నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఆరాం తిరుమొళి – వారణమాయిరం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఐందాం తిరుమొళి – మన్ను పెరుం

తనని ఎంబెరుమానుడి వద్దకి చేర్చమని ఆండాళ్ కోకిలని ప్రార్థించింది. అలా జరగనందున ఆమె బాధలో ఉంది. ఆమె ప్రేమ తన పట్ల పరిపక్వం కావాలని, అయిన వెంటనే తన వద్దకి చేర్చుకుందామని మరోవైపు ఎంబెరుమాన్ వేచి చూస్తున్నాడు. నమ్మాళ్వార్లకి భగవానుడు ప్రారంభంలోనే భక్తి మరియు జ్ఞానాన్ని ప్రసాదించినప్పటికీ, ఆళ్వార్ని పరభక్తి (భగవత్ జ్ఞానం) మరియు పరజ్ఞానం (భగవానుడి మానసిక దర్శనము) వంటి దశలను దాటించిన తరువాత మాత్రమే వారికి పరమపదంలో నిత్య సేవను అనుగ్రహించారు. సీతా పిరాట్టి కూడా “పెరుమాళ్ళ రాక కోసం నేను ఒక నెల వరకు వేచి ఉంటాను” అని చెప్పింది. కానీ పెరుమాళ్ మాత్రం “నేను పిరాట్టి నుండి ఒక్క క్షణం కూడా వీడి ఉండ లేను” అని అన్నాడు. త్రిజడ వంటి వాళ్ళకి పెరుమాళ్ళు స్వప్నములో దర్శనమిచ్చేవారు, ఆమె ఆ కలల గురించి సీతా పిరాట్టికి చెప్పి, పిరాట్టికి ఓదార్పుని కలిగించేది. మరోవైపు, ఆండాళ్ తనుకి స్వయంగా భగవానుడి స్వప్నదర్శనము కలిగితేనే తనను తాను నిలుపుకోగలదు. లోకమంతా నిద్రలో ఉన్నప్పుడు ప్రజలందరికీ మంచి కలలను చూపించి ఆనందాన్ని ప్రసాదించేందుకు ఎంబెరుమానుడు తాను మేలుకొని ఉంటాడని శాస్త్రము చెబుతుంది. అదే విధంగా, తనతో కళ్యాణము జరిగినట్లు ఆమె స్వప్నంలో దర్శింపజేసి, ఆ స్వప్నము గురించి తన స్నెహితురాల్లకి వర్ణిస్తూ  తాను తృప్తిపడేలా ఎంబెరుమానుడు చేశారు. 

మొదటి పాశురము: “ఆతడు రానీ, వచ్చాక మేము ఆనందిద్దాము” అని చెప్పి కుదురుగా ఉండకుండా, ఆతడు వచ్చిన క్షణం నుండే అనుభవము పొందాలని ఆమె ఆతని రాక కోసం దీర్ఘాలోచన చేస్తోంది.

వారణం ఆయిరం శూళవలం శెయ్దు 
నారణ నంబి నడక్కిన్ఱాన్ ఎన్ఱెదిర్
పూరణ పొఱ్కుడం వైత్తుప్పుఱమెంగుం
తోరణం నాట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ నా ప్రియమైన మిత్రమా! అన్ని శుభ లక్షణాలలో పరిపూర్ణుడు అయిన శ్రీమన్నారాయణుడు వెయ్యి ఏనుగులతో వస్తున్నాడు. బంగారు పూర్ణ కుంభాలు (అతిథులను నిండు కలశాలతో స్వాగతించే సాంప్రదాయ పద్ధతి) ఆతని ఎదుట ఉంచ బడ్డాయి. పట్టణం మొత్తం తోరణాలు మరియు స్తంభాలతో అలంకరించబడింది. స్వప్నంలో ఇవన్నీ చూసి నేను అనుభవించాను. 

రెండవ పాశురము: కృష్ణుడు పెళ్ళి పందిరిలోకి ప్రవేశించడం తాను చూసానని ఆమె తెలుపుతుంది. 

నాళై వదువై మణం ఎన్ఱు నాళిట్టు
పాళై కముగు పరిశుడైప్పందఱ్కీళ్
కోళరి మాదవన్ గోవిందన్ ఎన్బానోర్
కాళై పుగుద క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! కళ్యాణానికి అనుకూలమైన శుభ ముహుర్తము రేపు నిర్ణయించబడింది. నా స్వప్నంలో, నరసింహ, మాధవ, గోవింద అనే సహస్ర దివ్య నామాలు ఉన్న ఒక యువకుడు, మంగళ కరమైన వక్క చెట్టు కోశముతో అలంకరించబడిన పెళ్ళి పందిరిలోకి ప్రవేశించడం నేను చూశాను.

మూడవ పాశురము:పెళ్ళి బట్టలు వర మాలలు ధరించిన తన అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

ఇందిరనుళ్ళిట్ట దేవర్కుళాం ఎల్లాం
వందిరుందు ఎన్నై మగళ్ పేశి మందిరత్తు
మందిరక్కోడి ఉడుత్తి మణమాలై
అందరి శూట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! ఇంద్రుడు మరియు ఇతర దేవలోక వాసులందరూ ఇక్కడకు వచ్చి పెళ్లి ఏర్పాట్ల గురించి, వధువుగా నాతో చర్చించారు. దుర్గా (నా భర్త సోదరి) నాకు పెళ్లి చీర కట్టడం, సుగంధ పూరితమైన పుష్పమాలలు వేయడం నేను నా స్వప్నములో చూసాను.

నాలుగవ పాశురము: కళ్యాణానికి ముందు జరిగే కంకణ ధారణ అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

నాల్ తిశై త్తీర్ త్తం కొణర్ందు నని నల్గి
పార్పనచ్చిట్టర్గళ్ పల్లార్ ఎడుత్తేత్తి
పూప్పునైక్కణ్ణి ప్పునిదనోడు ఎన్ తన్నై
కాప్పు నాణ్ కట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! అనేక మంది బ్రాహ్మనోత్తములు నాలుగు దిక్కుల నుండి పవిత్ర జలాలను తెచ్చినట్లు నేను స్వస్పములో చూశాను. వారు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ ధ్వనుల మధ్య ఆ పవిత్ర జలాలను అన్ని చోట్లా చల్లడం చూశాను. పూమాలలు ధరించిన కృష్ణుడికి, వారితో పాటు నా చేతికి రక్షణ కంకణాన్ని వారు కట్టడం నేను చూశాను.

ఐదవ పాశురము:  ఎంబెరుమానుడిని మంగళ దీపాలతో పూర్ణ కుంభములతో స్వాగతించడం, ఆతడు పెళ్ళి పందిరిలోకి ప్రవేశించే అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

కదిరొళి దీపం కలశ ముడనేంది
శదిరిళ మంగైయర్ తామ్ వందెదిర్ కొళ్ళ
మదురైయార్ మన్నన్ నడినిలై తొట్టు ఎంగుం
అదిర ప్పుగుద క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా!  సూర్య కాంతుల వంటి మంగళ దీపాలను, స్వర్ణ కలశాలను (పూర్ణకుంభం) అందమైన కన్యలు పట్టుకొని ఉత్తర మధురకి రారాజైన ఎంబెరుమానుని స్వాగతించారు. ఆతడు పాదుకలు ధరించి, అతని పాదాల క్రింద భూమి ప్రతిధ్వనిస్తున్నట్లు గంభీరంగా నడుస్తుండటం నేను నా స్వప్నములో చూశాను.

ఆరవ పాశురము:   మధుసూధన భగవానుడు పాణీ గ్రహణము చేస్తున్న అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

మత్తళం కొట్ట వరిశంగం నిన్ఱు ఊదు
ముత్తుడైత్తామం నిరై తాళ్ంద పందఱ్కీళ్
మైత్తునన్ నంబి మదుసూదన్ వందు ఎన్నై
క్కైత్తలం పఱ్ఱ  క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా!  సర్వ గుణ పరిపూర్ణుడైన వాడు మధుసూదనుడు (ఎంబెరుమానుడు). అనేక ముత్యపు దండలతో అలంకరించి ఉన్న  పెళ్ళి పందిరిలో, తన చేతిలో నా చేతిని ఉంచి, పాణిగ్రహణము చేస్తూ నాతో పరిణయమాడబోతున్న నా అత్త కొడుకు (మధుసూదనుడు) ని నేను నా స్వప్నంలో చూశాను.

ఏడవ పాశురము:  ఎంబెరుమానుడితో తాను చేసిన అగ్ని ప్రదక్షిణల అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

వాయ్ నల్లార్ నల్ల మఱై ఓది మందిరత్తాల్
పాశిలై నాణల్ పడుత్తు ప్పరిదివైత్తు
కాయ్శినమా కళిఱన్నాన్ ఎంకై ప్పఱ్ఱి
తీవలం శెయ్య క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! స్పష్ఠమైన ఉచ్ఛారణతో వేద నిపుణులు వేద మంత్రాలు పఠిస్తున్నారు. వారు లేత ఆకులతో ఉన్న పవిత్రమైన గడ్డిని పరిచి, ఎండు కొమ్మలని అగ్నికి సమర్పించిరి. నిండుగా అలంకరించి ఉన్న మహా గజము వలె కృష్ణ భగవానుడు  ఆనందంతో నా చేయి పట్టుకుని అగ్ని ప్రదక్షిణలు చేయుట నేను స్వప్నంలో చూశాను. 

ఎనిమిదవ పాశురము:  తను ఎంబెరుమానుడి సమక్షంలో సన్ని కల్లు (రుబ్బు రాయి) తొక్కిన అనుభూతిని అనుభవాన్ని, ఆమె పంచుకుంటుంది.

ఇమ్మైక్కుం ఏళేళ్ పిఱవిక్కుం పఱ్ఱావన్
నమ్మై ఉడైయవన్ నారాయణన్ నంబి
శెమ్మై ఉడైయ తిరుక్కైయాల్ తాళ్ పఱ్ఱి
అమ్మి మిదిక్క  క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! ఈ జన్మలోనే కాక రాబోయే అన్ని జన్మలలో కూడా మనకు ఏకైక ఆశ్రయం ఎంబెరుమానుడు. సర్వ గుణ పరిపూర్ణుడైన ఆతడే మనకు స్వామి.  ఆ నారాయణుడు, కృష్ణ భగవానుడు, ఆతడి దివ్య హస్తముతో (అతని అనుచరుల పాదాలను కూడా పట్టుకోగల), నా పాదాన్ని పట్టుకుని సన్ని కల్లుపైన ఉంచడం నేను నా కలలో చూశాను .

తొమ్మిదవ పాశురము: లాజ హోమాము (హోమములో పేలాలు సమర్పించే ఆనవాయితి) యొక్క అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

వరిశిలై వాళ్ ముగత్తు ఎన్నైమార్ తాం వందిట్టు
ఎరి ముగం పారిత్తు ఎన్నై మున్నే నిఱుత్తి
అరి ముగన్ అచ్చుదన్ కైమేళ్ ఎంకై వైత్తు
పొరిముగందు అట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! విల్లులాంటి వారి కనుబొమ్మలు మరియు దివ్య తేజస్సు గల ముఖాలున్న నా సోదరులు అగ్ని సమక్షమున నన్ను నిలబెట్టి అగ్నిహోమాదులు గావించడం,  నేను స్వప్నంలో  చూశాను. గంభీరమైన సింహం లాంటి ముఖారవిందము కలిగిన అచ్యుతుడి దివ్య హస్తాన్ని నా చేతి పైన ఉంచి, పేలాలు (మురమురాలు) నా చేతిలో ఉంచడం,  నేను స్వప్నంలో  చూశాను. 

పదవ పాశురము: ఎంబెరుమానుడితో ఏనుగు అంబారి ఎక్కి అందరితో పణ్ణీరు చల్లించుకున్న అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

కుంగుమం అప్పి క్కుళిర్ శాందం మట్టిత్తు
మంగల వీది వలం శెయ్దు మణ నీర్
అంగు అవనోడుం ఉడన్ శెన్ఱు అంగు ఆనై మేల్
మంజనమాట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! నా శరీరముపై కుంకుమ పూవుతో కూడిన నలుగు, చల్లని చందన లేపనము చేశారు, ఏనుగుపైన ఎంబెరుమానుడితో పాటు నేను దివ్యంగా అలంకరించబడిన వీధుల గుండా పట్టణం చుట్టూ  వెళ్ళాను. మా ఇరువురికీ సుగంధ జలాలతో స్నానం గావించడం నేను నా స్వప్నంలో చూశాను. 

పదకొండవ పాశురము:  ఈ పది పాశురములు సేవించిన వారికి లభించే ఫలితాన్ని వివరిస్తూ ఈ పదిగాన్ని పూర్తి చేస్తుంది.

ఆయనుక్కాగత్తాన్ కండ కనావినై
వేయర్ పుగళ్ విల్లిపుత్తూర్ క్కోన్ కోదై శొల్
తూయ తమిళ్ మాలై ఈరైందుం వల్లవర్
వాయు నన్ మక్కళై ప్పెఱ్ఱు మగిళ్వరే 

బ్రాహ్మనోత్తములచే కీర్తించబడిన వారు పెరియాళ్వార్లు. వారు శ్రీవిల్లిపుత్తూర్కి నాయకుడు. పెరియాళ్వార్ల కుమార్తె అయిన ఆండాళ్ కృష్ణ భగవానుని తన స్వప్నంలో ఎలా పరిణయము ఆడిందో ఆమె దయతో వర్ణించిన ఈ పది పాశురములను నేర్చుకున్న వారికి గొప్ప గుణాలతో, భగవత్ విషయములలో నిమగ్నమై ఉండే పెరియాళ్వార్ల వంటి సంతానము పొంది ఎల్ల కాలము సంతోషముగా జీవిస్తారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-6-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment