడుటకు కారణము కాదు. కాని, వాన పడేటప్పుడు ఏరు వుంటేనే నీరు నిండుతుంది.  అలాగే ఆత్మలు చేసే శరణాగతి మొదలైన వేవీ భగవంతుడు కృప చేయుటకు కారణము కాదు. భగవంతుడి కృప ఏ కారణము వలన ఏర్పడదు. సహజ సిద్దమైనది. అలాంటి సహజ సిద్దమైన కరుణ ఏర్పడునప్పుడు దానిని పొందుటకు ఆత్మలు అర్హత కలిగి వుండాలి. ఆ అర్హత ” శరణాగతి ” అనీ ” భక్తి” అనీ నోము అనీ పుణ్యములనీ చెప్పబడుతున్నాయి. ఇలా అర్హతలుండడమే కారణములుగా చెప్పలేము.” వనత్తిడరై ఏరియాం వణ్ణం ఇయఱ్ఱుం ఇతువల్లాల్ మారి యార్ పొయిగిర్పార్?మఱ్ఱు ఎన్ఱు ” ( అడవిలో ఏరు ఏర్పడడానికి కారణము ఎవరు?)అని భూదత్తళ్వార్లు చెప్పారు. ” ఇవి శరణాగతి చేయుటకు అర్హతను కల్పిస్తాయి. భగవంతుడు స్వయముగా మోక్షమునిస్తాడు. అన్న యదార్దములు ఇక్కడ తెలుస్తున్నాయి.  మాంసమయమైన శరీరములో జీవించుట చెఱ వాసము లాగా భావించి  విడుదల పొందుటకు మనసు పరితపించాలి. లక్ష్మీనారాయణుని శ్రీపాదములను చేరుటే శరణాగతి అవుతుంది. అది పండిన పండు కాడ నుండి విడివడినట్లు సకల బంధములను వదిలి వేయుట అవుతుంది.

మోక్షమును పొందుటకు శరీరము విరోధి అవుతుంది. ఆ  విరోధిని వదిలించుకోవటానికి భగవంతుడి శ్రీపాదముల వద్ద చేసే శరణాగతియే సాధనము అవుతుంది. దీకి వివరణగా రామాయణములో భరతుడు,విభీషణుడు శ్రీరాముడి శ్రీపాదములకు  శరణాగతి చేసిన విధమును చూడవచ్చు.  భరతుడు, తన తల్లి వలన కష్టముల పాలయ్యాడు. విభీషణుడు తన అన్న వలన కష్టముల పాలయ్యాడు. ఇద్దరూ తమ కష్టటములను తాళలేని వారే.

” తొళుదు ఉయర్ కైయినన్, తువండ మేనియన్,

అళుదు అళి కణ్ణినన్, ‘అవలం ఈదూ ఎన

ఎళుదియ పడివం ఒత్తు ఎయిదువాన్

‘భరతనుం తొళుతు తోన్నినాణ్ మలరడి వందు వీళ్దనన్”

( కంబ రామాయణం- అయో-49 తిరువడి సూట్టు పడలం) ( జోడించిన చేతులు, వేలాడిపోయిన శరీరము, దుఃఖము వలన ఎర్రబారిన కన్నులు, అశక్తుడినని వాపోతూ పాదముల మీద వచ్చి వాలాడు భరతుడు)

ఇది భరతుడి శరణాగతి. ” అధికారి విశేషణము” .ఇదే భగవంతుడు కృప చేయుటకు  అర్హత అవితుంది.

” కరంగళ్ మీచ్చుమందు సెల్లుం కదిర్ మణి ముడియన్, కల్లుం

మరంగళుం ఉరుగ నోక్కుం కాదలన్,కరుణై వళ్ళల్

ఇరంగినన్ నోక్కుం తోలుం ,ఇరునిలంత్తు ఇరైంజుగిన్రన్

వరంగళిన్ వారి అన్నతాళ్ ఇణై వందు వీళ్దాన్ ”

( కంబ రామాయణం-యుధ్ధ-విభీషణుడి  శరణాగతి-137)

పై రెంటిలోను ఆత్మ శరీరమనే చెఱ నుండి విడివడుట వలన భగవంతుడి శ్రీపాదములందు శరణాగతి చేయుటకు అర్హమైనవి. భరతుడికి కైక వలన వచ్చిన కష్టము, విభీషణుడికి అన్న వలన వచ్చిన కష్టము , ఆత్మకు శరీరము వలన వచ్చిన కష్టము , ఎటువంటి కష్టమైనా అది తీరుటకు భగవంతుడి శ్రీపాదములందు శరణాగతి చేయుటే ఉపాయము కాగలదు. అలాగే ఈ ఆత్మ శరీరమనే చెఱ నుండి విడివడుటానికి ఆర్తితో  భగవంతుడి శ్రీపాదములందు శరణాగతి చేసాడు.

” ఈ ప్రాణములను స్వీకరించవా? ” అని కరిగి పోయాడు,ఆగాడు- కృష్ణుని కన్నులనే పుండరీకములు కృపను వర్షించగా – వాడు ప్రంపంచమంతా నిండి పొంగి పోయాడు.

” అయావుయిర్త్తు, అళుకణీర్ అరువి మార్పిది

ఉయర్వుర ,తిరువుళ్ళం ఉరుగ, పుల్లినాన్

నియాయం అత్తనైక్కుం ఓర్ నిలై ఆయినన్

తయా ముదల్ అఱ్త్తినై త్తళి ఇయతు ఎన్నవే ”

( కంబ రామాయణం- అయో-55 తిరువడి సూట్టు పడలం)

ఇది భరతుడి యందు రాముడు  చూపిన దయ

”  గునోడు ఐవర్ ఆనోం మున్బుపిన్ కున్రు సూళ్వాన్

మగనోడు అరువర్ ఆనోం, ఎం ముళై అంబు వంద

అగన్ అమర్ కాదల్ ఐయ! నిన్నోడుం ఎళువర్ ఆనోం

పుగల్ అరుంగానం తంతు పుదల్వరాల్ పొలిందాన్-నుందై”

( కంబ రామాయణం- యుధ్ధ-143విభీషణ  పడలం)

తిరువడి ముడియిన్ సూడి ,సెంకతిర్ ఉచ్చి సేర్ న్ద

అరువరై ఎన్న, నిన్ర అరక్కర్ తం అరసై నోక్కి

ఇరువరుం ఉవకై కూరందార్, యావరుం ఇంబం ఉత్తార్,

పొరు అరుం అమరర్ వాళ్తి, పూమళై పొళివదానార్”

( కంబ రామాయణం- యుధ్ధ-145విభీషణ  శరణాగతి)

తేడువోర్ తేడ నిన్రసేవడి , తానుం తేడి

నాడువాన్ అన్రు కండ నాన్ముగన్ కళీ ఇయ నల్ నీర్

ఆడువార్ పావం ఐందుం   నీంగి, మేల్ అమరర్ ఆవార్,

సూడువార్ ఎయితుం తన్మై సొల్వార్ యావర్? సొల్లీర్”

( కంబ రామాయణం- యుధ్ధ-150 విభీషణ  శరణాగతి)

ఇలా ఆర్తితో శరణాగతి చేయు ఆత్మలకు భగవంతుడు తాను దిగివచ్చి కృప చేస్తాడు, అని సారము. దీనిని ” కరుణ ,ఉపాయము, తీయని ఉపేయము ” అని ఆచార్యులు చెప్పారు.

పైన చెప్పిన భరత, విభీషణ శరణాగతులలో , విభీషణ శరణాగతి ఫలించినదిగాను, భరత  శరణాగతి ఫలించనదిగాను తెలుస్తున్నది. “భరతుడికి మంచే చెడుగా పరిణమించినది.” అన్న మాట చూడవచ్చు.(ఈ విషయం ఇంకొక చర్చగా ఉంది. ఎందులకు భరతుని శరణాగతి ఫలించలేదు కాని విభీషణ శరణాగతి ఫలించినది అని. శ్రీ రాముడు భరతుని శరణాగతి కు అనుగ్రహము చేయుట ఆ సమయము తగదని భావించారు. శ్రీ రామునుకి ఒక విస్తారమైన ప్రణాళిక ఉండింది..14  వనవాసము చేయుట, ఋషులను రాక్షసుల బారినుండి కాపాడుట, విభిషనుని తన గోష్ఠి లో చేర్చుకొనుట, రావణ సంహారం మొదలగునవి.  మన శరణాగతిని  అనుగ్రహించు సమయమును కేవలం భగవంతుడే స్వాతంత్రడై నిరణయము చేస్తారు. భరతుని విషయములో ఏరి త్రోవ్వి పెట్టినను, వాన కురువటకు అది తగు సమయం కాదు.  ) అందు వలన శరణాగతి మొదలైన వన్ని అధికారి విశేషణములుగా చెప్పబడీనవే కాని ఉపాయములుగా చెప్పబడ లేదు.  శరణాగతి మొక్షమునిస్తుందనటము కాల విలంబనము లేక మొక్షమునిస్తుందన్న అర్థములోనే తప్ప దానికి మొక్షమునిచ్చే శక్తి వుందని కాదు అర్థము. ఈ విధముగా  శరణాగతి శాస్త్రమును ఈ పాటలో మామునులు వివరించారు.

అడియేన్  చూడామణి రామానుజ దాసి

మూలము:  http://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-1-una-udal/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

0 thoughts on “జ్ఞానసారము 1”

Leave a Comment