నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – నాంగామ్ తిరుమొళి – తెళ్ళియార్ పలర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< మూన్ఱాం తిరుమొళి – కోళి అళైప్పదన్

ఎంబెరుమానుడు గొల్ల భామల వస్త్రాలను తీసుకొని కురుంద వృక్షాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఆ భామలు ఆయనను ప్రార్ధించారు, దూషించారు, ఏదో ఒకవిధంగా వారి వస్త్రాలను తిరిగి పొందారు. ఆ గొల్ల భామలు ఎంబెరుమానునితో కలిసి  ఒకటై మరియు ఆనందించారు. కానీ, ఈ సంసారంలో ఏ సుఖము శాశ్వతం కాదు కాబట్టి, భగవానుడు వారి నుండి విడి, వారి సుఖాన్ని నిలిపివేస్తాడు. అతడు తమ వస్త్రాలను తీసికుని మమ్మల్ని అల్లరిపెట్టినా సరే పరవాలేదు. కానీ, అతనితో ఉండి ‘కూడల్’ లో పాల్గొనాలని ఆ గొల్ల పిల్లలు భావించారు. ‘కూడల్’ అనగా సోది చెప్పించుకోవడం లాంటిది. గ్రామాల్లో, అమ్మాయిలు తాము ఆశించి జరగాలనుకుంటున్న సంఘటన గురించి ఆలోచిస్తూ తమ కళ్ళు మూసుకొని ఇసుకలో గుండ్రంగా గీత గీస్తారు. ఆ గీత చేరి గుండ్రంగా సరిగ్గా వస్తే, వారు మొదట్లో అనుకున్న ఆ సంఘటన నిజమవుతుందని వారు నమ్మేవారు (అది జరుగుతుందని). భగవత్ విషయాలు ఎంతో గొప్పవి మధురమైనవి కనుక, ఆయన పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో తన భక్తులు అచేతన తత్వాలపై (కూడల్ వంటివి) ఆధారపడినప్పటికీ, అతడిని ఏదో ఒకవిధంగా సాధించేలా చేస్తాయి. అతని నుండి వీడినప్పుడు, తన భక్తుల మనస్సులను విచలితం చేయకపోతే, భగవానుడికి గొప్పతనం ఏముంది! అందువలన, ఈ పదిగంలో వాళ్ళు కృష్ణుడిని పొందాలనే ఉద్దేశ్యముతో కూడల్ లో పాల్గొంటారు.

మొదటి పాశురము: తిరుమాలిరుంజోలైలో వరుడిలా ఉన్న భగవానుడు శ్రీరంగంలో శయనించి ఉన్నాడు. శ్రీరంగ పెరుమాళ్ళ అంతరంగ సేవ కావాలని కోరుకుంటూ, ఆమె కూడల్ని ప్రయత్నిస్తోంది.

తెళ్ళియార్ పలర్ కై తొళుం దేవనార్
వళ్ళల్ మాలిరుంజోలై మణళనార్
పళ్ళి కొళ్ళుం ఇడత్తు అడి కొట్టిడ
కొళ్ళుమాగిల్ నీ కూడిడు కూడలే

ఓ వలయమా! స్పష్టమైన జ్ఞానం కలిగిన నిత్యులు (శ్రీవైకుంఠపు నిత్య వాసులు) మరియు ముక్తలు (సంసారం నుండి శ్రీవైకుంఠానికి చేరుకున్నవారు) ప్రభువుగా ఆరాధించబడే అత్యోన్నతమైన భగవానుడు, తిరుమాలిరుంజోలైలో వాసమున్న ఆ  కృపాసముద్రుడు శ్రీరంగంలో శయనించి ఉన్నాడు. అటువంటి భగవానుడు ఒకవేళ తన దివ్య పాద సేవ చేయమని నన్ను అడగాలని ఆతడు భావిస్తే, నీవు అది దానిని జరిగేలా చేయి (సరిగ్గా గుండ్రంగా వచ్చేటట్టు).

రెండవ పాశురము: “భగవానుడు నన్ను చేరాలని మార్గాలు వెదుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయంలో నీవు నాకు సహాయం చేస్తావా?” అని ఆమె చెబుతుంది.

కాట్టిల్ వేంగడం కణ్ణపుర నగర్
వాట్టమిన్ఱి మగిళ్ందుఱై వామనన్
ఓట్టరా వందు ఎన్ కైప్పఱ్ఱి తన్నొడుం
కూట్టుమాగిల్ నీ కూడిడు కూడలే

ఓ వలయమా! మహారణ్యము మధ్యన ఉన్న తిరుమలిరుంజోలైలో నిత్య నివాసుడై ఉన్న భగవానుడు, మహా నగరం మధ్యన తిరుక్కణ్ణపురంలో ఉన్నవాడు, వామనుడిగా అవతారమెత్తిన ఆతడు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, నా చేయి పట్టుకుని నన్ను తనతో తీసుకెళ్ళేటట్టుగా, పూర్తి వలయములా కలిసిపోయి అది జరిగేలా చేయుము.

మూడవ పాశురము: కృష్ణుడు వస్తాడా అని కూడల్ని అడిగి తెలుసుకుంటుంది ఆమె.

పూమగన్ పుగళ్ వానవర్ పోఱ్ఱుదఱ్
కామగన్ అణి వాణుదల్ దేవకి
మామగన్ మిగు శీర్ వసుదేవర్ తం
కోమగన్ వరిల్ కూడిడు కూడలే

ఓ వలయమా! భగవానుడి దివ్య నాభీ కమలములో నుండి జన్మించిన బ్రహ్మ చేత స్తుతించ తగినవాడు, నిత్య సూరులచే ఆరాధించ తగినవాడు ఆతడు. ఆతడు దివ్య ప్రకాశవంతమైన నుదిరు కలిగిన ఉన్న దేవకీ పిరాట్టి సుపుత్రుడు. ఆతడు అనేకానేక శుభ గుణాలు ఉన్న శ్రీ వసుదేవుని దివ్య కుమారుడు. అంతటి  కృష్ణుడు నా వద్దకు వచ్చేటట్టు, నీవు పూర్తి వలయముగా కలిసి, అది జరిగేలా చేయుము.

నాలుగవ పాశురము:  అద్భుత లీలలాడిన కృష్ణుడు వస్తాడా అని కూడల్ని ఆరా తీసి తెలుసుకుంటుంది ఆమె.

ఆయ్ చ్చిమార్గళుం ఆయరుం అంజిడ
పూత్త నీళ్ కడంబేఱి ప్పుగ ప్పాయ్ందు
వాయ్ త్త కాళియన్ మేల్ నడం ఆడియ
కూత్తనార్ వరిల్ కూడిడు కూడలే

ఓ వలయమా! పుష్పాలతో నిండి ఉన్న పొడవైన కదంబ (సింధూర వృక్షం) వృక్షముపై నుండి క్రిందకి ఒక్క దూకు దూకిన ఆతడి పాదాలు యమున నీటిలోకి కూరుకుపోయాయి. అక్కడ ఉన్న గొల్ల అమ్మాయిలు మరియు అబ్బాయిలందరూ భయపడిపోయారు. ఆతడు నాట్య నిపుణుడు. మహా భాగ్యవంతుడైన కాలియ సర్పము తలపై నృత్యం చేశాడు (భగవానుడి దివ్య పాదాలు అతని తలపై పెట్టినందున). అటువంటి కృష్ణుడు నా వద్దకు వచ్చేలా, నీవు పూర్ణ గుండ్రంగా కలిసి అది జరిగేలా చేయుము.

ఐదవ పాశురము: శతృ నాశనము చేసే లక్షణము ఉన్న కృష్ణుడు వస్తాడా అని కూడల్ని అడిగి తెలుసుకుంటుంది ఆమె.

మాడ మాళిగై శూళ్ మదురై ప్పది
నాడి నన్తెరువిన్ నడువే వందిట్టు
ఓడై మా మదయానై ఉదైత్తవన్
కూడుమాగిల్ నీ కూడిడు కూడిలే

చక్కగా అలంకరించి ఉన్న కువలయాపీడం (కంసుడి రాజ ఏనుగు) ఏనుగుని కృష్ణుడు వధించాడు. అలాంటి కృష్ణుడు, పెద్ద పెద్ద భవనాలతో అంతఃపురములతో చుట్టు ముట్టి ఉన్న ఈ మధురా నగరంలో మా వీధికి వెదుకుతూ వచ్చి మాతో కలిసి, అందరూ మమ్మల్ని చూసే విధంగా మాతో చేరాలి, నీవు ఒక పూర్తి వృత్తంగా రూపుదిద్దుకొని, అది జరిగేలా చేయుము.

ఆరవ పాశురము: తన కోసము తన కంటే ముందు అవతరించిన కృష్ణుడు వచ్చి తనలో ఐక్యమౌతాడా లేదా అని కూడల్ని అడిగి తెలుసుకుంటుంది ఆమె.

అఱ్ఱవన్ మరుదముఱియ నడై
కఱ్ఱవన్ కంజనై వంజనైయినాల్
శెఱ్ఱవన్ తిగళుం మదురైప్పది
కొఱ్ఱవన్ వరిల్ కూడిడు కూడలే

ఓ వలయమా! ఆతడు నా కోసం మాత్రమే ఇక్కడ ఉన్నాడు; మరుద వృక్షములు (రాక్షసులు ఇద్దరు వాసమున్న యమలార్జున వృక్షాలు) చీలి కూలి పడిపోయే విధంగా ఆ కృష్ణుడు చిన్ని చిన్ని అడుగులు వేశాడు; ఆతడు మాయ చేసి కంసుడిని వధించాడు. దివ్య ప్రకాశంతో నిండి ఉన్న మథురా నగరానికి రాజు అయిన ఆ కృష్ణుడు నా వద్దకు రావాలి, నీవు ఒక పూర్తి వృత్తంగా రూపుదిద్దుకొని, అది జరిగేలా చేయుము.

ఏడవ పాశురము: తన శతృవుల నాశనము చేసిన కృష్ణుడు వచ్చి తనలో ఐక్యమౌతాడా లేదా అని కూడల్ని అడిగి తెలుసుకుంటుంది ఆమె.

అన్ఱు ఇన్నాదన శెయ్ శిశుపాలనుం
నిన్ఱ నీళ్ మరుదుం ఎరుదుం పుళ్ళుం
వెన్ఱి వేల్ విఱల్ కంజనుం విళ మున్
కొన్ఱవన్ వరిల్ కూడిడు కూడలే

ఓ వలయమా! కృష్ణుడి కాలానికి ముందు శిశుపాలుడి దుర్మార్గాలకి అంతులేదు; మరుద వృక్షాలు నిటారుగా నిలబడే ఉన్నాయి; ఆ సప్త వృషభాలు (ఎద్దులు) యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి; బకాసుర రాక్షసుడు కొంగ రూపంలో వచ్చాడు; ఎదురు లేని బలముతో కంసుడు ఉన్నాడు. అందరి ముందూ కృష్ణుడు వీరందరినీ మట్టు బెట్టాడు. అలాంటి కృష్ణుడు నా వద్దకు రావాలి, నీవు ఒక పూర్తి వృత్తంగా రూపుదిద్దుకొని, అది జరిగేలా చేయుము.

ఎనిమిదవ పాశురము: ఆమె నిండు ప్రేమతో ఆత్రుతగా ఉంది.  సర్వ రక్షకుడైన ఆతడు అతి సాధారణ తత్వము కూడా. ఈ స్థితిలో, ఆతడు వస్తాడా అని ఆమె అడుగుతుంది.

ఆవల్ అన్బుడైయార్ తం మనత్తన్ఱి
మేవలన్ విరై శూళ్ తువరాపది
క్కావలన్ కన్ఱు మేయ్ త్తు విళైయాడుం
కోవలన్ వరిల్ కూడిడు కూడలే

ఓ వలయమా! తన పట్ల ప్రేమ, ఆసక్తి ఉన్నవారి మనస్సులలో తప్పా ఇతరులపై ఆతడు ఆసక్తి చూపడు. ఆతడు సుగంధ పూరితమైన ద్వారకా రక్షకుడు. లేగ దూడలతో ఆడుకునే గోపాలుడు (గో రక్షకుడు). అలాంటి ఆ కృష్ణుడు నా వద్దకు రావాలి, నీవు ఒక పూర్తి వృత్తంగా రూపుదిద్దుకొని, అది జరిగేలా చేయుము.

తొమ్మిదవ పాశురము: తన సంపద అయిన ఈ లోలాలన్నింటినీ కొలిచిన ఆతడు వచ్చి తనను స్వీకరిస్తాడా లేదా అని కూడల్ని అడిగి తెలుసుకుంటుంది ఆమె.

కొణ్డ కోల క్కుఱళ్ ఉరువాయ్ చ్చెన్ఱు
పణ్డు మావలి తన్ పెరు వేళ్వియిల్
అణ్డముం నిలనుం అడి ఒన్ఱినాల్
కొణ్డవన్ వరిల్ కూడిడు కూడలే

ఓ వలయమా! ఆతడు మహాబలి యజ్ఞము నిర్వహిస్తున్న చోటికి దయతో దివ్యాభరణ అలంకారముతో వామనుడిగా వెళ్లాడు. త్రివిక్రముడిగా తన ప్రతి అడుగుతో పై లోకాలను క్రింది లోకాలని కొలిచాడు. ఆ త్రివిక్రముడు నా వద్దకు రావాలి, నీవు ఒక పూర్తి వృత్తంగా రూపుదిద్దుకొని, అది జరిగేలా చేయుము.

పదవ పాశురము: గజేంద్రుడిని రక్షించిన ఆ భగవానుడు వచ్చి తనని కూడా రక్షిస్తాడా లేదా అని కూడల్ని అడిగి తెలుసుకుంటుంది ఆమె.

పళగు నాన్మఱైయిన్ పొరుళాయ్ మదం
ఒళుగు వారణం ఉయ్య అళిత్త ఎమ్
అళగనార్ అణి ఆయ్ చ్చియర్ శిందైయుళ్
కుళగనార్ వరిల్ కూడిడు కూడలే

ఓ వలయమా! అమరమైన నాలుగు వేదాలకు అంతర్గత పరమార్థము ఆతడు (భగవాన్). దుఃఖ సాగరములో మునిగి ఉన్న గజేంద్రుడిపై తన కరుణను కురిపించి రక్షించాడు. అందరినీ ఆకర్షించే సౌందర్యముగల ఆతడు, గొల్ల భామల లేత హృదయాలలో వాసమున్నాడు. అటువంటి ఆ కృష్ణుడు నా వద్దకు రావాలి, నీవు ఒక పూర్తి వృత్తంగా రూపుదిద్దుకొని, అది జరిగేలా చేయుము.

పదకొండవ పాశురము: ఈ పదిగాన్ని నేర్చుకొని అనుసంధానము చేసిన వారికి లభించే ఫలితాన్ని తెలియజేస్తూ ఈ పదిగాన్ని ఆమె ముగిస్తుంది.

ఊడల్ కూడల్ ఉణర్దల్ పుణర్దలై
నీడు నిన్ఱ నిఱై పుగళ్ ఆయ్ చ్చియర్
కూడలై క్కుళఱ్కోదై మున్ కూఱియ
పాడల్ పత్తుం వల్లార్ క్కు ఇల్లై పావమే

ఎంతో కాలంగా ఆ గొల్ల భామలు ప్రేమ తగాదాలు (భగవానునితో), విరహ వేదనలు, ఊడల్ ని అనుభవిస్తూ ఆతనితో ఏకమౌతూ ఉన్నారు. వారు తగదాలు పెట్టుకుంటూ ఆపై మళ్ళీ కలిసిపోతూ ఆనందంగా కాలము గడిపారు. అందమైన శిరోజాలు ఉన్న ఆండాళ్, పూర్ణ  గొప్పతనాన్ని కలిగి ఉన్న అటువంటి గోప బాలికల ‘కూడల్’ గురించి వర్ణిస్తూ ఈ పది పాశురాలను కూర్చింది. ఈ పాశురములను పఠించగల సామర్థ్యం ఉన్నవారికి భగవానుడి నుండి దూరమైయ్యే బాధలు, వాటి నుండి కలిగే పాపాలు ఉండవు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-4-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment