శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీ మణవాళ మాముణులు తమ ఉపదేశరత్తిన మాల 10వ పాశురములో అమలనాదిపిరాన్ యొక్క వైభవమును అద్భుతంగా వెల్లడించారు.
కార్తిగైయిల్ రోహిణి నాళ్ కాణ్మిన్ ఇన్ఱు కాశినియీర్!
వాయ్ త్త పుగళ్ పాణర్ వన్దుదిప్పాల్! ఆత్తియర్ గళ్
అన్బుడనేదాన్ అమలనాదిపిరాన్ కత్త దఱ్పిన్!
నన్గుడనే కొణ్డాడుమ్ నాళ్!!
ఓ! ప్రపంచ జనులారా! వీక్షించండి, ఈ రోజు కార్తీక మాసమున రోహిణీ నక్షత్రము, తిరుప్పాణాళ్వార్ అవతరించిన శుభదినము. వేదములను నమ్మి గౌరవించిన వారు ఈ ఆళ్వార్ పాడిన అమలనాదిపిరాన్ ప్రబంధాన్ని అభ్యసించిరి. అభ్యసించిన పిదప ఈ ప్రబందము పది పాసురములలో వేదార్థములు అందముగా వివరించి ఉన్నాయని, సదా పశ్యంతి (ఎల్లప్పుడు ఎమ్పెరుమాన్ ను చూస్తూ) అని వారు ఈ దినమును వారు కీర్తించిరి.
తిరుప్పాణాళ్వార్ తాము కృప చేసిన పది పాశురముల ద్వారా, పెరియ పెరుమాళ్ (శ్రీ రంగములో శయనించి ఉన్న శ్రీ రంగనాథుడు) యొక్క దివ్య తిరుమేనియే తాము అనుభవించ గలిగే విషయమని పేర్కొన్నారు . శ్రీ రంగ ఆలయ పురోహితులైన లోకసారంగముని, తిరుప్పాణాళ్వార్ల విషయం లో ఒక అపచారము చేసారు. ఆ కారణముగా అళ్వార్ ని తీసుకురమ్మని పెరియ పెరుమాళ్ ఆ అర్చకుడిని ఆదేశిస్తారు. లోకసారంగముని వెంటనే తిరుప్పాన్ ఆళ్వార్ వద్దకు వెళ్లి తనతో పాటు ఆలయానికి రమ్మని ప్రార్థిస్తారు. కానీ, ఆళ్వార్ తాను శ్రీ రంగములో అడుగు పెట్టడానికి అర్హులు కారని, తాను రాలేరని నిరాకరిస్తారు. అప్పుడు లోకసారంగమునివరులు ఆళ్వారి ని తన భుజాలపై ఎత్తుకొని తీసుకు వెళతారు. ఈ విధముగా ‘మునివాహనులు’ అనే విశిష్టమైన తిరునామాన్ని ఆళ్వార్ సంపాదించుకున్నారు. వారు ఆలయములో ప్రవేశించిన క్షణం నుండి ప్రారంభించి పెరియ పెరుమాళ్ సమక్షమములోకి వేంచేసే వరకు పాశురములు పాడారని, పదవ పాశురము పాడిన తరువాత వారు పరమపదాన్ని అధీష్ఠించారని మనుకు చరిత్ర చెబుతుంది.
మన పూర్వాచార్యులు ఈ ప్రబంధము యొక్క పాశురముల మధ్య సంబంధమును రెండు భిన్నమైన రితులలో వ్యక్తపరచారు. పెరియ పెరుమాళ్ తమ అవయవాలను వ్యక్తపరచిన క్రమములో ఆళ్వార్ అనుభవించారన్నది మొదటిది. రేండవది పెరియ పెరుమాళ్ కురిపించిన ఉపకారములు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాశురానుభవము చేయుట తగును.
ఈ పాశురముల సరళ వ్యాఖ్యానము మన పూర్వాచార్యుల వ్యాఖ్యానముల సహాయముతో వ్రాయబడింది.
తనియన్లు
ఆపాదచూడ మనుభూయ హరిం శయానం
మధ్యే కవేర దుహితుర్ ముదితాంతరాత్మా|
అద్రష్టతాం నయనయోర్ విషయాంతరాణాం
యో నిశ్చికాయ మనవై మునివాహనం తం||
పెరియ పెరుమాళ్ తప్పా ఇంకే విషయముతో అనుబంధము ఉంచుకోని తిరుప్పాణాళ్వార్, లోకసారంగముని సహాయముచే లోనికి వెళ్లి పెరియ పెరుమాళ్ యొక్క దివ్య చరణాల నుండి మకుటము వరకు అనుభవించి పరమానందాన్ని పొందిన తిరుప్పాణాళ్వార్ని నేను ఆరాధిస్తాను.
కాట్టవే కణ్డ పాద కమలమ్ నల్లాడైయుంది
తేట్టరుమ్ ఉదరబందమ్ తిరుమార్వు కండమ్ చ్చెవాయ్
వాట్టమిల్ కణ్గళ్ మేని ముని యేరి తని పుగుందు
పాట్టినాల్ కండు వాళుం పాణర్ తాళ్ పరవినోమే
లోకసారంగముని సహాయముచే పెరియ పెరుమాళ్ సన్నిధి లోనికి ఒంటరిగా వెళ్ళి, పెరుమాళ్ యొక్క కమలముల వంటి శ్రీపాదములు, అందమైన పీతాంబరము, దివ్య నాభి, అతి మృదువైన దివ్య ఉధరభాగము, దివ్య వక్షస్థలము, దివ్య కంఠము, ఎర్రని నోరు, అప్పుడే వికసించిన కమలముల వంటి కన్నులు, వీటన్నింటితో కూడిన దివ్య తిరుమేనిని సేవించుకొని వాటిని వర్ణించడమే తమ జీవిత ధ్యేయముగా చేసుకొని ఆనందించిన తిరుప్పాణాళ్వార్ శ్రీపాదములను ఆశ్రయించెదము.
**********
మొదటి పాశురము: పెరియ పెరుమాళ్ వ్యక్త పరచిన తమ దివ్య చరణములను వీక్షించిన ఆళ్వార్ వాటిని కీర్తిస్తున్నారు.
ఏ అపేక్షను ఆశించకుండ తనను దాసునిగా స్వీకరించి, ఆపై తన దాసులకు దాసునిగా చేసి నందుకు పెరియ పెరుమాళ్ యొక్క శుద్ధమైన మంగళ గుణాలను ఆళ్వార్ కీర్తిస్తున్నారు.
అమల నాదిపిరాన్ అడియార్కెన్నై ఆట్పడుత్త
విమలన్ విణ్ణవర్ కోన్ విరై యార్ పొళిల్ వేంగడవన్
నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్ మదిళ్ అరగత్తమ్మాన్
తిరుక్కమలపాదం వన్దు ఎన్ కణ్ణిన్ ఉళ్లన వొక్కిన్ఱతే (1)
ఎత్తైన గోడలతో నిర్మింపబడి ఉన్న తిరువరంగంలో శయనించి ఉన్న ఓ స్వామీ! నా నుంచి ఏ ఫలమును ఆశించని అత్యంత పవిత్రమైన వాడివి నీవు; నీకు దాసునిగా చేసుకోవడమేగాక నీ అనుచరులకు కూడా దాసుగా చేసే స్వచ్చత గలిగిన వాడివి; నిత్యసూరులకు యజమానుడివి నీవు; సువాసనలు వెదజల్లే పూల తోటలతో నిండి ఉన్న తిరువేంగడంలో నిత్య నివాసము ఉన్నవాడివి నీవు; నీ అనుచరులు సులభముగా సమీపించే స్వచ్చత గలిగిన వాడా; నీ అనుచరుల లోపాలను చూడని గుణము గలిగిన వాడా; నీవు స్వామిత్వము – శేశత్వము అవిచ్చిన్నముగా ఉండే పరమపదమును ఏలు వాడవు. నీ దివ్య చరణములు తమకు తాముగా వచ్చి తన కన్నులలోకి ప్రవేశించాయని ఆళ్వార్ సాగించారు .
రెండవ పాశురము: తిరు పీతాంబరమును ఆళ్వారులు ఆస్వాదిస్తున్నారు. ఎలాగైతే సముద్ర అలలు పడవను మెల్లిగా తోస్తాయో, పెరుమాళ్ యొక్క దివ్య తిరుమేనిలో ఆళ్వార్ ఒక అంగము నుండి ఇంకొక అంగము వైపు తోయబడుతున్నారు.
పెరుమాళ్ యొక్క నిర్హేతుక కృప ఇంకేక్కడైనా ప్రదర్శించారా అని ప్రశ్నించి నప్పుడు, ఆళ్వార్ త్రివిక్రముని వృత్తాంతము చూపిస్తూ ఆనందిస్తున్నారు.
ఉవంద ఉళ్ళత్తనాయ్ ఉలగం అళందండం ఉఱ
నివంద నీళ్ముడియన్ అన్ఱు నేరంద నిశాశరరై
కవరంద వెంగణై క్కాగుత్తన్ కడియార్ పొళిల్ అరంగత్తమ్మాన్
అరైచ్చివంద ఆడైయిన్ మేల్ శెన్ఱదాం ఎన శిందనైయే (2)
ముల్లోకాలను కొలిచేటప్పుడు పెరుమాళ్ యొక్క ఆ దివ్య కిరీటము ఈ బ్రహ్మాండమునంతా వ్యాపించినది. క్రూరంగా బాధించునట్టి తన బాణములతో అసురులను వధించిన శ్రీ రాముడే సువాసనలు వెదజల్లే పూలతోటలతో చుట్టు ముట్టి ఉన్న శ్రీరంగములో పెరియ పెరుమాళ్ రూపములో శయనించి ఉన్నాడు. వారి దివ్య నడుమును చుట్టి ఉన్న ఆ దివ్య పీతాంబరముపై నా మనస్సు నిలిచి ఉంది.
మూడవ పాశురము: ఇందులో, భగవాన్ యొక్క దివ్య నాభికమలమును అనుభవిస్తున్నారు. బ్రహ్మ అధీష్టించిన తరువాత ఆ దివ్య నాభి యొక్క సౌందర్యము మరింత పెరిగినదని వారు తెలియజేస్తున్నారు.
మునుపటి పాశురములో త్రివిక్రమ అనుభవాన్ని పొందిన ఆళ్వార్, ఈ పాశురములో తిరువేంకటనాధునిగా ప్రత్యక్షమైన భగవానుడిని పరమానందిస్తున్నారు. పెరియ పెరుమాళ్ మరియు తిరువేంకటనాధుడు ఇరువురు ఒకే ఎంబెరుమాన్ యొక్క రెండు దివ్య స్వరూపాలు అని తెలియజేస్తున్నారు.
మంది పాయ్ వడవేంగడ మామలై వానవర్గళ్
శందిశెయ్య నిన్ఱాన్ అరంగత్తర వినణైయాన్
అంది పోల్ నిఱై త్తాడైయుం అదన్ మేల్ అయనై ప్పడైత్తదోర్ ఎళిల్
ఉంది మేలదన్ఱో అడియేన్ ఉళ్ళత్తిన్ ఉయిరే (3)
తమిళ దేశానికి ఉత్తరాన ఉన్న తిరుమల కొండపై పెరుమాళ్ నిలుచొని ఉన్నారు, కోతులు గేంతుకుంటూ ఆడుకొనే ఈ కొండకు నిత్యసూరులు వేంచేసి పెరుమాళ్ని శ్రీనివాసుని రూపంగా ఆరాధిస్తారు. వారే శ్రీరంగంలో మెత్తని శేష శెయ్యపై (ఆదిశేషునిపై) పవళించిఉన్నారు. నా మనస్సులో ఉన్న నా ఆత్మ, ఎర్రటి ఆకాశము వలె కనిపించే పెరుమాళ్ యొక్క దివ్య పీతాంబరము, ఆ దివ్య పీతాంబరముపైన ఉన్న బ్రహ్మాసీనులైన దివ్య నాభీకమలముపై నిలవదా?
నాల్గవ పాశురము: ఎంబెరుమాన్ యొక్క దివ్య నాభితో కూడిన ఉదర భాగాన్ని దర్శించి ఆళ్వార్ ఆనందిస్తున్నారు. ఆ దివ్య నాభిని వ్యాపించి ఉన్నది బ్రహ్మ అయితే, “సమస్థ లోకాలను నాలో ఉంచుకున్నాను, కాదా!” అని ఆ దివ్య ఉదరము చెబుతుంది.
ఎంబెరుమాన్ మనల్ని స్వీకరించే ముందు మన అహంకార మమకారములు తొలగించరా? లంకను చుట్టి ఉన్న ఎత్తైన ప్రహరీ గోడలను పడగొట్టినట్టుగా, వారి శత్రువులను కూడా తొలగిస్తారు అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
శదుర మామదిళ్ శూళ్ ఇలంగైక్కిరైవన్ తలైపత్తు
ఉదిర ఓట్టి ఓర్ వెంగణనై ఉయత్తవన్ ఓద వణ్ణన్
మదుర మావండు పాడ మా మయిలాడరంగత్తమ్మాన్ తిరు వయిత్తు
ఉదర బందం ఎన్ ఉళ్ళత్తుళ్ నిన్ఱులాగిన్ఱదే (4)
కూనిరాగములు పాడుతున్న తుమ్మెదలు మరియు నాట్యము చేస్తున్న నెమలులు ఉన్న శ్రీరంగములో పెరియ పెరుమాళ్ శయనించి ఉన్నారు. అటువంటి పెరియ పెరుమాళ్ నాలుగు విధములైన రక్షణములు ఉన్న లంకా నాయకుడైన రావణుడిని యుద్దములో వణుకుపుట్టించాడు. సాగర వర్ణము గల ఎంబెరుమాన్ ఆ తరువాత దశ ముఖ రావణుడిని వధించాడు. పెరియ పెరుమాళ్ యొక్క ఉదర భాగాన్ని అలంకరించిన దివ్యాభరణము నా యొక్క హృదయములో దృఢముగా నిలిచిపోయింది.
ఐదవ పాశురము: ఈ పాశురములో ఆళ్వార్ పెరియ పెరుమాళ్ యొక్క దివ్య వక్షస్థలమును ఆనందిస్తున్నారు. ఎంబెరుమాన్ యొక్క ఆ దివ్య వక్షస్థలములో చిత్ మరియు అచిత్తులకు గుర్తింపుగా శ్రీవత్సము మరియు కౌస్తుభములు ఉంటాయి. ప్రళయ కాలములో ముల్లోకాలను తన కడుపులో ఉంచు కున్న వారి దివ్య ఉధర భాగము కంటే అవి చాలా విలువైనవి. పెరుమాళ్ యొక్క గుర్తింపైన పెరియ పిరాట్టి నివాస స్థలము కూడా ఈ వక్షస్థలమే. వారి వక్షస్థల సౌందర్యాన్ని వీక్షించమని ఆహ్వానింపబడిన ఆళ్వార్, దానిని చూసి పరమానందిస్తున్నారు.
అహంకార మమకారములు నశించిన తరువాత ఆత్మను పాప పుణ్యములు వెంటాడవా? ఎంబెరుమాన్ వాటిని కూడా నశింపజేస్తాడని ఆళ్వార్ వివరిస్తున్నారు.
పారమాయ పళవినై పత్తఱుత్తు ఎన్నై త్తన్
వారమాక్కి వైత్తాన్ వైత్తదన్ఱి ఎన్నుళ్ పుగుందాన్
కోర మాదవం శెయ్ దనన్ కొల్ అఱియేన్ అరంగత్తమ్మాన్
తిరు ఆరమార్వదన్ఱో అడియేనై ఆట్కొడదే (5)
ఎన్నో జన్మలలో చేసిన కర్మలు కూడి కూడి పెద్ద మూట అయ్యి, నన్ను వెంటాదుతూ ఉన్నాయి, అయినా స్వామి తన పైన ఆప్యాయత పెరిగేలా తాను చేశారు. అంతటితో ఆగక, అయన నా హృదయములో ప్రవేశించారు. నా పూర్వ జన్మలలో నేను ఏ ఘోర తపస్సు చేశానో ఏమో, ఈ రోజు నాకు ఇంతటి అదృష్టము దక్కినది. ఆ శ్రీరంగానికి నాథుడైన పెరియ పెరుమాళ్ యొక్క దివ్య వక్షస్థలము, ఆ దివ్య వక్షస్థలములో శ్రీ మహాలక్ష్మి, దివ్య ఆభరణాలు ఈ దాసుడిని సేవకుడిగా చేసినవి.
ఆరవ పాశురము: ఈ పాసురములో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క దివ్య కంఠభాగమును అనుభవిస్తున్నారు. ప్రళయ కాలమున పిరాట్టితో పాటు చిదచిత్తులు ఎంబెరుమాన్ యొక్క వక్షస్థలములో ఉంటాయి, అన్ని లోకాలను నేను మ్రింగి రక్షిస్తాను అని దివ్య కంఠభాగము పలికిన పలుకులు విని ఆళ్వార్ ఆనందానుభవము పొందుతున్నారు.
ఎంబెరుమాన్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరి పాపాలైనా ఇలా తొలగించారా? బ్రహ్మ శాపముతో బాధ పడుతున్న శివుడిని ఎంబెరుమాన్ శాప విమోచనము చేశారు, చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోతుండగా శాప విమోచనము చేశారు అని ఆళ్వార్ గుర్తుచేసుకుంటున్నారు.
తుండ వెణ్పిఱై యాన్ తుయర్ తీర్తవన్ అంజిరై
వండువాళ్ పొళిల్ శూళ్ అరంగనగర్ మేయ అప్పన్
అండర్ రండ బగిరండత్తు ఒరు మానిలం ఎళుమాల్ వరై ముత్తుమ్
ఉణ్డ కండ కండీర్ అడియేనై ఉయ్యక్కొండదే (6)
అర్థ చంద్రాకారుడిని తలపై ధరించిన శివుడి బాధను ఎంబెరుమాన్ తొలగించి వెశారు. ఇంకా అర్థ చంద్రాకారుని బాధను కూడా ఎంబెరుమాన్ మాయము చేశారు. అందమైన రెక్కలతో ఉన్న తూనీగలు విహరిస్తున్న తోటలతో చుట్టు ముట్టి ఉన్న శ్రీరంగములో పెరియ పెరుమాళ్ చక్కగా ఒప్పి ఉన్నారు. అన్ని అండములలో ఉన్న జీవరాసులను, లొకాలను, ఆ విశ్వాలపై ఉన్న పొరలన్నీ మరియు అన్ని తత్వాలను మ్రింగిన పెరియ పెరుమాళ్ యొక్క ఆ దివ్య కంఠము తనని ఉద్దరింప జేసింది అని ఆళ్వార్ తెలియజేస్తున్నారు.
ఏడవ పాశురము: ఇందులో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క దివ్యమైన నోటిని మరియు వారి అధరములను సేవించి ఆనందిస్తున్నారు. ఆ దివ్యమైన నోరు ఆళ్వార్ తో “దివ్య కంఠము లోకాలన్నీటిని మింగినప్పటికీ, మొదట లోకాలన్నిటినీ తాను తీసుకొని వాటితో మా శుచః (చింతించవద్దు) అని వూరటనిచ్చే మాటలు పలుకుతాను” అని ఆ దివ్య నోరు పలికిన మాటలను విన్న ఆళ్వార్ ఆనందిస్తున్నారు.
రుద్రుడు మొదలైన వారి రక్షణ ఎంబెరుమాన్ వహిస్తాడు. కానీ నిన్ను రక్షిస్తాడా? ఇతర లాభాలను ఆశించే దేవలోక వాసులకన్నా ఎక్కువగా నేను ఎంబెరుమాన్ ని ఆశిస్తాను, నన్ను తప్పక రక్షిస్తారని ఆళ్వార్ తమ మనస్సుకు బదులిస్తున్నారు.
కైయినార్ శురి శంగన లాళియర్ నీళ్వరై పోల్
మెయ్యనార్ తుళబవిరైయార్ కమళ నీళ్ ముడియమ్
ఐయ్యనార్ అణి అరంగనార్ అరవిన్ అణైమిశై మేయ మాయనార్
శెయ్య వాయ్ అయ్యో ఎన్ చ్చిందై కవరందదువే (7)
పెరియ పెరుమాళ్ వద్ద ముడుచుకొని ఉన్న దివ్య శంఖము, కోటి కాంతులను వెదజల్లే దివ్య చక్రము, విశాలమైన పర్వతము వంటి దివ్య తిరుమేని, సువాసనలు వెదజల్లే దివ్య తుళసితో అలంకరింపబడిన పొడుగాటి దివ్య కిరీటము ఉన్నాయి. అందమైన శ్రీ రంగములో ఆదిశేషునిపై శయనించి ఉన్నారు. ఆ దివ్య క్రియాకలాపాలతో ఉన్నవారు నా స్వామి. ఆ స్వామి యొక్క ఎర్రని దివ్య నోరు నన్ను ఆకర్షించింది.
ఎనిమిదవ పాశురము: ఈ పాశురములో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క దివ్య నేత్రాలను ఆనందిస్తున్నారు. వారి దివ్య నోరు ఏం చెప్పినా కానీ, వారి ఆధిపత్యాన్ని సూచించే వాత్సల్యాన్ని కురిపించేది వారి నేత్రాలు మాత్రమే. కావున ఆళ్వార్ భగవాన్ దివ్య నేత్రాలను ఆనందిస్తున్నారు.
నాలుగు మరియు ఐదవ పాశురములలో మన పూర్వ కర్మలు, అహంకార మమకారములు నిర్మూలించబడతాయని చూపబడింది. అవి తొలగించబడినా కానీ, ఆ మనిషిలో “అవిధ్య” (అజ్ఞానము) ఇంకా ఉంటే అతని అహంకార మమకారములు మొదలైనవు తిరిగి రావచ్చు కదా? అవిధ్యకు చిహ్నమైన తమో గుణానికి ప్రతిరూపమైన హిరణ్య కశిపుడిని ఎంబెరుమాన్ వధించినట్టుగా, మన తమో గుణాన్ని కూడా ఎంబెరుమాన్ తొలగిస్తాడు అని ఆళ్వార్ తెలియజేస్తున్నారు.
పరియన్ ఆగి వంద అవుణన్ ఉడల్ కీండ అమరర్ క్కు
అరియ ఆది పిరాన్ అరంగత్తమలన్ ముగత్తు
కరియవాగిప్పుడై పరందు మిళిరిందు శెవ్వరి ఓడి నీంద అ
ప్పెరియ వాయ కణ్గళ్ ఎన్నై ప్పేదైమై శెయ్దనవే (8)
విశాల స్వరూపముతో దిగివచ్చి హిరణ్య కశిపుని చీల్చి వేసినాడు; బ్రహ్మాది దేవతలకు కూడా చిక్కని ఆ సర్వకారకుడు, సకల జనులకు శుభాలను ఒసగేవాడు శ్రీ రంగములో శయనించి ఉన్నాడు. వారి దివ్య శ్రీ ముఖములోని పొడగాటి నల్లని దివ్య నేత్రములు, విశాలముగా, ఎర్రని రేఖలతో అద్భుతముగా ఉన్న వారి నేత్రములు నన్ను కొల్లగొట్టినవి అని ఆళ్వార్ తెలియజేస్తున్నారు.
తొమ్మిదవ పాశురము: ఈ పాశురములో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క సంపూర్ణ దివ్య తిరుమేనిని ఆస్వాదిస్తున్నారు. ఎంబెరుమాన్ యొక్క అగడితఘటనా గుణాన్ని (బంధించలేని తత్వాలను బంధించగల లక్షణము) ఆనందిస్తున్నారు. వేదాంత పరిజ్ఞానము (వేదముల యొక్క చివరి భాగము, దీనినే ఉపనిషత్తులు అని కూడా అంటారు) ఉన్నట్లైతేనే తమో గుణము తొలగుతుంది. కానీ ఆళ్వార్ వేదాధ్యయానికి అర్హతలేని వంశములో జన్మించారు. ఈ ప్రశ్న తలెత్తినప్పుడు, ” ఎంబెరుమాన్ ఎవ్వరూ ఊహించలేని రీతిలో అన్ని లోకాలను మ్రింగి వటపత్ర శాయి రూపములో ఒక రాగి ఆకు పైన ఎలాగైతే శయనించారో, తన తమో గుణాన్ని కూడా అలానే నిర్మూలిస్తారు” అని ఆళ్వార్ బదులిచ్చిరు.
ఆలమా మరత్తిన్ ఇలై మేల్ ఒరు పాలకనాయ్
జ్ఞాలం ఏళుం ఉండాన్ అరంగత్తరవిన్ అణైయాన్
కోలమా మణి ఆరముం ముత్తు త్తామముం ముడి విల్లదోర్ ఎళిల్
నీల మేని ఐయో నిఱై కొండదు ఎన్ నెంజినైయే (9)
అన్ని లోకాలను మ్రింగి లేత రాగి ఆకుపై శయనించి ఉన్నవాడే శ్రీ రంగములో ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు. ముత్యాలు మరియు వజ్ర వైడూర్యాలతో తయారు చేయబడిన దివ్య తిరు ఆభరణాలతో అలంకరింపబడిన ఆ అద్వితీయమైన వారి నల్లని తిరుమేని నన్ను ఆకర్షించినది . అయ్యొ! నేను ఏమి చెయగలను!
పదవ పాశురము: చివర్లో ఆళ్వార్ పెరియ పెరుమాళ్ స్వరూపములో శ్రీ కృష్ణుడిని చూసి, ఇంక దేనిని చూసే ఆశ లేదని, ఎంబెరుమాన్ దివ్య చరణములను పొంది శ్రీవైకుంఠాని చేరుకున్నారు.
కొండల్ వణ్ణనై క్కోవలనాయ్ వెణ్ణెయ్
ఉణ్డ వాయన్ ఎన్ ఉళ్ళం కవర్దానై
అణ్డర్ కోన్ అణి అరంగన్ ఎన్ అముదినై
కండ కణ్గళ్ మత్తోన్ఱినై క్కాణావే (10)
మేఘ వర్ణములో మరియు మేఘము యొక్క గుణాలతో ఉన్నవాడు, యదు వంశములో పుట్టి వెన్న దొంగిలించినవాడు, నా మనస్సు దోచినవాడు, నిత్యసూరులకు నాయకుడైనవాడు శ్రీరంగములో శయనించి ఉన్నాడు. సంతుష్టమైన ఎంబెరుమాన్ ని చూసిన నా కళ్ళు ఇకపై దేనిని చూడవు.
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/amalanadhipiran-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org
Happy to read amalaNAdhipirAn, with meaning. AZHWAR thiruvadigale saranam, Jai srimannarayana