శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

గతభాగంలో పంచాగ్ని విద్య ద్వారా జీవాత్మ జనన మరణ చక్రంలో తిరగడాన్ని గురించి చూసాము. పరమాత్మ కృప వలన మాత్రమే జీవాత్మ ఈ చక్రం నుండి బయట పడగలడని, దీనికోసం జీవాత్మకు నామ సంకీర్తన అనే ఒక మార్గాన్ని కూడా తెలియజేసారని చూసాము.
దీనికి ప్రమాణం ఏమిటి? భీష్మాచార్యుడిని యుధిష్ఠిరుడు “ కిం జపం ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్? “ అని శ్రీవిష్ణు సహస్రనామం మొదట్లో ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు జవాబు శ్రీవిష్ణు సహస్రనామం చివరలో “వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః సర్వ పాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం” అన్న శ్లోకంలో దొరికింది. ప్రశ్నకు జవాబుకు మధ్య భగవంతుడి వేయి నామాలు ఉన్నాయి. వాటిని జపించడం వలన కలిగే ప్రయోజనాన్ని కూడా తెలిపాయి. అందువలననే తొండరడిప్పొడి ఆళ్వార్లు ఈ తిరుమాలై ప్రబంధంలో భగవంతుడి వేయి నామాలను పాడటం మొదలు పెట్టారు.
‘విష్ణుధర్మం’ అనే గ్రంధం భగవంతుడి వేయి నామాలకు మూలధారం. ఈ విష్ణుధర్మాన్ని ఎవరు ఎప్పు డు చెప్పారు? ఎవరు విన్నారు? అని తెలుసుకోవాలను కుంటే పాండవుల తరువాత కొన్ని తరాలదాక చూడాలి. వీరివంశంలో ‘శతానీక‘ అని ఒక రాజు ఉండేవాడు. పరమాత్మ కృప వలన పాండు వంశంలో జన్మించడం వలన అతడు మహా సాత్వికుడుగా ఉండేవాడు. మంచి ఎప్పుడూ చెడు దగ్గర ఓడి పోకూడదనుకునేవాడు ఆయన. తన ప్రజలు దేహయాత్ర చాలించిన తరువాత ప్రయాణించాల్సిన మార్గం గురించి తానేమీ చేయలేకపోయానని చింతించాడు. దాని కోసం శౌనక ఋషి దగ్గరకు వెళ్లి ‘నాప్రజలందరూ లౌకిక జీవనంలో మునిగిపోయారు. పారలౌకిక జీవనం కోసం ఏమి చేయటం లేదు. వాళ్ళకు ఏదైనా మంచి మార్గం చూపించండి.” అని అడిగాడు. దానికి అయన ‘ఇది కలియుగం. కృత, త్రేతా, ద్వాపర యుగాలకంటే మనుష్యుల ఆయుష్షు తక్కువ. అందువలన శాస్త్ర అభ్యసనానికి కాలం చాలదు. దానికోసం ప్రయత్నించేవారు కూడా తక్కువ. శాస్త్ర రహస్యాలను అర్థం చేసుకునేందుకు బుద్ది కూడా తక్కువే. ప్రజలంతా పాపాలచే చుట్టబడి ఉన్నారు. దీని నుంచి బయట పడటానికి ఒకటే మార్గం ఉంది. అదే నామ సంకీర్తనం అని చెప్పాడు. అందువలన విష్ణుధర్మం కలి ప్రారంభమయిన తరువాత వచ్చింది. చెప్పిన వాడు శౌనకఋషి, విన్నవాడు శతానీకుడు అని మనకు తెలుస్తున్నది.
తొండరడిప్పొడి ఆళ్వార్లు తిరుమాలై ప్రబంధాన్ని పాడారు, శ్రీరంగనాధులు విన్నారు. విష్ణుధర్మాన్ని అజ్ఞాని అయిన శతానీకుడు అజ్ఞాన ప్రశ్నంగా వినగా శ్రీరంగనాధులు జ్ఞానప్రశ్నంగా విన్నారు. జ్ఞానస్వరూపుడైన శ్రీరంగనాధులు ఒకరు చెప్పగా ఎందుకు విన్నారు? అన్న ప్రశ్న తలయెత్తుతుంది. దానికి ‘కిం మృష్టం సుత వచనం’ అన్నదే జవాబు. ఒక తల్లిని ‘ఎవరి మాటలు ఇంపుగా ఉంటాయి?’ అని అడిగితె ఆమె తడుముకోకుండా ‘మా పిల్లవాడి మాటలు ‘ అని చెపుతుంది. అలాగే భగవంతుడు కూడా తన పిల్లల వచనాలను ఆనందంగా వింటాడు.
శ్రీరంగనాధులు స్వయంగా వినటం ఈ ప్రబంధానికున్న ఒక ఔన్నత్యంగా మరి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. 1. భగవంతుడి గురించి చెప్పిన విషయాలు వేదసమానమైనవి. తైత్తరీయ ఉపనిషద్, బృగు వల్లీ ( యతో వా ఇమాని భూతాని జాయంతే) ఇందులో భగవంతుడి పేరును తెలుపలేదు. ఈ ఉదాహరణనే ఎందుకు తీసుకున్నారంటే అధర్వ శిఖలో ‘కారణానంతు దేయాః’ (ఎవడు కారకుడో వాడిని ధ్యానించు) అనగానే కారణం ఏమిటి అన్న ప్రశ్న ఉదయించింది. మహోపనిషత్తులో ‘ఎకో హ వై నారాయణా ఆసిత్ ప్రళయ కాలంలో నారాయణుడు మాత్రమే ఉంటాడు. శివుడు కాదు, బ్రహ్మ కాదు. అంతటా ఆవరించి వుండేది నారాయణుడు మాత్రమే అని వేదం చెపుతుంది. పురుష సూక్తంలో ఋషులు ‘అజాయమానో బహుదా విజాయతే‘ ( కర్మ వశమైన పుట్టుక లేనివాడు తన సంకల్ప వశమున అనేక రూపాలుగా అవతరించాడు.) ఋషులు ఒక్కోక్కరు ఒక్కొక్క అవతార చేష్టితాలలో మునిగి మురిసిపోయారు. ఉదాహరణకి., వాల్మీకి రామవతరంలోను, పరాశర భగవానుడు కృష్ణావతరంలోను శ్రీశుఖులు అర్చామూర్తులలోను మోహపరవశులైనారు. ఆళ్వార్లలో మొదటి ముగ్గురు పరత్వవంలో పరవశించారు. (పర వాసుదేవుడు, శ్రీ వైకుంఠము) భగవంతుడి ఐదు రూపాలలో ఉన్నతమైనది. అదే సమయంలో తిరుమల శ్రీనివాసుడి సౌలభ్యాన్ని కూడా కీర్తించారు. నమ్మాళ్వార్లు, పెరియాళ్వార్లు కృష్ణావతారాన్ని కీర్తించారు . తిరుమంగై ఆళ్వార్లు దివ్యదేశాలు సందర్శించి అక్కడి అర్చా మూర్తులను పాడారు. కానీ తొండరడిప్పొడి ఆళ్వార్లు శ్రీరంగనాధులను తప్ప ఇరతరులెవ్వరిని కీర్తించలేదు. ఇదియే వీరి ప్రత్యేకత .
శ్రీరంగానికి ఇతర దివ్యదేశాల కంటే ఔన్నత్యం ఎక్కువ. కావేరి అనేక చోట్ల పారుతున్నా శ్రీరంగక్షేత్రంలోని అమ్మామండపం (శ్రీరంగనాధుని ఆలయానికి దగ్గరలో ఉన్న స్నాన ఘట్టం) లోని కావేరిది ప్రత్యేక స్థానం. అలాగే దివ్యప్రబందంలో తొండరడిప్పొడి ఆళ్వార్ల ప్రబందానిది ప్రత్యేక స్థానం. తిరువాయ్మొళి 6.9.1 లో నమ్మాళ్వార్లు ‘నిరాయ్ నిలనాయ్ తీయాయ్ కాలాయ్ నెడువానాయ్, శీరార్ సుడర్గల్ ఇరండాయ్ శివనాయ్ ఆయనాయాయ్‘ అని అన్నారు. ఇందులో అచిత్ తత్వాలైన నీరు, నేల, నిప్పు, గాలి, ఆకాశము, చిత్ తత్వాలైన బ్రహ్మ, శివుడు అన్ని శ్రీమన్నారాయణుడే అని అన్నారు. పరమాత్మ చిత్, అచిత్తులకంటే ఉన్నతుడు. శరీరాత్మ బంధనా సామాన్యాధి కరణం. తిరువాయ్మొళి 10.10.1 లో ‘మునియే నాన్ముగనే ముక్కణ్ణప్పా‘ లో కూడా దేవతాంతరాలైన బ్రహ్మ, శివుడు సమానమని శ్రీమన్నారాయణుడు వీరికి అంతర్యామి, వీరికంటే ఉన్నతుడని చెప్పారు.
వేదాంతము కానీ, ఆళ్వార్ల ప్రబంధాలు కానీ సముద్ర మంత లోతైనవి. నీరు తేటగా ఉంటే అడుగు కనపడు తుంది. అలాగే ఇక్కడ ఆళ్వార్ల ప్రబంధాలలో పద ప్రయోగాల వలన శాస్త్రం స్పష్టంగా అవగాహన అవుతుంది. తొండరడిప్పొడి ఆళ్వార్ల ప్రబంధం కూడా అలాగే సులభ శైలిలో సాగింది. ప్రణవం కేవలం మూడు మాతృకలతో కూడినదే అయినా దాని అర్థము మహాభారత మంతటిది (1,25,000 శ్లోకాలు). అంతరార్థం చెప్పనలవి కాదు. తిరుమాలై, ప్రణవం అంత చిన్నది కాక మహాభారతమంత పెద్దది కాక 45 పాశురాలతో అనువుగా వుంది. పైవాటిని అర్థం చేసుకోవటం కష్ట తరం కాగా ఇది సులభగ్రాహ్యంగా ఉంది. తక్కిన ఆళ్వార్ల ప్రబంధాలతో పోల్చినా ఇది తేలికగా అర్థం చేసుకోవచ్చు.
తిరుమాలై ప్రబంధంలో మొదటి మూడు పాశురాలలో పరమాత్మ నామాలను స్మరించారు. తరువాతి 11 పాశురాలలో (4 నుండి 14 వరకు) పరోపదేశం చేశారు. కానీ సంసారులు అంత తేలికగా వినేటట్లు కనపడలేదు. తరువాతి పది (15 నుండి 24) పాశురాలలో భగవంతుడు తనకు చేసిన ఉపకారానికి కృతజ్ఞలతలు తెలుపుకున్నారు. 25 నుండి 34 వరకు ఆకించన్యం చేశారు. 35 నుండి 37 వరకు నైచ్యానుసంధానము చేశారు. భగవంతుడు తనను కోరే ఈ ఒక్క ఆత్మ కూడా దూరమై పోతుందేమోనని భావించి ఆళ్వార్లకు తన అవతార విశేషాలను చెప్పి ‘ఎలాంటి వారికంతా మొక్షం ఇచ్చాము. మిమ్మల్ని వదిలేస్తామా ! సందేహించకండి‘ అని ఆశ్వాస పరిచారు. 38వ పాశురంలో ఆళ్వార్లకు మళ్ళీ ధైర్యం వచ్చింది. అందులో ద్వయ మహామంత్ర అర్థాన్ని చెప్పారు. 39 నుండి 44 దాకా భాగవత శేషత్వాన్ని గురించి చెప్పారు. 45వ పాశురంలో ఫలశృతి చెప్పి సుసంపన్నం చేశారు.
ఇక్కడికి అవతారిక సంపూర్ణమయింది, ఇక ప్రబంధంలోకి ప్రవేసిద్దాము .
అడియెన్ చూడామణి రామానుజ దాసి
హిందీలో – https://divyaprabandham.koyil.org/index.php/2016/07/thirumalai-introduction-2/
మూలము : https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org
Adiyen Dasoham
TIRUMALAI
It is not opening I.e giving access to Vyakhynam in TELUGU from Pasuram 2.
Kindly address the issue.
RAMANUJA ADIPPODI,
SATYANARAYANA ACHARYULU