శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఇప్పుడు, ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు, తిరువాయ్ ప్పాడి (శ్రీ గోకులం) లోని ఐదు లక్షల గొల్ల భామలను మేల్కొలపడానికి ప్రతినిధులుగా ఆండాళ్ పది మంది గోపికలను మేల్కొల్పుతుంది. ఆమె వేదలో నైపుణ్యము ఉన్న పది మంది భక్తులను మేల్కొలిపే విధానము బట్టి ఈ పాశురములు అమర్చబడ్డాయి.
ఆరవ పాశురము: ఇందులో, ఆమె కృష్ణానుభవానికి క్రొత్తదగుటచే ఈ వ్రత వైభవము తెలియక తానొక్కతియే తన భవనములో పరుండి వెలికి రాకుండా ఉన్న ఒక ముగ్ధను లేపుచున్నారు. భాగవంతుడిని అనుభవించడంలో ఇది ప్రథమ పర్వ నిష్ఠ (మొదటి దశలో ప్రవేశించడం). ఇతర భక్తులతో కలిసి ఉండాలని అర్థం చేసుకుంటే, అది చరమ పర్వ నిష్ఠ (అంతిమ దశలో ప్రవేశించడం) అవుతుంది.
పుళ్ళుమ్ శిలుంబిన కాణ్ పుళ్ళ రైయన్ కోయిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు అరియన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
ఆహారమును ఆర్జించు కొనుటకై లేచి పక్షులు కలకల లాడుతూ పోవుచున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి యగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సేవలకు సమయమైనది రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుట లేదా ! ఓ పిల్లా! లెమ్ము!. మేము ఎవరు లేపగా లేచితిమన్న సందేహము కలుగ వచ్చు. పూతన యొక్క స్తనములందుండు విషమునారగించినవాడును , అసూరావేషము కలిగి చంపుటకు వచ్చిన శకటమును కీలూడునట్లు, పాలకై ఏడ్చి కాలుచాచి పొడిపొడి యగునట్లు చేసినవాడును, క్షీర సముద్రములో చల్లని మెత్తని సుకుమారమైన ఆదిశేషునిపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో ఉన్న జగత్ కారాభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయములో పదిలపరచుకొని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి-హరి-హరి యనుచుండు నపుడు వెడలిన పెద్దధ్వని మా హృదయములలో చొచ్చి, చల్ల పరచి మమ్ములను మెలకొల్పినది – నీవు కూడా లేచిరామ్ము.
ఏడవ పాశురము: ఇందులో, కృష్ణానుభవములో ప్రావీణ్యం ఉన్న ఒక గోపికను ఆండాళ్ మేల్కొలుపుతుంది. అయితే, ఈ గోపిక అండాళ్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినడానికి తన ఇంటి లోపలే ఉంది.
కీశు కీశెన్ఱెంగుం ఆనై చ్చాత్తన్ కలన్దు
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుమ్ పిరప్పుమ్ కలకలప్పక్కై పేర్తు
వాశ నఱుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర్ అరవమ్ కేట్టిలైయో
నాయక ప్పెణ్పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ తిఱ వేలో రెమ్బావాయ్.
భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలిసికొని అన్ని వైపుల ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ద్వనినైననూ నీవు వినలేదా !
ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధము వేదజల్లుచున్న జుట్టు ముడులు గల గోపికలు, కవ్వముతో పెరుగును చిలుకుతుండగా, వారి చేతుల కంకణ ధ్వనులు, వారి మెడలో ఆభరణాల ధ్వనులతో ఆ శబ్దము విజృంభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనిని వినలేదా? ఓ నాయకులారా ! సర్వ పదార్దములలో వాత్సల్యముతో వ్యాపించియుండి ,మనకు కన్పడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడు గా అవతరించి , విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లు తలుపు తెరవవలయును.
ఎనిమిదవ పాశురము: ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది.
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు
మేయ్వాన్ పరన్దన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వన్దు నిన్ఱోమ్ కోదుకలమ్ ఉడైయ
పావాయ్ ఎళున్దిరాయ్ పాడి ప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱునామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.
శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపికా! తూర్పు దిక్కున తెల్లవారుతున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. మిగిలిన గోపికలందరు కూడా వ్రత స్థలానికి బయలుదేరారు, అలా పోవుటయే తమకు ప్రయుజనమనునట్లు వెళుచున్నారు. ఆ పోయేవారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలుచున్నాము. కుతూహలము కలదానా – ఓ పడతీ ! లేచిరమ్ము!, కేశి అనే రాక్షసుడి చీల్చి వధించిన వానిని, కంసుని మల్లయోధులను చంపిన వానిని, నిత్యాసురులకు నాయకుడైన కృష్ణుడిని మనం వెళ్ళి ఆరాధిస్తే, అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షించును .
తొమ్మిదవ పాశురము: ఇక్కడ, ఆమె ఎంబెరుమాన్ మాత్రమే ఉపాయమని దృఢమైన నమ్మకము ఉండి, ఎంబెరుమాన్ తో వివిధ మనోహరమైన రీతులలో వారిని ఆస్వాదిస్తున్న గోపికను మేల్కోలుపుతుంది. ఈగోపిక “ శ్రీ రాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షిస్తాడు” అని హనుమంతుడి తో చెప్పిన సీత పిరాట్టి లాంటిది.
తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్ అవళై యెళుప్పీరో? ఉన్ మగళ్ దాన్
ఊమైయో అన్ఱిచ్చెవిడో అనన్దలో
ఏమ ప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్ఱు ఎన్ఱు
నామమ్ పలవుమ్ నవిన్ఱేలో రెమ్బావాయ్
పరిశుద్దమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖమైన శయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరు ధూపము గుమగుమలాడు చుండగా నిద్రపోవుచున్న అత్త కూతురా! మణి కావాటపు గడియ తీయుము. ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము – నీ కుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక జాడ్యము కలదా? లేక ఎవరైనా కావలి ఉన్నారా ? లేక గాఢ నిద్ర పట్టు నట్లు మంత్రించినారా ? “మహా మాయావీ ! మాధవా ! వైకుంఠ వాసా!” అని అనేక నామాలను కీర్తించాము, కానీ ఆమె లేచినట్లు లేదు.
పదవ పాశురము: ఈ పాశురములో ఆండాళ్ శ్రీకృష్ణుడికి ప్రియమైన ఒక గోపికను మేల్కోలుపుతుంది. పరమాత్మని పొందటానికి అతనే మార్గమని ప్రగాఢమైన విశ్వాసముతో ఉంది, ఈ కారణంగా ఆమె ఎంబెరుమాన్ కి అతి ప్రియమైనది కూడా.
నోఱ్ఱు చ్చువర్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్
మాఱ్ఱముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాఱ్ఱత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోఱ్ఱప్పరై త్తరుమ్ పుణ్ణియనాల్ పణ్ణొరునాళ్,
కూఱ్ఱత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోఱ్ఱు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆఱ్ఱ అనన్దల్ ఉడైయాయ్ అరుంగలమే
తేఱ్ఱమాయ్ వన్దు తిత్తవేలో రెమ్బావాయ్
మేము రాకముందే నోము నోచి, దాని ఫలితముగా సుఖానుభవము పొందిన ఓ తల్లీ ! తలుపు తెరవక పోయినా, కనీసము మాటలైనా పలుకవా! పరిమళముతో నిండిన తులసి మాలలు ధరించి కిరీటముగల నారాయణుని కారణముగా ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు ,నిద్రలో నీచే ఓడింపబడి తనసొత్తగు ఈ నిద్రను నీకు ఒసంగినాడా ! ఇంత ఆధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరికి శిరో భూషణమైన దానా ! మైకము వదిలి వచ్చి తలుపు తెరువుము.
పదకొండవ పాశురము: ఇందులో, బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్ర లేపుతుంది. ఈ పాశురములో, వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది.
కఱ్ఱు క్కఱవై క్కణంగళ్ పలకఱన్దు
శఱ్ఱార్ తిఱల్ అళియచ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుఱ్ఱ మొన్ఱిల్లాద కోవలర్ తమ్ పొఱ్కొడియే
పుఱ్ఱరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుఱ్ఱత్తుతోళిమార్ ఎల్లారుమ్ వన్దు నిన్
ముఱ్ఱమ్ పుగున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిఱ్ఱాదే పేశాదే శెల్వప్పెండాట్టి నీ
ఎఱ్ఱుక్కు ఱంగుమ్ పొరుళ్ ఏలోర్ రెమ్బావాయ్.
లేగ దూడలు గలవియు, దూడలవలే ఉన్నవియునగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుక గలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును, ఏ దోషము లేనివారును యగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగా ! పుట్టలోని పాము పడగవలే సన్నని నడుము గలదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలును మొదలగు అందరూ వచ్చిరి. నీ ముంగిట చేరిరి. నీలమేఘ వర్ణము గల శ్రీ కృష్ణుని నామములను కీర్తించు చుండిరి. అయినా కానీ నీవు ఉలుకక పలుకక ఉన్నావేమీ ? ఓ సంపన్నురాలా! నీ నిద్ర అర్థమేమో తెలుపుము.
పన్నెండవ పాశురము: ఇందులో, ఆమె శ్రీకృష్ణుడి ఒక సఖుని యొక్క సోదారి అయిన ఒక గోపికను మేల్కోలుపుతుంది, శ్రీకృష్ణుడి యొక్క ఆ సన్నిహితుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడు, కానీ ఎంబెరుమాన్ యొక్క కైంకర్యంలో మునిగి ఉంటాడు. ఏదేమైనా, అతను కైంకార్యం చేయడం పూర్తి చేసి, తన దినచర్యలను నిర్వహించడం ప్రారంభిస్తాడు.
కనైత్తిళం కఱ్ఱెరుమై కన్ఱుక్కిరఙ్గి
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిలమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడై పఱ్ఱి
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చెఱ్ఱ
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
లేగ దూడలు గల గేదెలు పాలుపితుకు వారు లేక వాటిని తలంచుకొని వానిపై మనసు పోవుట చే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తలిచి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతా బురద ఆగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచి ఉంటిమి. నీ ఇంటి ద్వారము పై కమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణుని చంపిన మనోభీరాముడగు శ్రీ రాముని గానము చేయుచుంటిమి. అది విని కూడా నీవు నోరు విప్పవా ! ఏమి గాఢ నిద్ర ! ఊరి వారికందరికును నీ విషయము తెలిసినది.
పదమూడవ పాశురము: ఇందులో ఆమె ఏకాంతంలో, తన కళ్ళ అందాన్ని మెచ్చుకుంటున్న ఒక గోపికను మేల్కోలుపుతుంది. కళ్ళు సాధారణంగా జ్ఞానాన్ని సూచిస్తాయి కాబట్టి, ఈ అమ్మాయికి ఎంబెరుమాన్ కి సంబంధించిన విషయాలలో పూర్తి జ్ఞానం ఉందని చెప్పవచ్చు. శ్రీ కృష్ణుడు తనంతట తాను ఆమెను వెతుక్కుంటూ వస్తాడని ఆమె అభిప్రాయం. అరవిందలోచనుడైన శ్రీ కృష్ణుని కళ్ళు ఆమె కళ్ళకి సరిపోతాయి.
పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లా అరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్కళమ్ పుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱంగిఱ్ఱు
ప్పుళ్ళుమ్ శిలుంబిన కాణ్, పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళ క్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో? పావాయ్ నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్
పక్షి శరీరమును ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని వధించిన శ్రీ రాముని గానము చేయుచుపోయి మన తోడి పిల్లలందరూ వ్రత క్షేత్రానికి చెరినారు. తామరపూలను పోలిన కన్నులు గలదానా ! లేడి వంటి చూపులుగలదానా! గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులు కూయుచున్నవి. కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా స్నానమొనర్పక పాన్పుపై పండుకొనియుండెదవేల? ఈ మంచి రోజున నీవు నీ కపటమును వీడి మాతో కలసి ఆనందము అనుభవింపుము.
పద్నాలుగో పాశురము: ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడాలేపెదనని చెప్పిన ఒక గోపిక మేల్కొలుపబడుచున్నది.
ఉఙ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెఙ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబిన కాణ్
శెంగల్ పొడిక్కూఱై వెణ్ పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్ ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శంగొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పంగయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.
ఓ పరిపూర్ణురాల! నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎఱ్ఱ తమరాలు వికసించినవి. నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి. ఎఱ్ఱని కాషాయములు ధరించి తెల్లని పలువరుస కలుగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన మొనర్చుటకు వెళుచున్నారు. లెమ్ము. మమ్మల్ని వచ్చి నిద్ర లేపుతానని మాట ఇచ్చితివి. మరచితివా! శంఖ చక్రమును ధరించిన వాడును, ఆజానుభాహువును, పుండరీకాక్షుని గానము చేయుటకు లేచిరామ్ము.
పదిహేనవ పాశురము: ఈ పాశురములో, తన భవనము వద్దకు వస్తున్న ఆండాళ్ ని మరియు ఆమె స్నేహితులను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక గోపికని మేల్కొలుపుతున్నారు.
ఎల్లే ఇలంగిళియే యిన్నమ్ ఉరంగుదియో
శిల్లెన్ఱు అళైయేన్మిన్ నంగైమీర్ పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కత్తురైగళ్ పణ్డే ఉన్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానేదాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దు ఎణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱానై మాఱ్ఱారై మాఱ్ఱు అళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.
ఈ పాశురమునలో లొన ఉన్న గోపికకు బయటి గోపికకు సంవాదము నిబంధింపబడినది .
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కాలదానా ! ఇంకనూ నిద్రించుచున్నావా ! అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలరా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకూడదు. నేనిదే వచ్చు చున్నాను.
బయటి గోపికలు: నీవు చాలా నేర్పుగల దానవు నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదుము.
లోని గోపిక: మీరే నేర్పుగలవారు, పోనీలే, నేనే కఠినురాలను.
బయటి గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమి ? అలా ఏకాంతముగా నుండెదవేల? వేగముగా వెలికి రమ్ము.
లోని గోపిక: అందరు గోపికలును వచ్చిరా ?
బయటి గోపికలు: అందరూ వచ్చిరి. నీవు వచ్చి లెక్కించుకొనుము.
లోని గోపిక: సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?
బయటి గోపికలు: బలిష్టమగు కువలయాపీడము అను ఏనుగును చంపిన వాడును, శత్రువుల దర్పమును అణచిన వాడను, మాయావి అయిన శ్రీ కృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-6-15-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org