స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 21-30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

శ్లోకములు 11-20

శ్లోకము 21 – రక్షకుడైన భగవానుడి  గొప్పతనాన్ని గురించి ఆళవందార్లు ధ్యానిస్తున్నారు. మరోలా వివరిస్తూ – ఇంతకు ముందు లక్ష్యము యొక్క స్వభావాన్ని వివరించినట్టుగా, ఇక్కడ లక్ష్య సాధకుడి స్వభావాన్ని వివరిస్తున్నారు. మరొక వివరణ – ఇంతకు ముందు రక్షకుడైన భగవానుడి స్వరూప వివరణ ఇవ్వబడింది, తరువాత శరణాగతి స్వరూపము (శరణాగతి విధానము) గురించి క్రమంగా వివరించబడుచున్నది.

నమో నమో వాజ్ఞ్మనసాతిభూమయే
నమో నమో  వాజ్ఞ్మనసైకభూమయే।
నమో నమోऽనంతమహావిభూతయే
నమో నమోऽనంత దయైకసింధవే ॥

తమ స్వప్రయత్నాల ద్వారా నిన్ను తెలుసుకోవాలని ప్రయత్నించేవారి వాక్ మనస్సులకు గోచరం కాని నీకు నా నమస్కారములు, నమస్కారములు; నీ అనుగ్రహముతో నిన్ను తెలుసుకున్నవారి వాక్ మనస్సుల అధీనుడవైన నీకు నా నమస్కారములు; అనంత ఐశ్వర్యము కలిగిన నీకు నా నమస్కారములు; కృపా సముద్రుడవైన నీకు నా నమస్కారములు.

శ్లోకము 22 –  ఆళవందార్లు, తన అర్హతను చాటుతూ  ప్రపత్తిలో  (మునుపటి పాసురములో చెప్పిన) నిమగ్నమవుతున్నారు. ఈ శ్లోకము ఆ లక్ష్యానికి (ప్రపత్తి) సముచితమైన సాధన గురించి వివరిస్తున్నారు.

న ధర్మనిష్టోऽస్మి  న చాత్మవేదీ
న భక్తిమాం స్త్వచ్చరణారవిందే।
అకించనోऽనన్యగతిశ్శరణ్య
త్వత్పాదమూలం శరణం ప్రపద్యే॥

శరణాగతవత్సలుడవైన ఓ భగవానుడా! నేను కర్మ యోగముపై స్థిరత లేనివాడిని: నేను స్వరూప జ్ఞానము లేనివాడిని; నీ దివ్య చరణముల యందు భక్తి లేనివాడిని; ఏ సాధనము ఏ రక్షణలేని నేను స్థిరతతో దృఢంగా నీ దివ్య చరణాలను సాధనముగా స్వీకరుస్తున్నాను.

శ్లోకము 23 –   “నన్ను చేరుకోలేవని నీవు చింతించకు, నీవార్జించిన ఈ అర్హతను నాశింపజేయు చెడు అలవాట్లు నీలో లేనంతవరుకు ఇది సాధ్యము. నీలో సద్గుణాలను  సృష్ఠించి గమ్యానికి చేరుస్తాను” అని భగవాన్ అభయమిస్తున్నారు.  “అన్నీ ప్రతికూలమైన అంశాలతో కూడిన వాడిని నేను” అని ఆళవందార్లు బదులిస్తున్నారు.

న నిందితం కర్మ తదస్తి లోకే
సహస్రశో యన్న మయా వ్యధాయి।
సొऽహం విపాకావసరే ముకుంద!
క్రన్దామి సంప్రత్యగతి స్తవాగ్రే॥

మోక్షాన్ని ప్రసాదించే ఓ భగవానుడా! నేను పాల్పడిన ఈ నిషేద చర్యలు శాస్త్రములో కూడా లేవు. ఈ చర్యలన్నీ కర్మలుగా మారతాయన్న భయంతో నీ ముందు మొరపెట్టుకుంటున్నాను. నీవే రక్షించాలి అని భావము.

శ్లోకము 24 –   “నీ కృపయే నాకు రక్ష” అని ఆళవందార్లు భగవాన్ని వేడుకుంటున్నారు; “నిన్ను చేరుకోవడం నా  అదృష్టం, నీ కృపకి నేను కూడా తగిన వాడినే” అని ఆళవందార్లు తెలుపుతున్నారు.

నిమజ్జతోऽనంతభవార్ణ వాంతః
చిరాయ మే కూలమివాऽసి లబ్దః।
త్వయాऽపి లబ్దం భగవన్నిదానీం
అనుత్తమం పాత్రమిదం దయాయాః॥

అనంతుడవైన ఓ భగవానుడా! దీర్ఘకాలముగా సంసార సాగరములో మునిగి ఉన్న నాకు నీవు ఒక ఒడ్డు వంటి వాడవు; ఓ భగవానుడా! నీ కృపకు నేను సముచిత పాత్రుడిని అయ్యాను.

శ్లోకము 25 –  “నీ సంపూర్ణ భారాన్ని నాపై ఉంచినప్పుడు, నీ స్వభావము శ్రీ రామాయణములో సుందర కాండము 9.30లో “…తత్ తస్య సదృషం భవేత్” (శ్రీ రాముడు స్వయంగా వచ్చి లంకను నాశనము చేసి నన్ను రక్షించుట వారి మర్యాద – కావున నేను వారి కొసం ఎదురుచూస్తాను) అన్నట్టుగా ఉండాలి, నిన్ను రక్షించమని ఎందుకు పట్టుపట్టావు?” అని భగవానుడు అడుగగా, “నా దుఃఖాన్ని పోగొట్టమని నేను వేడుకోవడం లేదు; నీ లోకములో నీ భక్తులు బాధపడుతుంటే అది నీ ఔన్నత్యానికి మచ్చ వంటిది; అందుకని, బాధలు పోగొట్టమని విన్నపించుకుంటున్నాను” అని ఆళవందార్లు బదులిస్తున్నారు.

అభూతపూర్వం మమ భావి కిం వా
సర్వం సహే మే సహజం హి దుఃఖం।
కిం తు త్వదగ్రే శరణాగతానాం
పరాభవో నాథ! న తేऽనురూపః ||

ఓ నా స్వామి! నేననుభవించని దుఃఖాలంటూ ఏమి మిగిలున్నాయి? దుఃఖాలను భరిస్తూనే వస్తున్నాను; అవి నాతో పాటు పుట్టాయి. కానీ నీ సమక్షంలో నీ శరణాగతులు బాధలనుభవించుట నీ ఔన్నత్యానికి సముచితము కాదు.

శ్లోకము 26 – “నీ గొప్పతనానికి మచ్చ ఏర్పడుతుందని నీవు నన్ను వదిలి పెట్టినా, నేను నిన్ను వదలను” అని ఆళవందార్లు తమ అనన్యగతిత్వము (నిశ్చలమైన నమ్మకము) ఫలితముగా ఆర్జించిన  మహా విశ్వాసమును ప్రదర్శిస్తున్నారు.

నిరాసకస్యాపి న తావదుత్సహే
మహేశ! హాతుం తవ పాదపంకజం।
రుషా నిరస్తోऽపి శిశుః స్తనందయో
న జాతు మాతు శ్చరణౌ జిహాసతి॥

ఓ సర్వేశ్వరుడా! ఒకవేళ నీవు నన్ను తోసిపుచ్చినా, నీ దివ్య చరణములను నేనెన్నడూ విడువను; ఒకానొక పరిస్థితిలో, తల్లి తన పసిపాపను తోసినా, ఆ పసి బిడ్డ మాత్రము ఆ తల్లిని పట్టుకొనే ఉంటాడు.

శ్లోకము 27 – “నా యొక్క అనన్య గతిత్వము మాత్రమే నిన్నెన్నడూ విడువనీయ కుండా చేసేది? నీ స్వరూపానుభవములో మునిగిన నా మనస్సు ఇక దేనినీ ఆశించదు” అని ఆళవందార్లు తెలియజేస్తున్నారు.

తవామృత స్యందిని పాదపంకజే
నివేశిదాత్మ కథమన్య దిచ్చతి।
స్థితేऽరవిందే మకరంద నిర్భరే
మధువ్రతో నేక్షురకం హి వీక్షతే॥

దివ్య మకరందము వెదజల్లుతున్న నీ దివ్య చరణ కమలముల వద్ద స్థిరమై ఉన్న నా మనస్సు, ఇంకేదైనా ఎలా కోరుకుంటుంది? తేనెతో నిండిన ఎర్రని కమలము ముందున్న తరువాత, తేనీగ గడ్డి పూవులను ఎలా చూస్తుంది?

శ్లోకము 28 –  ” నీవు నాకు సహాయం చేయడానికి ఒక అంజలి (రెండు చేతులు జోడించి ప్రార్థించుట) సరిపోదా?” అని ఆళవందార్లు అడుగుతున్నారు.

త్వదంఘ్రిముద్ధిశ్య కదాపి కేనచిత్
యథా  తతా వాऽపి సకృత్కృతోऽంజలిః।
తదైవ ముష్ణాత్యశుభాన్యశేషతః
శుభాని పిష్ణాతి న జాతు హీయతే॥

ఎవరైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా అంజలి [శారీరిక శరణాగతిని సూచిస్తుంది] పెట్టినప్పుడు, అది ఆనవాలు లేకుండా వెంటనే పాపాలను తొలగించి; మంగళ గుణాలను పెంచుతుంది; అటువంటి మంగళ గుణాలు ఎన్నడూ క్షీణించవు. 

శ్లోకము 29 – ఈ శ్లోకము మానసిక ప్రపత్తి గురించి తెలుపుతుంది.  ప్రత్యామ్నాయంగా –  శ్లోకము 28 “త్వదంగ్రిముద్దిశ్య” మరియు శ్లోకము 29 “ఉదీర్ణ” లలో వివరించిన నట్టుగా, శరణాగతి ప్రతిఫలంగా  పరభక్తి  లభిస్తుందని చెప్పవచ్చు.

ఉదీర్ణ సంసార దవాశుశుక్షణిం
క్షణేన నిర్వాప్య పరాం చ నిర్వృతిం।
ప్రయచ్చతి త్వచ్ఛరణారుణాంబుజ
ద్వయానురాగామృతసింధుశీకరః॥

నీ ఎర్రని లేత దివ్య చరణ కమలముల యందు భక్తి, మహాసాగరములో ఒక చిన్న బిందువు వంటిదైనా సరే, సంసారము (లౌకిక బంధనములు) యొక్క కార్చిచ్చుని ఒక్క క్షణములో ఆర్పివేయుటతో పాటు దివ్య పరమానందమును కూడా అనుగ్రహిస్తుంది.

శ్లోకము 30 –  ఆలస్యము కాకుండా సత్వరమే ఫలితమునిచ్చు సిద్దోపాయమును (స్థాపితమైన సాధనము, భగవానుడు) ఆళవందార్లు స్వీకరించగా, ‘త్వర’తో ప్రేరేపితులై వారు, తిరువాయ్మొళి 6.9.9 లో చెప్పినట్టుగా “కూవిక్ కొళ్ళుం కాలం ఇన్నం కుఱుగాదో” (మిమ్మల్ని చేరుకునే రోజు త్వరలో రాదా?) అని ఆతృత చెందుతున్నారు. ప్రపత్తి ఫలితమైన పరభక్తి కారణముగా, తిరువాయ్మొళి 6.3.10 లో చెప్పినట్టుగా, “కనైకళల్ కాణ్బదెన్ఱుకొల్ కణ్గళ్” (నా కళ్ళు భగవానుడి దివ్య చరణాలను ఎప్పుడు చూస్తాయి?) మరియు తిరువాయ్మొళి 9.5.1లో చెప్పినట్టుగా, “కాణక్ కరుదుమ్ ఎన్ కణ్ణే” నా కళ్ళు నిన్ను చూడాలని కోరుకుంటున్నాయి, అని ఆళవందార్లు తన స్థితిని వ్యక్తపరచుచున్నారు. 

విలాసవిక్రాంత పరావరాలయం
నమస్యదార్తిక్షపణే కృతక్షణం।
ధనం మదీయం తవ పాదపజ్ఞ్కజం
కదా ను సాక్షాత్కరవాణి చక్షుషా॥  

దేవలోకము నుండి పాతాల లోకమువరకు కొలిచిన నీ పాదములు, ఆశ్రయించి ఆరాధించువారి దుఃఖాలను తొలగించే నీ దివ్య పాదములు, నాకు గొప్ప సంపద అయిన నీ దివ్య పాద పద్మములను నేనెన్నడు చూస్తాను?

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-21-to-30-simple/

పొందుపరచిన స్థానము : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment