జ్ఞానసారము 35

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 34

అవతారిక

తనకు అందుబాటులో ఉన్న అచార్యునిపై విశ్వాసము లేక  , ఆశ్రయించుటకు  దూరస్తుడైన భగవంతుని ఇష్టపడు వారు బుధ్ధిహీనులని 33,34 పాశురాలలో చెప్పారు. ఈ పాశురములో గురువు మీద ప్రీతి లేని వారిని భగవంతుడు ఉపేక్షించక శిక్షిస్తాడని ఉదాహరణ సహితముగా చెపుతున్నారు.

lord-vishnu-wallpapers

పాశురము

ఎన్ఱుం అనైత్తుయిఱ్కుం ఈరం సెయ్ నారణనుం

అన్ఱుం తన్ ఆరియన్ పాల్ అంబు ఒళియిల్ నిన్ఱ

పునల్ పిరింద  పంగయతై పొంగు సుడర్  వెయ్యోన్

అనల్ ఉమిళందు తాన్ ఉలర్తియఱ్ఱు

ప్రతిపదార్థము

నిన్ఱ పునల్ = తంకు ఆధారమైన నీటిని

పిరింద  = వదలిన

పంగయతై = తామరపూవును

పొంగు సుడర్ = ప్రాకాశించే కాంతి వున్న

వెయ్యోన్ = వేడి కిరణములను ప్రసరించే సూర్యుడు

తాన్ = మునుపు ఆ పూవు వికసించుటకు కారణమైన వాడు

అనల్ ఉమిళందు = నిప్పులు కక్కి

ఉలర్తియఱ్ఱు = వాడిపోయేట్టు చేస్తాడు

ఎన్ఱుం = ఎప్పుటికీ

అనైత్తుయిఱ్కుం = సకల జీవరాశులకు

ఈరం సెయ్  = కరుణ చూపే

నారణనుం = నారాయణుడు

తాన్ ఆరియన్ పాల్ = తన ఆచార్యుని విషయములో

అంబు ఒళియిల్ = భక్తిలో లోపము ఏర్పడితే

అన్ఱుం = కోపముతో దహించి వేస్తాడు

వ్యాఖ్యానము

ఎన్ఱుం ………భూత,భవిష్యత్ , వర్తమాన కాలాలములనే త్రికాలాలలోను

అనైత్తుయిఱ్కుం………సకల ఆత్మలకు

ఈరం సెయి నారణనుం…….సదా కృపను చూపు నారాయణుడు…. ఇక్కడ నారాయణుడు అన్నప్రయోగము వలన జీవాత్మకు , పరమాత్మకు  విడదీయరాని సంబంధమును తెలియజేస్తున్నది .  నారములనగా సమస్త జీవరాశులు , అయనమనగా సమస్త జీవులకు అంతరమున, బాహ్యమున ఆధారమైన  వాడు అని అర్థము . ఈ భావనను ఆండాళ్ ‘ “ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియాదు” ( తిరుప్పావై 28) లో అన్నది . స్వామి తిరుమళిసై అళ్వార్ కూడా “నాన్ ఉన్నై అన్ఱి ఇలేన్ కండాయ్ నారణనే!!! నీ ఎన్నై అన్ఱీ ఇలై” అన్నారు .  దీని వలన జ్ఞానమున్న ఆత్మలకు, జ్ఞాన శూన్యమై జడ పదార్థములైన నారములకు ప్రాణాధారమై లోపల ఉండి చేతనత్వము కలిగించు వాడు “నారాయణుడు” అని అర్థమును  తెలుపుతున్నారు . సమస్త జీవులు చేయు దోషములను గుణములుగా స్వీకరించు వాడు , వశ్చలుడు , సమస్త జీవులపై కృపను చూపు వాడు“నారాయణుడు” అని  ఆయన గుణములను తెలియ జేస్తున్నారు.

అన్ఱుం …….దండించు వాడు,కోపగించు వాడు అని అర్థము .“అన్ఱియ వాణన్” పెరియ తిరుమొళిలో (1275) కోపించిన అన్న అర్థములోనే చెప్పారు . ఆయన కృపా సముద్రుడు కాదా! ఆయనకు కోపము ఎప్పుడు వస్తుంది? అంటే ……

తన్ఆరియన్ పాల్ అన్ బు ఒళియిల్ …..…తన గురువుపై భక్తి లేని వారిపై కోపిస్తాడు . మునుపు  “ఎట్ట ఇరుంద గురువై” , “పఱ్ఱు గురువై”, అన్న రెండు పాశురాలలో గురువుపై విశ్వాసము లేని వాడు, గురువును సామాన్యునిగా భావించి ,తన దైవముగా భావించని వాడిపై కోపిస్తాడు అని చెప్పారు. ఈ విషయముగా ఇక్కడ చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు .

నిన్ఱ పునల్ పిరింద  పంగయతై .……..లోకములోని జీవులన్నింటికీ ఆధారభూతుడైన  సూర్యుడు తన ప్రకాశవంతమైన కిరణాల ద్వారా వేడిని  వెలుగును ప్రసరింప చేస్తాడు .  కొలనులోని తామరలను సూర్యుడు తన  కిరణాలను ప్రసరించి   వికసింపచేస్తాడు.  అదే తామర నీటిని విడిచి బయట వుంటే ఆ సూర్యుడు  ఏమి చెస్తాడో వివరిస్తున్నారు .

పొంగు సుడర్  వెయ్యోన్……కులశేఖరాళ్వార్లు  “సెంగమలం అందరం సేర్ వెంగదిరోరుక్కల్లాల్ ” అన్నట్లుగా సూర్య కిరణాలు లేనిదే తామర వికసించదు.  కృత్రిమమైన  వెలుగును ప్రసరింపచేయటము  ద్వార వికసింప చేయాలని ప్రయత్నించినా ఫలితము ఉండదు . తామర నీటిలో ఉన్నంత వరకు నీరు ,  సూర్యుని వేడి  అది వికసించడానికి ఉపకరిస్తాడు . అదే  సూర్యుని వేడి  తామర నీటిని వదిలి బయటకు వస్తే ………..

అనల్ ఉమిళందు తాన్ ఉలర్తియఱ్ఱు ……… సూర్యుడి  ప్రతాపమునకు వాడి పోతుంది .  అలాగే ఆచార్య భక్తి వున్న వాడిపై  శ్రీమన్నారాయణుని  కృప ఉంటుంది .  ఆచార్య భక్తి లేని వాడిపై శ్రీమన్నారాయణుడు  తన కోపమును ప్రదర్శిస్తాడు . ఈ ఉదాహరణ ఆచార్య భక్తి కలిగివుండటము ఎంత అవసరమో తెలియజేస్తున్నది .   ఆచార్య భక్తి వున్న వాడికి  శ్రీమన్నారాయణుని  కృప వలన జ్ఞానము అభివృధ్ధి చెందుతుంది . ఆచార్య భక్తి లేని వాడికి శ్రీమన్నారాయణుని కృప లేక పోవటము చేత  వున్న జ్ఞానము కూడా తొలగి పొయి అజ్ఞానిగా మిగులు తాడు . కావున మంత్రోపదేశము చేసిన ఆచార్యుని మీద భక్తి లేని వాడిని కరుణాసముద్రుడైన  శ్రీమన్నారాయ ణుడు కూడ కరుణించక పోగా తన కోపమును చూపుతాడు .  నీటిలో వున్న తామర వికశించడానికి కారణమైన సూర్యుడే , నీటిని వదలిన తామర వాడిపోవడానికి కారణమవుతాడు . ఆచార్య భక్తి ఉన్న శిష్యుడి జ్ఞానము అభివృద్ధి చెందడానికి ఉపకరించిన  శ్రీమన్నారాయణుడే , ఆచార్య భక్తి లేని శిష్యుడిని జ్ఞాన శూన్యునిగా చేస్తాడు  . ఈ సందర్భములో తిరువళ్ళువర్  చెప్పిన “ఉళరెనినుం ఇల్లారోడొప్పర్” అన్న వార్త అనుసంధానము చేసుకోవాలి . శ్రీవచనభూషణము చూర్ణిక -439లో “తామరైయై అలర్థ కడవ ఆదిత్యన్ తానే, నీరైప్పిరిందాల్ అత్తైఉలర్తుమాపోలే, స్వరూప వికాసత్తై పణ్ణుం ఈశ్వరన్ తానే ఆచార్య సంబంధం కులైందాల్ అత్తై వాడ పణ్ణుం “చూర్ణికై-439 ) అని చెప్పారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-35-enrum-anaithuyirkum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

Leave a Comment